Share News

సిరియా...కొత్త భయాలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:07 AM

నిరంకుశుడైన పాలకుడు గద్దెదిగితే సంతోషించాల్సిందే. అధికారం కోసం లక్షలాదిమందిని జైళ్ళలోకి నెట్టి, చిత్రహింసలుపెట్టి, ఊచకోతలు కోసినవాడైతే మరీనూ. నిర్దాక్షిణ్యంగా శత్రుసంహారం చేస్తూ దశాబ్దాలుగా...

సిరియా...కొత్త భయాలు

నిరంకుశుడైన పాలకుడు గద్దెదిగితే సంతోషించాల్సిందే. అధికారం కోసం లక్షలాదిమందిని జైళ్ళలోకి నెట్టి, చిత్రహింసలుపెట్టి, ఊచకోతలు కోసినవాడైతే మరీనూ. నిర్దాక్షిణ్యంగా శత్రుసంహారం చేస్తూ దశాబ్దాలుగా అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన సిరియా అధ్యక్షుడు బషర్‌–అల్‌ అసద్‌ కోట ఇంత సునాయసంగా కూలుతుందని, పెళ్ళాంపిల్లలతో సహా పుతిన్‌ పంచన చేరుతాడని ఎవరూ అనుకొని వుండరు. అధికారంలో ఉన్నంతకాలం నియంతలను మించి నిరంకుశంగా కనిపించిన అసద్‌ ఇలా కూలిపోవడం, పిరికివాడిలాగా పారిపోవడం చాలామందికి నచ్చింది. అసద్‌ కుటుంబం ఉక్కుపిడికిలినుంచి ఐదుదశాబ్దాల తరువాత సిరియా బయటపడింది, నవశకం ఆరంభమవుతోంది. నిరంకుశపాలన అంతమైనందుకు సంతోషించాల్సిందే కానీ, రేపటిదాని ప్రయాణం ఏ దిశగా ఉంటుందన్నది భయపెడుతున్న ప్రశ్న.


నియంతృత్వం పోయినంతమాత్రాన ప్రజాస్వామ్యం నెలకొంటుందని హామీ ఏమీ లేదు. సిరియా మరో కొత్తసంక్షోభం వైపు ప్రయాణిస్తున్నదని, అది ప్రపంచానికి ప్రమాదం తేవచ్చునని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అసద్‌ను కూల్చడానికి అవసరార్థం ఒక్కటైన శక్తులన్నీ తమ దీర్ఘకాలిక ఎజెండాలు, ప్రయోజనాలను తాత్కాలికంగా పక్కనబెట్టి ఒక్కటిగా సాగే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఎవరిపాత్ర ఎంతో నిర్దిష్టంగా నిర్వచించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఘర్షణలకు తావులేని పాలన అందిస్తామని, ప్రజాస్వామికంగా నడుస్తామని, పొరుగుదేశాల్లో కాళ్ళూవేళ్ళూ పెట్టబోమని తిరుగుబాటుదారులు ప్రపంచానికి హామీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఆమోదంకోసం, అగ్రరాజ్యాల సాయం కోసం ఆ మాత్రం చేయవలసిందే. అసద్‌ నిష్క్రమణ పశ్చిమాసియాకు మాత్రమే కాక, యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిణామం. ఇరాన్‌, హిజ్బొల్లా, రష్యా సాయంతో శత్రువులను దశాబ్దాలుగా తట్టుకొని నిలిచిన అసద్‌, ప్రధానంగా పుతిన్‌ వైఖరిలో మార్పుతో ఒక్కసారిగా ఒంటరి అయిపోయాడు. ఇరాన్‌ బలహీనపడటం, ఇజ్రాయెల్‌ బలపడటం, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు, టర్కీనుంచి లక్షలాదిమంది శరణార్థులు తిరిగి సిరియాకు వెనక్కు పోవడం ఇత్యాది భావి పరిణామాలను విశ్లేషకులు అంచనావేస్తున్నారు.


భారత్‌–సిరియా మధ్య దౌత్యసంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి డెబ్బైఐదేళ్ళవుతాయి. 1957లో అమెరికా వెడుతూ మార్గమధ్యంలో నెహ్రూ సిరియాలో దిగితే, ఆ సందర్భంగా అక్కడ ఒక వీధికి ఆయన పేరుపెట్టిన గతాన్ని మీడియా ఇప్పుడు గుర్తుచేస్తోంది. లౌకికవాదానికి కట్టుబడిన అసద్‌ కుటుంబం అధికారంలో ఉన్నంతకాలం భారతదేశానికి తమనుంచి ఏ ఇబ్బందీ రానివ్వలేదు. కశ్మీర్‌సహా కీలకమైన విషయాల్లో అంతర్జాతీయ వేదికలమీద సైతం సిరియా మనపక్షాన నిలబడింది. కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని తొలగించినప్పుడు కూడా అది భారత్‌ అంతర్గత విషయమని సిరియా తేల్చేసింది. అంతర్జాతీయ వేదికలమీద మనపై విరుచుకుపడే టర్కీ ఎర్డొగాన్‌ కంటే అసద్‌ ఉత్తమం. రష్యాతో మన సాన్నిహిత్యం వల్లనో, పుతిన్‌ కారణంగానో మన పక్షాన ఉంటూవచ్చిన సిరియా ఇప్పుడు ప్రధానంగా ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ సంస్థ (హెచ్‌టీఎస్‌) సహా వివిధ రకాలైన తిరుగుబాటుదారుల చేతుల్లోకి పోవడం ప్రమాదకరమే. అసద్‌కు వ్యతిరేకంగా పోరాడిన శక్తుల్లో పాకిస్థాన్‌నుంచి వెళ్ళిన కొన్ని ముఠాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.


తనకు గ్లోబల్‌ ఎజెండాలు లేవని, సిరియాకు మాత్రమే పరిమితంగా కార్యకలాపాలు ఉంటాయని హెచ్‌టీఎస్‌ అంటున్నప్పటికీ, అది ఒక ఇస్లామిస్టు సంస్థ అన్నది నిజం. మానవ, మహిళా, మైనారిటీ హక్కులకు హామీ ఇస్తున్న ఆ సంస్థ అధికారంలో కుదురుకున్న తరువాత ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి. భిన్న మతాలు, తెగలు, విభజనలు ఉన్న సమాజాన్ని సయోధ్యతో కాక, అణచివేతతో ఏలాలని ప్రయత్నించిన అసద్‌ వంటివారు ఎప్పటికైనా కూలిపోక తప్పదు. అసద్‌ పతనం, అతడి విగ్రహాల కూల్చివేత తదితర దృశ్యాలు చూసినవారికి ఇరాక్‌ గత పాలకుడు సద్దాం హుస్సేన్‌ గుర్తుకొచ్చాడు. అణ్వాయుధాలున్నాయన్న ఆరోపణతో, ఇరాక్‌లో చొరబడి సద్దాంను అమెరికా దించివేసిన అనంతరం పలు ఉగ్రసంస్థలు పడగవిప్పి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. సిరియాలో అధికారమార్పిడి అలాంటి ఒక కొత్తసమస్య తెచ్చిపెట్టకపోతే అదేచాలు.

Updated Date - Dec 10 , 2024 | 01:07 AM