Share News

సెంథిల్‌ పునరాగమనం

ABN , Publish Date - Oct 01 , 2024 | 02:58 AM

కరుణానిధి మనవడు, తమి‍ళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్‌ అయ్యారు. తండ్రితో పోల్చితే కుమారుడికి మరీ ఇంత వేగంగా ఈ హోదా దక్కడం కొందరికి ఎబ్బెట్టుగా తోస్తున్నది...

సెంథిల్‌ పునరాగమనం

కరుణానిధి మనవడు, తమి‍ళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్‌ అయ్యారు. తండ్రితో పోల్చితే కుమారుడికి మరీ ఇంత వేగంగా ఈ హోదా దక్కడం కొందరికి ఎబ్బెట్టుగా తోస్తున్నది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు రాజకీయవారసులు లేరు కానీ, కరుణానిధి కుటుంబానికి ఆ కొరతేమీ లేదు. పైగా, నలభైయేడేళ్ళ వయసులో హీరోగా నటిస్తున్న వ్యక్తి, రాజకీయాల్లో డిప్యూటీసీఎం పాత్ర నిర్వహించకూడదన్న నియమమేమీ లేదు. వాళ్ళపార్టీ వాళ్ళిష్టం అని సరిపెట్టుకుంటున్నవాళ్ళు కూడా జూనియర్‌ స్టాలిన్‌కు పట్టాభిషేకం చేయడానికి పెద్దస్టాలిన్‌ కాసింత తొందరపడ్డారని మాత్రం అంటున్నారు. ఐదేళ్ళక్రితమే పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి అధికారిక ప్రవేశం చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేకావడం, ఏకంగా మంత్రిగా అవతరించడం తెలిసినవే. ‘సనాతన ధర్మం’ మీద ఆ పాటి కఠినమైన వ్యాఖ్యలు చేయకపోతే, దేశమంతా ఆయన పేరు మారుమోగేదికాదేమో. వారసుడన్నాక ప్రమోషన్‌కు సహజమే కానీ, స్టాలిన్‌కు కరుణానిధి పట్టా‌భిషేకం చేయడానికి కనీసం మూడుదశాబ్దాలు ఆగారు. తమకుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని సీనియర్‌ స్టాలిన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎందుకు హామీ ఇచ్చారో, అధికారంలోకి వచ్చిన తరువాత మనసెందుకు మార్చుకున్నారో తెలియదు కానీ, తండ్రిలాగా ఎక్కువకాలం నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే జూనియర్‌ స్టాలిన్‌కు రాజమార్గం సుగమమైపోయింది. ఏడాదిన్నరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చర్య అధికులను ఆశ్చర్యపరచలేదు కానీ, ఆదివారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో సెంథిల్‌ బాలాజీకి మళ్ళీ మంత్రిగా చోటుదక్కడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మాత్రమే ఇచ్చిందనీ, నిర్దోషి అనలేదని స్టాలిన్‌ మరిచిపోయినట్టున్నారు.


రెండురోజుల క్రితం సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ మీద విడుదలైన వెంటనే ఆయనను కీర్తిస్తూ స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు, స్వాగతసత్కారాలు, పార్టీ హడావుడి చూసిన తరువాత, ఆయనకు మళ్ళీ మంత్రిపదవి కట్టబెట్టే ప్రమాదం ఉన్నదని చాలామందికి తోచింది. అది అప్రదిష్ఠ, అనైతికం అన్న హెచ్చరికలు, హితవులను పక్కనబెట్టి తాను అనుకున్నదే స్టాలిన్‌ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో పదిహేను నెలలుగా జైల్లో ఉన్న సెంథిల్‌మీద అన్నాడీఎంకె హయాంలో ప్రభుత్వ రవాణాసంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్న అభియోగాలున్నాయి. సిట్‌ దర్యాప్తులో సెంథిల్‌ కుట్రంతా వెలుగుచూసి న్యాయస్థానాలకు చేరింది. ఫిర్యాదుదారులకు తాను డబ్బులు తిరిగి ఇచ్చేశానని కేసు కొట్టివేయమని సెంథిల్‌ ఒక దశలో న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. మద్రాస్‌ హైకోర్టు ఈ జాబ్స్‌ ఫర్‌ క్యాష్‌ కేసు కొట్టివేస్తే, సుప్రీంకోర్టు అడ్డుపడటంవల్లనే నిజానికి వ్యవహారం అరెస్టులవరకూ వచ్చింది. ‘రవాణామంత్రి తన శాఖను అమ్మకానికి పెట్టేశాడు. అవినీతి, దోపిడీ, భూకబ్జాలు, అపహరణలతో ఆయన ఎదిగాడు. పదిహేనుసార్లు మంత్రివర్గం మార్పులు జరిగినా ఆ అవినీతిపరుడి స్థానం పదిలం. ఆయన అవినీతిమీద శాసనసభలో నేను స్వయంగా సాక్ష్యాలు సమర్పించినా చర్యలు లేవు’ అంటూ జయలలిత ప్రభుత్వంలో సెంథిల్‌ అవినీతిమీద స్టాలిన్‌ 2016 ఎన్నికల ప్రచారసభలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక దశలో జయలలిత కూడా దూరం పెడితే కేవలం రాజకీయార్థిక ప్రయోజనాలకోసం ఆయన డీఎంకెలో చేరాడు.


పదిహేను నెలలుగా ఆయన జైల్లో ఉన్నా సమీపకాలంలో కేసు విచారణకు వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో మనీలాండరింగ్‌ కేసులో సైతం కోర్టు బెయిల్‌ ఇచ్చింది. తిరిగి మంత్రి కాకూడదన్న ఆంక్షలు విధించకపోవచ్చును కానీ, ఆయన పదవిలో ఉంటే దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ అప్పట్లో రాజ్‌భవన్‌ సెంథిల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు చాలామందికి గుర్తుకొస్తున్నది. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌, మనీలాండరింగ్‌ ఆరోపణలతో పాటు, అంతకుపూర్వంనుంచే ఆయనపై అనేక క్రిమినల్‌ కేసులున్నాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తిరిగి అధికారం స్వీకరించడం ఆశ్చర్యకరమైన విషయం. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మద్రాస్‌ హైకోర్టు నియమించే కమిషన్‌ విచారణ పూర్తయిన తరువాత ఆయనకు మంత్రిపదవి దక్కివుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో బాధితులకు అన్యాయం జరిగిందన్న అప్రదిష్ఠ స్టాలిన్‌కు వచ్చేది కాదు.

Updated Date - Oct 01 , 2024 | 02:58 AM