Share News

సంఘ్‌ శతాబ్ది వేళ భగవత్‌‌ మాట

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:54 AM

భగవత్‌‌ ఉపన్యాసాలకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధికార వాణిగా సర్వత్రా గుర్తింపు ఉన్నది. అందుకు ఆ సంస్థ స్వభావమూ, నిర్మాణ విలక్షణతతో పాటు సర్‌ సంఘ్‌చాలక్‌గా భగవత్‌‌ సర్వోన్నత ప్రాధాన్యమే కారణం.

సంఘ్‌ శతాబ్ది వేళ భగవత్‌‌ మాట

భగవత్‌‌ ఉపన్యాసాలకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధికార వాణిగా సర్వత్రా గుర్తింపు ఉన్నది. అందుకు ఆ సంస్థ స్వభావమూ, నిర్మాణ విలక్షణతతో పాటు సర్‌ సంఘ్‌చాలక్‌గా భగవత్‌‌ సర్వోన్నత ప్రాధాన్యమే కారణం. భగవత్‌కు సంఘ్‌లో తిరుగులేని అధికారమున్నదని అందరూ విశ్వసిస్తారు. కనుక ఆయన ఉపన్యాసాలను, ముఖ్యంగా ఇటీవలి కాలంలో అందరూ గంభీరంగా ఆలకిస్తున్నారు.

మోహన్‌ భగవత్‌కు చిత్రమైన సమయ భావం ఉన్నది. ఆయన ఉపన్యాసాలు వెలువరించడం అరుదు. అయితే ఉపన్యసించడానికి ఆయన ఎంపిక చేసుకునే రోజు, సందర్భం ప్రశస్తమైనవి. తన భావాలను వ్యక్తం చేసేందుకు ఆయన వాడే మాటలు శ్రేష్ఠమైనవి. నేను ఆయన ఉపన్యాసాలను ఆంగ్లానువాదంలో మాత్రమే చదివాను. చాలా మంది ఆయన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తారు. నాకూ వాటితో ఏ మాత్రం ఏకీభావం లేదు. ఏమైనా భగవత్‌‌ ముఖ్యంగా 2014 అనంతరం వెలువరిస్తున్న ఉపన్యాసాలు సంఘ్‌ శ్రేణులనే కాదు, ఇతరులనూ ఆకట్టుకుంటున్నాయనడంలో ఎవరికీ మరో అభిప్రాయం లేదు.

భగవత్‌‌ ఉపన్యాసాలకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధికార వాణిగా సర్వత్రా గుర్తింపు ఉన్నది. అందుకు ఆ సంస్థ స్వభావమూ, నిర్మాణ విలక్షణతతో పాటు సర్‌ సంఘ్‌చాలక్‌గా భగవత్‌‌ సర్వోన్నత ప్రాధాన్యమే కారణం. భగవత్‌కు సంఘ్‌లో తిరుగులేని అధికారమున్నదని అందరూ విశ్వసిస్తారు. కనుక ఆయన ఉపన్యాసాలను, ముఖ్యంగా ఇటీవలి కాలంలో అందరూ గంభీరంగా ఆలకిస్తున్నారు, వాటి గురించి నిశితంగా ఆలోచిస్తున్నారు.


జూన్‌ 2024లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజులకే మోహన్‌ భగవత్‌‌ ఒక ఉపన్యాసం వెలువరించారు. ఆ ప్రసంగంలోని ప్రధానాంశం: ‘అహంకారాన్ని విడనాడి వినయ విధేయతలతో ప్రవర్తించాలి’. లోక్‌సభ ఎన్నికల అనంతరం అది ఆయన మొదటి బహిరంగ ఉపన్యాసం. అందులో ఆయన ఇలా అన్నారు: అబద్ధాలతో కూడిన, నిందాపూర్వక భాషను ఉపయోగించిన ఎన్నికల ప్రచార ప్రసంగాలు రాజకీయ పార్టీలు పాటించాల్సిన మర్యాదలను పూర్తిగా ఉల్లంఘించినవే అవుతాయి; మీ ప్రత్యర్థి మీ శత్రువు కాదు. అతడు ఒక విరుద్ధ దృక్పథానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శత్రువుగా కాక ప్రతిపక్ష అభ్యర్థిగా భావించాలి. ప్రతిపక్ష భావాలు, అభిప్రాయాలను కూడా తప్పక పరిగణనలోకి తీసుకోవాలి; ఒక నిజమైన స్వయం సేవకుడు హుందాగా ప్రవర్తిస్తాడు. ప్రత్యర్థికి మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకుంటాడు. ‘నేను ఈ పని చేశాను’ అన్న అహంకారం అతడికి ఏ కోశాన ఉండదు, ఉండకూడదు. నరేంద్ర మోదీని, ఆయన ఎన్నికల ప్రచార సరళిని దృష్టిలో ఉంచుకునే భగవత్‌‌ ఈ ప్రసంగం చేశారని ఆనాడు అందరూ భావించారు.

జూలై 2024లో వెలువరించిన మరొక ఉపన్యాసంలో ఆయన ఈ సుప్రసిద్ధ వ్యాఖ్యలు చేశారు: ‘ఒక వ్యక్తి తొలుత ఒక మహా మనిషి కావాలనుకున్నాడు, ఆ తరువాత ఒక దేవుడు అవ్వాలని ఆశించాడు; పిదప ఒక భగవాన్‌గా లోకులు తనను పూజించాలని కోరుకున్నాడు’. తాను అందరిలా జైవికంగా జన్మించలేదని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకున్న గొప్పలను నిర్ద్వంద్వంగా నిరాకరించడమే కాదూ భగవత్‌‌ వ్యాఖ్యలు? తల్లి గర్భధారణ, గర్భావధి (గర్భధారణ నుంచి శిశు జననందాకా సమయం), ప్రసవం అనే సహజ ప్రక్రియలకు తాను అతీతుడినని, పరాత్పరుడు తనను నేరుగా ‘సృష్టించాడు’ అని భావించారా? అలా అయితే మోదీ ఒక పరిధి మించి మాట్లాడారని భగవత్‌‌ తన వ్యాఖ్యలతో స్పష్టంగా సూచించినట్టు అనుకోవచ్చు.


విజయదశమి (అక్టోబర్‌ 12, 2024) రోజున రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ తన 100వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఆ సందర్భంగా మోహన్‌ భగవత్‌‌ తన మూడవ సుప్రసిద్ధ ఉపన్యాసాన్ని వెలువరించారు (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా టైమ్స్‌.కామ్‌ అనువదించి నివేదించిన ఆ ప్రసంగ పాఠాన్ని మాత్రమే నేను చదివాను) ఆ ఉపన్యాసం నాకు ఆశాభంగం కలిగించింది, అయితే ఆశ్చర్యపరచలేదు. భగవత్‌‌ ఆ ఉపన్యాసంలో వ్యవస్థిత ఆరెస్సెస్‌ భావజాల వైఖరులకు మళ్లీ మళ్లారు. ఆయన ఆ ఉపన్యాసంలో ధర్మం, సంస్కృతి, వ్యక్తిగత సౌశీల్యం, జాతీయ వ్యక్తిత్వం ధర్మ విజయం, మంగళప్రదమైన భవిష్యత్తు, నైతికత, స్వాభిమానం, ఆత్మగౌరవం ఇత్యాది మాటలు ధారాళంగా వాడారు. హమాస్‌, ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధం గురించి పరోక్షంగా సూచించారు. అయితే ఆ మారణకాండలో 43 వేల మంది హతమయ్యారన్న విషయాన్ని ప్రస్తావించలేదు; అలాగే జమ్మూ–కశ్మీర్ ఎన్నికల గురించి కూడా. అయితే కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపనే లేదు; మణిపూర్‌ విషయానికి వస్తే అక్కడి పరిస్థితులు ‘ఆందోళన’ కలిగిస్తున్నాయని మాత్రమే ముక్తసరిగా పేర్కొన్నారు.

భగవత్‌‌ ప్రసంగంలోని మిగతా అంశాలన్నీ మోదీ తరహా ఉపన్యాస ధోరణిలో ఉన్నాయి: భారత్‌ ఎలా శక్తిమంతమైన జాతిగా ఎదిగింది, మన విశ్వ సౌభ్రాతృత్వ ఆదర్శాన్ని ప్రపంచం ఎలా అంగీకరించింది, భారత్‌ పేరు ప్రతిష్ఠలు, ప్రభావ ప్రాబల్యాలు అంతర్జాతీయంగా నిరంతరం ఎలా పెరుగుతున్నాయో భగవత్‌‌ ప్రస్తావించారు. మరిన్ని విషయాలు కూడా భగవత్‌‌ పేర్కొన్నారు. భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, ఉదారవాద దేశాలుగా పేరు పొందిన పాశ్చాత్య రాజ్యాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను చట్టవిరుద్ధంగా లేదా హింసాత్మక మార్గాలలో కూలగొట్టేందుకు వెనుకాడడం లేదని, అబద్ధాల ఆధారంగా భారత్‌ యశోవైభవాన్ని కళంకితం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నాయని భగవత్‌‌ అన్నారు. తన తీవ్ర ఆరోపణలకు భగవత్‌‌ ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేదు. బంగ్లాదేశ్‌ గురించి ప్రస్తావిస్తూ ఆ దేశంలో హిందువులపై నిష్కారణంగా క్రూర దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. హిందువులతో సహా అన్ని మైనారిటీ మత వర్గాల భద్రత ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరుగుతున్న పర్యవసానంగా జనాభాపరమైన అసమతౌల్యతలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఉపన్యాసం ముగింపులో మోదీ మాదిరిగానే భగవత్‌‌ కూడా ఇలా అన్నారు: ‘అసంఘటితంగా ఉండడం వల్ల బలహీనపడతామని, దుష్టుల దాడులు, దౌర్జన్యాలకు గురికావలసి వస్తుందనే పాఠాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ నేర్చుకోవాలి’. ఆధునిక రాజకీయ పరిభాషను ఉపయోగించడంలో ఆరెస్సెస్‌ నైపుణ్యం సాధించినట్టు భగవత్‌‌ ఉపన్యాసం విశదం చేసింది. డీప్‌ స్టేట్‌, కల్చరల్‌ మార్క్సిస్ట్‌, ఫాల్ట్‌ లైన్స్‌, ఆల్టర్‌నేటివ్‌ పాలిటిక్స్‌ మొదలైన మాటలు, భావనలను ఆయన ఉదారంగా వాడారు. ‘అర్బన్‌ నక్సల్స్‌’, ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’ అనే మాటలను ఆయన ఎందుకనో విడిచిపెట్టారు.

మొత్తం మీద రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌, భారతీయ జనతా పార్టీ తమ విభేదాలు తొలగించుకుని కలసికట్టుగా ముందుకు సాగేందుకు సంకల్పించుకున్నట్టు కనిపిస్తుంది. నరేంద్ర మోదీ ప్రకటనలు, చర్యలను ఆక్షేపించి ఆయనను నిగ్రహించేవారు ఎవరూ లేకపోతే జరిగేదేమిటి? ఆయన తన అధికారాన్ని మరింత విచక్షణారహితంగా ఉపయోగించేందుకు, ప్రతిపక్షాలను ఛిన్నాభిన్నం చేసేందుకు; ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అసమానతలు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, సామాజిక అణచివేత, మతతత్వ ఘర్షనలు, అన్యాయాలకు దారితీసిన తన విధానాలను మరింత ధైర్యంగా అమలుపరిచేందుకు ఆయన సాహసిస్తారు. గత పదేళ్ల మోదీ పాలనను మరింత తీవ్రస్థాయిలో చవిచూసేందుకు సర్వసన్నధంగా ఉండండి.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Oct 19 , 2024 | 05:54 AM