సమస్య, నిర్మూలన
ABN , Publish Date - Sep 06 , 2024 | 02:00 AM
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం నాడు జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో ఒక అగ్రనేతతో సహా తొమ్మిదిమంది మావోయిస్టులు చనిపోయారు. దీనితో ఆ రాష్ట్రంలో ఈ సంవత్సరారంభం నుంచి జరుగుతున్న భద్రతాదళాల చర్యల్లో...
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం నాడు జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో ఒక అగ్రనేతతో సహా తొమ్మిదిమంది మావోయిస్టులు చనిపోయారు. దీనితో ఆ రాష్ట్రంలో ఈ సంవత్సరారంభం నుంచి జరుగుతున్న భద్రతాదళాల చర్యల్లో మరణించినవారి సంఖ్య 150 దాటింది. చాలా కాలం పాటు సాపేక్షంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య ‘ఎన్‌కౌంటర్లు’ తిరిగి ప్రారంభమయ్యాయి. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు పోలీసు, భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయారు. ఇవి రెండూ ఒక క్రమంలో జరిగిపోయిన సంఘటనలు మాత్రమే. ఈ సందర్భం నుంచి మొత్తం దృశ్యాన్ని చూడగలిగితే, సంక్షోభ తీవ్రత అర్థమవుతుంది. ఈ తొమ్మిదినెలల కాలంలో జరిగిన సంఘటనల్లో చనిపోతున్నవారిలో సాయుధులెందరో, నిరాయుధులెందరో, అమాయకులెందరో అన్న ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అవకాశం దక్కినప్పుడు మావోయిస్టులు కూడా ప్రతిఘటన పేరుతో ఏదో హత్యాకాండకు పాల్పడతారు. హతులు ఎవరైనా, మరణవార్తలు, ఛిద్రమైన మృతదేహాల ముఖచిత్రాలు ఎవరికీ ఆహ్లాదకరంగా, ఆహ్వానించదగినవిగా ఉండవు.
మావోయిస్టు ‘సమస్య’ను 2026 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మధ్య కూడా వాగ్దానమో, ఉద్ఘాటనో చేశారు. దేశంలో అశాంతి కలిగిస్తుందనుకుంటున్న ఒక అంశాన్ని చక్కబరచాలన్నది అమాత్యుడిగా ఆయన బాధ్యత కావచ్చు. కానీ, సమస్య అని చెబుతున్నదాన్ని సరిగా అర్థంచేసుకున్నారా లేదా అన్నది ప్రజలకు, సమాజానికి ముఖ్యం. ప్రభుత్వం, దాని ప్రతినిధులు ఒక క్లిష్ట పరిస్థితి కారణాలను సరిగా గుర్తించలేకపోతే, దానికి అనుసరించే పరిష్కారమార్గాలు కూడా పొరపాటువే అవుతాయి. ఒక్కోసారి, ‘సమస్య’ కంటె మించినవి అవుతాయి. రెండేళ్లు, మూడేళ్లు అని వ్యవధి విధించుకోవడం దాదాపు అరవై ఏళ్ల నుంచి భారతదేశపు హోంమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తూనే వచ్చారు. ఏ పరిస్థితీ అకారణంగా, అకస్మాత్తుగా జనించదు. కారణాలను వదిలివేసి, వాటి ప్రతిస్పందనలను నిర్మూలిస్తే, సమస్య కొనసాగుతూనే ఉంటుంది. నక్సలిజానికి కానీ, మావోయిజానికి కానీ, వ్యవస్థల వైఫల్యంలో, పాలనలలోని అప్రజాస్వామికతలలో, కొరతలలో సానుకూలతలు ఏర్పడ్డాయి. రాజ్యం, దాని రాజకీయ నాయకత్వం తమ స్వయంకృతాల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దే పనిని భద్రతా యంత్రాంగానికి అప్పజెబుతున్నవి. ఫలితంగా హింస, ప్రతిహింస, మరింత హింస అనే చట్రం నిరంతరంగా కొనసాగుతూ వస్తున్నది.
ఘర్షణాత్మక వాతావరణం నిరంతరంగా కొనసాగడం, అందులో ప్రాణనష్టం జరగడం ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారిని తీవ్రంగా బాధిస్తుంది. బాధించాలి. కానీ, దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ స్రవంతిలో ఈ పరిస్థితిపై ఒక మౌనం, నిశ్శబ్ద అంగీకారం నెలకొనడం బాధాకరం. ఆయుధధారులై, ప్రభుత్వంతో తలపడుతున్నవారు నిర్బంధచర్యలు ఎదుర్కొనడం అనివార్యమనుకున్నా, పెద్ద సంఖ్యలో అమాయక ఆదివాసులు సానుభూతిపరులుగా, ఆశ్రయదాతలుగా అనుమానితులై హతులవుతున్నారన్న వార్తలు కూడా భారతీయ పౌరసమాజాన్ని పెద్దగా కదలించలేకపోతున్నాయి. మావోయిస్టులను ‘ఏరివేయడానికి’ భద్రతా దళాలు అనుసరిస్తున్న పద్ధతుల గురించి కూడా ఆందోళనకరమైన వార్తలు వింటున్నాము. ప్రభుత్వాలకున్న కర్తవ్యాలేమైనా, వాటిని చట్టబద్ధంగా మాత్రమే నెరవేర్చాలి. నక్సల్ ప్రభావం ఉధృతమైన సమయాల్లో, అది శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదంటూ అవసరార్థం సూక్తులు వల్లించే రాజకీయవాదులు, ఈ సమయంలో మాత్రం మౌనం వహించడం న్యాయం కాదు. కల్పించుకోవాలి. పారదర్శకత కోసం ప్రయత్నించాలి. ఉద్రిక్తతను ఉపశమింపజేసి సంప్రదింపుల అవకాశాలను అన్వేషించాలి. దేశంలో అనేకచోట్ల నిషిద్ధ బృందాలతో కేంద్రం చర్చలు జరుపుతున్నది. మావోయిస్టులతో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి చర్చల ప్రయత్నం జరిగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయస్థాయిలో కూడా స్వామి అగ్నివేశ్ ఆధ్వర్యంలో కొంత ఆలోచన సాగింది. ఎక్కడో జరుగుతున్న గాజా విధ్వంసం విషయంలో అయినా కలవరం వ్యక్తం చేయగలుగుతున్న పక్షాలు, మన దేశంలోనే, మన మధ్యనే ఒక ఆదివాసీ రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాదు. మావోయిస్టులు కూడా భారతదేశంలోని సకలపక్షాలనూ ఉద్దేశించి, సంభాషించాలి. పరిస్థితిని మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించవలసిందిగా పౌరసమాజాన్ని గట్టిగా అభ్యర్థించాలి. కాల్పుల విరమణకు తమవైపు నుంచి చేయగలిగిన ప్రతిపాదనలను ప్రజల ముందు బహిరంగపరచాలి.
ఆదివాసీల గురించి గొప్పగా చెబుతారు. వారికి నాగరిక ఫలితాలు ముట్టజెప్పి, జనజీవన స్రవంతిలోను, ప్రధాన మతాలలోనూ కలుపుకోవాలని చూస్తారు. కానీ, వారికి ఉన్న సామాజిక, రాజకీయ పలుకుబడి అతి స్వల్పం. వారి ప్రాణాలకు పెద్ద విలువలేదు. వారికి అండగా తక్కిన సమాజం అంతా నిలబడితే గనుక, వారు మాత్రం నక్సలైట్ల వెనుక ఎందుకు సమీకృతులవుతారు? అన్ని రకాలుగా అణగారిపోయి, అప్రధానులైపోయిన ఆదివాసులను గుట్టుచప్పుడు కాకుండా బాధించడం సాధ్యపడితే, నాగరికత, సభ్యత, ప్రజాస్వామికత అంటూ గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?