బంగ్లాపై ఒత్తిడి!
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:20 AM
భారత్, బంగ్లాదేశ్‌లు మాట్లాడుకోవడమే ఓ అద్భుతంగా చెప్పుకోవాల్సిన కాలం వచ్చింది. ఎవరివాదనమీద వాళ్ళు ఉన్నప్పటికీ, పొరుగుదేశంమీద కాస్తంత ఒత్తిడిపెంచడానికి...
భారత్, బంగ్లాదేశ్‌లు మాట్లాడుకోవడమే ఓ అద్భుతంగా చెప్పుకోవాల్సిన కాలం వచ్చింది. ఎవరివాదనమీద వాళ్ళు ఉన్నప్పటికీ, పొరుగుదేశంమీద కాస్తంత ఒత్తిడిపెంచడానికి భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటన ఉపకరించింది. రెండుదేశాలు క్రమంగా ఆరోపణలస్థాయినీ, విమర్శల తీవ్రతనీ పెంచేస్తున్న తరుణంలో మిస్రీ ఒక్కరోజు పర్యటన జరిగింది. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత, దిగజారిన వాతావరణంలో, భారత్‌నుంచి ఒక ఉన్నతాధికారి ఢాకాలో కాలూనడం ఇదే తొలిసారి. మైనారిటీలను రక్షించాల్సిందే అని మిస్రీ గట్టిగా చెప్పడం వల్లనే 88మతవిద్వేషపూరిత ఘటనలు జరిగాయన్న వాస్తవాన్ని బంగ్లాదేశ్ ఒప్పుకుందని కొందరి నమ్మకం. ఇవి ప్రధానంగా హిందువులమీద జరిగాయనీ, ఈ సంఖ్య మరింతగా హెచ్చుగా ఉంటుందని వేరుగా చెప్పుకోనక్కరలేదు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఒత్తిడిపెరుగుతోంది కనుక, రాజ్యభారాన్ని తాత్కాలికంగా మోస్తున్న నోబెల్ విజేత యూనిస్ ఏవో కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించవలసిందే. ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నామనీ, వరుస అరెస్టులతో ఉన్మాదులను భయపెడుతున్నామనీ ఆ దేశం వివరణ కూడా ఇచ్చుకుంటోంది.
బంగ్లాదేశ్‌కు ఎంతో చేశామని, పుట్టుకనుంచి ఎదుగుదలవరకూ మనమే మోశామని, ఆ కృతజ్ఞత ఏమాత్రం లేకుండా ఆ దేశం వ్యవహరిస్తున్నదని చాలామంది బాధ. హసీనా పాలనలో ఆ దేశం ఆర్థికంగా మరింత ఎదిగింది, మనతో స్నేహం దానికి ఉపకరించినట్టుగానే, సరిహద్దును ప్రశాంతంగా ఉంచడంలో ఆ దేశం మనకు సాయపడ్డది. ఈశాన్యరాష్ట్రాల్లో నిప్పురాజేసే మిలిటెంట్ సంస్థలను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడంలో బంగ్లా సహకారం కాదనలేనిది. హసీనా లేని బంగ్లాదేశ్ మనకు సమస్యాత్మకంగా తయారవుతుందనీ, మతోన్మాదులకూ, పాక్ అనుకూల శక్తులకూ స్థావరంగా మారుతుందనీ ఊహించినదే. హసీనా నిరంకుశత్వం, ఆధిపత్యధోరణులు ఆమె పతనానికి దారితీశాయన్నది ఎంత నిజమో, ఆమెను దింపేసిన ఉద్యమంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తున్న యువతరంతో పాటు, ఖలేదాజియా పార్టీ, అనుబంధ ఇస్లామిక్ సంస్థలు ఉన్నాయన్నది అంతే నిజం.
మొదట్లో హిందువులమీద జరిగిన దాడులు పూర్తిగా రాజకీయమైనవేనని, అందులో మతం లేదని యూనిస్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇప్పుడవి మతవిద్వేష దాడులని ఒప్పుకుంటున్నది కానీ, భారత్‌ను బూచిగా చూపిస్తున్నది. గతంలో ఇస్కాన్ సంస్థలో పనిచేసి, ఆ తరువాత వేరుకుంపటి పెట్టుకున్న చిన్మయి కృష్ణదాస్ వ్యవహారశైలి ఉభయదేశాల మధ్యా దూరాన్ని మరింత పెంచింది. ఆయన అరెస్టు, రాజద్రోహం కేసు, ఉద్రిక్తతల సందర్భంలో మనదేశం గట్టిగా ప్రతిస్పందించి అతడిని వెంటనే వదిలేయాలని డిమాండ్ చేయడంతో, చిన్మయిని మోదీ ఏజెంటుగా అభివర్ణించేందుకు పొరుగువారికి అవకాశం చిక్కింది. ఆఖరునిముషం వరకూ అధికారాన్ని కాపాడుకొనేందుకు ఉద్యమకారులను కాల్చిపారేసిన హసీనాకు ఆశ్రయం ఇవ్వడం కూడా భారతవ్యతిరేకత పెంచడానికి ఉపకరించింది. నిలువనీడ పొందిన ఆమె నోరువిప్పకపోయినా సరిపోయేది. కానీ, కొద్దిరోజుల్లోనే ఆమె అక్కడి రాజకీయ పరిణామాలమీద ఇక్కడనుంచి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఆ తరువాత మరింత ఘాటుపెంచి, యూనిస్ ప్రభుత్వం మైనారిటీలను కాపాడలేకపోతున్నదని అంటూ, హిందువులను ఊచకోత కోస్తున్నారన్న అర్థంవచ్చే వ్యాఖ్యలు చేశారు. హసీనాను అప్పగించండి అని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మనం సరేననక్కరలేదు.
కానీ, అక్కడి పరిస్థితులు మరింత దిగజారడానికీ, మనకు వ్యతిరేకంగా తయారవడానికి దోహదం చేసే వ్యాఖ్యలకు ఆమెను అనుమతించకూడదు. అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులను ఇక్కడ తమ మతరాజకీయాలకు వాడుకోవడంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి వంటివారు బాబర్, సంభాల్, బంగ్లాదేశ్‌లను ముడిపెడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు పొరుగుదేశంతో సంబంధాలను మరింత దిగజార్చుతాయి. బంగ్లాదేశ్‌లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని మమతాబెనర్జీ ఓ అర్థంలేని వ్యాఖ్యచేయగానే, ఇండియాలో హిందువులు, బంగ్లాలో రజాకార్ వ్యతిరేకశక్తులు చేయికలిపితే ఐదునిముషాల్లో యూనిస్ చర్మం ఊడిపోతుందని పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యాఖ్యానించారు. మోదీ తలుచుకుంటే ఐదునిముషాల్లో బంగ్లాదేశ్ పనిపూర్తవుతుందని మరోపెద్దమనిషి అన్నాడు. అక్కడి పరిణామాలు మనల్ని బాధిస్తున్నట్టుగానే, ఇక్కడి మాటలు సరిహద్దు ఆవల కూడా ప్రభావం చూపుతాయని మరిచిపోకూడదు.