Share News

మధ్యభారతంలో ఆదివాసీల హననం ఆపండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:35 AM

నక్సలిజాన్ని సమూలంగా తుదముట్టిస్తామని అమిత్ షా పదేపదే చెప్తున్నారు. దేశంలో ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించే సమస్యలు ఉన్నంత కాలం ఏదో ఒక రూపంలో పోరాటాలు, నిరస

మధ్యభారతంలో ఆదివాసీల హననం ఆపండి

నక్సలిజాన్ని సమూలంగా తుదముట్టిస్తామని అమిత్ షా పదేపదే చెప్తున్నారు. దేశంలో ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించే సమస్యలు ఉన్నంత కాలం ఏదో ఒక రూపంలో పోరాటాలు, నిరసనలు జరుగుతూనే ఉంటాయనేది ఈ 75 ఏళ్ల కాలంలో నిరూపితమైంది. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా జరుగుతున్న ప్రజల పోరాటాలను కూడా నక్సలైట్ పోరాటాలుగా, ఉగ్రవాద కార్యకలాపాలుగా ముద్ర వేస్తున్నారు. ఇటీవల డిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమాలను ఖలిస్తాన్ వేర్పాటువాద పోరాటాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. ఒకవైపు ప్రజా ఆందోళనలపై ఉక్కు పాదం మోపుతూ మరోవైపు మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడం ఓ సంప్రదాయంగా జరుగుతూ వస్తున్నది.


ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో నక్సలైట్ల ఉద్యమాలను, వారు ప్రకటించుకుంటున్న లక్ష్యాలు–ఆశయాలను గమనిస్తే అసమానతలతో వేళ్లూనుకుపోయిన సమాజాన్ని సమ సమాజంగా మార్చడం; దున్నేవారికే భూమి కావాలనడం; అంటరానితనం పోవాలనడం; కింది కులాలకు కూడా చదువు, ఆత్మగౌరవం అందాలనడం; విదేశీ సామ్రాజ్యవాద దోపిడి నుంచి దేశ సంపద రక్షణ; దేశానికి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్వాతంత్య్రం తదితర అంశాలు వారి ఎజెండాలో ఉన్నాయి. దేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించి వారిని రక్షించాల్సిన పాలకులు... ఒకవైపు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను అణచివేస్తూ మరోవైపు విదేశీ సామ్రాజ్యవాదులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టమవుతున్నది.


ప్రజల సమస్యల పరిష్కారంలో భారత పాలకుల వైఖరిలో అప్పటికీ– ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించకపోవడం బాధాకరం. అంతేగాక అనవసర సమస్యలను సృష్టించి కాలయాపన చేయడం ప్రభుత్వాలకు ఓ అలవాటుగా మారింది. ప్రజల్లో ప్రభుత్వాలపై అసహనం, వ్యతిరేకత వస్తున్న సందర్భంలో జనంలో చర్చ లేకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఓ సమస్యను సృష్టిస్తూ ఉంటాయి. నిత్యం ఆ అంశాన్ని ప్రసార సాధనాలలో ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతాయి. దేశవ్యాప్త సార్వత్రక ఎన్నికల వేళ ఆ కోవకు చెందినదే ఈ ఆపరేషన్ కగార్ దాడులు అని భావించాలి.


మావోయిస్టులు విజ్ఞాపనల రూపంలోనో, ప్రకటనల రూపంలోనో ప్రజల సమస్యలను భారత పాలకుల ముందు ఉంచుతున్నారు. వారు లేవనెత్తే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించి చర్చిస్తే ప్రజలకు మేలు. అంతేగాని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా భావిస్తూ ప్రజలను అణచివేస్తే అది కూడా ప్రధాన సమస్యగా మారి నక్సలైట్ ఉద్యమాలు తీవ్రరూపం దాల్చి... ఇది ఎన్నటికీ అంతం కానీ సమస్యగానే ఉంటుంది. ఈ యుద్ధంలో ఇరువైపులా చనిపోతున్నది పేదలైన ఈ దేశ బిడ్డలే.


మధ్య భారతంలో యుద్ధం నిలిపివేసి శాంతి నెలకొల్పాలి. ఐదవ షెడ్యూల్ అటవీ ప్రాంతాలలో పోలీసు క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని వెనక్కి పిలవాలి. దేశ సరిహద్దులను రక్షించే రక్షణ సైన్యాలను రాష్ట్రాలలో ఉపయోగించడం నిలిపివేయాలి. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. ఆదివాసీల హక్కులను రక్షించి వారి సమస్యలను పరిష్కరించాలి. వారికి జల్, జంగల్, జమీన్‌లపై అధికారం ఇవ్వాలి.

– ప్రశాంత్ పగిళ్ళ, కన్వీనర్

స్టూడెంట్స్ ఫర్ ఫీస్ అండ్ లిబర్టీ, ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - Apr 27 , 2024 | 04:35 AM