సంచలన సభాపర్వం
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:59 AM
ఊహించినట్టుగానే రాహుల్ గాంధీ ఘాటు ప్రసంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి జవాబు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగేచర్చలో రాహుల్ గాంధీ సోమవారం నాడు...
ఊహించినట్టుగానే రాహుల్ గాంధీ ఘాటు ప్రసంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి జవాబు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగేచర్చలో రాహుల్ గాంధీ సోమవారం నాడు మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఆయన మొదటి ప్రసంగం ఇది. తీవ్రమైన విమర్శలలో, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను కూడా జోడించి, రాహుల్ చేసిన వేడి వేడి ప్రసంగానికి మిశ్రమ ప్రతిస్పందనలు లభించాయి. ప్రతిపక్షాలన్నిటి తరఫున మాట్లాడుతూ, ఆత్మవిశ్వాసాన్ని, పరిపక్వతను ప్రదర్శించారని అభిమానులు సంతోషిస్తే, అనుభవ రాహిత్యంతో చాపల్యాన్ని ప్రదర్శించారని విమర్శకులు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత స్థాయికి తగినట్టు పెద్దరికాన్ని చూపలేదని విమర్శించారు. చర్చకు సమాధానం ఇస్తూ, మోదీ మంగళవారం నాడు రాహుల్‌ను బాలకుడు, బాలకుడు అంటూ పదేపదే ఎద్దేవా చేశారు. అయితే, చిన్నపిల్లవాడిగా వ్యవహరించాడని తేలికగా తీసుకోగూడదని, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రమాదకరమైన ఉద్దేశ్యాలున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. హిందూ సమాజాన్ని హింసావాదులుగా నిందించడాన్ని కోట్లాది మంది ప్రజలు మరచిపోరని హెచ్చరించారు. జనాదేశం తమకే అనుకూలంగా ఉన్నదని, పూర్తి సాధికారతతో తాము పాలిస్తామని, ఈ నినాదాలకు, విమర్శలకు లొంగి తగ్గబోమని మోదీ స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలకు తగ్గట్టు, పద్ధెనిమిదో లోక్‌సభ సంచలనశీలంగా, ఉద్రిక్తంగా, సంవాదభరితంగా మొదలయ్యింది. మున్ముందు సభా కాలం అంతా ఇదే విధంగా కొనసాగుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. మునుపటి సభలలో మాదిరిగా, నూతన సభలో ప్రభుత్వ, ప్రతిపక్ష కూటముల మధ్య అంతరం భారీగా లేదు. అధికార కూటమిలో ప్రధానపార్టీ బీజేపీకి స్వయంగా మెజారిటీ లేదు. కాంగ్రెస్ సొంత సంఖ్య వంద దాటనప్పటికీ, మునుపటి కంటె 90 శాతం పెరిగింది, దాని మిత్రపక్షాల బలమూ గణనీయంగా పెరిగింది. ఆ ఉత్సాహం సభలో వ్యక్తమవుతోంది. ఇటీవలి సాధారణ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించిన అంశాలు, రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో కూడా ప్రతిధ్వనించడం చూడవచ్చు. వాటికి తోడు, ఎన్నికల అనంతరం ముందుకు వచ్చిన ‘నీట్’ వంటి సమస్యలు చర్చలో ప్రముఖంగా ముందుకు వచ్చాయి. చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చే రోజునే ‘నీట్’ ఆందోళనకారులు పార్లమెంటు ముట్టడిని చేపట్టడం విశేషం. ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపు, ప్రతిపక్ష బెంచ్‌ల నుంచి ఎడతెగకుండా నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకాలం విస్మరణకు గురిఅయిన మణిపూర్, మంగళవారం నాడు, ప్రజాప్రతినిధుల ప్రసంగాల్లో, నినాదాల్లో మారుమోగింది.
అత్యవసర పరిస్థితికి 49 ఏళ్లు నిండిన సమయంలో, అధికారపక్షం ప్రారంభించిన ఉధృత విమర్శలు, సభలోనూ కొనసాగాయి. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఎన్నికల ప్రచారంలో చేసిన విమర్శలను తిప్పికొట్టడానికి బీజేపీ ఎమర్జెన్సీ యాభై ఏట ప్రవేశించిన సందర్భం అనువుగా అందివచ్చింది. జగ్జీవన్ రామ్ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇందిరాగాంధీ అడ్డుకున్నదని, మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా సభలో రాజీవ్ గాంధీ సుదీర్ఘ ప్రసంగం చేశారని మోదీ ప్రస్తావించడం, కాంగ్రెస్‌ను సామాజిక న్యాయానికి వ్యతిరేకిగా నిలబెట్టడానికే. అయితే, బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు వర్తమానానికి సంబంధించినవి కాగా, బీజేపీ ఎదురుదాడి, గతంలోని కాంగ్రెస్ వైఖరుల మీద గురిపెట్టినవి.
గత సభ కంటె అదనంగా లభించిన విజయాలను చూసి కాంగ్రెస్ అతిగా ఆనందిస్తున్నదని, ఆ పార్టీకి అంత ఉత్సాహం అవసరం లేదని బీజేపీ చెబుతోంది. అట్లాగే, తాము బలహీనపడ్డామని, ప్రజలు తమను నిరాకరించారని భావించవద్దని, ప్రజాదరణ తమకు తగ్గలేదని, మూడోసారి అధికారానికి ప్రజలే పంపారని, తమది కొనసాగింపే తప్ప, మార్పేమీ లేదని మోదీ పదే పదే చెబుతున్నారు. ఒకరిలో అతిశయాన్ని, మరొకరిలో న్యూనభావాన్ని ఈ వైఖరులు ప్రతిబింబిస్తున్నాయి. ప్రతిపక్షం అతిచురుకుగా ఉండేందుకు, ప్రభుత్వపక్షం యథాపూర్వం కొనసాగేందుకు చేసే ప్రయత్నాలు చట్టసభలలోను, పరిపాలనలోను, ప్రజారంగంలోను అనేక విశేష సన్నివేశాలను కల్పించవచ్చు. సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా పడుతున్న ఇబ్బంది, పరిస్థితిలోని జటిలతను సూచిస్తోంది.
సభలో గమనించదగిన విశేషం, ప్రతిపక్ష కూటమిలో అనేక గొంతులు దృఢంగా వినిపించడం. మంగళవారం నాడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడిన తీరు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. మణిపూర్ ఎంపీ బిమోల్ అకోయ్జమ్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. డీఎంకే, ఆర్జెడీ, ఠాక్రే శివసేన ఎంపీలనూ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కులగణన కోరే స్వరాలకు పార్లమెంటులో కొత్త బలం వచ్చినట్టు అనిపించింది. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో బీజేపీ సభ్యులు చురుకుగా పాల్గొనగా, మిత్రపక్షాల నుంచి ఆ స్థాయిలో భాగస్వామ్యం కనిపించలేదు. బడ్జెట్ సమయంలో ప్రభుత్వం ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.