Share News

మనిషి లోపలి బయటి లోకాలకు అద్దం పట్టిన కవులు

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:42 AM

నీళ్ల కోసం తపించిన తెలంగాణ గోసను ‘తలాపునా పారుతుంది గోదారీ/ నీ చేను నీ చెలుకా ఎడారి’ వంటి అనేక ఆర్ద్ర గీతాలలో పలికిన ప్రజాకవి, ‘గోదావరి కవి’గా తెలంగాణ ప్రజలు ప్రేమతో పిలుచుకునే మల్లావఝల సదాశివుడు స్మృతిలో ఆ కవి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఆత్మీయ పురస్కారం అందిస్తున్నది.

మనిషి లోపలి బయటి లోకాలకు అద్దం పట్టిన కవులు

నీళ్ల కోసం తపించిన తెలంగాణ గోసను ‘తలాపునా పారుతుంది గోదారీ/ నీ చేను నీ చెలుకా ఎడారి’ వంటి అనేక ఆర్ద్ర గీతాలలో పలికిన ప్రజాకవి, ‘గోదావరి కవి’గా తెలంగాణ ప్రజలు ప్రేమతో పిలుచుకునే మల్లావఝల సదాశివుడు స్మృతిలో ఆ కవి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఆత్మీయ పురస్కారం అందిస్తున్నది. ఆ పరంపరలో 2022, 2023 సంవత్సరాలకుగాను కవులు మోహన్ రుషి, పసునూరు శ్రీధర్ బాబులకు నేడు సాయంత్రం రవీంద్రభారతిలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు.

కవిత్వం నాకొక సెన్సిటివ్ బిజినెస్, స్పిరిచువల్ యాక్టివిటీ అని రాసుకున్నాడు శ్రీధర్ బాబు. నిదురపోని మెలకువ చెప్పిన కలగా ప్రవహించే కవిత్వాన్ని వర్ణమయ అధివాస్తవిక పదచిత్రాలతో చిత్రిక కట్టి, పాఠకులను విభ్రమకు గురిచేస్తాడు శ్రీధర్ బాబు. తూనిక రాళ్లను మోస్తూ తిరగడం యిష్టం లేక, తనలో ఒక తూనీగను దాచుకుని ప్రయాణిస్తున్న కవి. ఒళ్ళంతా కిటికీలై తెరుచుకున్న తేనెతుట్టె వంటి కవిత్వాన్ని సృజిస్తూ సాగిపోతున్న కవి.

ఇరవై ఏళ్ళ క్రితం శ్రీధర్ బాబు తన తొలి కవితా సంకలనం ‘అనేక వచనం’లో ‘నేను నీ లోంచి /నీవు నా లోంచి /మనిద్దరమూ మరెవడి లోంచో/ సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనల్లోంచి’ అంటూ తన కవిత్వ తాత్వికతకు ఒక భూమిక రాసుకున్నాడు. ఇరవై ఏళ్ళ తరువాత వెలువరించిన అనేక వచనం.

2 కవితలో ‘లోపలి అద్దంలో మెరిసిన బొమ్మ కోసం /తలుపులు తెరిచి మాయాలాంతరు పట్టుకుని /పరుగులు తీసినవాడి జాడ ఎక్కడైనా కనిపించిందా? / నేనే ఈ జనారణ్యంలో అన్ని వైపులా అసంఖ్యాకంగా’ అన్నాడు.


‘ఏటి ఒడ్డున’ అన్న కవితలో ఏటి ఒడ్డున ఎవరో విడిచి వెళ్లిన కన్నీటి చుక్కలు, విడిచేసిన ఏకాంతపు ముఖాలు, పగిలిన నత్త గుల్లలు, పగిలిన ముఖాలు ఇట్లా ఏవేవో వుంటాయని చెబుతూ, కవిత చివరలో ‘ఏటి ఒడ్డున ఇవేవీ పట్టనట్టు /తుళ్ళుతూ - పరవళ్లు తొక్కుతూ పారే / ఏరు కూడా వుంటుంది’ అంటాడు శ్రీధర్ బాబు.

ఏటి ఒడ్డున వున్న వేటినీ పట్టించుకోకుండా వెళ్లిపోయే ఆ ఏరును కూడా తన కవిత్వంలో భద్రపరుస్తున్నాడు శ్రీధర్ బాబు. ఎందుకంటే, శ్రీధర్ బాబుకు కవిత్వం రాయడమంటే ‘దిగుడుబావి లోకి దిగుతూ దిగుతూ /ఆకాశాన్ని మరిచిపోయి /పెను చీకట్లోకి ఈదుకుంటూ పోయే పని /మెట్లెక్కుతూ ఎక్కుతూ /కాళ్ళకింద మెట్లు గల్లంతైనా /ఆగని ఆరోహణ లాంటి పని’. శ్రీధర్ బాబు కవిత్వం చదవడమంటే నక్షత్రపురం తోవలో ఒక విభ్రమతో ప్రయాణించడం.

స్కాటిష్ కవయిత్రి ‘కరోల్ ఆన్ డఫీ’ అంటుంది - ‘నీ రోజువారీ జీవితంలో, నీ జ్ఞాపకాలలో, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వినిపించే సంభాషణలలో లేక నీ హృదయం లోపలి ఉద్వేగాలలో నీకు కవిత్వం దొరుకుతుంది’.

కవి మోహన్ రుషి ఇటువంటి సజీవ దృశ్యాలనే తన కవిత్వంలో రికార్డు చేస్తున్నాడు. తెలంగాణలోని ఒక ద్వితీయశ్రేణి పట్టణం నుండి బతుకు తెరువు కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చిన భావుకుడు తనలాగే బతుకు తెరువు కోసం మహానగరానికి వచ్చిన మనుషులు బస్సులలో, షేరింగ్ ఆటోలలో తారసపడి వెళ్లబోసుకునే బాధలు, జీవన సంక్షోభాలు మోహన్ రుషి కవిత్వంలో మనల్ని పలకరించి కలవరపెడతాయి.

సరళమైన భాషతో జీవితాన్ని వ్యాఖ్యానిస్తూ సాగే మోహన్ రుషి కవిత్వంలో ఒక విధమైన వ్యంగ్యం అంతర్లీనంగా గోచరిస్తుంది. అట్లా అని అది వెటకారమూ కాదు, హాస్యమూ కాదు. బహుశా, వాటిని ‘చాప్లినిక్ స్టేట్‌మెంట్స్’ అనవచ్చేమో! ఉదాహరణకు ఒక కవితలో అంటాడు ‘వాహనాల సందుల్లో అతను ప్రవహించినంత సులభంగా అతని జీవితం ప్రవహించదు’.

కవిత్వం మాత్రమే కాదు, సమకాలీన రాజకీయాల మీదా, సామాజిక సంఘటనల మీదా, సినిమాల మీదా ‘దిమాగ్ ఖరాబ్’ పేరున మోహన్ రుషి రాసిన వన్ లైనర్స్ కూడా చాలా ప్రాచుర్యం పొందాయి.

‘గోదావరి కవి’ మల్లావఝల సదాశివుడు పురస్కారం స్వీకరించబోతున్న ఇష్టమైన కవిమిత్రులు ఇద్దరికీ శుభాకాంక్షలు!

– -కోడూరి విజయకుమార్

Updated Date - Jul 06 , 2024 | 04:42 AM