Share News

సాగు హక్కుకు గుర్తింపు ఏదీ?

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:10 AM

తెలంగాణ ప్రభుత్వం భూమికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలపై తన విధానాన్ని రూపొందించే పనిలో ఉంది. ఒకటి భూమి హక్కులను నమోదు చేసే చట్టం, రెండోది భూమి సాగుకు మద్దతును ఇచ్చే రైతు భరోసా పథకం. అయితే రెండూ ఒక దానితో ఒకటి

సాగు హక్కుకు గుర్తింపు ఏదీ?

తెలంగాణ ప్రభుత్వం భూమికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలపై తన విధానాన్ని రూపొందించే పనిలో ఉంది. ఒకటి భూమి హక్కులను నమోదు చేసే చట్టం, రెండోది భూమి సాగుకు మద్దతును ఇచ్చే రైతు భరోసా పథకం. అయితే రెండూ ఒక దానితో ఒకటి సంబంధం లేని అంశాలుగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు కనబడుతున్నది. కేవలం మొక్కుబడి మార్పులతో, పైపై మెరుగులతో సరిపుచ్చుతున్నది. తద్వారా నిజమైన సాగుదారుకు గుర్తింపు, మద్దతు లేకుండా, ఎటువంటి హక్కూ లేకుండా చేస్తోంది.

రైతు భరోసా పథకం ఎలా ఉండాలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ, పంట పెట్టుబడి ఎవరికి, ఏ భూమికి, ఎంత భూమికి పరిమితం చేయాలి అనే విషయాలను ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. ఈ సమావేశాల్లో నిజంగా సాగు చేసే రైతుకే, సాగులో ఉన్న భూములకే పంట పెట్టుబడి ఇవ్వాలనే వాదన బలంగా వినిపిస్తుంది. చిత్రం ఏమిటంటే పూర్వపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన మార్గదర్శకాల్లో కూడా ఇదే విషయం ఉంది. అయితే ఆ ప్రభుత్వం స్వంత మార్గదర్శకాలనే ఉల్లంఘిస్తూ సాగుతో సంబంధం లేకుండా లక్షల ఎకరాలకు వేల కోట్ల రూపాయలు పంచింది. అర్హత లేకుండా డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు భూమి యజమానులకు నోటీసులు కూడా ఇస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల డొల్లతనం బయటపడుతుంది. ఏ ఎండ కా గొడుగు పట్టినట్టు ఏ ప్రభుత్వం వస్తే వారి భజన చేస్తూ ఎప్పటికీ వారు తమ పబ్బం గడుపుతున్నట్లే కనబడుతుంది. అందుకే ముఖ్యమైన రెవెన్యూ, పరిశ్రమలు, పెట్టుబడి శాఖల్లో అదే అధికారులు మార్పు లేకుండా కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులు కూడా స్వంత ప్రయోజనాల కోసం ఈ అధికారుల సహకారమే కావాలి కాబట్టి వారిపై చర్యలు తీసుకోరు. మొత్తంగా నాయకులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వాన్ని, పాలనను, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు.


భూమి యజమాని తన భూమిపై హక్కు కోల్పోకుండా, వాస్తవ సాగుదారునే (ప్రస్తుతం ఎక్కువగా మహిళలే) రైతుగా గుర్తించి వారికే వ్యవసాయ సంబంధిత అన్ని సహాయ సహకారాలు అందించడం ఎలాగ అన్నదే ప్రస్తుతం ప్రభుత్వం ముందు, తెలంగాణ సమాజం ముందు ఉన్న బలమైన సమస్య. గత టీఆర్ఎస్‌ ప్రభుత్వం అసలు కౌలుదారు, సాగుదార్ల ఉనికినే గుర్తించ నిరాకరించింది. భూమి యజమాని ఇరుసుగానే తన మొత్తం రాజకీయ ఎజెండా నిర్మించుకుంది. అందుకోసమే భూమి విలువలు విపరీతంగా పెరిగేలా చర్యలు తీసుకుంది. వాస్తవ సాగుదార్లు కొత్తగా భూమి పొందే అన్ని మార్గాలు మూసేసింది.

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన వెంటనే, అప్పటి సైనిక పాలనాధికారి నేతృత్వంలో హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం 1950 రూపొందింది. అప్పటి తెలంగాణ సాయుధ పోరాటం, తద్వారా మారుమోగిన ‘దున్నేవాడిదే భూమి’ నినాదం, వేల మంది పేదల త్యాగాల ఫలితంగా రాజ్యానికి ఒక తప్పని పరిస్థితి ఫలితమే ఆ చట్టం. అప్పటి తెలంగాణ సమాజ అసలు సిసలు ఆకాంక్ష. అయితే చట్టం రూపొందిన, ఆ తరువాత ముఖ్యమైన మూడు సంవత్సరాలలో, అప్పటి దొరల, భూస్వాముల ఒత్తిడితో చట్టంలో పేర్కొన్న విధంగా నిజమైన సాగుదార్ల పేర్లు పూర్తి స్థాయిలో నమోదు కాలేదు. తద్వారా రక్షిత కౌలుదార్లకు ఉన్న హక్కులను కొన్ని వేలమంది పొందలేకపోయారు. సదరు చట్టం పూర్తిగా అమలులోకి వచ్చే సమయంలో పాలన ఆంధ్ర ప్రాంత నాయకత్వంలోకి వెళ్లటంతో, చట్టం అమలుకు నోచుకోకపోవడమే కాక, తెలంగాణ అత్మను, అస్తిత్వాన్ని చెరిపివేసే చర్య 1969 సవరణ చట్టం ద్వారా జరిగింది. తెలంగాణ ప్రాంతంలో భూ బదలాయింపులపై 1950 చట్టంలోని 5వ అధ్యాయంలో ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేశారు. దాని ఫలితం ఏమైందో ఇప్పుడు అందరికీ తెలిసిందే.


1950 చట్టం ద్వారా అప్పటి హైదరాబాదు రాష్ట్రం, నేటి తెలంగాణ ప్రాంతంలో సాధారణ కౌలు వ్యవస్థ నిషేధించబడింది. సాధారణ రైతులు తమ భూములు ఇతరులకు లీజుకు ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. నేటికీ ఆ చట్టమే అమలులో ఉంది. అయితే కేవలం కాగితాల్లోనే. 1950ల్లో భూములు పొందిన లక్షలాది మంది సాగుదార్లు తమ భూములు కోల్పోకూడదనేదే సదరు చట్టం ఉద్దేశం. అంటే, దున్నేవాని చేతిలోనే భూమి ఉండాలని. తెలంగాణ కౌలుదారీ చట్టం రక్షిత కౌలుదారులకు, సాధారణ భూ యజమానులకు రక్షణ కల్పిస్తుంది. గత మూడు దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమ ప్రభావం తగ్గి, పాత ఆధిపత్య వర్గాలు, కొత్తగా ఉనికిలోకి వచ్చిన ఉద్యోగ, వ్యాపార, వృత్తి వర్గాలు ఆంధ్రీకరించబడటం, అనగా భూమి ఆధారిత పెట్టుబడిదారీతనం పెరగడంతో, తెలంగాణ సన్న చిన్నకారు రైతులు, శ్రామిక కుటుంబాలు, భూ సంస్కరణల్లో భాగంగా భూమి పొందిన వారు తమ భూమి హక్కులను కోల్పోతూ ఉన్నారు. స్వయంగా వ్యవసాయం చేయలేని భూ యజమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. భూమి లేని సాగుదార్లు పెరిగి, దున్నేవానిదే భూమి అనే నినాదం నుంచి దున్నేవారికే సాగు మద్దతు అనే పరిస్థితికి వచ్చింది.

1950 చట్టంలోని 6వ అధ్యాయం, ఎవరైనా తమ భూమిని అస్సలు సాగుచేయని, సరిగ్గా సాగుచేయని పరిస్థితుల్లో లేదా మిగులు భూముల విషయంలో ఏమి చేయాలో స్పష్టంగా చెబుతోంది. భూమి యజమానుల ఆస్తి హక్కుకు భంగం కలగకుండా, వారు స్వయంగా సాగుచేయడానికి ముందుకు వచ్చే వరకు, ప్రభుత్వం ఆ భూములను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని సాగుచేయగల పేదలకు, సన్న చిన్నకారు రైతులకు ఆ భూములను సాగుచేసే అవకాశం కల్పించవచ్చు. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు మిగులు మొత్తంలో కొంత భూ యజమానులకు కూడా ఇవ్వవచ్చు. అలాగే 3వ అధ్యాయంలో ఏ సందర్భాలలో భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇవ్వవచ్చో, వాటి విధివిధానాలు కూడా ఉన్నాయి. చట్టంలోని ఈ అవకాశాలను నేటి అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తే, సాగుచేయని భూ యజమానులకు పంట రుణాలు, రైతుబంధు, భరోసా, బీమా, రుణమాఫీ వంటివి అందవు. కేవలం సాగుచేసే వారికే, సాగు చేసినంత కాలం సదరు మద్దతు అందుతుంది. భూ యజమానులు తన భూమి హక్కును కోల్పోరు. సదరు చట్టాన్ని అమలుచేయడానికి, కావలసిందల్లా ప్రభుత్వం వైపు నుంచి సంకల్పమే.

అయితే అటువంటి సంకల్పం గత ప్రభుత్వంలో లేదు, ప్రస్తుత ప్రభుత్వంలోనూ కనపడటం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆర్.ఒ.ఆర్, 2024 చట్టమే దానికి నిదర్శనం. సమగ్ర భూమి, సాగుదార్ల సర్వే చేపట్టకుండా, సమగ్రమైన రెవెన్యూ కోడ్‌ను రూపొందించకుండా అరకొరగా భూమి హక్కుల నమోదు చట్టం రూపొందించే పని చేపట్టింది. ధరణి చట్టంలో గత ప్రభుత్వం తొలగించిన 1971 చట్టంలోని చాలా అంశాలను తిరిగి పొందుపరిచినా, సాగుదారు నిర్వచనాన్ని, సాగుహక్కు నమోదుకు లేదా గుర్తింపునకు అవకాశాన్ని ప్రతిపాదిత చట్టంలో లేకుండా చేశారు. తద్వారా, సాగుదారుకు సంబంధించి కేసీఆర్‌ ఆలోచనా ధోరణినే ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా కొనసాగిస్తున్నట్లు కనబడుతున్నది.


ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకునే సందర్భం వచ్చింది. భూమి కమతాలు, భూమి సంబంధాలు, భూమి వినియోగం, మొత్తంగా సమాజం ప్రజాస్వామ్యయుతం కావాలని కోరుకునే సంఘాలు, పార్టీలు, వ్యక్తులు, ఈ విషయంలో నిరంతరం పని చేస్తూ శ్రామికులు, సాగుదార్లను, ముఖ్యంగా మహిళలను సంఘటితపరుస్తూ విస్తృత ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం శ్రామిక విలువలు కలిగిన నైతిక సమాజంగా రూపొందుతుందా, లేక పూర్తి పెట్టుబడిదారీ, శ్రమ దోపిడీ విలువలతో అనైతిక సమాజంగా రూపొందుతుందా అనేది ఈ నిరంతర ప్రయత్నం, ఫలితంపైనే ఆధారపడి ఉంది.

భూమి యజమాని తన భూమిపై హక్కు కోల్పోకుండా, వాస్తవ సాగుదారునే రైతుగా గుర్తించి

వారికే వ్యవసాయ సంబంధిత అన్ని సహాయ సహకారాలు అందించడం ఎలాగ అన్నదే

ప్రస్తుతం ప్రభుత్వం ముందు,

తెలంగాణ సమాజం ముందు ఉన్న బలమైన సమస్య.

రవికుమార్

న్యాయవాది

Updated Date - Sep 03 , 2024 | 05:10 AM