Share News

పాఠ్యపుస్తకాల్లో పొలిటికల్‌ కూడికలు, తీసివేతలు

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:20 AM

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల సవరణ కాండ ఈ సంవత్సరం కూడా కొనసాగింది. ఈసారి 12వ తరగతి రాజనీతి శాస్త్ర పాఠ్యపుస్తకం ‘స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలు’లో చోటు చేసుకున్న మార్పులు చేర్పులూ వాస్తవాలను సగం కప్పి సగం విప్పి, జరిగిన సంఘటనల మీద విద్యార్థులకు

పాఠ్యపుస్తకాల్లో పొలిటికల్‌ కూడికలు, తీసివేతలు

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల సవరణ కాండ ఈ సంవత్సరం కూడా కొనసాగింది. ఈసారి 12వ తరగతి రాజనీతి శాస్త్ర పాఠ్యపుస్తకం ‘స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలు’లో చోటు చేసుకున్న మార్పులు చేర్పులూ వాస్తవాలను సగం కప్పి సగం విప్పి, జరిగిన సంఘటనల మీద విద్యార్థులకు పాక్షిక దృష్టిని కలిగిస్తున్నాయి. ప్రజాస్వామిక, న్యాయ పద్ధతుల ద్వారా అయోధ్య సమస్య పరిష్కారమైనట్టు పేర్కొంటున్న ఈ పుస్తకం నుంచి గుజరాత్ మారణహోమం పూర్తిగా మాయమైంది.

మొదటిసారి 2007లో ప్రచురితమై 2023 దాకా కొనసాగిన పాతప్రతిలో అయోధ్య సమస్య అనే అంశం క్రింద ఉన్న వివరణ సంక్షిప్త రూపం ఇది: బాబ్రీమసీదు 16వ శతాబ్ది కట్టడం. దాన్ని బాబర్ సేనాని నిర్మించాడు. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా భావిస్తున్న చోట నిర్మితమైన ఆలయాన్ని పడగొట్టి నిర్మితమైనదిగా భావింపబడింది. ఈ అంశం చుట్టూ హిందూ ముస్లింలు తమ వర్గాలను సమీకరించుకున్నాయి. ఇది మతహింసకు దారితీసింది. ప్రజల మద్దతు కూడగట్టడానికి బీజేపీ రథయాత్రను నిర్వహించింది. కరసేవకులు డిసెంబరు 6, 1992న బాబ్రీమసీదును ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. దేశవ్యాపితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూల్చివేతను విపత్కర సంఘటనగా అభివర్ణించింది.

కాగా, నవీకరింపబడిన కొత్తప్రతి 2024లో ప్రచురితమై అమలులోకి వచ్చింది. దీనిలో పైన పేర్కొన్న విషయం మొత్తం తొలగింపబడి క్రింది విషయం వచ్చి చేరింది. దాని సంక్షిప్త రూపం ఇలా ఉంది: ఇది శ్రీరాముని జన్మభూమికి చెందిన వివిధ వాదనలున్న అంశం. 1528లో శ్రీరాముని జన్మస్థలంలో మూడు గుమ్మటాల నిర్మాణం జరిగింది. దీని మీద హిందూ ప్రతీకలూ, ఆనవాళ్లూ ఉన్నాయి. ఈ పవిత్రస్థలం కోసం సంవత్సరాల తరబడి న్యాయపోరాటం జరిగింది. 1992 లో కట్టడం కూలగొట్టబడినపుడు ప్రజాస్వామ్యం ఒక సవాలును ఎదుర్కొన్నది. చట్టబద్ధ మార్గాల ద్వారా పరిష్కారం కుదిరి సుప్రీంకోర్టు ఆ స్థలాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థట్రస్టుకు రామాలయ నిర్మాణానికి ఇస్తూ, వక్ఫ్ బోర్డుకు వేరొక స్థలం కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనలాంటి బహుళత్వం కలిగిన సమాజాలు ఈ విధంగా ప్రజాస్వామ్యపద్ధతిలో సమస్యలు పరిష్కరించుకోవాలి. భారతీయ నాగరికతలోనే కలిసిపోయిన ఆ తత్వానికి ఇది సమున్నత ఉదాహరణ... అంటూ 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పులోని కొన్ని ఉటంకింపులతో ముగిసింది.

రెండు ప్రతులలోని అంశాల వివరణలో ఎంతో వైరుధ్యం కనిపిస్తుంది. పాత ప్రతిలో ‘‘Ayodhya dispute’’ అని సమతూకంతో ఉన్న ఉపశీర్షిక కొత్తప్రతిలో తక్కువ తీవ్రత కలిగిన ‘‘Ayodhya issue’’గా మారింది. జరిగిన పరిణామాలను పాతప్రతి వాస్తవికంగా, తార్కికంగా, బాహాటంగా వివరించగా కొత్తప్రతి వివరణ నర్మగర్భంగా, ఖాళీలతో, వాక్యాల మధ్య అన్వయలేమితో సాగింది. అక్కడ నిర్మితమైన కట్టడాన్ని బాబ్రీ మసీదుగా పాతప్రతి స్పష్టం చేయగా, కొత్తప్రతి దానిని మూడు గుమ్మటాల కట్టడం అనింది. అది ఏమిటో దానిని ఎవరు నిర్మించారో ఇక్కడ జవాబులు లేవు. మసీదు నిర్మాణానికి ముందు ఉన్న ఆలయ ప్రదేశం శ్రీరాముని జన్మస్థలం అనేది ఒక విశ్వాసం అని పాత ప్రతి విస్పష్టంగా చెప్పగా, కొత్త ప్రతి దానిని శ్రీరాముని జన్మస్థలంగా నిర్ధారించి మాట్లాడింది. చారిత్రక వ్యక్తి జన్మస్థలానికీ, పురాణ వ్యక్తి జన్మస్థలానికి మధ్య ఉండవలసిన శాస్త్రీయత, ఊహాత్మకతల మధ్య విభజనను కొత్తప్రతి పాటించలేదు.

ఇక, పూర్తిగా తొలగింపుకు గురైన పాఠ్యభాగం ‘‘Gujarat riots’’. కరసేవకులతో నిండి అయోధ్య నుంచి తిరిగి వస్తున్న రైలు బోగీకి గోద్రా స్టేషన్‌లో ఎవరో నిప్పంటించడం, 57 మంది మరణించడం, అది ముస్లింల దుశ్చర్యగా భావించి వారి మీద మరుసటి రోజు మొదలు నెలరోజులపాటు మారణహోమం సాగటం, 1100 మంది మరణించటం, అందులో అత్యధికులు ముస్లింలు కావడంతోపాటు జాతీయ మానవహక్కుల కమిషన్ దమనకాండను అదుపుచెయ్యడంలో గుజరాత్ ప్రభుత్వ దారుణ వైఫల్యాన్ని తప్పు పట్టడం వంటి అంశాలున్న ఈ ఉపశీర్షిక మొత్తం ఎత్తివేయబడింది. ఈ అల్లర్లు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మత పక్షపాతం ఉంటుందని రుజువుచేశాయనీ, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్ల జరిగే ఇటువంటి ప్రమాదాల పట్ల జాగరూకత వహించాలనీ, ఇవి ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనీ చేసిన వ్యాఖ్యలు కూడా తొలగించబడ్డాయి.

అలాగే పై రెండు సందర్భాలలో పాతప్రతిలో ముద్రింపబడిన సంఘటనల నాటి వార్తాపత్రికలలో ముద్రింపబడిన వార్తల నకళ్లు కొత్తప్రతిలో మొత్తంగా మాయమయ్యాయి. వీటిల్లో హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన ‘బాబ్రీ మసీదు విధ్వంసం-– కళ్యాణ్ ప్రభుత్వాన్ని రద్దుచేసిన కేంద్రం’ అనే శీర్షిక, ‘అయోధ్య, బీజేపీ దారుణ వైఫల్యం –- అద్వానీని ముందే హెచ్చరించాను- కానీ మితవాదులకు ఇక్కడ స్థానం లేదు’ అని పయనీర్ ప్రచురించిన వాజ్‌పేయి ఆక్రోశం, పయనీరే ప్రచురించిన ‘కూల్చివేతపై పశ్చాత్తాపం లేదు’ అన్న అద్వానీ బాధ్యతారాహిత్యం, స్టేట్స్ మన్ ప్రచురించిన ‘ప్రపంచవ్యాపిత ఆగ్రహ ప్రతిస్పందన’ అనే వార్త ఉన్నాయి.


గుజరాత్ విషయానికి వస్తే తొలగింపుల్లో హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించిన ‘మండుతున్న గుజరాత్’ అనే వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ‘కంటికి కన్ను సూత్రంతో గుడ్డిదైన గాంధీనగర్’ అనే పతాక శీర్షిక, ఒక పత్రిక (పేరు లేదు) ప్రచురించిన ‘గుజరాత్ సంఘటనలు మాయని మచ్చలు –- ప్రపంచానికి నా ముఖం ఎలా చూపించను’ అన్న వాజ్‌పేయి ఆవేదన, మరో పత్రిక ప్రచురించిన ‘ఆగని గుజరాత్ మారణహోమం’ అనే శీర్షిక ఉన్నాయి. వీటితోపాటు తొలగింపుల్లో 1947 ఫిబ్రవరి 27న రాజ్యాంగ పరిషత్తు సలహా సంఘం ముందు ‘మైనారిటీలను కాపాడలేమని మనమీద ఉన్న అపప్రథను తొలగించుకుని వాటిని పరిరక్షించుకోవడంలో మనలను మించినవారు లేరని రుజువుపరచుకోవలసి ఉంది’ అన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటల్ని తొలగించారు. అలానే, గుజరాత్ సంఘటనను, వాటి నివారణలో ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా తప్పుపట్టి, ఈ గాయాన్ని త్వరగా మాన్పుకుని శాంతియుతమైన, తాళైక్యత (harmony) కలిగిన సమాజం కోసం ఎదురు చూడాలని, ఈ మహత్తర ఆశయ సాధన రాజ్యాంగ విలువల పరిరక్షణ ద్వారా సాధ్యపడాలని కాంక్షించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 2001–-02 వార్షిక నివేదిక ఉటంకింపు కూడా కత్తిరింపబడింది. చివరిగా, అప్పటి ప్రధాని వాజ్ పేయి ‘గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రికి నా సందేశం ఒకటే –- అతను రాజధర్మాన్ని పాటించాలి. పరిపాలకుడు కులం, మతం, జాతి ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపరాదు’ అన్న మాటలు కూడా తొలగింపబడ్డాయి.

ఈ సందర్భంగా ఎన్‌సిఈఆర్‌టి డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ, ‘‘హింసను ప్రేరేపించి, పౌరులను కుంగుబాటుకు గురిచేసే ప్రమాదముంటుందని భావించి’’ వాటిని తొలగించినట్టూ చెబుతూ, ‘‘పిల్లలు పెద్దయ్యాక ఎలాగూ తెలుసుకుంటారు. ఇప్పటి నుంచే వాటి గురించి తరగతి గదిలో ఎందుకు?’’ అని తమ చర్యను సమర్థించుకున్నారు (ఆంధ్రజ్యోతి 17.6.2024 వార్త). నిజానికి ఈ పుస్తకం చదువుకునే విద్యార్థి వయసు 17 సంవత్సరాలు ఉంటుంది. మరో ఏడాదిలో ఓటుహక్కు లభించే అతనికి/ఆమెకు దేశ రాజకీయాలను దాచిపెట్టి చెప్పవలసిన అవసరం ఏముందీ? వాటి మీద సరైన అవగాహన రాజనీతి శాస్త్ర గ్రంథం కాక, మరేది ఇవ్వగలదు?

ఒకవేళ, తొలగింపు సమర్థనే నిజమైతే, అది 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం ఢిల్లీలో, ఇతర ఉత్తరభారత ప్రాంతాలలో జరిగిన సిక్కుల ఊచకోతకు కూడా వర్తించాలి. కానీ ఈ రెండువేల మంది సిక్కుల మరణానికి దారితీసిన కారణాలూ, అనంతర పరిణామాలూ, ఈ దారుణ ఘటనల పట్ల 2005లో అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ పార్లమెంటులో సిక్కు సమాజంతో పాటు యావత్ భారతజాతిని క్షమాపణలు కోరుతూ చేసిన పశ్చాత్తాప ప్రకటనను కూడా తొలగించాలి. కానీ, కొత్తప్రతిలో దానిని యథాతథంగా ఉంచేశారు.

పాఠ్యపుస్తకాల్లో సవరణలు, తొలగింపుల విషయమై ఎన్‌సిఈఆర్‌టి డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ, ‘‘పిల్లలు పెద్దయ్యాక ఎలాగూ తెలుసుకుంటారు. ఇప్పటి నుంచే వాటి గురించి తరగతి గదిలో ఎందుకు?’’ అని తమ చర్యను సమర్థించుకున్నారు. నిజానికి ఈ పుస్తకం చదువుకునే విద్యార్థి వయసు 17 సంవత్సరాలు ఉంటుంది. మరో ఏడాదిలో ఓటుహక్కు లభించే అతనికి/ ఆమెకు దేశ రాజకీయాలను దాచిపెట్టి చెప్పవలసిన అవసరం ఏముందీ?

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Updated Date - Aug 17 , 2024 | 05:20 AM