Share News

‘కవిసంధ్య’ నిర్వహణలో ఎక్కడా ప్రయాస లేదు, అంతా ఆనందమే!

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:48 AM

మీరు నిర్వహించే ద్వైమాసిక కవిత్వ పత్రిక ‘కవిసంధ్య’ యాభై సంచికల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ పత్రిక పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

‘కవిసంధ్య’ నిర్వహణలో ఎక్కడా  ప్రయాస లేదు, అంతా ఆనందమే!

మీరు నిర్వహించే ద్వైమాసిక కవిత్వ పత్రిక ‘కవిసంధ్య’ యాభై సంచికల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ పత్రిక పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది. నేను 2015 డిసెంబర్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పదవీ విరమణ చేశాను. మీరన్నట్టు అప్పటికి రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరా బాద్‌లో ‘కవిసంధ్య’ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కవిసంధ్య తన కార్యక్షేత్రాన్ని నా పుట్టిన ఊరైన యానాంకు మార్చుకుంది. యానాంలో కవిసంధ్య తొలి సాహిత్య కార్యక్రమంగా దుర్ముఖినామ ఉగాది ఉత్సవాలు నిర్వహించ తలపెట్టింది. ఈ సందర్భంగా ‘కవిసంధ్య’ పేరుతో ఒక కవిత్వ బులెటిన్‌ తెస్తే ఎలా వుంటుందనే పురుగు లాంటి ఆలోచన బుర్రలో కలిగింది. నా ఆలోచనను యానాం కవిమిత్రుల ముందుంచాను. అప్పటికి ఉగాది రెండు మూడు రోజులే వుంది. మా యానాం మిత్రులు పెద్దగా వుత్సాహం చూపకపోగా నిరుత్సాహ పరిచారు. ఒకటి రెండు రోజులకు మించి సమయంలేదు– పైగా నువ్వు హైదరాబాద్‌లో, కార్యక్రమం యానాంలో, ఇంతతక్కువ వ్యవధిలో బులెటిన్‌ సాధ్యం కాదని తేల్చేశారు. వారికి ఒక ఉపాయం చెప్పి ఆ విధంగా ముందుకు పొమ్మన్నాను. ఫలితంగా 2016 ఏప్రిల్‌ 8న దుర్ముఖి నామ ఉగాది వేడుకల సందర్భంగా ‘కవిసంధ్య’ ఏప్రిల్‌–-మే ద్వైమాసిక సంచికగా యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు ముఖ చిత్రంతో 16 పేజీల కవిత్వ పత్రికగా వెలువడింది. ఇంతకీ నేను చెప్పిన ఉపాయమల్లా ‘‘సమయం లేదంటున్నారు కనుక యానాం కవుల కవితలు తలా ఒకటి సేక రించండి, యానాం వచ్చాక మిగతా సంగతి నేను చూసుకుంటాను’’ అని అన్నాను. ఆ రకంగా మొదటి సంచిక యానాం కవుల సంచికగా వెలువడింది. ఉగాది మరుసటి రోజున ఆర్ట్స్‌ కాలేజీలో భాస్కర రెడ్డిగారి అధ్యక్షతన పత్రిక కొనసాగింపుపై సమావేశం జరిగింది. పత్రిక నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వాటి సారాంశం: రచనలు వస్తాయి – -చందాలు రావు, పత్రిక అంటే ఒక కార్యాలయం, చిన్నపాటి సిబ్బంది అవసరం; మూలనిధి ఎలా? కొసమెరుపు: సంపాదకుడు హైదరాబాద్‌లో, పత్రికా నిర్వహణ యానాంలో అని సవాలక్ష సందేహాలు, ప్రశ్నలూ... అన్నిటికీ సర్దుబాటు సమాధానాలు చెప్పి, మొదటి మూడు సంచికలు నా ఖర్చుతో తెస్తాను,- నాలుగో సంచిక నాటికి పరిస్థితి చూద్దాం అన్నాను. నాలుగో సంచిక ఖర్చు నేను భరిస్తాను అన్నాడు మధునాపంతుల. ఏమనుకున్నాడో ముమ్మిడి చిన్నారి జేబులోంచి అయిదు వందలనోటు తీసి అందిం చారు. తొలి, రెండు, మూడు సంచికలు యానాం ఎక్స్‌ల్‌ నెట్‌ సెంటర్‌లో మిత్రుడు సత్తిబాబుగారు లే అవుట్‌ చేశారు. ఇదీ కవిసంధ్య తొలి అడుగు. ఇప్పుడు 50వ మైలు రాయికి చేరింది.

ఈ కాలంలో కవిత్వమే ప్రధానంగా పత్రిక నడపటం ఎలాంటి పని అని అడిగితే ఏం చెబుతారు?

ఇప్పుడు అన్ని పత్రికలూ కవితలకు చోటు తగ్గించే ధోరణితో ఉన్నాయి. దాంతో కవులకు స్కేళ్లు కొనుక్కోవడం తప్పటం లేదు. కవిత్వానికి స్థల నిర్దేశం చేయడం పోలీసింగ్‌ లాంటిది. జీవితానికి మల్లే కవిత్వానికి పోలీసింగ్‌ మంచిది కాదు. గతంలో, వేకువ, కంజిర, సంతకాలు, జముకు, చైతన్య కవిత వంటి పత్రికలు వచ్చి ఆగిపో యాయి.- ‘కవితా!’ పత్రిక కొనసాగుతుంది. అందుకే ఇప్పుడు కవిత్వానికి ఒక పత్రిక చాలా మంచి పని, అవసరమైన పని అని చెప్తాను.

సన్నాహక సభలో మిత్రులు అన్నట్టు రచనలు వచ్చినంతగా చందాలు రావన్నది అనుభవం మీద తెలిసింది. తొలి సంవత్సరంలో తిరుపతి సాహితీ మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువ లేనిది. రచనలు అడిగినంత చనువుగా చందాలు, రెన్యువల్స్‌ కూడా అడగలేక పోయాను. ఒక కవి గారిని పత్రికకు రచన అడిగితే మీరు అడగవలసిన పద్ధతిలో అడగ లేదంటాడు.- మరొక కవి ఇన్ని సంచికల్లో నా రచన ఒక్కటీ అచ్చు కాలేదంటాడు, పత్రికలకు రచనలు పంపడం రచయితల బాధ్యత కాదా! సంపాదకులు బొట్టుపెట్టి అడగాలా? భారతి పత్రిక చలానికి తిప్పి పంపిన కథ, ఆయన భారతికి అడిగితే పంపింది కాదని మన కవులు, రచయితలు ఎప్పటికి గుర్తెరుగుతారో.

ఇక ప్రయాస అంటారా... పత్రిక తయారీ హైదరాబాద్‌లో... ప్రింటింగ్‌ విజయవాడలో... పోస్టింగ్‌ యానాంలో... ఒక అరడజను మిత్రులు మా అన్నయ్య దుర్గా ప్రసాద్‌, మా మేనబావ ఆదినారాయణతో కలుపుకుని కవిసంధ్య ఆఫీసులో నేలమీద కూచుని పత్రికలను పోస్టింగ్‌కు సిద్ధంచేసేవాళ్ళం. అది ఒక కుటుంబ కార్యక్రమంలా సాగేది. ఒకసారి విజయవాడ నాగేంద్ర ప్రెస్‌లో కవిసంధ్య పత్రికల కట్టలు వున్న సంచిని ఎత్తబోతే నడుం కరుక్కుమంది. అది చూసి నాగేంద్ర ప్రెస్‌ పద్మగారు ఎందుకీ ప్రయాస, ఎక్కడి రేట్లు అక్కడే వుంటాయి. శుభ్రంగా హైదరాబాద్‌లో అచ్చేసి, అక్కడే పోస్ట్‌ చేసుకోమని హితవు పలికితే... ఇక అప్పట్నుండీ అన్నీ హైదరాబాద్‌లో... కరోనాలో అది అనివార్యం కూడా అయింది. నాకు కవిసంధ్య నిర్వహణ పత్రికలను మోయడం మా మనవడు విరాంశ్‌ను ఎత్తుకున్నంత సంతోషం.- ఇది ఆనందమే కాని ప్రయాస కాదు. ఎందుకంటే ఇష్టమైన పని కష్టమనిపించదు కనక.


ఈ యాభై సంచికల పనిలో మీరు మరిచిపోలేని జ్ఞాపకాలు, సన్నివేశాలు? పత్రిక భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు?

చాలానే వున్నాయి. రెండు మూడు చెబుతాను. పత్రిక ప్రారంభించాక కొత్తలో ప్రముఖ రచయిత్రి, నా కవిత్వాభిమాని అబ్బూరి ఛాయాదేవిగారు పదివేల రూపాయలు చెక్కు పంపించారు. తీరాచూస్తే అది కవిసంధ్య పేరు మీద వుంది. అప్పటికి కవి సంధ్యకు ఇంకా బ్యాంకు అకౌంట్‌ తెరవలేదు. అదే విషయం ఆమెకు చెబితే నా పేరు మీద మరొక చెక్కు పంపారు. కవిసంధ్య పేరుమీద వున్న చెక్కును తిరిగి మీకు పంపిస్తాను అంటే, వద్దు అకౌంట్‌ తెరిచాక అది కూడా బ్యాంకులో వేసుకోండి అన్నారు ఛాయమ్మ గారు అమ్మ మనసుతో. పేర్లు చెప్పడానికి ఇష్టపడని అజ్ఞాత సౌజన్యమూర్తులు మరికొందరు కవిసంధ్యకు వున్నారు.

నాకు కవిగా పదుల సంఖ్యలో చిన్నా పెద్దా పురస్కారాలు వచ్చాయి. అయితే ప్రముక పద్యకవి అనుమాండ్ల భూమయ్యగారు ఇటీవల తాముయిచ్చే పద్యకవి సత్కార సభలో కవిసంధ్య పత్రికా సంపాదకుడిగా నన్ను సత్కరించడం కవిసంధ్యకు, సంపాదకుడిగా నాకు దక్కిన తొలి సత్కారం.

ఇక భవిష్యత్తు ఆలోచనలు అంటారా... కవిసంధ్య 50 సంచికలను మనసు ఫౌండేషన్‌ రాయుడుగారి సౌజన్యంతో డిజిటలైజేషన్‌ చేసి భవిష్యత్తరాలకోసం భద్రపరచాలనే ఆలోచన వుంది. ఆన్‌లైన్‌ పత్రికగా తెచ్చే ఆలోచన వుంది. వచన కవిత్వం త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ‘వందేళ్ల వచన కవిత’ పేరుతో ఒక బృహత్‌ సంకలనం తెచ్చే ఆలోచన వుంది. పత్రికలో ఇపుడున్న శీర్షికలతో పాటు కవుల కవిత్వానుభవాలు, మన అనువాదకులు, నచ్చిన పుస్తకం వంటి శీర్షికలు ప్రవేశపెట్టే ఆలోచన వుంది.

ఒక కవి గారిని పత్రికకు రచన అడిగితే మీరు అడగవలసిన పద్ధతిలో అడగలేదంటాడు.- మరొక కవి ఇన్ని సంచికల్లో నా రచన ఒక్కటీ అచ్చు కాలేదంటాడు, పత్రికలకు రచనలు పంపడం రచయితల బాధ్యత కాదా! సంపాదకులు బొట్టుపెట్టి అడగాలా? భారతి పత్రిక చలానికి తిప్పి పంపిన కథ, ఆయన భారతికి అడిగితే పంపింది కాదని మన కవులు, రచయితలు ఎప్పటికి గుర్తెరుగుతారో.

(సెప్టెంబరు 14న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘కవిసంధ్య’ యాభయ్యవ స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ)

& 98482 02526

Updated Date - Sep 09 , 2024 | 05:48 AM