రాబోయే ఐదేళ్లూ ఆ పదేళ్ల పాలనే!
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:58 AM
కొత్త లోక్‌సభ తొలి సమావేశాలు నా అనుమానాలను ధ్రువీకరించాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఏమీ మారలేదు సుమా! బహుశా ఏదీ మారబోదు కూడా. ఇది సందేహాతీతం. ఇందుకు స్పష్టమైన సూచనలు ఇప్పటికే కనిపించాయి (జూన్ 29న ఇదే కాలమ్‌లో వచ్చిన ‘మార్పు మిథ్య, మోదీయే సత్యం!’
కొత్త లోక్‌సభ తొలి సమావేశాలు నా అనుమానాలను ధ్రువీకరించాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఏమీ మారలేదు సుమా! బహుశా ఏదీ మారబోదు కూడా. ఇది సందేహాతీతం. ఇందుకు స్పష్టమైన సూచనలు ఇప్పటికే కనిపించాయి (జూన్ 29న ఇదే కాలమ్‌లో వచ్చిన ‘మార్పు మిథ్య, మోదీయే సత్యం!’ మరొక మారు చదవండి). ఎన్నికలకు పూర్వం ప్రభుత్వ సాఫల్యాలపై వక్కాణింపులు, బడాయి మాటలు, విధానాలు, కార్యక్రమాలు, పాలనా శైలి, ప్రభుత్వ నడవడి, ప్రతీకార ధోరణులు మొదలైనవాటిని సమర్థించాలని, పునరుద్ఘాటించాలని, కొనసాగించాలని నరేంద్ర మోదీ దృఢంగా ఆదేశించారు మరి.
విషాదమేమిటంటే పార్లమెంటు ఉభయ సభలలో కూడా మోదీ ఆదేశం ప్రభావం కనిపిస్తోంది. ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం ఉభయ సభలను అధిక సంఖ్యాకుల అభీష్టం ప్రకారం కాకుండా ఏకాభిప్రాయంతో నడపవలసి ఉంది. ‘సభా కార్యకలాపాలను లంచ్ విరామం లేకుండా కొనసాగిద్దామా?’ అన్న చిన్న పాటి విషయంపై సభాపతి లేదా అధికార పక్షం వైఖరి ఎలా ఉన్నా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సదాచారంగా ఉన్నది. అయినప్పటికీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన వృత్తి విద్యా కోర్సుల ఎంట్రెన్స్ టెస్ట్‌లపై నెలకొన్న వివాదాలను చర్చించాలని వందలాది ఎంపీలు మద్దతునిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు చేపట్టడానికి ఉభయ సభల సభాపతులూ తిరస్కరించారు. గత ఐదేళ్లలో పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన వైనాన్ని సభాపతుల నిర్ణయం గుర్తుకు తెచ్చింది. ఎంత శోచనీయం!
పార్లమెంటు ఉభయ సభలలో తొలి చర్చ, పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉద్దేశాలను, పరిపాలనా దిశను స్పష్టం చేశాయి : ఒకే వ్యక్తి ఆదేశాలు, నిర్దేశాల ప్రకారమే దేశ పాలన కొనసాగనున్నది; మోదీ 3.0కు కీలక మద్దతు నిస్తున్న మిత్రపక్షాల (టీడీపీ, జేడీయూ)తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వేటికి కూడా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడం మినహా మరెటువంటి పాత్ర ఉండదు; నరేంద్ర మోదీ తన సొంత మంత్రులకు, పార్లమెంటు ఉభయ సభలలోని ప్రతిపక్ష నేతలకు దేశ పాలనా వ్యవహారాలలో పాలు పంచుకునేందుకు ఎటువంటి అవకాశమివ్వబోరు; ఉద్దేశపూర్వకంగా గానీ, అనుద్దేశపూర్వకంగా గానీ తాము చేసిన తప్పులు, పొరపాట్లను మోదీ సర్కార్ ఎటువంటి పరిస్థితులలోను అంగీకరించబోదు; ప్రస్తుత ప్రభుత్వ పాలనలోని సకల లోపాలు, లొసుగులకు బాధ్యత జవహర్‌లాల్ నెహ్రూతో మొదలుకొని పాలించిన గత ప్రభుత్వాలదేనని మోదీ ప్రభృతులు నిక్కచ్చిగా చెప్పడం తప్పక కొనసాగుతుంది; బీజేపీ అధికార ప్రతినిధులు యథావిధిగా కలహశీల, ఆక్షేపణీయ రీతుల్లో వ్యవహరిస్తారు; జీతభత్యాలపై అధికార పక్షానికి అనుకూలంగా సామాజిక మాధ్యమాలలో చెలరేగిపోయేవారు మరింత క్రియాశీలంగా కొనసాగుతారు; దర్యాప్తు సంస్థలపై ఎటువంటి అదుపులు ఉండబోవు, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవి వ్యవహరిస్తాయి.
543 లోక్‌సభ నియోజకవర్గాలలో 240ని మాత్రమే బీజేపీ సొంతంగా గెలుచుకున్నది; దాని నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకున్న స్థానాలు 292 మాత్రమే. అయినప్పటికీ మరోసారి పాలించడానికి ప్రజలు తమకే అధికారమిచ్చారని మోదీ విశ్వసిస్తున్నారు. ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉందని ఉద్ఘాటిస్తున్నారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు దృఢ శైలాలే కానీ, లక్క పిడతలు కారు’ అన్న సత్యాన్ని ఆయన విస్మరిస్తున్నారు. సరే, ఎంపీల విషయమేమిటి? ఇంత స్వల్ప వ్యవధిలో వారి తీరుపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి రావడం కష్టం కానీ కొన్ని ప్రాథమిక సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌కు చెందిన ఎన్డీఏ/ బీజేపీ ఎంపీలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ మూడు రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే వారి కలవరపాటుకు ప్రధాన కారణం. ఆ రాష్ట్రాలలో తాము మళ్లీ అధికారానికి రాగలుగుతామా అనే శంక వారిని పీడిస్తోంది. మహారాష్ట్రలో మహాయూతి ప్రభుత్వం బలహీనపడుతోంది. హర్యానాలోని పది లోక్‌సభ సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సరిసమానంగా గెలుచుకున్నాయి. హేమంత్ సోరేన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు ఆ మూడు రాష్ట్రాలలోని ఇండియా కూటమిలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అసెంబ్లీ సమరానికి ఆ కూటమి మహోత్సాహంతో సమాయత్తమవుతోంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, కర్ణాటకలో ఎన్డీఏ/ బీజేపీ తీవ్రంగా నష్టపోయాయి. కేరళ, తమిళనాడులో ఆ రెండూ దాదాపుగా అంతర్ధానమయ్యాయి. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, అస్సోం, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ నుంచి ఎన్నికైన ఎన్డీఏ/ బీజేపీ ఎంపీలు ఉల్లాసంగా ఉన్నారు. అయితే తమది ‘సంకీర్ణ’ ప్రభుత్వం అన్న వాస్తవం వారిని వేదనకు గురి చేస్తోంది. ఈ సంకీర్ణ సర్కార్ ఎంత కాలం మనగలదన్న విషయం కూడా వారిని కలవరపరుస్తోంది.
భారతీయ జనతా పార్టీ ఒక అజేయ శక్తా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజేయుడా? అవునని ఘంటా పథంగా చెప్పుకోవడానికి తాము ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలన్న విషయం బీజేపీకి బాగా తెలుసు. అదే విధంగా కాంగ్రెస్ సైతం నెహ్రూ, ఇందిర నాటి తన పాత వైభవాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించుకోవాలంటే బీజేపీ కంటే మరెంతో జనాదరణ పొందవలసి ఉన్నది. ఇటీవలి సార్వత్రక ఎన్నికలలో తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ తన 99+2 సీట్లను సాధించుకున్నది. 170 లోక్‌సభ స్థానాలు ఉన్న మరో తొమ్మిది రాష్ట్రాలలో కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకున్నది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే 215 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అసలు పోటీ చేయలేదు (ఆ నియోజకవర్గాలలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు పోటీ చేశాయి) కాంగ్రెస్, ఇండియా కూటమి కలసి ఒక బలవత్తరమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించివేయగల శక్తి వాటికి లేదు. అటువంటి శక్తి లోక్‌సభలో 16 మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీకి, 12 మంది సభ్యులు ఉన్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి ఉన్నాయి. ఆ రెండు పార్టీలు తమకు సరైన సమయం వచ్చే వరకు వేచివుంటాయి. కేంద్ర బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాయి. తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రెండు పార్టీలు తప్పక డిమాండ్ చేస్తాయి. అయితే అందుకు మోదీ ససేమిరా అంటారని మరి చెప్పనవసరం లేదు. మరి కొద్ది నెలల్లో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే దాకా వేచివుంటాయి.
సరే, ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితులు ఆర్థిక విధానాలను ఎలా ప్రభావితం చేయనున్నాయి? కొన్ని ఊహలు చేసేందుకు, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు సాహసిస్తున్నాను. 1) తన వైఫల్యాలను నిరాకరించే ధోరణి ప్రభుత్వం తప్పక కొనసాగిస్తుంది: నిరుద్యోగిత పెచ్చరిల్లిపోవడాన్ని, ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో బాగా పెరిగిపోతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించదు; కార్మికుల వేతనాలు, ఆదాయాలు స్తంభించిపోవడాన్ని ఒప్పుకోదు; దేశ జనాభాలో కింది స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదరికంలో కునారిల్లుతున్నారన్న కఠోర వాస్తవాన్ని గుర్తించదు; అసమానతలు పెరిగిపోవడాన్ని పట్టించుకోదు. మరి ఇటువంటి వైఖరితో ఉన్న మోదీ సర్కార్ ఆర్థిక విధానాలలో మౌలిక మార్పులకు పూనుకుంటుందా? అలా ఆశించడమే అసంబద్ధం. 2) మౌలిక సదుపాయాలు, బుల్లెట్ రైలు ఇత్యాది ఆడంబరపూర్వక ప్రాజెక్టులలో భారీ మదుపులను మోదీ సర్కార్ కొనసాగిస్తుంది. మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ వ్యయాల పెరుగుదల వల్ల ఆర్థిక లబ్ధి సమకూరుతుంది, సందేహం లేదు. అయితే ప్రైవేట్ పెట్టుబడులు కొరవడుతాయి. వృద్ధిరేటు స్వల్పస్థాయిలో ఉంటుంది. అయితేనేం, ప్రభుత్వం అవిశ్వసనీయ గణాంకాలతో వృద్ధిరేటును ఘనంగా పెంచుతుంది. 3) దక్షిణ కొరియా అభివృద్ధి నమూనాను అనుసరించడాన్ని మోదీ సర్కార్ కొనసాగిస్తుంది. కీలక రంగాలలో గుత్తాధిత్యం పెరిగిపోతుంది. తత్ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఖాయిలాపడతాయి. కొత్త ఉద్యోగాల సృష్టి మందగిస్తుంది. ఏటా లక్షల సంఖ్యలో ఉద్యోగాల మార్కెట్‌లోకి ప్రవేశించే విద్యావంతులు, అనిపుణ యువజనులు తీవ్రంగా నష్టపోతారు. 4) వృద్ధాప్యం మీదబడుతున్న నాయకుని సారథ్యంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్య, ఆరోగ్య భద్రత, పర్యావరణ రక్షణ, వాతావరణ మార్పు నియంత్రణ, వ్యవసాయం, అడవుల అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు–అభివృద్ధి రంగాలలో మౌలిక మార్పులు సాధించగల ప్రతిభావంతులను ఆకట్టుకుని, వారికి నిర్ణయాత్మక బాధ్యతలు అప్పగించే అవకాశాలు తక్కువ. మరి ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించకపోతే నష్టపోయేది దేశమే కాదూ?
గత పది సంవత్సరాలుగా తాము అనుసరించిన పాలనా విధానాలు సమర్థనీయమైనవని, భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేవని ప్రధానమంత్రి దృఢంగా విశ్వసిస్తారు. అవే విధానాలు యథాతథంగా కొనసాగుతాయని పార్లమెంటులో ఆయన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక కేవలం అదే ప్రభుత్వానికే కాకుండా, అదే పాలనకు సైతం దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి.
గత పది సంవత్సరాలుగా తాము అనుసరించిన పాలనా విధానాలు సమర్థనీయమైనవని, భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేవని ప్రధానమంత్రి దృఢంగా విశ్వసిస్తారు. అవే విధానాలు యథాతథంగా కొనసాగుతాయని పార్లమెంటులో ఆయన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక కేవలం అదే ప్రభుత్వానికే కాకుండా, అదే పాలనకు సైతం దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)