ఉపశమనం
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:04 AM
దాదాపు రెండునెలలుగా మండుటెండలను, వడగాడ్పులను అనుభవిస్తున్న ఉత్తరభారతంలో కొన్ని ప్రాంతాలకు త్వరలోనే నిర్దిష్టమైన ఉపశమనం దక్కవచ్చునని భారతవాతావరణశాఖ మంగళవారం చేసిన ప్రకటన...
దాదాపు రెండునెలలుగా మండుటెండలను, వడగాడ్పులను అనుభవిస్తున్న ఉత్తరభారతంలో కొన్ని ప్రాంతాలకు త్వరలోనే నిర్దిష్టమైన ఉపశమనం దక్కవచ్చునని భారతవాతావరణశాఖ మంగళవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. బిహార్ వంటి రాష్ట్రాల్లో వేడిమి తగ్గడం, పశ్చిమభారతంలోనూ, ఈశాన్యంలోనూ వర్షాలు కురవడం ఇత్యాది పరిణామాలను ఐఎండీ లెక్కవేసింది. పంజాబ్, పశ్చిమరాజస్థాన్‌లో వడగాడ్పుల బాధ మరికొంతకాలం తప్పదని, ఇందుకు పూర్తిభిన్నంగా పశ్చిమబెంగాల్ తడిసిముద్దవుతుందని ఈ ప్రకటన సారాంశం. నైరుతి రుతుపవనాల విస్తరణతో దేశం చల్లబడుతుందన్న విశ్లేషణలు మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి.
ఏప్రిల్ మొదలు జూన్ మూడోవారం వరకూ ఇంతటి సుదీర్ఘకాలం వేడిమిని, వడగాడ్పులను దేశం గత దశాబ్దకాలంలో చూసివుండదు. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా ఉంటూ ప్రధానంగా ఉత్తరాది యావత్తూ మాడిపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా గరిష్ఠం స్థాయిలో ఉంటూ, రాత్రివేళల్లోనూ వేడినిలబడి జనజీవితం దుర్భరమైంది. అర్థరాత్రిళ్ళు నలభైడిగ్రీల వేడిని సైతం ఢిల్లీ అనుభవించింది. ఈనెలలో, పట్టుమని పదిరోజుల్లోనే రెండువందలమంది నిరుపేదలు, నిరాశ్రయులు మరణించడం వడగాడ్పుల తీవ్రతను తెలియచేస్తోంది. అత్యంత వేడిమి శరీరంమీద మిగల్చే ప్రభావాలు అంతుచిక్కవు. ప్రాణానికి ముప్పువాటిల్లేవరకూ ఆ వేడి శరీరాన్ని పైకి కనిపించకుండా దొలిచేస్తుంది. ఆస్పత్రులు కిటకిటలాడిపోతూ, ఒకదశలో చికిత్స అందించలేని స్థితిలోకి జారుకున్నాయి. మిగతా అందరికంటే ఎక్కువగా కార్మికులు, వలసకూలీలు ప్రత్యక్షనరకం చవిచూశారు. ఎండల్లో పనిచేయలేక, ఆకలితో ఉండలేక అల్లాడిపోయారు. గిగ్ వర్కర్లు కాలుకదపలేకపోయారు. రోడ్లమీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనేవారిని మండుటెండలు చావుదెబ్బకొట్టాయి. ఈ దేశంలో డెబ్బయ్‌ఐదుశాతంమంది శ్రామికులు ఎండల్లోనే పనిచేస్తున్నందువల్ల మండుటెండలు, వడగాడ్పులతో ఉత్పన్నమైన పరిస్థితులు వారి ఉపాధిని గణనీయంగా దెబ్బతీయడమే కాక, దేశ ఉత్పత్తి కూడా తీవ్రంగా పతనమవుతుందన్నది వాస్తవం. ఈశాన్యభారతంలోని ఎత్తయిన పర్వతప్రాంతాల్లో కూడా కొద్దివారాల్లోనే అధిక వడగాడ్పురోజులు నమోదైనాయి.
దేశరాజధాని చవిచూసిన పరిస్థితులను గమనించినప్పుడు, మీడియా కన్ను అంతగా పడని మిగతా ప్రాంతాలు ఇంకెంతటి నరకాన్ని చూవిచూశాయో సులువుగా అర్థమవుతుంది. జనానికి సరిపడా నీటిని అందించలేక, రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోయిన ప్రైవేటు ట్యాంకర్ల మాఫియాను నియంత్రించలేక ఢిల్లీ ప్రభుత్వం చతికిలబడిపోయింది. ఎండిన యమునలోకి కాస్తంత నీటిని వదలాల్సిందిగా హర్యానాను కోరినా ఆ రాష్ట్రం రాజకీయకారణాలతో సహకరించలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆరోపించింది. ఢిల్లీకి కాసిన్ని తాగునీళ్ళు ఇప్పించడానికి న్యాయస్థానాలు సైతం రంగంలోకి దిగాల్సివచ్చింది. విద్యుత్ వినియోగం రికార్డుస్థాయికి చేరి, తగినంత సరఫరా లేక, దిగుమతి చేసుకున్నది కూడా చాలక ఢిల్లీ ప్రజలు నానారకాల కష్టాలూ అనుభవించారు. ప్రజల బాధల్ని తీర్చలేని పాలకులు ప్రతీ విషయాన్నీ ఎంత తెలివిగా రాజకీయం చేస్తారో ఢిల్లీ ప్రజలు మరోమారు చూశారు.
ఇదంతా ఎల్‌నినో ప్రభావమే కావచ్చును కానీ, గత మూడునాలుగేళ్ళుగా వడగాడ్పులను దేశం చవిచూస్తున్నది. వచ్చే సంవత్సరాల్లోనూ ఈ పరిస్థితుల్లో విశేషమైన తేడా ఉండకపోవచ్చు. వాతావరణమార్పులు ఇందుకు దోహదం చేస్తున్నప్పటికీ, స్థానిక పరిస్థితులు, ప్రభుత్వాల నిష్ర్కియాపరత్వం తోడైనప్పుడు సామాన్యుడు సులువుగా బలైపోతాడు. ముందస్తు ప్రణాళికలతో, అత్యయిక స్థితి తరహా ఏర్పాట్లతో మండుటెండలనుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండాలి. నేడు ఢిల్లీ ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు అన్ని నగరాలూ అనుభవించక తప్పదేమో. కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయిన నగరాలన్నీ ఈ తరహా ఉపద్రవాలు చవిచూస్తూ, ఉద్యోగ ఉపాధులు దెబ్బతినిపోతే ఎలా అన్నది ప్రశ్న. ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకినప్పటికీ, గత పదిహేనురోజులుగా అవి స్తంభించిపోవడంతో, అటు వర్షాలు లేక, ఇటు ఎండలు తగ్గక, ఉక్కపోత భరించలేక దేశం యావత్తూ అల్లాడిపోతున్నది. ఈ దీర్ఘకాలిక వేసవికి త్వరలోనే విముక్తి లభించబోతున్నందుకు కచ్చితంగా సంతోషించాల్సిందే.