సురక్షితమైన ఆసుపత్రులు సామాజిక బాధ్యత
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:33 AM
కోల్‌కత్తాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో డ్యూటీలో ఉన్న వైద్యురాలి హత్యోదంతంపై సుప్రీంకోర్టు తనకు తానే సుమోటోగా స్పందించడం, వైద్యుల రక్షణాంశంపై
కోల్‌కత్తాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో డ్యూటీలో ఉన్న వైద్యురాలి హత్యోదంతంపై సుప్రీంకోర్టు తనకు తానే సుమోటోగా స్పందించడం, వైద్యుల రక్షణాంశంపై జాతీయ టాస్క్‌ఫోర్స్ నియమించడం ముదావహం. హీనమైన నేరంపై సత్వరం దర్యాప్తు జరిపి, దోషుల్ని బోనెక్కించడం, బాధిత కుటుంబానికి ఊరటనివ్వడం ఎంత ముఖ్యమో, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా నివారణా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై దాడుల్ని నివారించేలా కఠినమైన చట్టాలు ఉండడంతోబాటు, ఆ చట్టాల ద్వారా వెంటనే న్యాయం జరుగుతుందని, తప్పు చేసిన వారికి శిక్షపడక తప్పదని వ్యవస్థ తన పనితీరు ద్వారా హెచ్చరించాలి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో అరకొర శిక్షలతో కొనసాగుతున్న చట్టాల స్థానే, దేశ వ్యాప్తంగా అమలుపరిచే బలమైన చట్టాలు కావాలి. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ఈ తరహా చట్టం దశాబ్దం క్రితం తీసుకువచ్చినపుడు అది బలమైనదే. నేరానికి మూడేళ్ల జైలు శిక్షతో. అయితే తర్వాత వచ్చిన మార్పులతో -అంటే ఏడేళ్ళలోపు జైలు శిక్ష పడగల నేరానికి వెంటనే బెయిల్ పొందవచ్చు అన్న మార్పుతో- ఆ చట్టం వాడి తగ్గిపోయింది. అందుకనే దాడి చేసినట్లు నేరం నిరూపితమైతే పదేళ్ళకు తగ్గని జైలు శిక్షతో కొత్త చట్టం రావాలి. కోవిడ్ సమయంలో అమలైన ప్రజారోగ్య సేవల చట్టం తరహాలో. శాంతిభద్రతలు, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలే కావచ్చు కానీ, ఆరోగ్య సేవలపై దాడులు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దాన్ని నియంత్రించడానికి కఠినంగా వ్యవహరించడంలో తప్పేముంది?
ఇక రెండో విషయం. ఆసుపత్రులకు భద్రత, రక్షణ పెంచకపోతే ఎంత గొప్ప చట్టమున్నా, ప్రయోజనం స్వల్పం. ఆధునిక పర్యవేక్షణా వ్యవస్థ అందుబాటులో ఉంచడంతోబాటు వెంటనే స్పందించే టీములు, కొంత భద్రతా సిబ్బందిని కేటాయించడం అవసరం. ఉద్వేగాలతో రోగి బంధువులు ఉంటారు. బ్యాడ్ న్యూస్‌ని తట్టుకోలేని స్థితిలో ఉండొచ్చు. వారిని వైద్యంపై, చట్టంపై అవగాహనా కార్యక్రమాలతో ఒప్పించవచ్చు. వీటితోబాటు జూనియర్ వైద్యులు ఎంత అసౌకర్యాల నడుమ, ఎక్కువ పని గంటలతో వృత్తి నిర్వహిస్తున్నారో ఈ ఆందోళన సమయంలో తెలిసివచ్చింది. వాటిపై కూడా దృష్టి సారించాలి. పరిస్థితి చక్కదిద్దడానికి సమగ్రమైన కార్యాచరణ కావాలి. ఇది సామాజిక బాధ్యత. అందులో పెద్ద పాత్ర కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలది.
– డి.వి.జి శంకరరావు