Share News

ఉపశమనం!

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:37 AM

అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌–హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది ఓ అరవైరోజులే అమల్లో ఉంటున్నందున, ఆ తరువాత ఏమిటన్న ప్రశ్న

ఉపశమనం!

అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌–హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది ఓ అరవైరోజులే అమల్లో ఉంటున్నందున, ఆ తరువాత ఏమిటన్న ప్రశ్న ఎలాగూ ఉంది. గద్దెదిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఒప్పందాన్ని సగర్వంగా ప్రకటించారు కానీ, ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఉల్లంఘనలకు కూడా పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ఏడాదిగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న బాంబులు ఆగిపోతాయన్న సంతోషం వల్ల కాబోలు, ఒప్పందం అమలులోకి వచ్చిననాడే లెబనాన్‌ పౌరులు తిరిగి స్వగ్రామాలకు రావడం, ఇజ్రాయెల్‌ సైన్యాలు ఇంకా అక్కడే ఉండటంతో కొన్ని ఘర్షణలు జరిగాయన్న వార్తలు వింటున్నాం. హిజ్బొల్లా మిలిటెంట్లు నక్కివున్నారన్న ఆరోపణమీద ఒప్పందం కుదిరిన 24గంటల్లోనే ఇజ్రాయెల్‌ వైమానికదాడులు చేయడమూ చూశాం. త్వరలోనే ఈ పరిస్థితులన్నీ మారి, కాల్పులు నిలిచిపోతాయని నమ్మినప్పటికీ, ఆ శాంతి ఎంతకాలమన్న ప్రశ్న మిగిలేవుంటుంది. లెబనాన్‌ ప్రవర్తనమీద ఈ ఒప్పందం అమలు ఆధారపడివుంటుందని ఇజ్రాయెల్‌ ప్రధాని ఓ మాట అని ఉంచారు కూడా.

ఈ కాల్పుల విరమణకీ, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టులో ఇజ్రాయెల్‌ చేసుకున్న అభ్యర్థనకు సంబంధం ఉన్నదో లేదో తెలియదుగానీ, ఇజ్రాయెల్‌ మంచిమనసు చేసుకోవడం వెనుక ఏదో మర్మం ఉంది. ఒకపక్క హిజ్బొల్లాతో సంధి కుదర్చుకొని, మరోపక్క గాజాలో పదిమంది పిల్లలతో సహా మరింతమందిని సరికొత్తగా ఊచకోతకోసిన ఇజ్రాయెల్‌ ప్రధాని, తనమీద జారీ చేసిన అరెస్టువారెంట్లను ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తిచేసుకున్నారు. తమ పిటిషన్ తిరస్కరించినపక్షంలో ఐసీసీ ఎంత చెడ్డదో మిగతా ప్రపంచానికి తెలుస్తుందనీ, అందుకే పిటిషన్‌ వేశామని ఇజ్రాయెల్‌ ఓ బెదిరింపు వ్యాఖ్య కూడా చేసింది. హమాస్‌మీద యుద్ధం పేరిట గాజాను సర్వనాశనం చేసినట్టుగానే, హిజ్బొల్లాను అంతం చేస్తున్నానంటూ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ తీవ్ర విధ్వంసం సాగించింది. ఇజ్రాయెల్‌–హిజ్బొల్లా మధ్య 14నెలలుగా సాగుతున్న యుద్ధంలో లెబనాన్‌లో మరణించినవారి సంఖ్య ఐదువేలలోపు ఉండవచ్చుగానీ, లక్ష ఇళ్ళు నాశనమై, ౧2లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోవలసివచ్చింది. ఆస్తినష్టం 850 కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా. ఇజ్రాయెల్‌ మీద హిజ్బొల్లా దాడులకు ప్రతీకారంగా, లెబనాన్‌మీద ఇజ్రాయెల్‌ అంతకు పదిరెట్లు విరుచుకుపడింది.


ఇజ్రాయెల్‌–హిజ్బొల్లా ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అడుగుముందుకు పడిందని కొన్ని పశ్చిమదేశాలు, వాటి మిత్రదేశాలు ముచ్చటపడిపోతున్నాయి. గత సంవత్సరకాలంలో ఇజ్రాయెల్‌ దాడులకు హిజ్బొల్లా దెబ్బతిన్నది తప్ప, నాశనం కాలేదని, ఇరాన్‌ సహకారం కొద్దోగొప్పో కొనసాగుతున్నందున అది ఇంకా నిలవగలుగుతోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిజ్బొల్లా దాడులతో దక్షిణ లెబనాన్‌ను అనుకొని ఉన్న ఉత్తర ఇజ్రాయెల్‌ నిత్యం వొణుకుతున్నది. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికీ, ఆస్తినష్టం, పంటనష్టం అధికం. హిజ్బొల్లా దెబ్బలకు ఓ యాభైవేలమంది ఇజ్రాయెలీలు ఇల్లూవాకిలీ వదిలిపెట్టి పోవలసి వచ్చింది. వారిని వెనక్కుతేవాలని నెతన్యాహూమీద ఒత్తిడి పెరిగిపోతోంది. అమెరికా, ఫ్రాన్స్‌ అధినేతలకు లెబనాన్‌ జనం కంటే, ఇజ్రాయెలీలమీద ప్రేమ ఎక్కువ ఉండటం సహజం. హమాస్‌, హౌతీ, హిజ్బొల్లా, ఇరాన్‌.. ఇలా ఓ పరిమితయుద్ధాన్ని అపరిమితం చేసి, ఆర్థికంగానూ, ఆయుధాలపరంగానూ నిండా మునిగిన నెతన్యాహూను బయటపడవేయడానికే ఈ ఒప్పందం కుదిరిందని కొందరి నమ్మకం. ఈ ఒప్పందం అమల్లో ఉన్నకాలంలో మిగతాశత్రువులను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్‌కు వీలుకలుగుతుంది. ఆ తరువాత పాలస్తీనా భవిష్యత్తును నిర్ణయించడంలో అమెరికా, ఇజ్రాయెల్‌ మాట మరింత బలంగా చెల్లుబాటు అవుతుంది కనుక, పశ్చిమాసియా కొత్తచిత్రాన్ని వాటిపక్షాన గీసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్‌కు నచ్చని, గిట్టుబాటుకాని రీతిలో ఏ నిర్ణయమూ జరగదన్న విషయాన్ని గుర్తిస్తే, హిజ్బొల్లాతో ఒప్పందంలోనూ ఈ రెండుదేశాల ప్రయోజనం అర్థమవుతుంది. ప్రస్తుతం దెబ్బతిని ఉన్నందున హిజ్బొల్లా కూడా ఈ కొద్ది విరామానికి అంగీకరించివుండచ్చు. చర్చల్లో అది ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం, ఒప్పందంలో భాగంగా అది ఖాళీచేసిన ప్రాంతాల్లోకి లెబనీస్‌ సైన్యం రావడం, వారికి అమెరికా, ఫ్రాన్స్‌ సహాయపడటం వంటి అంశాలు ఒక విధంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. యుద్ధంలో అలిసిపోయిన ఇజ్రాయెల్‌, హిజ్బొల్లాలకు కాస్తంత ఉపశమనం ఇవ్వడానికి ఈ ఒప్పందం ఉపకరించవచ్చు.

Updated Date - Nov 30 , 2024 | 05:37 AM