కాలుష్యం–రాజకీయం
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:41 AM
దీపావళి రాకముందే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీ వాసులు ఏటా అనుభవించే నరకమే, చూసే రాజకీయమే ఎప్పటిలాగా కొనసాగుతోంది. కేజ్రీవాల్ స్థానంలో కూర్చున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి తనకు వీలైన చర్యలేవో తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ వ్యవస్థలు...
దీపావళి రాకముందే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీ వాసులు ఏటా అనుభవించే నరకమే, చూసే రాజకీయమే ఎప్పటిలాగా కొనసాగుతోంది. కేజ్రీవాల్ స్థానంలో కూర్చున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి తనకు వీలైన చర్యలేవో తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు ఎంతో హడావుడి చేస్తున్నాయి. ఆ కలుషితవాతావరణంలో కాస్తంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పుడల్లా ఏ రోజుకారోజు ప్రజలు సంతోషమో, దుఃఖమో పడవలసి వస్తున్నది. దీపావళి సమీపిస్తున్నప్పటికే కాలుష్యం దారుణంగా పెరిగిపోవడం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
వారంరోజుల వ్యవధిలోనే గాలినాణ్యత బాగా పడిపోవడంతో, వాలంటీర్లను మళ్ళీ ప్రభుత్వం రంగంలోకి దింపబోతున్నది. కాలుష్యాన్ని అరికట్టడానికికంటూ ఉన్న పదివేలమందిని గత ఏడాది తొలగించిన ప్రభుత్వమే ఇప్పుడు మళ్ళీ వారిని నియమించుకొని బాధ్యతలు అప్పగించబోతోంది. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడం, అన్ని రకాల నిర్మాణకార్యక్రమాలను నిలిపివేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే వినియోగించేట్టుగా ప్రజలపై ఒత్తిడితేవడం వంటి చర్యలు ఎప్పటిలాగానే ఇప్పుడూ ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇక, టపాసులు కాల్చడం మీద ఢిల్లీలో ఎప్పటినుంచో నిషేధం ఉంది. ఆరంభంలో గ్రీన్ క్రాకర్స్, అంటే తయారీలో బేరియం లవణాలను వినియోగించని టపాసులకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ తరువాత ఆ మినహాయింపు కూడా దుర్వినియోగం కావడంతో పూర్తి నిషేధం వచ్చిపడింది. పాలకుల చొరవవల్లనో, న్యాయస్థానాల ఆదేశాలవల్లనో, చేజేతులా వాతావరణాన్ని కలుషితం చేయడమెందుకన్న భావన వల్లనో, దేశరాజధానివాసుల్లో టపాసుల మోజు ఇటీవలి సంవత్సరాల్లో బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ, ఢిల్లీ రాజధాని ప్రాంతంలోకి టపాసుల సరఫరా ఎంతోకొంత మేరకు అక్రమంగా సాగుతూనే ఉంది. దీపావళి నాడు వాటిని కాల్చి ఆనందించేవారిని నిరుత్సాహపరచేందుకు, వారిలో చైతన్యం పెంచేందుకు ‘దియాజలావ్’ కార్యక్రమాన్ని ఆరంభించబోతున్నట్టు ఢిల్లీ పర్యావరణ మంత్రి ప్రకటించారు. రాబోయే పదిహేనురోజుల్లో కాలుష్యం మరింత పెరుగుతుంది కనుక, జనం టపాసులను పూర్తిగా దూరం పెట్టాలన్నారు ఆయన. అంతవరకూ బాగున్నది కానీ, ఇంతటి తీవ్రమైన పరిస్థితులను, సందర్భాలను సైతం రాజకీయం చేయడమే సముచితంగా లేదు. వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటినీ ఆయన గొప్పగా చెప్పుకోవడం తప్పుకాదు. కానీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలనుంచి, అంటే, బీజేపీ పాలిత పొరుగురాష్ట్రాలనుంచి టపాసుల స్మగ్లింగ్ భారీగా జరుగుతోందని ఈ ఆప్ మంత్రి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాలు అంటూ కేంద్రాన్ని కూడా కలిపి విమర్శించారు. టపాసుల స్మగ్లింగ్ నివారించాల్సిందిగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఓ లేఖకూడా రాశారు.
ఢిల్లీ కాలుష్యానికి యూపీ, హర్యానా రైతులు పంటపొలాల్లో వ్యవసాయ వ్యర్థాలు పెద్ద ఎత్తున తగలబెట్టడమే కారణమని ముఖ్యమంత్రి ఆతీశీ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పటినుంచో ఉన్న సమస్య, ఇందులో అసత్యమేమీ లేదు. కానీ, ఢిల్లీ ప్రజల అనారోగ్యానికి బీజేపీ పాలిత రాష్ట్రాలే కారణమంటూ ఆమె వ్యాఖ్యానించడం సరికాదు. ఆప్ పాలిత పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం గణనీయంగా తగ్గిందని కూడా ఆమె సమర్థించుకున్నారు. ఆప్ మంత్రులంతా అవే మాటలు వల్లిస్తున్నారు. సహజంగానే బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. రెండుపార్టీల నాయకులు కాలుష్యం కేంద్రంగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ రాజకీయ కాలుష్యాన్ని మరింత పెంచేస్తున్నారు.
గ్యాస్ చాంబర్‌లాగా మారిపోయిన ఢిల్లీలో ప్రజలు పలు ఆరోగ్యసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. విపరీతమైన వాయుకాలుష్యం వారిని నిలువనివ్వడం లేదు. ప్రధానంగా వృద్ధులను, పిల్లలను దగ్గు, గొంతునొప్పి, ఆయాసం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. కళ్ళు, ముక్కు మండిపోతుంటే వాయురూపంలో ఉన్న విషాన్ని దిగమింగుతున్నట్టుగా వారికి అనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలతో ఢిల్లీ, దాని పొరుగు రాష్ట్రాలు కలసికట్టుగా కాలుష్యనివారణకు కృషిచేయాల్సిన తరుణమిది. ఈ కష్టకాలంలో పార్టీలకు అతీతంగా నిలిచి, ప్రజల మేలుచేకూర్చాల్సినవారు వాతావరణాన్ని మరింత విషపూరితం చేయడం సముచితం కాదు.