వ్యాసుడు చూపిన వెలుగుబాట
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:34 AM
గొప్ప చరిత్రకారుడు, విశిష్ట జీవితాల కథకుడు అయిన రాజ్‌మోహన్ గాంధీని నేను చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను. అత్యయికస్థితి చీకటి రోజుల్లో ఆయన ఎడిటర్‌గా ఉన్న వారపత్రిక ‘హిమ్మత్’ ఆనాటి భయ విహ్వల వాతావరణాన్ని సాహసోపేతంగా
గొప్ప చరిత్రకారుడు, విశిష్ట జీవితాల కథకుడు అయిన రాజ్‌మోహన్ గాంధీని నేను చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను. అత్యయికస్థితి చీకటి రోజుల్లో ఆయన ఎడిటర్‌గా ఉన్న వారపత్రిక ‘హిమ్మత్’ ఆనాటి భయ విహ్వల వాతావరణాన్ని సాహసోపేతంగా ఎదుర్కొంది. ఆ తరువాత ఆధునిక భారతదేశంపై లోతైన, నిర్దుష్ట పరిశోధనతో పలు పుస్తకాలు వెలువరించారు. పటేల్, రాజాజీ జీవితం, రాజనీతిజ్ఞత, పాలనాదక్షతపై ప్రభావశీల గ్రంథాలు కూడా వాటిలో ఉన్నాయి. పత్రికలలో తన కాలమ్స్ ద్వారా వివిధ అంశాలపై ఆలోచనాత్మక చర్చకు విశేషంగా దోహదం చేశారు.
ఇటీవల నా మిత్రుడు ఒకరు నేను ఇంతకు ముందు చదవని రాజ్‌మోహన్ గాంధీ ప్రసంగం ఒకదాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 1991లో రాజ్యసభలో ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టంపై చర్చలో చేసిన ఉపన్యాసమది. ఆగస్టు 15, 1947నాటికి ఉన్న ఒక ప్రార్థనాస్థలం మతపరమైన స్వభావాన్ని యథాతథంగా ఉంచేందుకు, ప్రార్థనాస్థలం లేదా స్థలంలోని ఒక విభాగాన్ని వేరే మతానికి చెందిన లేదా అదే మతంలోని వేరే సంప్రదాయానికి చెందిన ప్రార్థనాస్థలంగా మార్చడాన్ని నిషేధించే బిల్లు అది. అప్పటికే న్యాయ విచారణలో ఉన్న అయోధ్య వివాదాన్ని ఆ ప్రతిపాదిత చట్టం నుంచి మినహాయించారు. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ లోక్‌సభలో ఆ బిల్లు ఆమోదం పొందింది. తమ నియంత్రణలో ఉన్న ప్రార్థనా స్థలాలలో ఎటువంటి మార్పులు చేయడానికి అయినా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉన్నదని బీజేపీ వాదించింది. అప్పట్లో జనతాదళ్ సభ్యుడుగా ఉన్న రాజ్‌మోహన్ గాంధీ ఆ బిల్లుపై చర్చ ప్రారంభించారు. పగ తీర్చుకునే ప్రయత్నాలలో లక్షలాదిమంది హతమైపోయిన విషాదం గురించి మహాభారతంలో వ్యక్తమైన ఆవేదన ప్రస్తావనతో రాజ్‌మోహన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘గతించిన యుగాలలో జరిగిన తప్పులను ప్రతీకార దృక్పథంతో సరిదిద్దేందుకు ప్రయత్నించేవారు కేవలం విధ్వంసానికి, మరింత విధ్వంసానికి, మరెంతో వినాశనానికి కారకులు అవుతారని మహాభారతం ఉద్ఘోషిస్తోంది’ అని వక్కాణించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రార్థనాస్థలాల చట్టాన్ని రాజ్‌మోహన్ పూర్తిగా సమర్థించారు. ఆ బిల్లు హిందూ మతస్థులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ సభ్యులు చేసిన విమర్శకు ఆయన ఇలా ప్రతిస్పందించారు: ‘ఆ విమర్శలు మన దేశంలో కొత్త వేర్పాటు వాదాన్ని వినిపిస్తున్నాయి. ఆ విమర్శలు చేస్తున్నవారు తాము ప్రవచిస్తున్నది ఒక కొత్త జాతీయవాదం అని అంటున్నారు. అయితే అది హిందూ వేర్పాటువాదం. హిందూ ధర్మాన్ని వక్రీకరించిన వాదనలు అవి. ఆ విమర్శలు చేస్తున్నవారు తమ సొంత భావావేశాలు, ఉద్వేగాలతో తప్పుదోవ పట్టినవారు. భారత్‌లో ఒక హిందూ పాకిస్థాన్‌ను, ఒక హిందూ సౌదీ అరేబియాను సృష్టించాలని వారు ఆకాంక్షిస్తున్నారు’. ‘గత యుగాలలో జరిగిన నేరాల (వాస్తవమైనవి, ఊహాత్మకమైనవీ)పై మితిమీరిన స్థాయిలో దృష్టి పెట్టిన ‘కొత్త వేర్పాటువాద హిందూధర్మం’ ఉద్దేశపూర్వకంగా వర్తమాన కాలంలోని సంఖ్యానేక ప్రజల జీవన దుర్భరత్వం, ఆకలి దప్పులను విస్మరిస్తుందని, తాండవమాడుతున్న అవినీతి, పెచ్చరిల్లుతున్న హింసాకాండను ఉపేక్షిస్తుందని’ ఆయన ఆక్షేపించారు.
‘హిందువుల ఆత్మ గౌరవ పునరుద్ధరణ గురించి హిందూత్వశక్తులు మాట్లాడుతున్నాయి. ముస్లింల పట్ల వ్యతిరేకత చూపడం ద్వారా మీ హిందూ అస్తిత్వాన్ని నిరూపించుకోండి అని కొత్త హిందూ వేర్పాటువాద శక్తులు నిర్దేశిస్తున్నాయి’ అని ఆయన గర్హించారు. ‘ప్రార్థనా స్థలాల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారు స్వల్పంగానో లేదా బృహత్తర స్థాయిలోనే రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చు గానీ, ఆ వ్యతిరేకత కొత్త భావావేశాలను సృష్టిస్తుంది. పురాతన యుగాలలో సంభవించిన తప్పులను సరిదిద్దేందుకు మరెన్నో ప్రయత్నాలు జరుగుతాయి. ఇది దేశ శ్రేయస్సుకు శుభం కాదు. ఈ సత్యాన్ని విస్మరిస్తే గత చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దే పేరిట మరెన్నో పోరాటాలు ప్రజ్వరిల్లి శాంతి సామరస్యాలు సమసిపోయే ప్రమాదమున్నది’ అని ఆయన హెచ్చరించారు. హిందూ ఆత్మాభిమానం, హిందూ గౌరవం అనే భావావేశాలను నగదుగా, ఓట్లుగా, జడిపించే అధికారంగా, తుపాకీగా మార్చివేసే ప్రయత్నాలు హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని ఆయన స్పష్టం చేశారు.
‘ఇక చాలు, ఈ ఘర్షణలకు స్వస్తి చెబుదాం అన్నది మన జాతీయ సంకల్పం అయ్యేందుకు కృషి చేద్దాం. వివాదాలు ఉంటాయి, ఉండవచ్చు. అయితే హింసాత్మక ఘర్షణలను నివారిద్దాం. మనం సమైక్యంగా భవిష్యత్తులోకి చూపు సారిద్దాం, గతంలోకి అంతగా చూడవద్దు, గతాన్ని ఉపేక్షిద్దాం’ అని రాజ్‌మోహన్ గాంధీ ప్రసంగాన్ని ముగించారు. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం–1991ను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తే స్వయంగా బలహీనపరిచిన నేపథ్యంలో రాజ్ మోహన్ గాంధీ వివేకశీల మాటలను మనం మళ్లీ గుర్తు చేసుకుందాం, వాటి స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో గత కాలపు హిందూ దేవతా ప్రతిమలు ఉన్నాయని, వాటిని ఆరాధించే హక్కు తమకు ఉందని, పూజలకు అనుమతినివ్వాలని కోరుతూ ఆగస్టు 2021లో కొంత మంది హిందువులు తొలుత స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మేరకు జ్ఞానవాపి మసీదును సర్వే చేయాలని ఆ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. దీనిపై అభ్యంతరం తెలిపినవారు మే 2022లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం అధ్యక్షుడుగా ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇలా వ్యాఖ్యానించారు: ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం–1991 గత యుగాలలోని ఏ కాలానికి చెందిన ప్రార్థనా స్థలం మత పర స్వభావాన్ని నిర్ధారించడాన్ని అడ్డుకోదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే చారిత్రక తప్పులను సరిదిద్దే ప్రయత్నాలను ప్రోత్సహించాలని కింది న్యాయస్థానాలు, హైకోర్టు న్యాయమూర్తులు కోరుకుంటే అందుకు అనుగుణమైన ఆదేశాలు జారీ చేసేందుకు వారికి స్వేచ్ఛ ఉన్నది’. దీనిపై మానవహక్కుల ఉద్యమ నేత హర్ష్ మందర్ ఇలా వ్యాఖ్యానించారు: ‘సంభాల్‌లో ఆరుగురు వ్యక్తుల మరణానికి కారణమైన సివిల్ జడ్జి ఉత్తర్వును సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలు అనుమతించాయి. ప్రార్థనాస్థలాల మత పర స్వభావం విషయమై అనేక సవాళ్లకు సీజేఐ వ్యాఖ్యలు దారితీస్తున్నాయన్న సుప్రీంకోర్టు అబ్జర్వర్ వ్యాఖ్యలో సత్యం ఉన్నది’.
1998–2004 సంవత్సరాల మధ్య ఎన్డీఏ పాలనా కాలంలో బీజేపీ అగ్రనాయకులు అరుదుగా మాత్రమే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. 1990లో ఎల్‌కె ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా రక్తపాతం చోటుచేసుకున్నప్పటికీ, ఎన్డీఏ ప్రభుత్వంలో హోం మంత్రిగా ఆయన ప్రకటనలు సంయమనంతో ఉండేవి. ఇతర కేబినెట్ మంత్రులు, ప్రధానమంత్రి కూడా చాలా సంయమనంతో మాట్లాడేవారు. ఇప్పుడు హిందువులు కాని భారతీయుల పట్ల విద్వేషపూరిత వ్యతిరేకతతో తమ హిందూ అస్తిత్వాన్ని నిర్వచించుకుంటున్న వారిలో చాలా శక్తిమంతమైన, అత్యున్నతస్థాయి రాజకీయ నాయకులు కూడా ఉంటున్నారు. కేంద్ర హోంమంత్రి, ఉత్తరప్రదేశ్, అసోం ముఖ్యమంత్రులు తమ ఉపన్యాసాలలో తరచుగా భారతీయ ముస్లింలపై తీవ్ర అపవాదులు వేయడం పరిపాటి అయిపోయింది. ప్రధానమంత్రి సైతం అప్పుడప్పుడూ ఇటువంటి వైఖరి చూపుతున్నారు. అధికార లాలసులు అయిన హిందూత్వవాదులు తమ ముస్లిం విద్వేష వైఖరులను సరిదిద్దుకోగలరని ఆశించలేము. అయితే భారతీయ ధర్మ స్ఫూర్తిని రక్షించుకోవాలనే వివేక వాణిని వినేందుకు సుముఖంగా ఉన్న హిందువుల కోసం మహాభారతం పఠనం నుంచి రాజ్‌మోహన్ గాంధీ తెలుసుకున్న సత్యాన్ని ఈ వ్యాసానికి ముగింపుగా మరొకసారి ఉటంకిస్తాను: ‘‘చారిత్రక తప్పులను ప్రతీకార వైఖరితో సరిదిద్దేందుకు ప్రయత్నించేవారు కేవలం విధ్వంసాన్ని, మరింత విధ్వంసాన్ని, మరెంతో వినాశనాన్ని మాత్రమే సృష్టిస్తారు’.
గాంధీ, రాజాజీల మనవడు అయిన రాజ్‌మోహన్ మరో చోట చేసిన ఒక వివేకశీల వ్యాఖ్యను కూడా ఉటంకిస్తాను: ‘మన చరిత్రను మహాభారతం సహాయంతో దర్శించదలుచుకోవడం, ఆ ఇతిహాస కావ్యానికి జ్ఞానదాయక భాష్యం చెప్పడానికి ప్రయత్నించడం అనుమతించదగిన కర్తవ్యమే కాకుండా, అది ఒక నిర్దేశిత విధ్యుక్త ధర్మం’.
1991లో ప్రార్థనాస్థలాల చట్టంపై రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ ‘గతించిన యుగాలలో జరిగిన తప్పులను ప్రతీకార దృక్పథంతో సరిదిద్దేందుకు ప్రయత్నించేవారు కేవలం విధ్వంసానికి, మరింత విధ్వంసానికి, మరెంతో వినాశనానికి కారకులు అవుతారని మహాభారతం ఉద్ఘోషిస్తోంది’ అని రాజ్‌మోహన్ గాంధీ గుర్తుచేశారు. భారతీయ ధర్మస్ఫూర్తిని రక్షించుకోదలిచిన వారందరూ ఆ వివేకవాణిని ఔదలదాల్చాలి.
(వ్యాసకర్త చరిత్రకారుడు)