Share News

అమెరికా స్వప్నం ఇప్పుడు అంత సులువు కాదు!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:45 AM

‘అవకాశాల పురిటిగడ్డ’గా (land of opportu-nity) పేరుగాంచిన అమెరికాలో ఇప్పటికీ అదే వాతావరణం ఉన్నదా? ఈ ప్రశ్నకు అంత సులువుగా సమాధానం చెప్పలేని పరిస్థితి నేడు ఆ దేశంలో నెలకొని ఉన్నది. అమెరికాకు తరలి వచ్చే భారతీయ యువత ఆ దేశ వాస్తవిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నాకనే ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది.

అమెరికా స్వప్నం ఇప్పుడు అంత సులువు కాదు!

‘అవకాశాల పురిటిగడ్డ’గా (land of opportu-nity) పేరుగాంచిన అమెరికాలో ఇప్పటికీ అదే వాతావరణం ఉన్నదా? ఈ ప్రశ్నకు అంత సులువుగా సమాధానం చెప్పలేని పరిస్థితి నేడు ఆ దేశంలో నెలకొని ఉన్నది. అమెరికాకు తరలి వచ్చే భారతీయ యువత ఆ దేశ వాస్తవిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నాకనే ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది.

ఇండియాలో ఇంజినీరింగ్ చదివే ప్రతి కుర్రాడికీ అమెరికాలో మంచి అవకాశం వస్తే వెళ్లి ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది. చదువుకునే రోజుల నుంచీ ఆ దిశగా ప్రయత్నాలు ఎక్కుపెడతారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది మంచి స్వప్నమే. కానీ ఇప్పుడు అమెరికాలో ఐటీ కొలువు అనేది కష్టసాధ్యంగా మారింది. అమెరికాలో ఐటీ ఉద్యోగ వాతావరణాన్ని, పర్యవసానాల్ని దగ్గరి నుంచి గమనిస్తున్న వ్యక్తిగా ఔత్సాహిక ఇంజినీర్లకు చెప్పగలిగిన మాట ఒక్కటే– హెచ్–1బీ వీసా వచ్చినంత మాత్రాన అమెరికా బయల్దేరేందుకు తొందరపడవద్దు!

నేడు అమెరికాలో పనిచేస్తున్న వారే వేల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొత్త వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఐటీ మినహా తతిమ్మా రంగాలు బాగానే వృద్ధిలో ఉన్నాయి. భారతీయ యువతరానికి అత్యంత ఆకర్షణీయమైన ఐటీ రంగం మాత్రం కుదేలైపోయింది. కరోనా అనంతర వాతావరణంలో ఇంత తీవ్రంగా ఐటీ రంగం దెబ్బతిన్నది ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు.


దీని పర్యవసానాలు ఇబ్బందికరంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హెచ్–1బీతో ఇక్కడకు వచ్చి, భారీ ప్యాకేజీలున్న ఉద్యోగాలు సంపాదించి, ఆ ధైర్యంతో లోనుతో సొంత ఇల్లు కల తీర్చుకున్నవాళ్లు ఇప్పుడు వాయిదాలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ ఉద్యోగ వాతావరణం ఊహించినట్టుగా లేకపోవడం వలన కొత్త దంపతుల మధ్య కలహాలు ముదురుతున్నాయి. హెచ్–1బీ ఉన్నది కదాని అమెరికాకు వచ్చేసే మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఇక్కడ ఉద్యోగాలు దొరక్క, ఇంటి నుంచి ఆర్థికంగా జరుగుబాటు అందక అనేక ఇతర పనుల్లోకి దిగుతున్నారు.

హెచ్–1బీ వీసా ద్వారా వచ్చినవారు తమ ప్రాజెక్ట్ అయిపోయినట్లయితే 60 రోజులకు మించి అమెరికాలో ఉండడానికి అవకాశం ఉండదు. కానీ వివిధ కన్సెల్టెన్సీ కంపెనీల ద్వారా ఇక్కడ ఉద్యోగాలు దక్కించుకుంటున్న వారికి ఒక సౌకర్యం ఉంది. భారతదేశానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎక్కువ కన్సల్టెన్సీ కంపెనీలు తెలుగువారివే. ఇది మన హెచ్–1బీ వీసాదారులకు కలిసి వస్తున్న అంశం. ఎలాగంటే– ఒకవేళ వారికి ప్రాజెక్ట్ అయిపోయినప్పటికీ ఈ కంపెనీలు వారిని పేరోల్స్ నుంచి తొలగించకుండా ఇన్సూరెన్స్ కూడా కొనసాగిస్తున్నాయి. అందువల్ల వారు కొత్త ప్రాజెక్టు చూసుకోవడానికి వీలు కలుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే ఇటువంటి సందర్భాలలో అమెరికన్ యాజమాన్యంలో ఉన్న కన్సల్టెన్సీలకు సంబంధించినంత వరకు ప్రాజెక్టు అయిపోయిన తర్వాత వాళ్లు 60 రోజుల లోపు దేశాన్ని ఖచ్చితంగా విడిచి వెళ్లిపోవాలి.


ఈ గడ్డు పరిస్థితిలో భారతీయ యువత స్వయంకృతాపరాథం కూడా కొంత ఉంది. కోవిడ్ సమయంలో అమెరికన్ కంపెనీలు పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్ చేపట్టాయి. ఈ అవకాశాన్ని భారతీయ విద్యార్థులు అడ్డదారుల్లో కూడా వినియోగించుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందినవారు కొల్లలుగా ఉన్నారు. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం అన్నింటిలోనూ నకిలీ సర్టిఫికెట్లే. కానీ పనిలో చేరిన తర్వాత వారిలోని డొల్లతనం బయటపడింది. పనికి సరిపడిన జ్ఞానం, నైపుణ్యం వారి వద్ద లేకుండా పోయాయి. చివరకు భారతీయ విద్యార్థులు అంటేనే అనుమానంతో చూసే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి ఇబ్బందిగా పరిణమించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా రావాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఒకవేళ వారు పనిచేసే కంపెనీ స్పాన్సర్ చేసినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అలాగాక సాధారణ కన్సల్టెన్సీల ద్వారా హెచ్–1బీ వీసాతో అమెరికాకు రావడం మంచి నిర్ణయం కాకపోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారు కొందరు ఆ ఉద్యోగాలను వదిలేసి ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క, దొరికిన ఉద్యోగాల్లో స్థిరత్వం లేక మానసిక ఒత్తిడికి లోనవటంతో పాటు, అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారాలు పరిమితంగానే ఉన్నాయని చెప్పాలి. ముందుగా హెచ్–1బీ వీసాల మీద అమెరికా వస్తున్నవారికి వారి ఎంప్లాయర్ నుంచి పూర్తి మద్దతు ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో ఎంప్లాయర్లు ఇతర కంపెనీలలోనైనా ఉద్యోగాలు చూసిపెట్టగలగాలి. ఏఐ వంటి సాంకేతికత నేపథ్యంలో చాలా ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయి. సాంకేతికంగా వచ్చే ప్రతి మార్పునకు ఉద్యోగార్థులు అప్‍డేట్ అవుతూ ఉండాలి. తమను తాము ఉత్తమ ప్రమాణాలతో ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ఉంటే ఉద్యోగాలకు ప్రమాదం ఉండదు. అవకాశాలు పొందడం కూడా సులువు అవుతుంది. కంపెనీలు తమ మీద ఆధారపడే స్థాయిలో తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడంపై నిత్యం శ్రద్ధ పెట్టాలి. విధాన నిర్ణయాల్లో మార్పు వస్తే కూడా కొంత మేలు జరుగుతుంది. ఉదాహరణకు 60 రోజుల్లోగా తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలనే నిబంధనను కొంత సడలిస్తే భారతీయ విద్యార్థులకు ఊరట.


అమెరికాలో గతంలో అనేకసార్లు ఐటీ రంగానికి సంబంధించి మార్కెట్‌లో స్తబ్ధత వచ్చినప్పటికీ ఇంతటి స్థాయిలో ఎప్పుడూ లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కరోనా సమయంలో అన్ని కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్నాయి. అప్పటి పరిస్థితుల్లో కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక, ముందు జాగ్రత్త చర్యగా కంపెనీలు ఈ విధంగా చేశాయి. అప్పట్లో అవసరానికి మించి నియమించుకున్న ఉద్యోగులను ఇప్పుడు క్రమంగా తొలగిస్తున్నాయి. దానితోపాటు ఆర్థిక మాంద్యం నుంచి పూర్తిగా బయటపడకపోవడంతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.

2022లో అమెరికాకు భారత్ నుంచి 1,90,512 మంది విద్యార్థులు వెళ్లారు. 2023 జూన్ నాటికి అలా వెళ్లిన వారి సంఖ్య లక్ష దాటింది. అమెరికాలోని మొత్తం విద్యార్థుల్లో 25 శాతం మంది భారతీయులే అని ఒక అంచనా. ఈ స్థాయిలో అక్కడ భారతీయ యువతరం ప్రాతినిధ్యం పెరిగిపోతోంది. కానీ ఉద్యోగాల దామాషాలో చూస్తే వారి ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. ఇప్పటికే అమెరికాకు వచ్చి ఇక్కడ ఉంటున్న వారికే ఉద్యోగాలు దొరక్కపోతుండగా కొత్తగా కేవలం ఉద్యోగాల కోసం హెచ్–1బీ వీసాలతో వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు.

అమెరికా ఆశావహులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏమంత బాగాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగార్థులుగా అడుగుపెట్టడం సాహసమే! కానీ పరిస్థితి ఎల్లకాలం ఇలాగే ఉండదు. అమెరికా ఇలాంటి సంక్షోభాలను అనేకం చూసింది. ఐటీ ఉద్యోగ వాతావరణం కూడా మళ్లీ కుదుటపడుతుంది. అప్పటిదాకా నిరీక్షించడం తెలివైన పని.

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగార్థులుగా అడుగుపెట్టడం సాహసమే. పరిస్థితి ఎల్లకాలం ఇలాగే ఉండదు. అమెరికా ఇలాంటి సంక్షోభాలను అనేకం చూసింది. ఐటీ ఉద్యోగ వాతావరణం కూడా మళ్లీ కుదుటపడుతుంది. అప్పటిదాకా నిరీక్షించడం తెలివైన పని.

కృష్ణమోహన్ దాసరి డల్లాస్

Updated Date - Apr 27 , 2024 | 04:45 AM