Share News

సమగ్ర ప్రగతికి సోపానం రాష్ట్ర బడ్జెట్

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:21 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దశాబ్ద కాలంలో పదిరెట్లు అప్పు పెరిగింది. సంక్షేమం, పురోగతీ లేక పాలకులు తీసుకున్న విధాన నిర్ణయాలు తెలంగాణలో తీవ్ర అవినీతిని పెంచి పోషించాయి. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల దుర్వినియోగం

సమగ్ర ప్రగతికి సోపానం రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దశాబ్ద కాలంలో పదిరెట్లు అప్పు పెరిగింది. సంక్షేమం, పురోగతీ లేక పాలకులు తీసుకున్న విధాన నిర్ణయాలు తెలంగాణలో తీవ్ర అవినీతిని పెంచి పోషించాయి. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల దుర్వినియోగం జరిగింది. దీంతో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కొరవడింది. దీన్ని సరిచేసి రాష్ట్ర అభివృద్ధికి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్‌ దోహదం చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ, దుబారా తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణతో సంక్షేమ పాలనకు దోహదం చేసే బడ్జెట్‌ ఇది. కాంగ్రెస్ సర్కార్‌ బడ్జెట్‌లో నాలుగో వంతు (సుమారు రూ.72,659 కోట్లు) వ్యవసాయ రంగానికి కేటాయించింది. సాగునీరు, రైతు భరోసా, రుణ మాఫీ తదితరాలకు భారీ కేటాయింపులు జరగడమే కాక, గత పదేళ్ళలో నిర్లక్ష్యం కాబడిన అన్ని రంగాల్లోనూ కేటాయింపులు పెరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యాల పెంపు, మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం అమితప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో 65 ఐటిఐలను టాటా టెక్నాలజీస్‌ సహకారంలో డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా మార్చటం ద్వారా నూతన రంగాలలో ఉపాధి అవకాశాల పెంపు జరుగుతుంది. దీనికి రూ.2324కోట్ల వ్యయం చేస్తారు. ఏఐ, డాటా సెంటర్ల ఏర్పాటు నిరుద్యోగ నిర్మూలనకు దోహదం చేస్తుంది. రాష్ట్రంలో నైపుణ్యాల స్థాయి పెంపు కోసం పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో ‘తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు అవుతోంది. బడ్జెట్‌లో ప్రథమంగా రూ.100 కోట్లు కేటాయింపు జరిపి, భూమిపూజ నిర్వహించి, నిర్మాణం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ఆధునిక రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం దీనిద్వారా సాధ్యం అవుతుంది. ముఖ్యంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజి రంగానికి రూ.773కోట్లు, వాటి అవస్థాపన సౌకర్యాలకు రూ.100 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో జాతీయ స్థాయి కన్నా నిరుద్యోగిత అధికంగా ఉంది. 2022–23 ప్రకారం దేశంలో 3.4శాతం, ఉండగా రాష్ట్రంలో 4.6శాతం నిరుద్యోగిత రేటు ఉంది. అంతే కాకుండా గ్రామాల్లో మూడు శాతం, పట్టణాల్లో ఎనిమిది శాతం నిరుద్యోగిత ఉంది. దీనికి గత కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరించి అస్తవ్యస్త విధాన నిర్ణయాలు ప్రధాన కారణం.


హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా మార్చటానికి సుమారు రూ.10వేల కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు, చెరువులు, ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) అనే విభాగాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వ ఆస్తుల రక్షణకు కొత్త చొరవ తీసుకుంది. దీనికి సుమారు రూ.200కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ ఏడాది అధిక కేటాయింపులు వ్యవసాయ వృద్ధికి దోహదం చేస్తాయి. కాంగ్రెస్‌ తన తొలి పూర్తి బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని ఆర్థిక అంతరాలను రూపుమాపి సమగ్ర, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి ఈ బడ్జెట్‌ దోహదం చేస్తుందన్నది నిస్సందేహం.

– డా. రియాజ్‌

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌

Updated Date - Aug 03 , 2024 | 01:21 AM