నైపుణ్యానికి నెలవుకానున్న తెలంగాణ
ABN , Publish Date - Aug 31 , 2024 | 05:51 AM
తెలంగాణ శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ’ బిల్లును ఆమోదించి, దానికి ప్రఖ్యాత వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించి మన రాష్ట్ర యువత భవిష్యత్తుకు సుస్థిరమైన రూట్ మ్యాపుని నిర్దేశించింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. వేల కోట్ల విలువైన ముచ్చర్లలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భూమి పూజ
తెలంగాణ శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ’ బిల్లును ఆమోదించి, దానికి ప్రఖ్యాత వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించి మన రాష్ట్ర యువత భవిష్యత్తుకు సుస్థిరమైన రూట్ మ్యాపుని నిర్దేశించింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. వేల కోట్ల విలువైన ముచ్చర్లలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించుకుని, ఇదే ఏడాది ఆరు కోర్సులు ప్రారంభించుకున్న ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ప్రతీ రంగం కొత్త సాంకేతికతో సరికొత్త పుంతలు తొక్కుతుంది.
స్కిల్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ప్రస్తావించినట్టుగా– ఇటు ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీలకు, అటు చదువులు నేర్పే విద్యాలయాలకు ఉన్న అంతరం తొలగిపోవాలి. డిగ్రీల కోసం వర్సిటీలు కాదు, అవి ఉద్యోగ కల్పనకు కేంద్రాలు కావాలి. ఈ దిశగానే మన అసెంబ్లీ ఆమోదించిన ‘యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ కృషి చేస్తుందనే ప్రగాఢ విశ్వాసాన్ని తెలంగాణ యువతలో కల్పిస్తున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.
మహాత్మాగాంధీ నడిపిన ‘యంగ్ ఇండియా’ పత్రికే స్ఫూర్తిగా స్కిల్ యూనివర్శిటీ పేరును పెట్టడం ఆ స్ఫూర్తిని మనలో రగిలిస్తుందనేది అక్షర సత్యం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల, బడుగు బలహీనవర్గాల పక్షపాతి అన్న సత్యాలను నాటి జవహర్‌లాల్ నెహ్రూ మొదలు నేటి తెలంగాణ ప్రభుత్వం వరకూ నిరూపిస్తూనే ఉంది. మనతో పాటే స్వాతంత్ర్యం పొందిన దేశాలు సామాజికం, ఆర్థికం అనే తేడా లేకుండా అన్నింట్లో వెనుకబడుతుంటే ఈ సువిశాల భారతదేశం మాత్రం తనదైన రీతిలో ముందుకు వెళ్లడం వెనుకాల ఉన్నది నాటి బలమైన పునాదులే! నాడు పంచవర్ష ప్రణాళికలు తీసుకువచ్చి వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారు. రాజీవ్‌గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రపంచంతో పోటీపడే అవకాశాల్ని మన యువతకు అందించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సైతం పునాదులు వేసింది ఆనాడు రాజీవ్‌గాంధీ హాయాంలోని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమనేది ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే నేడు రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం, అందులో ఉద్యోగాలు కల్పిస్తున్న ఇండస్ట్రీలను భాగస్వామ్యం చేయడం, నేటి కాలానికి ఏం కావాలో అందించడం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది.
ఈ ఒరవడి చూస్తుంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక సమాజంలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు ఏమిటో మరోసారి మనకు అవగతమౌతుంది, గతంలో కొద్దిమంది కోసం యూనివర్సిటీలు ధారాదత్తం చేసిన మాదిరిగా కాకుండా పీపీపీ మోడ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యూనివర్శిటీ ఏర్పాటు, అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల మాదిరిగా ఇందులోనూ రిజర్వేషన్ల అమలు, ఫీజులు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించడం, ముఖ్యంగా ఫీజు రియింబర్స్‌మెంట్‌తో పాటు, ఇండస్ట్రీ నుంచి పారితోషికం రూపంలో విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందజేయడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద కవర్ కాని వారికి ఫీజు తగ్గించే అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలించడం గొప్ప నిర్ణయం. యంగ్ ఇండియా యూనివర్సిటీలో 17 కోర్సులను నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
బిల్డింగులు కట్టడం కోసమనో, మౌలిక వసతులు సమకూర్చడానికనో ఏళ్లకు ఏళ్లు వృథా చేయకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా ఒప్పించి, 2000 మందికి ఈకామర్స్ లాజిస్టిక్, బిఎప్ఎస్ఐ, కన్ట్స్రక్షన్, ఫార్మా, రిటైల్, ఆనిమేషన్ వంటి ఆరు కోర్సులను తాత్కాలికంగా నిర్వహించాలని నిర్ణయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో మూడేళ్ల పైబడి డిగ్రీ, ఏడాది నుండి రెండేళ్ల కాలవ్యవధితో కూడిన డిప్లమాతో పాటు మూడు నుంచి ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులను సైతం విద్యార్థి, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ఫ్యాకల్టీలతో అందజేస్తామని చెప్పడం, ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ కోర్సులకు ట్రైనింగ్, ఫార్మా విద్యార్థులకు ప్రతిష్టాత్మక రెడ్డీ ల్యాబ్స్ ద్వారా శిక్షణ ఇవ్వనుండటం, ట్రైనింగ్ తర్వాత ఆయా సంస్థల్లోనే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామనడం, ఇంకా ఫ్లిప్‌కార్ట్, జీఎంఆర్, అపోలో, హెచ్ఎస్‌బీసీ వంటి ఎన్నో ప్రపంచస్థాయి కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకొని పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌తో స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే స్పష్టమైన రూట్ మ్యాప్‌తో తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధం కావడం శుభపరిణామం.
నాడు రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవంతో ప్రపంచంలో ప్రతీ పదిమంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో నలుగురు మనవారే కావడం ఇప్పటివరకూ సాధించిన ప్రగతి ఐతే, రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ద్వారా తెలంగాణ నుంచి వివిధ వృత్తి నిపుణులు ప్రపంచ నలుదిశల్లో అవకాశాల్ని అందిపుచ్చుకొని మన ఖ్యాతిని సుస్థిరం చేస్తారన్న నమ్మకం ఉంది.
l బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి
సీఈవో, టీసాట్ నెట్‌వర్క్
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక