Share News

తొలి అడుగు..!

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:48 AM

పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరుకావడం ఒక విశేషమైన పరిణామం. దాదాపు పదేళ్ళ తరువాత భారతవిదేశాంగమంత్రి పాకిస్థాన్‌లో కాలూనిన సందర్భం ఇది. షాంఘై సహకార సంస్థ సదస్సుకు పాకిస్థాన్‌ అతిథ్యం

తొలి అడుగు..!

పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరుకావడం ఒక విశేషమైన పరిణామం. దాదాపు పదేళ్ళ తరువాత భారతవిదేశాంగమంత్రి పాకిస్థాన్‌లో కాలూనిన సందర్భం ఇది. షాంఘై సహకార సంస్థ సదస్సుకు పాకిస్థాన్‌ అతిథ్యం ఇస్తున్నది కనుక, ఈ విస్తృత వేదికలో భాగస్వామిగా, ఆ సదస్సులో పాలుపంచుకోవడానికి మాత్రమే ఆయన వెడుతున్నారు తప్ప పాకిస్థాన్‌తో రాసుకుపూసుకొనేదేమీ ఉండదని ప్రయాణానికి ఎంతో ముందుగానే జైశంకర్ పక్షాన ఆయన మంత్రిత్వశాఖ ఓ మాట చెప్పింది కూడా. ఆయన ప్రయాణం, పెద్దలతో భేటీలు ద్వైపాక్షికవ్యవహారం కాకపోవచ్చును కానీ, ఉభయదేశాల మధ్యా గడ్డకట్టుకొనిపోయిన దౌత్యసంబంధాల్లో కాస్తంత సానుకూలమైన మార్పు తీసుకురావడానికి ఆయన పర్యటన పరోక్షంగా ఉపకరించవచ్చు. సదస్సు సందర్భంగా పాకిస్థాన్‌తో విడిగా ఎటువంటి మంతనాలు, చర్చలూ ఉండవని మనం తేల్చేయడమూ, అటు పాకిస్థాన్‌ కూడా అదే తరహాలో ద్వైపాక్షిక చర్చలు ఉండవంటూ స్పందించడం ఒక విధంగా వాతావరణాన్ని సానుకూలం చేసింది. అన్ని అనుమానాలు, శషబిషలు పక్కనబెట్టి చక్కగా పలకరించుకొని, చేయీచేయీ కలుపుకొని, కాస్తంత నవ్వుకోవడానికి ఈ పరిస్థితి అవకాశం ఇచ్చింది.

వాతావరణం బాగా ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో, వేరొక అవసరం చేత పొరుగుదేశానికి ప్రయాణం కట్టవలసివచ్చినా కూడా దానినుంచి మిగతావారు ఊ‍హించేదీ ఎక్కువే ఉంటుంది. అందువల్ల, ఈ పర్యటనకు ఏ విలువా లేదని ఉభయులూ ముందుగానే తేల్చేస్తే ఆ మేరకు ఆశతో పాటు, ప్రమాదం కూడా తగ్గుతుంది. దౌత్యసంబంధాలను కాస్తంత చక్కదిద్దుకోడానికి కొంతకాలంగా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇది మరీ అవసరం. అంతవరకూ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని కాదు కానీ, జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయం రెండు దేశాల మధ్యా అతిపెద్ద అగాధాన్ని సృష్టించింది. ఢిల్లీలో తన హైకమిషనర్‌ను ఉపసంహరించుకొని, తనదేశంనుంచి మనవారిని వెళ్ళగొట్టి, వాణిజ్యసంబంధాలను సైతం తెగదెంపులు చేసుకొని చాలా హడావుడి చేసింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి ఆ అధికారాలన్నీ దక్కితేనే తననుంచి ఓ మాట, ఓ పలకరింపు ఆశించాలని స్పష్టంచేసింది. మనకు మరింత దూరంగా పోయి, ద్వైపాక్షిక చర్చలను కాదనుకున్నది ఆ దేశమే.


ఈ పరిస్థితుల మధ్య, వెళ్ళిన పనేదో చూసుకొని రావడం తప్ప, జయశంకర్‌ పర్యటనలో ఏవో విశేషాలు, అనూహ్యమైన మలుపులూ ఉంటాయని ఎవరూ ఆశించలేదు. తన ప్రసంగంలో ఉగ్రవాదం గురించి, దానిని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ తదితర దేశాల గురించి తాను చెప్పదల్చుకున్నదేదో జైశంకర్‌ కూడా కుండబద్దలు కొట్టేశారు. పొరుగుదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గుర్తించి గౌరవించుకోవడం నేర్చుకోమంటూ చైనా, పాకిస్థాన్‌కు గట్టిగానే చీవాట్లు వేశారు. ఉభయదేశాల మధ్యా దూరాన్ని పెంచుతున్న ఉగ్రవాదంతో నిజాయితీగా పోరాడాలంటూ పాకిస్థాన్‌కు హితవు చెప్పారు. చైనా బెల్ట్‌ అండ్ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) మరింత విస్తరించాలనీ, హైవేలు, ఓడరేవులు, రైల్వేలైన్లతో ఆసియా నుంచి ఆఫ్రికావరకూ అంతా కళకళలాడిపోవాలని పాకిస్థాన్‌ ప్రధాని చైనాను ఆకాశానికి ఎత్తేస్తే, దానికి పూర్తి భిన్నమైన, విరుగుడు వ్యాఖ్యలు జైశంకర్‌ చేశారు.

ఆర్థికం, వాణిజ్యం, పర్యావరణం తదితర అంశాలపట్ల ఆయా ప్రభుత్వాల అధికారిక వైఖరులు ఎలా ఉన్నప్పటికీ, ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇటీవల ప్రతీసందర్భంలోనూ, అన్ని అంతర్జాతీయవేదికలమీదా ఆయన కశ్మీర్‌ ఊసులేకుండా ప్రసంగాలు చేయలేదు. అలాగే, విందు సందర్భంలో ఆయన జైశంకర్‌తో కాస్త ఎడంగా కొద్దిసేపు ముచ్చటించడం, పాకిస్థాన్‌ ఉప ప్రధాని, విదేశాంగమంత్రులు కూడా సుదీర్ఘసమయం మాట్లాడటం వంటివి జరిగాయి. మరోవైపు, ఎస్సీవో సదస్సుకోసం పాకిస్థాన్‌ వెళ్ళిన భారతదేశ పాత్రికేయులతో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌, ఆయన కుమార్తె మరియం నవాజ్‌ ప్రత్యేకంగా భేటీ కావడం, జైశంకర్‌ పర్యటనను తొలి అడుగుగా అభివర్ణించడం విశేషం. భారతజర్నలిస్టులతో వారిరువురూ భేటీ కావడంపై పాకిస్థాన్‌ మీడియా సంస్థలు భిన్నంగా స్పందించాయి కూడా. సహకార సంస్థ సదస్సుకు భారతప్రధాని నరేంద్రమోదీ వచ్చివుంటే ఎంతో బాగుండేదని నవాజ్‌ షరీఫ్‌ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య కూడా అందరినీ ఆకర్షించింది. ఇవన్నీ చిన్నచిన్న విషయాలే అయినప్పటికీ, ఉభయదేశాల మధ్యా ఉన్న ఉక్కబోత వాతావరణాన్ని కాస్తంత ఉపశమింపచేసేందుకు ఉపకరిస్తాయి.

Updated Date - Oct 19 , 2024 | 05:48 AM