Share News

బెటాలియన్‌ వ్యవస్థను రద్దు చేయాలి!

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:15 AM

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలతో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బ్రతుకులు కూడా మారుతాయి అనే ఆకాంక్షతో ఎదురుచూసిన పోలీసు కానిస్టేబుల్

బెటాలియన్‌ వ్యవస్థను రద్దు చేయాలి!

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలతో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బ్రతుకులు కూడా మారుతాయి అనే ఆకాంక్షతో ఎదురుచూసిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబాల్లో నిరాశే మిగిలింది. గతంలో రాజకీయ పార్టీలు ఏక్ పోలీస్ వ్యవస్థ ఏర్పాటు విషయంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగస్థులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు.

నాడు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పెరుగుతున్న వామపక్ష భావజాలాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ గ్రే హౌండ్స్ అనే కొత్త పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో విప్లవ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికై పోరాడాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదనంతరం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ, కొంతవరకు యువత ఆధునిక భావాల వైపు వెళ్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు కూడా నక్సలిజం ప్రభావం తగ్గిందని ప్రకటించారు. అంతేగాక, సీఆర్‌పీఎఫ్‌ లాంటి కేంద్ర బలగాలు జాతీయ స్థాయిలో దేశ రక్షణలో బాధ్యత వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ ఇండియన్ రిజర్వ్ అనే పేరుతో తెలంగాణ రాష్ర్ట బెటాలియన్ పోలీసులను వివిధ రాష్ట్రాలలో పని చేయించడం కూడా సహేతుకం కాదు. దేశంలో శాటిలైట్, ఇంటర్నెట్, జీపీఎస్ సదుపాయాల ద్వారా నిఘా వ్యవస్థలు కూడా పటిష్టమవుతున్న నేపథ్యంలో తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థ ఆవశ్యకతా, మనుగడా నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థలో ఉన్న అంతర్గత అధికారిక ఒత్తిడి, వివక్షల కారణంగా ఎంతో మంది కానిస్టేబుల్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు, ఆత్మహత్యలపై ఒక్క నిజనిర్ధారణ కమిటీ నియమించలేదు. ఒకే పోలీసు నియామక బోర్డు ద్వారా ఎంపికైన భిన్న విభాగ పోలీస్ వ్యవస్థలలో బెటాలియన్ వ్యవస్థకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కంపెనీ మూమెంట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో పోలీస్ స్టేషన్లను కేటాయించినప్పుడు సివిల్, ఏఆర్ లాంటి ఇతర పోలీసు విభాగాల నుంచి వివక్షలకు గురి కావడం ఒక రకమైన కుల వ్యవస్థని తలపిస్తుంది.

ఎన్నో సంవత్సరాలుగా నష్టపోతున్న పోలీస్‌ కానిస్టేబుల్ కార్మిక కుటుంబాలు డిమాండ్ చేస్తున్న అంశం అయిన ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం’ను ఇప్పటికైనా అమలుపరచాలి. ఒకే పనిపై వాళ్ళని నియమించి, ఎనిమిది గంటల పని విధానాన్ని కల్పించాలి. కానిస్టేబుల్స్‌ను వివక్షకు గురి చేయకుండా, అనైతిక బానిసత్వం నుంచి విముక్తి కలిగించి, వృత్తిపరంగా గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలి. కుటుంబానికి దూరంగా ఉంచి, వారి పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సమకాలీన సమాజంలో ప్రాధాన్యత లేని ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థ నిర్వహణ కూడా రాష్ర్ట ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థను రద్దు చేసి ‘ఏక్ స్టేట్ -ఏక్ పోలీస్’ విధానం తీసుకొని రావడం ద్వారా కానిస్టేబుల్స్‌ కుటుంబాల జీవితాల్లో గుణాత్మక మార్పులు సాధ్యం అవుతాయి.

– గాదె వంశీధర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Updated Date - Nov 02 , 2024 | 06:15 AM