Share News

ఎవరి కోసం ఈ స్కిల్‌ యూనివర్సిటీ!?

ABN , Publish Date - Nov 19 , 2024 | 05:51 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌- పబ్లిక్- భాగస్వామ్య పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో

ఎవరి కోసం ఈ స్కిల్‌ యూనివర్సిటీ!?

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌- పబ్లిక్- భాగస్వామ్య పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నది. ఆదాని, రెడ్డి లాబ్స్, మహేంద్ర, ఫ్లిప్‌కార్ట్, జి.ఎం.ఆర్., హెచ్.ఎస్.బి.సి., అపోలో లాంటి కార్పొరేట్ కంపెనీలు భాగస్వాములుగా చెబుతున్న ఈ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా చైర్మన్‌.

ఈ ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో కంపెనీల పాత్ర స్పష్టంగా లేదు. యూనివర్సిటీ కోసం అయ్యే మొత్తం పెట్టుబడిలో ఈ కంపెనీల వాటా ఎంత? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు కల్పిస్తారు? ఈ కంపెనీలు ఒక్కొక్కటీ రాబోయే ఐదేళ్ళలో ఒక్కొక్క సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి? ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తాయి? నిర్దిష్టంగా ఈ యూనివర్సిటీ స్థాపనలో ఏయే కంపెనీలు భాగస్వాములవుతున్నాయి? అనే విషయాల మీద సమాచారం లేదు. అయితే ఈ భాగస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర స్పష్టంగానే ఉంది. ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి కావలసిన సుమారు 57 ఎకరాల భూమిని కేటాయించింది. భవనాలను నిర్మించడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నది. రోడ్లు, విద్యుత్తు, నీరు మొదలైన మౌలిక వసతులను ఉచితంగా కల్పిస్తున్నది. యూనివర్సిటీ నడవడానికి కావలసిన తాత్కాలిక క్యాంపస్‌ను గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో, హైటెక్ సిటీలోని నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏర్పాటు చేశారు. వచ్చే మూడేళ్ళకు అయ్యే మొత్తం పునరావృత ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం కాదా?


ఈ యూనివర్సిటీలో 17 రకాలైన కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఈ–కామర్స్, హెల్త్ కేర్, ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కన్‌స్ట్రక్షన్ మొదలైన అధ్యయన సముదాయాలు (స్కూల్స్) ప్రారంభిస్తున్నారు. ఇటువంటి కోర్సులను ప్రవేశపెట్టి యూనివర్సిటీని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడంలో ఆంతర్యమేమిటి? ముఖ్యమంత్రితో సహా మంత్రులు దేశ, దేశాలు తిరిగి 19 బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అత్యధిక లాభాలే లక్ష్యంగా కలిగిన ఈ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణల ద్వారా వేలాదిమంది ఉద్యోగులను తీసివేశారు, తీసివేస్తున్నారు. మరోవైపు, కార్పొరేట్ కంపెనీల తరపున ఇన్ఫోసిస్ అధినేత రోజుకు 8 గంటలు కాదు 12 గంటలు పని చేయాలని సూచన చేశాడు. అంటే కొత్తగా ఉద్యోగాలను ఇవ్వడం అటుంచి, ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించాలనే ఉచిత సలహా ఇచ్చాడు. పైగా కృత్రిమ మేధస్సు అమలు చేయడం వలన రాబోయే కాలంలో నిరుద్యోగం ఇంకా తీవ్రతరం అవుతుంది. ఈ కోర్సుల ఉద్దేశం అతి తక్కువ వేతనాలతో, సామాజిక భద్రత లేని అవుట్‌సోర్సింగ్, కాన్ఫరెన్స్ పద్ధతిలో అసంఘటిత కార్మికులను సృష్టించడమేనని అర్థమవుతున్నది.

1980–-1990 కాలంలో చైనా దేశంలో చిన్న పట్టణాలలో, గ్రామాలలో ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా పెద్ద ఎత్తున టౌన్ అండ్ విలేజ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా మన దేశంలో కూడ ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా చిన్న పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వమే వేలాదిగా చిన్న కుటీర పరిశ్రమలను స్థాపించి లక్షల సంఖ్యలో ఉద్యోగాలను ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ అవకాశం కూడా ఉన్నది. వేలాది వ్యవసాయాధారిత పరిశ్రమలను స్థాపించవచ్చు. అలాగే అటవీ సంపద మీద ఆధారపడే పరిశ్రమలను అభివృద్ధి చేయవచ్చు. టూరిజం, కోళ్ల పరిశ్రమ, పూలు, పండ్లు సాగు చేసి అమ్మడం లాంటి రంగాలలో పరిశ్రమలను స్థాపించి రెగ్యులర్ ప్రాతిపదికన, సామాజిక భద్రత కల్పించి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఈ పరిశ్రమల కోసం ఎటువంటి నైపుణ్యాలు కావాలో అటువంటి కోర్సులను ప్రవేశపెట్టవచ్చు. అటువంటిది ఏమీ లేకుండా పైపైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి స్వదేశీ, విదేశీ కంపెనీలకు అప్పజెప్పితే ఫలితం శూన్యం.


ఈ యూనివర్సిటీకి ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీల నిధులతోపాటు బ్యాంకుల నుంచి, కార్పొరేషన్‌ల నుంచి అప్పులు తీసుకుంటారు. దాతలు డబ్బులు ఇస్తే భవనాలు, సెంటర్లు, గదులు, గోడలకు కూడా ఆ దాతల పేర్లు పెడతారు. యూనివర్సిటీ స్వయంపోషకంగా ఉండటానికి వనరులు సేకరించాలని చట్టంలో చెప్పారు. ఇక్కడ ఇచ్చే డిగ్రీలకు, డిప్లమాలకు, సర్టిఫికెట్లకు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసే అవకాశమూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఫీజుల వివరాలు వెల్లడించలేదు. యూనివర్సిటీలోని ఆడిటోరియంలను, క్రీడా ప్రాంగణాలను పెళ్లిళ్లకు, పేరంటాలకు, బర్త్‌డే పార్టీలకు ఇచ్చి నిధులను సమకూర్చుకోవాలని చట్టం సూచించింది. ఇక్కడ అధ్యాపకుల నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయి. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని నియమించాలని చట్టం బహిరంగంగానే చెప్పింది. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీ మొదలైన స్కూల్స్‌కు డీన్ మాత్రమే కోర్ ఫ్యాకల్టీగా ఉంటాడు. అంటే మొత్తం స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ అంతా ఒకే ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటాడన్నమాట. మిగతా ఫ్యాకల్టీ అంతా కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీగా నియమించబడతారు. చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఎన్నిచోట్ల పనిచేయవలసి ఉంటుందో, ఫలితంగా ఈ యూనివర్సిటీని వారు ఎంతవరకు పట్టించుకుంటారో ఇప్పటి మన యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.

యూనివర్సిటీ పరిపాలన రంగంలో అకడమిక్ కౌన్సిల్‌ పైనా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ పైనా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పెత్తనం జాతీయ విద్యా విధానంలో సూచించిన విధంగా ఉంటుంది. పరిపాలన విభాగంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ అనే విభాగాన్ని సృష్టించి దానికి సర్వాధికారాలను కలుగజేశారు. ఇంతవరకు యూనివర్సిటీలలో అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సెనేట్స్ ఉన్నాయి కానీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అన్నది ఎక్కడా లేదు. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలను పక్కకు పెట్టడం దగ్గర నుంచి, ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించడం, రిజిస్ట్రార్‌ను నియమించడం దాకా అసాధారణ అధికారాలు ఉంటాయి. వైస్–ఛాన్సలర్‌ను కూడా తొలగించే అధికారం దీనికి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అకాడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామమాత్రమై బోర్డు అఫ్ గవర్నర్స్ అనే విభాగం అంతిమ నిర్ణయాధికార సంస్థగా ఉంటుంది. యూనివర్సిటీకి సంబంధించిన సర్వాధికారాలు కలిగిన ఈ సంస్థలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఏడుగురు సభ్యులు కంపెనీల నుండే ఉంటారు. అటువంటప్పుడు ఇది ఎవరి ప్రయోజనాలు కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్ధరహితం. రాష్ట్రంలోని వేలాది స్కూళ్లలో పి.ఇ.టి, పి.డి.లు లేరు. ఆటలకు సంబంధించిన ఆట వస్తువులు కూడా లేవు.

ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం పేరు మీద ఏర్పడిన ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం ఇచ్చే భూములతోపాటు, ఉచితంగా కల్పించే రోడ్లు, విద్యుత్‌, నీటి వసతి మొదలైన సౌకర్యాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం అయినట్టే. ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ రంగంలోనే వేలాది చిన్న, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తే, వాటికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడు ఉన్న ఐటీఐలూ పాలిటెక్నిక్‌లలో నేర్పించే విధానం ఏర్పాటు చేస్తే తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన జరిగేది. కానీ ఇక్కడ స్కిల్‌ యూనివర్సిటీ పేరిట కార్పొరేట్ కంపెనీలకు అవసరమైనట్టు సామాజిక భద్రత లేకుండా, తక్కువ జీతాలతో పనిచేసే కొద్దిమంది అసంఘటిత కార్మికుల తయారీ మాత్రమే జరుగుతుంది. దీని గురించి చర్చ జరగాలి.

ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ రంగంలోనే వేలాది చిన్న, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తే, వాటికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడు ఉన్న ఐటీఐలూ పాలిటెక్నిక్‌లలో నేర్పించే విధానం ఉంటే తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన జరిగేది.

ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

Updated Date - Nov 19 , 2024 | 05:51 AM