Share News

సంభాల్‌ హింస

ABN , Publish Date - Nov 27 , 2024 | 04:04 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం జరిగిన హింస అవాంఛనీయమైనది. స్థానిక కోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్న షాహీ జామా మసీదు సర్వేను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నించడంతో...

సంభాల్‌ హింస

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం జరిగిన హింస అవాంఛనీయమైనది. స్థానిక కోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్న షాహీ జామా మసీదు సర్వేను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నించడంతో అల్లర్లు జరిగాయి. మృతులసంఖ్య ప్రస్తుతం ఐదుకు చేరడంతో పాటు, పరిస్థితులు కుదుటపడలేదు. సర్వేను ప్రతిఘటిస్తూ పెద్ద గుంపుగా వచ్చిన కొందరు రాళ్ళు రువ్వడంతో ఆరంభమైన ఈ అల్లర్లను నియంత్రించడానికి పోలీసులు బాష్పగోళాలు, ప్లాస్టిక్‌ బుల్లెట్లు ప్రయోగించవలసివచ్చింది. రెండున్నరవేలమందిమీద పోలీసులు ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదుచేశారు. సమాజ్‌వాదీపార్టీకి చెందిన ఒక ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు ఈ హింసను ప్రోత్సహించారంటూ వారిమీదా కేసులు పెట్టడంతో బీజేపీ, ఎస్పీ మధ్య రాజకీయ యుద్ధం జోరుగా సాగుతోంది.


దశాబ్దాలుగా మతసామరస్యానికి పుట్టినిల్లులాగా ఉన్న ఈ ప్రాంతం ఈ ఘటనతో ఒక్కసారిగా వేడెక్కిపోయిందని, ఉభయమతాలవారి మధ్య అవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మృతులు నలుగురూ పోలీసుల కాల్పుల్లో మరణించలేదని, వారిని ఎవరో అత్యంత సమీపంనుంచి నాటు తుపాకులతో కాల్చిచంపారని పోలీసు ఉన్నతాధికారుల వాదన. ఆందోళన చేస్తున్నవారిమీద మరోమతానికి చెందిన ప్రత్యర్థులు కాల్పులు జరిపివుంటారన్న వాదన కూడా తెరమీదకు వస్తున్నది. విడియో క్లిప్పుల విశ్లేషణతో మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయన్నది అటుంచితే, ప్రార్థనాస్థలాల చుట్టూ వివాదాలు రేగుతున్నంతకాలం ఇటువంటి ఘర్షణలకు అవకాశం ఉంటుందన్నది నిజం. పైగా ఒకమారు సర్వే జరిగిన తరువాత, స్థానిక న్యాయస్థానం రీ సర్వేకు ఆదేశించడం ఇక్కడ ఇంకొంత అనుమానాన్ని పెంచింది. మంగళవారం సర్వేకు అనుమతించినప్పటినుంచీ ఈ ప్రాంతం ఉద్రిక్తంగానే ఉంది.


దేశంలో తలెత్తుతున్న మందిర్‌–మస్జిద్‌ వివాదాల్లో ఇది మరొకటి. షాహీ జమామసీదు ఉన్నచోటనే హరిహర ఆలయం ఉన్నదంటూ, జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదించిన న్యాయవాది స్థానికకోర్టులో పిటిషన్‌ వేసి, సర్వేకు అనుకూలమైన ఉత్తర్వులు పొందారు. మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ ౧6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టాడని ఆయన వాదన. 1904నాటి పురాతన కట్టడాల పరిరక్షణచట్టం వర్తించే ఈ ప్రదేశంలో ఒక సివిల్‌కోర్టు ఇలా సర్వేకు ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మసీదు కమిటీ 1991 నాటి చట్టాన్ని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిలువరించేందుకు ఏవో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.


అయోధ్య వివాదం పతాకస్థాయిలో ఉన్నప్పుడు, 1992లో మసీదు కూల్చివేతకు ముందుగానే, పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేసిన చట్టం ఇది. కేవలం అయోధ్యను, అప్పటికే అది న్యాయవివాదంలోనూ ఉన్నందున, దానిని మినహాయించి, దేశంలోని మిగతా ప్రార్థనాస్థలాలన్నింటికీ 1947 ఆగస్టు 15 నాటి స్థితిని వర్తింపచేసేట్టుగా ఈ చట్టం తయారైంది. ఎవరూ ఆ ప్రార్థనాస్థలాల స్థితిగతులను మార్చకూడదు, తదనుగుణమైన చర్యలు తీసుకోకూడదు అంటూ ఈ చట్టం విస్పష్టంగా చెప్పింది. భవిష్యత్తులో అయోధ్య తరహా వివాదం ఎలా పుడుతుంది, పెరుగుతుందన్న అవగాహనతో, అటువంటి వివాదాలకు తావు ఇవ్వనిరీతిలో ఇది రూపొందింది. కానీ, ఎంతో ముందుచూపుతో రూపొందిన ఈ చట్టాన్ని కేంద్రమూ, సుప్రీంకోర్టు కలగలసి నిర్వీర్యం చేశాయి. 2019నాటి అయోధ్య తీర్పులో ఈ చట్టం గురించి సుప్రీంకోర్టు గొప్పగా వ్యాఖ్యానించింది. అయోధ్య వివాదం ముగిసింది కనుక, భవిష్యత్తులో ఇటువంటివి తలెత్తకూడదని, సామాజిక అశాంతి రేగకూడదని కాంక్షించింది. ఆ ధర్మాసనంలో మాజీ చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒకరు. కానీ, ఆయనే 2022మేనెలలో జ్ఞానవాపి వివాదంలో ఏఎస్‌ఐ సర్వేకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటూ, ఎదుటిపక్షంవారు సదరు కట్టడం స్వరూపాన్ని మార్చమని అడగడం లేదని, దాని మూలాలు తెలుసుకోవాలని మాత్రమే కోరుతున్నారంటూ ఏదో నిర్వచనం ఇచ్చారు. ఈ మినహాయింపు దిగువకోర్టులకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చి, అవి ధైర్యంగా 1991నాటి చట్టం స్ఫూర్తిని వమ్ముచేయడానికి వీలుకల్పించిన మాట నిజం. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేవరకూ, దిగువకోర్టులను సుప్రీంకోర్టు నియంత్రించనిపక్షంలో సంభాల్‌ తరహా ఘర్షణలు దేశం వరుసగా చవిచూడాల్సివస్తుంది.

Updated Date - Nov 27 , 2024 | 04:05 AM