Heavy Rains : జల విలయం
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:58 AM
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సృష్టిస్తున్న బీభత్సం ఊహకు అందనంతగా ఉంది. జనజీవనాన్ని ఆ కుండపోత అతలాకుతలం చేసింది. తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దయినాయి, కొన్ని ప్రాంతాలు తీవ్ర విధ్వంసాన్ని చవిచూశాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సృష్టిస్తున్న బీభత్సం ఊహకు అందనంతగా ఉంది. జనజీవనాన్ని ఆ కుండపోత అతలాకుతలం చేసింది. తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దయినాయి, కొన్ని ప్రాంతాలు తీవ్ర విధ్వంసాన్ని చవిచూశాయి. వర్షబీభత్సానికి పంటపొలాలు, నివాస స్థలాలు చెరువులైనాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉండగానే, రెండు రాష్ట్రాలూ మరో 24 గంటలపాటు కాస్తంత హెచ్చుతగ్గులతో వర్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. విపరీతమైన ఆస్తినష్టంతో పాటు, ఈ ప్రకృతి విలయంలో తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాణనష్టాన్ని కూడా చవిచూడాల్సిరావడం విషాదం.
దాదాపు పదిలక్షల క్యూసెక్కుల వరద తీవ్రతను చవిచూసిన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు తడిసిముద్దయినాయి. రాయలసీమలో వర్ష, వరద బీభత్సం కాస్తంత తక్కువగా ఉన్నా మిగతా ప్రాంతాలన్నీ వొణికిపోయాయి. బుడమేరు వరద విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఇటీవలి దశాబ్దాల్లో ఈ ప్రాంతం ఇంతటి భారీ వర్షాన్ని, వరద తీవ్రతను ఎదుర్కోలేదని అంటున్నారు. ఒక్కరోజులో ముప్పైఏడు సెంటీమీటర్ల వర్షం కురిసి తీవ్ర విధ్వంసానికి, ప్రాణనష్టానికి కారణమైంది. బుడమేరుకు వరద ఎక్కువగా రావడంతో పాటు, కొల్లేరుకు నీరుపోయే మార్గం నిర్వహణ గత ఐదేళ్ళుగా సక్రమంగా లేకపోవడంతో విజయవాడకు నీరువచ్చి ఇంతటి తీవ్రస్థితిని చవిచూడాల్సివచ్చిందని కొందరి వాదన. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగి, మోకాలిలోతు నీటిలో నానుతున్న నేపథ్యంలో, ఆహార సరఫరాలు, సహాయక చర్యలు నిరవధికంగా సాగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వరదప్రవాహంలో చిక్కుకున్నవారిని సహాయకబృందాలు రక్షించాయి.
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొద్దిగంటల్లోనే యాభైసెంటీమీటర్ల వరకూ రికార్డుస్థాయి వర్షాలు కురిసి వరదలు పోటెత్తాయి. కాల్వలు తెగిపోయాయి, చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలూ పొంగి గ్రామాలు, కాలనీలు జలమయమైనాయి. మున్నేరు వాగు వరదలతో ఖమ్మాన్ని ముంచింది. జిల్లాలో వందలాది గ్రామాలు నీటమునిగితే, నగరంలో కొన్ని భవనాల రెండో అంతస్తువరకూ నీరు చేరడం వరద ఉధృతికి నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల్లో చెరువులు, కాల్వలు, వాగులు పొంగిపొర్లుతూ జాతీయ రహదారులను జలదిగ్బంధంలోకి నెట్టివేశాయి. మొదట్లో ట్రాఫిక్ మళ్ళింపులతో గమ్యానికి చేరుతున్నామన్న భ్రమలు కలిగినా, కొద్దిగంటల్లోనే దారులన్నీ మూసుకుపోయాయి. వరదనీరు నిలువునా కోసేసిన రహదారులను తాత్కాలిక మరమ్మత్తులతో తిరిగి దారికి తేవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తెలుగురాష్ట్రాల మధ్యనే కాక, పొరుగు రాష్ట్రాలకు పోయే బస్సులు కూడా కదలని పరిస్థితి ఏర్పడింది. వందలాది రైళ్ళు రద్దుకావడం, ట్రాకుల కిందనుంచి భూమి కోసుకుపొయి అవి గాలిలో వేలాడుతుండటం జరిగిన బీభత్సానికి నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన అపారనష్టాన్ని కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడి తగిన సహకారానికి హామీ ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపడం అటుంచితే, జరిగిన ఆస్తినష్టాన్ని కొంతమేరకైనా పూడ్చేందుకు కేంద్రం తనవంతు ప్రయత్నం చేయాలి. వాణిజ్యపంటలతో సహా లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. పేదలు తమ పశువులను కోల్పోయారు. జరిగిన నష్టం ఏపాటిదో, మరమ్మతులు పూర్తిచేసుకొని వ్యవస్థలన్నీ గాడినపడేది ఎప్పటికో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేనిస్థితి. ఢిల్లీ పెద్దల పర్యటనలు, కేంద్రబృందాల రాకపోకలు, అధ్యయనాలు, ఓదార్పుల అనంతరమైనా కేంద్రసాయం దండిగా దక్కాలని తెలుగు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి.