Share News

సరిహద్దుపై సయోధ్య సాధ్యమేనా?

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:58 AM

చైనా మహా నాయకుడడు మావో గురించి అనేక ఐతిహ్యాలు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైనది: అమెరికా పాత్రికేయుడు, సుప్రసిద్ధ ‘రెడ్‌స్టార్‌ ఓవర్‌ చైనా’ గ్రంథకర్త ఎడ్గార్‌ స్నో కాబోలు ఒకసారి మావోను ‘మానవాళి చరిత్రపై ఫ్రెంచ్‌ విప్లవం ప్రభావం ఏమిటి?’ అని ప్రశ్నించగా ఆయన కొంచెంసేపు ఆలోచనామగ్నుడై ‘ఇప్పుడే చెప్పలేము’ అని అన్నారట.

సరిహద్దుపై సయోధ్య సాధ్యమేనా?

చైనా మహా నాయకుడడు మావో గురించి అనేక ఐతిహ్యాలు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైనది: అమెరికా పాత్రికేయుడు, సుప్రసిద్ధ ‘రెడ్‌స్టార్‌ ఓవర్‌ చైనా’ గ్రంథకర్త ఎడ్గార్‌ స్నో కాబోలు ఒకసారి మావోను ‘మానవాళి చరిత్రపై ఫ్రెంచ్‌ విప్లవం ప్రభావం ఏమిటి?’ అని ప్రశ్నించగా ఆయన కొంచెంసేపు ఆలోచనామగ్నుడై ‘ఇప్పుడే చెప్పలేము’ అని అన్నారట.

చైనా వేచి ఉంది. చాలా ఓర్పు గల దేశమది. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ తమది అని గొప్పలు చెప్పుకోదు. ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రభవించేందుకు ఒక నిర్దిష్ట తేదీని చైనా నిర్దేశించుకోలేదు. ప్రపంచ అగ్రగామిగా ఆవిర్భవిస్తున్న దేశంలో అటువంటి గుణ విశేషాలు అరుదు. మరో పార్శ్వం నుంచీ చైనాను చూద్దాం. అది ప్రజాస్వామిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామిక దేశాలలో అందరికీ లభించే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు చైనా ప్రజలకు లేవు. చైనాకు భిన్నంగా భారత్‌ చాలవరకు ఒక ప్రజాస్వామిక దేశం. నిత్యం ఒక క్రమబద్ధమైన అరాచకంతో కోలాహలంగా ఉంటుంది. జగడాలకు జనులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. భారత్‌లో చిన్న చిన్న సాఫల్యాలకే పెద్ద ఎత్తు విజయోత్సవాలు జరుపుకోవడం పరిపాటి. ఉదాహరణకు ఇటీవల పారిస్‌ ఒలింపిక్స్‌లో మన దేశానికి లభించిన పతకాలు ఎన్నో చూడండి: అమెరికా 40 స్వర్ణ, 44 రజత, 42 కాంస్య పతకాలను గెలుచుకున్నది. చైనాకు 39 స్వర్ణ, 27 రజత, 24 కాంస్య పతకాలు లభించాయి మరి మనకో? ఒలింపిక్‌ పతకాలను గెలుచుకోవడంలో 71వ స్థానంలో ఉన్న భారత్‌కు స్వర్ణ పతకాలు పూజ్యం, 1 రజత, 5 కాంస్య పతకాలు లభించాయి. అమెరికా, చైనాలో కంటే మన దేశంలోనే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి!

హిమాలయ పొలిమేరలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి గస్తీ ఏర్పాట్ల విషయమై కొద్ది రోజుల క్రితం కుదిరిన ఒప్పందాన్ని భారత్‌, చైనాలు ప్రకటించిన వైనాలను గమనిస్తే రెండు దేశాల మనోవైఖరులలో వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మే 2020లో సంభవించిన ఘర్షణల అనంతరం ఉభయ దేశాల మధ్య చోటుచేసుకున్న తొలి సానుకూల పరిణామం ఆ ఒప్పందమే. భారత్‌ తరపున మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు; విదేశాంగమంత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు; సైనిక దళాల ప్రధానాధికారి ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆ ఒప్పందం గురించి ప్రప్తావించారు. ‘మే 2020కు ముందు నాటి పరిస్థితులకు మళ్లామని’ విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. అయితే సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ మనోజ్‌ పాండే ఇలా చెప్పారు: ‘ఏప్రిల్‌ 2020 నాటి యథా పూర్వస్థితి తిరిగి నెలకొనాలని మనం కోరుకుంటున్నాం. ఆ పరిస్థితులు నెలకొన్న తరువాత ఉద్రిక్తతల సడలింపు, బలగాల ఉపసంహరణ, వాస్తవాధీన రేఖ వెంబడి మామూలు పరిస్థితుల నిర్వహణ మొదలైన అంశాలపై శ్రద్ధ చూపుతాం’. చైనా తరఫున ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఒప్పంద యథార్థాలను తెలుపుతూ ఒక ప్రకటన చేశారు. ‘సరిహద్దులకు సంబంధించిన వ్యవహారాలపై దౌత్య, సైనిక వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. సరిహద్దు సంబంధిత వివాదంపై రెండు దేశాలు ఇప్పుడు ఒక పరిష్కారానికి వచ్చాయి. దాని పట్ల చైనా సానుకూల వైఖరితో ఉన్నది. తదుపరి దశలో చైనా ఆ పరిష్కారాన్ని అమలుపరిచేందుకు భారత్‌తో కలిసి చైనా పని చేస్తుంది’. అయితే ఎలా పని చేస్తుందనే విషయమై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించాడు.


సరే, గత ఆదివారం (20, అక్టోబర్‌) దాకా ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. మార్చి–ఏప్రిల్‌ 2020లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళాల వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగాల్లోకి చొరబడ్డాయి. ఈ దురాక్రమణ మే 5, 2020న భారత్‌ దృష్టికి వచ్చింది చొరబాటుదారులను వెనక్కి తిప్పికొట్టే క్రమంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా పక్షాన కచ్చితంగా తెలియని సంఖ్యలో సైనికులు చనిపోయినట్టు తెలుస్తుంది. జూన్‌ 19, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. తన ముగింపు సమావేశంలో ఆయన ఈ అప్రతిష్ఠాకర వ్యాఖ్యలు చేశారు: ‘బయటి వ్యక్తులు ఎవరూ భారత భూభాగంలోకి చొరబడలేదు. బయటివారు ఎవరూ భారత్‌ లోపల లేరు’. అయితే మన సైనిక దళాలు మే 2020కు పూర్వం నిత్యం గస్తీ తిరిగిన దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై భారత్‌కు ఇంకెంత మాత్రం ఎలాంటి నియంత్రణ లేదని పలువురు సైనికాధికారులు, రక్షణ వ్యవహారాల నిపుణులు ఘంటాపథంగా చెప్పుతున్నారు.

కఠోరమైన విషయమేమిటంటే గల్వాన్‌ లోయ అంతా తమదేనని చైనా వాదిస్తోంది. వాస్తవాధీనరేఖ విషయమై భారత్‌లో స్పష్టత లోపించిందని విమర్శిస్తోంది. హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతానికి సంబంధించి ఒక్క అంగుళం కూడా భారత్‌కు చెందదని చైనా నిక్కచ్చిగా అంటోంది. డెమ్‌చోక్‌, డెప్సాంగ్‌ ప్రాంతాలపై చర్చలు జరపాలని భారత్‌ డిమాండ్‌ చేస్తుండగా చైనా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. భారత్‌తో 3,448 కిలోమీటర్ల పొడవునా ఉన్న సరిహద్దులోని అక్సాయిచిన్‌ ప్రాంతంలో సైనిక స్థావరాలను చైనా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది. వాస్తవాధీన రేఖ దాకా 5జి నెట్‌వర్క్స్‌ను ఏర్పాటు చేస్తోంది. పాంగోంగ్‌ సో నదిపై ఒక వంతెనను నిర్మించింది. పెద్ద ఎత్తున సైనిక సామగ్రి, సైనిక దళాలను పెద్ద ఎత్తున వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించింది.

మన అధికారిక వైఖరి ఏమిటో చూద్దాం. ఇంతకు ముందున్న పరిస్థితి అంటే మే 2020కు పూర్వ స్థితిని పునరుద్ధరించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది సైనిక దళాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు మొదలైన పదాలు ప్రభుత్వ ప్రకటనలలో ఉంటున్నాయి. ఏమైనా మన ప్రభుత్వం గొప్ప ఓర్పు, గట్టి పట్టుదల చూపిందని చెప్పవచ్చు. అయినా గస్తీ సంబంధిత ఒప్పందం నిజంగా ఉంటే అందులో ‘ఇంతకు ముందున్న పరిస్థితి’ అనే మాటకు బదులు ‘కీలకమైన పురోగతి’ అనే మాటను వాడాలని చైనా పట్టుబట్టి ఉండేది కాదూ? చైనా ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందనేది ఒక సందిగ్ధ విషయం. అయినప్పటికీ మన ప్రభుత్వం దృఢ వైఖరితో నిలబడడం వల్ల అంతిమంగా మనకు మేలు జరిగేందుకు ఎంతైనా ఆస్కారమున్నది.


మొత్తం మీద హిమాలయ సరిహద్దుల్లో గస్తీ ఏర్పాట్ల విషయమై భారత్‌, చైనాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అంతకుమించి ఏమీ లేదు అని అనుకోవచ్చు. చైనా వైపు, మన వైపు గస్తీ దళాల మధ్య సమన్వయముంటుంది. నెలకు రెండుసార్లు సమావేశమవుతాయి. గస్తీ బృందాలు ఒక్కో దానిలో ఉండే సైనికుల సంఖ్య 15కు మించదు. ఈ గస్తీ ఏర్పాట్లు డెమ్‌చోక్‌, డెప్సాంగ్‌ ప్రాంతాలకు సైతం వర్తిస్తాయా అన్నది స్పష్టంగా తెలియదు. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌ విషయంలో 2017లో ఉభయ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఆ తరువాత చైనా సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. అక్కడ తమ సైనిక స్థావరాలను పటిష్ఠం చేసుకున్నాయి. డెప్సాంగ్‌ మైదాన ప్రాంతాలలో వై జంక్షన్‌కు ఆవల ప్రదేశాలలోకి భారత సైనికులు ప్రవేశించేందుకు చైనా అనేక అవరోధాలు కల్పిస్తోంది. ఏ నాటి నుంచో ఉన్న 10, 11, 11ఎ, 12, 13 గస్తీ కేంద్రాల పరిధిలోని ప్రదేశాలలోకి కూడా అనుమతించడం లేదు. గల్వాన్‌ లాంటివి ఇరు దేశాల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. అలాగే పాంగోంగ్‌ సో నది ఉత్తర, దక్షిణ తీర ప్రాంతాలు, హాట్‌స్ప్రింగ్స్‌ మొదలైన వాటిపై కూడా చైనా నియంత్రణ కొనసాగుతోంది. ఉభయ దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉన్న ఈ వివాదాస్పద అంశాలకు నిజంగా పరిష్కారం లభించిందా? భవిష్యత్తులో లభించగలదా? లభించిందని లేదా లభించగలదని విశ్వసించడం చాలా కష్టం. చెప్పవచ్చినదేమిటంటే భారత్‌, చైనాల మధ్య సంబంధాలలో పరస్పర అపనమ్మకం ఇప్పటికీ ఒక అంతర్వాహినిగా ఉన్నది.

గత నాలుగు సంవత్సరాలుగా పార్లమెంటులో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా భారత్‌–చైనా ఘర్షణలపై చర్చించేందుకు అనుమతించకపోవడం మన ప్రజాస్వామ్యానికి ఒక కళంకం. సరిహద్దుల్లో గస్తీపై ఒప్పందం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని రక్షణ వ్యవహారాల నిపుణులు ముక్తకంఠంతో చెప్పుతున్నారు; కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన, ఉపయుక్తమైన ప్రశ్నలు లేవనెత్తింది; ఇతర విపక్షాలు మౌనంగా ఉండిపోయాయి. భారత్‌, చైనాలు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా సమగ్రంగా పరిష్కరించుకునేందుకు అక్టోబర్‌ ఏకాభిప్రాయం (అక్టోబర్‌ కన్సెన్సస్‌) పురిగొల్పుతుందా? ఇప్పుడే ఇదమిత్థంగా చెప్పలేము.

గత నాలుగు సంవత్సరాలుగా పార్లమెంటులో ఒక్కసారి కూడా భారత్‌–చైనా ఘర్షణలపై చర్చించేందుకు అనుమతించకపోవడం మన ప్రజాస్వామ్యానికి ఒక కళంకం. సరిహద్దుల్లో గస్తీపై ఒప్పందం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని రక్షణ వ్యవహారాల నిపుణులు ముక్తకంఠంతో చెప్పుతున్నారు. భారత్‌ చైనాలు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా సమగ్రంగా పరిష్కరించుకునేందుకు ఆ ఒప్పందం దారితీస్తుందా? ఇప్పుడే ఇదమిత్థంగా చెప్పలేము.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Oct 26 , 2024 | 04:58 AM