Share News

జమ్మూలో ఉగ్రబీభత్సం

ABN , Publish Date - Jul 18 , 2024 | 01:12 AM

జమ్మూలోని దోడాజిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భీకరమైన ఎదురుకాల్పుల్లో అధికారి సహా నలుగురు జవాన్లు మరణించారు, స్థానికపోలీసులు సైతం పెద్దసంఖ్యలో...

జమ్మూలో ఉగ్రబీభత్సం

జమ్మూలోని దోడాజిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భీకరమైన ఎదురుకాల్పుల్లో అధికారి సహా నలుగురు జవాన్లు మరణించారు, స్థానికపోలీసులు సైతం పెద్దసంఖ్యలో గాయపడ్డారు. దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలిసి, గాలింపు జరుపుతున్నప్పుడు ఒక్కసారిగా భద్రతాబలగాలపై ఈ దాడి జరిగింది. గతవారం పదిమంది జవాన్లు ట్రక్కులో వెడుతూండగా ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడిచేసి, కొందరిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. జమ్మూలో అతివేగంగా ఉగ్రవాదం అనేకజిల్లాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. కొన్నేళ్ళుగా ఉగ్రవాద కార్యకలాపాలు లేని జిల్లాలు సైతం ఇప్పుడు భయంతో వొణికిపోతున్నాయి.


దోడా, రియాసీ, కఠువా, పూంచ్‌, రజౌరీ.. ఇలా జమ్మూలోని పలుజిల్లాల్లో నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక స్థాయిలో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఉగ్రవాదులకంటే భద్రతాసిబ్బందే నాలుగురెట్లు అధికంగా కన్నుమూశారు. ఉగ్రవాదం జమ్మూమూలల్లోకి విస్తరించడం, విదేశీ ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది నిలువరించలేకపోవడం ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. ఇంటలిజెన్స్‌ వైఫల్యం వల్లనో, తప్పుడు సమాచారం వల్లనో భద్రతాసిబ్బంది ఉగ్రవాదుల ఉచ్చులోపడి, ప్రాణాలు కోల్పోతున్నారు. గతనెల రియాసీ జిల్లాలో వైష్ణోదేవి బస్సు యాత్రికులను విదేశీ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నాక, ఇది ఆరంభం మాత్రమేనని, గతకాలపు వాతావరణాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని లష్కరే తోయిబా ఒక ప్రకటన చేసింది. అనంతరం ప్రధాని అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను ఉపేక్షించవద్దంటూ భద్రతాదళాలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తగ్గిపోయిందని బీజేపీ అధినాయకులు చెబుతూంటారు. టెర్రరిజం తగ్గి టూరిజం పెరిగిందని ప్రధానమంత్రి తన ఎన్నికల సభలో సంతోషం వ్యక్తంచేశారు. కశ్మీర్‌లో దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ చేసిన పాపాలను దాని ప్రత్యేకప్రతిపత్తి రద్దుద్వారా ప్రక్షాళించామని బీజేపీ నాయకులు అంటారు. కానీ, వారంటున్నట్టుగా ఉగ్రవాదం సమసిపోలేదని, పైగా ఎంతో ప్రశాంతంగా ఉండే జమ్మూకు అది ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో విస్తరిస్తున్నదని ఈ వరుస ఘటనలు తెలియచెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ)కు వివిధ అంశాల్లో అపరిమితమైన అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను సవరించింది. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా నిరవధికంగా కొనసాగించే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్థానిక పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎల్జీకి మరిన్ని అధికారాలు ఇవ్వడమంటే రాష్ట్రహోదాను మరింత జాప్యం చేయడమేనని వాటి విమర్శ. ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమన్న తిరోగామిచర్య వెనుక ఉన్న ప్రకటిత ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాన్ని నిర్మూలించడం. ఈ విషయంలో వైఫల్యం స్పష్టంగా ఉన్నందున, అసెంబ్లీ ఎన్నికలలోపుగానే రాష్ట్రహోదాను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో కేంద్రం కలసినడవాలని స్థానికపార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.


గతంలో పాకిస్థాన్‌లోకి చొరబడి మరీ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని గొప్పగా చెప్పుకున్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఘట్టాలను అధికారపక్షం తన రాజకీయప్రయోజనాలకు వాడుకోవడం ఎంత సహజమో, విపక్షం వాటిని ఇటువంటి కష్టకాలంలో గుర్తుచేసి దెప్పిపొడవడమూ అంతే సహజం. రాజకీయాన్ని పక్కనబెడితే, భారతప్రభుత్వం అటు అంతర్జాతీయ వేదికలమీదా, ఇటు క్షేత్రస్థాయిలోనూ పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదంమీద యుద్ధంచేయాల్సిన తరుణమిది. సంఘటితంగా పోరాడాల్సిన ఈ సందర్భంలో, కశ్మీర్‌లోని రాజకీయపార్టీలు తమ స్వార్థప్రయోజనాలకోసం ఉగ్రవాదాన్నీ, ఉగ్రవాదులను పెంచిపోషించాయన్న అర్థంలో అక్కడి డీజీపీ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి. ఢిల్లీపాలకుల మెప్పుకోసం ఆయన ఆ మాటలన్నారని స్థానిక పార్టీలు మండిపడ్డాయి. ఈ ఆపత్సమయంలో నాయకులు, ప్రజలు సహా ఎవరినీ నొప్పించకుండా, దూరం చేసుకోకుండా అతిజాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత అక్కడి ఉన్నతాధికారులమీద ఉంది. పాకిస్థాన్‌ కుట్రలను సాగనివ్వకపోవడమే మన సమష్టికర్తవ్యం కావాలి.

Updated Date - Jul 18 , 2024 | 01:12 AM