Share News

‘తల్లి’ సెంటిమెంట్‌తో చెలగాటం!

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:17 AM

తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నది. ప్రజలు సతమతమయ్యే ఎన్నో సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఏదో ఒక సెంటిమెంటును ఎరగా వేసి పాలక పక్షాలు ఆడే నాటకంలో ఇప్పుడు కొత్తగా ఇది చేరింది. మనం భారతదేశ మ్యాప్‌లో జాతీయ జెండాతోపాటు

‘తల్లి’ సెంటిమెంట్‌తో చెలగాటం!

తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నది. ప్రజలు సతమతమయ్యే ఎన్నో సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఏదో ఒక సెంటిమెంటును ఎరగా వేసి పాలక పక్షాలు ఆడే నాటకంలో ఇప్పుడు కొత్తగా ఇది చేరింది. మనం భారతదేశ మ్యాప్‌లో జాతీయ జెండాతోపాటు కిరీటధారి ఐన నిలువెత్తు మహిళను భరతమాతగా చూపుతాము. తెలంగాణ ఏర్పడక ముందు మనకు తెలుగుతల్లి విగ్రహం ఉండేది– ఒక చేతిలో మామిడాకుల కలశం, మరో చేతిలో వరికంకులతో. ఇలాంటి చిహ్నాలను స్త్రీలను గౌరవించే మన సంప్రదాయంలో భాగంగా చూడవచ్చు. అంతేతప్ప భరతమాత ఇలా ఉంటుంది, తెలుగుతల్లి ఇలా ఉంటుంది... అనే భౌతికమైన ప్రాతిపదిక ఏదీ లేదు. ఎవరు ఏ రకమైన సెంటిమెంట్ కోసం ఈ ‘‘మాత’’లను, ‘‘తల్లు’’లను సృష్టించుకున్నా అవి స్ఫూర్తినిచ్చే ఊహాచిత్రాలే!

మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి మాదిరిగా తెలంగాణ తల్లి ఉండాలనే సెంటిమెంటు మొదలైంది. వాస్తవంగా తెలుగుతల్లి సమైక్యాంధ్ర తల్లి మాత్రమే కాదు, తెలుగు భాష మాట్లాడే వారందరికీ తల్లే. సరే, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది. ఒక చేతిలో మొక్కజొన్న కండె, మరో చేతిలో బతుకమ్మ, నెత్తిన కిరీటం... ఇదీ కేసీఆర్ అండ్ కో రూపొందించిన తెలంగాణ తల్లి. నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో తెలంగాణ తల్లికి రూపకల్పన చేసింది. ఇది అత్యంత ప్రాధాన్యత గల సెక్రటేరియట్ ముందు కొలువు తీరింది.


కాంగ్రెస్‌ రూపుదిద్దిన ఈ తెలంగాణ తల్లిలో రాజరికానికి చిహ్నం అయిన కిరీటాన్ని తొలగించారు. ఒక చేతిలో జొన్న, సజ్జ తదితర ధాన్యం కంకులు ఉంచి, మరో చేతిని అభయ హస్తంగా మలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలంగాణ తల్లిగా ఒక రూపం కొంతకాలం పాటు ప్రచారం పొందిన తర్వాత ఆ రూపాన్ని ప్రజల మనోఫలకం నుంచి తొలగించి మరో రూపాన్ని ఒప్పించడం అంత సులభం కాదు. ఇక విగ్రహం విషయానికి వస్తే– తెలంగాణ సెంటిమెంట్‌గా సృష్టించిన విగ్రహాలు రెండింటిలోనూ వాస్తవానికి బహుజన స్త్రీ రూపం గానీ, శ్రామిక స్త్రీ రూపం గానీ లేవు. తెలంగాణ శ్రామిక స్త్రీ మట్టగోచీ పెట్టుకొని పొలంలో పురుషుడితో సమానంగా శ్రమిస్తుంది. వర్గ దృక్పథం నుండి చూస్తే– చెంగులు విరబోసుకొని చీర కట్టిన మహిళను ధనిక, జమీందారీ వర్గానికి ప్రతీకగా చూడవచ్చు. శ్రామిక స్త్రీ ఎల్లప్పుడూ మట్టగోచీ పెట్టుకొని శ్రమకు అనుకూల రూపంలో ఉంటుంది. ఇక మధ్య తరగతి మహిళ ఈ రెండు రకాల చీర కట్టుబాట్లూ పాటిస్తుంది. మధ్యతరగతి మహిళలు పనిచేసే సమయంలో శ్రామిక స్త్రీలా గోచీ పెట్టుకుంటారు, పని పూర్తి కాగానే ఉన్నత వర్గ స్త్రీలా ఉండడానికి చీర చెంగులు విరబోసుకుని ఉంటారు. వాస్తవానికి తెలంగాణా తల్లి చీరకట్టు శ్రామిక, బహుజన స్త్రీ రూపంలో ఉండడమే న్యాయం. చెప్పాలంటే యథాతథంగా చాకలి ఐలమ్మ రూపం! అది చారిత్రకంగా ప్రాధాన్యత గల రూపం కూడా. మరి అటు కేసీఆర్ అండ్ కో గానీ, ఇటు రేవంత్ బృందం కానీ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే సమయంలో దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియదు.

ఇకపోతే గత ప్రభుత్వం తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను ఉంచింది. దాన్ని తొలగించి ప్రస్తుత ప్రభుత్వం అభయహస్తం సూచికగా ఉంచింది. వాస్తవానికి ఈ రెండూ కరెక్టు కాదు. తెలంగాణలో ఆడే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం వచ్చాక బహుజన బతుకమ్మగా కలరింగ్ ఇచ్చారే గానీ, నాకు తెలిసి నా చిన్నతనంలో బతుకమ్మను శ్రామిక స్త్రీలు అసలు పట్టించుకునేవారే కాదు. వైశ్య, బ్రాహ్మణ, వెలమ, రెడ్డి తదితర ఉన్నత వర్గాల మహిళలు మాత్రమే బతుకమ్మ ఆడుకునేవారు. చాకళ్ళు బొచ్చెలు మోసేవారు, ముదిరాజులు తంగేడు పూలు, గునుగు పూలు సేకరించడంలో ఉండేవారు. అలా పాములు కరిచి చెరువులో మునిగి అనేకమంది బహుజనులు మృత్యువాత పడేవారు కూడా. ఇట్లాంటి బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పుణ్యమా అని రాష్ట్ర సెంటిమెంట్‌గా మారింది. ఆ రకంగానే తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా మార్చుకున్నాం కూడా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం మరలా సెంటిమెంట్‌లో వేలు పెట్టినట్టయ్యింది. వాస్తవానికి భరతమాత, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... ఇలా ‘‘తల్లు’’లను సృష్టించే సమయంలో మనం అప్రయత్నంగానే మన పురాణాలలోని సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి.. తదితర దేవతల రూపాలను అనుకరిస్తాం. అందువల్లనే ఆ రూపాలలో కిరీటాలు, వడ్డాణాలు, హారాలు, చీరకట్టుబాట్లు వచ్చి చేరుతున్నాయి. తెలంగాణ తల్లి కూడా అందుకు మినహాయింపు కాదు. అందుకే ఏ తల్లిని మార్పు చేసినా సెంటిమెంటుకు బందీలైన ప్రజలు అంత తొందరగా జీర్ణం చేసుకోలేరు!

l ----ఎన్. తిర్మల్

Updated Date - Dec 12 , 2024 | 05:17 AM