ఉమ్మడి పౌరస్మృతిపై తొలగని భయాలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:43 AM
ఈ ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి దేశప్రజల నుద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. ఇది ఒక విధంగా రికార్డే. అయితే అందులో విశిష్టత ఏమీ లేదనుకోండి.
ఈ ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి దేశప్రజల నుద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. ఇది ఒక విధంగా రికార్డే. అయితే అందులో విశిష్టత ఏమీ లేదనుకోండి. అది వేరే విషయం. ఎర్రకోట బురుజుల నుంచి నరేంద్ర మోదీ వెలువరించిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలలో కెల్లా ఈ పంద్రాగస్టు ప్రసంగం సుదీర్ఘమైనది (98 నిమిషాల పాటు సాగింది). ప్రధానమంత్రిగా మూడో పర్యాయం ఆరంభంలో ఈ ప్రసంగం చేశారు గనుక, రాబోయే ఐదేళ్ల పాలనకు తన ప్రభుత్వ దార్శనిక సంకల్పాలు, ప్రణాళికలను నరేంద్ర మోదీ వెల్లడిస్తారని చాలా మంది ఆశించారు, వినడానికి నిరీక్షించారు.
ప్రధానమంత్రి ప్రసంగం సాహసోపేతమైన కొత్త దార్శనికతను సువ్యక్తం చేసిందని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశంసించారు. నిజమా? నిజమే అయితే అది ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకున్న దార్శనికత (?) మాత్రమే అని నేను భావిస్తున్నాను. నరేంద్ర మోదీ ఏమన్నారో గుర్తు చేస్తాను:’ మనం దృఢ సంకల్పంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాం. మరెవ్వరూ వెళ్లని గమ్యాలకు పురోగమిస్తున్నాం. అయితే మన ప్రగతి ప్రస్థానానికి సంబంధించి మరొక సత్యాన్ని కూడా చెప్పవలసి ఉంది. భారతదేశ శీఘ్ర పురోగతిని కొంత మంది భరించలేకపోతున్నారు. ఇది నిజం. భారత్ సాధిస్తున్న విజయాలను, అశేష ప్రజలకు సమకూరుస్తున్న శ్రేయస్సును కొందరు వ్యక్తులు గుర్తించడం లేదు. ఎందుకని? దేశం సాధిస్తున్న అభివృద్ధి వారి స్వార్థ ప్రయోజనాలకు తోడ్పడడం లేదు తమ బాగు మినహా మరెవ్వరి ప్రగతిని వారు కోరుకోరు, ఇష్టపడరు. ఇటువంటి విపరీత, కుటిల స్వభావమున్న వ్యక్తుల సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వ్యక్తుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’.
ఇంతకూ మోదీ ఆక్షేపించిన ‘కొంతమంది ప్రజలు’ ఎవరు? వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన మొదలైన రంగాలలో భారత్ ఘన విజయాలకు గర్వించని వ్యక్తి ఒక్కడూ నాకు తెలియదు మరెవరు? తనకు, ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేసిన 262 మిలియన్ ఓటర్లే ఆ ‘కొంత మంది ప్రజలు’ అని మోదీ పరోక్షంగా సూచిస్తున్నారా? నిరుద్యోగిత అంతకంతకూ పెచ్చరిల్లిపోవడంపై తనను, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న యువజనులా? లేక ధరల పెరుగుదలతో కుటుంబంపై పడుతున్న ఆర్థిక భారం గురించి వాపోతున్న గృహిణులా? లేక భారత భూభాగాలను చైనా ఆక్రమించుకుంటున్నప్పటికీ భారత్ మౌనంగా తిరోగమించడంపై విభ్రాంతికి లోనవుతున్న సైనికులు, మాజీ జవానులా?
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగమనేది జాతి సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యించే దార్శనికతకు మద్దతుగా దేశ ప్రజలను సంఘటితపరిచేందుకు ఉద్దేశించింది. మరి ప్రధాని మోదీ ప్రసంగం అందుకు దోహదం చేసేదిగా ఉన్నదా? లేదు. తన ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ప్రజలలో నెలకొన్న భయాలు, విభేదాలను మరింత తీవ్రతరం చేసేదిగా ప్రధానమంత్రి ప్రసంగం ఉన్నది. ప్రభుత్వంతో విభేదిస్తున్న, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వ్యక్తులను ‘విపరీత, కుటిల స్వభావమున్న’ వారని ఆక్షేపించడం ప్రజాస్వామిక తీర్పును మోదీ ఎంతగా ఏవగించుకుంటున్నారో అర్థమవుతున్నది.
ప్రజా తీర్పు నుంచి మోదీ పాఠాలు నేర్చుకోరు. లోక్‌సభలో బీజేపీ సీట్లు 240కి తగ్గిపోయినందున కొన్ని నిర్ణయాలను అమలుపరచడంలో మోదీ సర్కార్ జాప్యం చేయగలదని భావించాము. అయితే మేము పొరపడ్డాము. ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం– ఒకే ఎన్నిక విషయమై ప్రధానమంత్రి ఇప్పటికీ కృత నిశ్చయంతో ఉన్నారని అర్థమవుతోంది. ఆ రెండు అంశాలను ఆయన తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం వేర్వేరు మతాల వారికి ప్రత్యేకంగా ఉన్న వేర్వేరు పౌర స్మృతులను ‘మతతత్వ పౌర స్మృతులు’ అని ఆయన ఆక్షేపించారు. మోదీ ఇలా అన్నారు: ‘జాతిని మత ప్రాతిపదికన విడదీసే చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానంలేదు. ఎందుకంటే అవి మత, వర్గ వివక్షకు ప్రాతిపదిక అవుతాయి. దేశానికి ఇప్పుడు అవసరమయింది ‘లౌకిక పౌరస్మృతి. మనం 75 సంవత్సరాల పాటు ఒక మతతత్వ పౌర స్మృతిని పాటించాము. ఇప్పుడు ఒక లౌకిక పౌరస్మృతిని రూపొందించుకునే దిశగా వెళ్లవలసి ఉన్నది. మతం ప్రాతిపదికన అనుసరిస్తున్న పౌర స్మృతుల మూలంగా ప్రజలలో నెలకొన్న విభేదాలను లౌకిక పౌరస్మృతితో మాత్రమే రూపుమాపగలం’.
మోదీ చేసిన ఈ ఉద్ఘాటనలో మత చట్టాలపై ఆయన అస్పష్ట అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి వ్యక్తిగత చట్టమూ (పర్సనల్ లా) మతం ప్రాతిపదికన ఉంటుంది. హిందూ వ్యక్తిగత చట్టాలూ అందుకు మినహాయింపు కాదు. మతం ఆధారంగా ఉన్నందున అవి మతతత్వ చట్టాలు ఎలా అవుతాయి? వివాహాలకు సంబంధించి ఒక లౌకిక చట్టం ఉన్నది. అదే ‘ప్రత్యేక వివాహ చట్టం’. అయితే ఈ దేశ ప్రజలు దానిని పెద్దగా గుర్తించడం లేదు, పాటించడం లేదు. తన పొరుగువాడు ఒక విభిన్న మత చట్టాన్ని అనుసరిస్తున్నందున తాను ‘వివక్ష’కు గురవుతున్నానని ఏ మతానికి చెందిన సామాన్యుడూ భావించడు, భయపడడు. అన్ని మతాలవారు ఉమ్మడి పౌరస్మృతికి అంగీకరిస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది చెప్పినంత తేలికగా కార్యరూపం దాల్చదు.
ఉమ్మడి పౌరస్మృతి భావన, ఒక దేశం–ఒకే ఎన్నిక ప్రతిపాదన ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తొలుత వాటి విషయమై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించాలి. ఉమ్మడి పౌరస్మృతి విషయమై ముందుగా అన్ని మతాల వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ‘ఒక దేశం– ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలుపరచాలంటే రాజ్యాంగంలోని అనేక అధికరణలకు తప్పనిసరిగా సవరణలు చేయవలసి ఉంటుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ప్రజలను మతపరమైన చీలికలకు దారితీసే ప్రసంగాలను అధికార పక్షం నాయకులు చేశారు. మోదీ ఏమన్నారో గుర్తు చేస్తాను: ‘కాంగ్రెస్ అధికారానికి వస్తే ఫ్రజల భూములు, బంగారం, ఇతర విలువైన ఆస్తులను ముస్లింలకు పంపిణీ చేస్తుంది; కాంగ్రెస్ మీ మంగళసూత్రాలు, స్త్రీ ధనాన్ని సైతం తీసుకుని అధిక సంతానం ఉన్నవారికి ఇస్తుంది’. అమిత్ షా ఏమన్నారు? ‘ఆలయ మాన్యాలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది, వాటిని ముస్లింలకు ఇస్తుంది’. రాజ్‌నాథ్ సింగ్ మాట గుర్తులేదూ? ‘ప్రజల ఆస్తులను కాంగ్రెస్ కైవశం చేసుకుని వాటిని చొరబాటుదారులకు పునఃపంపిణీ చేస్తుంది’. చివరగా మోదీని మరోసారి ఉటంకిస్తాను: ‘గేదెల పైన కూడా వారసత్వ పన్ను రావచ్చు’ అని ఆయన హెచ్చరించారు! ఈ వెర్రి మాటలను నిలిపివేసేందుకు మీడియా ప్రయత్నించనే లేదు.
సరే, ప్రజల తీర్పు ఎలా ఉన్నదో మరి చెప్పనవసరం లేదు. మోదీ వ్యవహార శైలిలో సంయమనం కన్పించలేదు. అయితే ఆయన ప్రభుత్వం పలు అంశాలపై వెనుకంజ వేసింది. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఫర్ కేపిటల్ గెయిన్స్‌ను పునరుద్ధరించారు. వక్ఫ్ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు నివేదించారు. బ్రాడ్‌కాస్టింగ్ బిల్లును ఉపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో మధ్యస్థాయి, సీనియర్ పోస్టులలో సివిల్ సర్వీస్ అధికారులతో కాకుండా సంబంధిత రంగాలలో నిపుణులైన బయటి వ్యక్తులను నేరుగా నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌర స్మృతి, ఒక దేశం–ఒకే ఎన్నిక ఆలోచనలను పూర్తిగా విరమించుకుని, సంబంధిత బిల్లులను అంతిమంగా ఉపసంహరించుకున్నప్పుడే ప్రజల్లో భయాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రజలలో చీలికలు సృష్టించే, విభేదాలను ప్రకోపింప చేసే విధానాలు, నిర్ణయాలను త్యజించినప్పుడే ఒక కొత్త దార్శనికత ఆవిష్కృతమవుతుంది.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)