Share News

హింసావలయం..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:03 AM

మావోయిస్టులు లేని భారతదేశం ఎంతో దూరంలో లేదంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భం...

హింసావలయం..!

మావోయిస్టులు లేని భారతదేశం ఎంతో దూరంలో లేదంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భం కనుక, వారిని కర్తవ్యోన్ముఖులను చేసేందుకు ఆయన ఈ మాటలు అనివుంటారు. నానావిధ బలగాలను మోహరించి వామపక్ష తీవ్రవాదంమీద ప్రభుత్వం సాగిస్తున్న పోరు ఆఖరు అంకానికి చేరిందని, కాస్తంత గట్టిగా, ఒక్కసారిగా ఓ తోపుతోస్తే శత్రుశిబిరం పూర్తిగా కుప్పకూలిపోతుందని అమిత్‌ షా ఆ సందర్భంలో అత్యంత విశ్వాసం ప్రదర్శించారు. హోంమంత్రి చిత్రీకరిస్తున్నంతగా మావోయిస్టులు చితికిపోయారో లేదో తెలియదు కానీ, ఇటీవలికాలంలో సాయుధబలగాలు ఏకబిగిన సాగిస్తున్న యుద్ధంలో వీరు భారీగా నష్టపోతున్న విషయం కనిపిస్తూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌జిల్లా కొర్చోలీ అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13మంది మావోయిస్టులు మరణించిన ఘటన ఇటీవలికాలంలో అతిపెద్దది. కుప్పకూలినవారిలో చెప్పుకోదగ్గ స్థాయి నాయకులు ఉన్నారని కూడా అంటున్నారు. వారం క్రితం ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. మూడునెలల్లోనే యాభైమంది ప్రాణాలు కోల్పోయారన్న లెక్కలు నిజమైతే కేంద్రహోంమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేగంగా పడుతున్నాయని అనుకోవచ్చు.

ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మావోయిస్టు పార్టీ చేస్తున్న వాదనను పోలీసు అధికారులు ఖండిస్తున్నారు. సంఘటనాస్థలంలో అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, ఇంకా ఏవేవో దొరకడం వంటి ఆనవాయితీలు కూడా పూర్తయ్యాయి. నరేంద్రమోదీ పదేళ్ళపాలనలో మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారని, దేశాభివృద్ధికి, నిర్మాణానికి కట్టుబడిన తమ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చినప్పుడే మిగిలిన ఆ కాస్త పని పూర్తవుతుందని ఇటీవల అమిత్‌ షా చత్తీస్‌గఢ్‌లో అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతూనే ఉంది. కానీ, ఇటీవలికాలంలో వేర్వేరు పేర్లతో ప్రత్యేక సాయుధ దళాల ఏర్పాటు, హెలిప్యాడ్ల నిర్మాణం, డ్రోన్ల వినియోగం, మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలమీద వైమానిక, డ్రోన్‌ దాడులు ఇత్యాదివి గమనించినప్పుడు శత్రు నిర్మూలన మరింత నిర్దిష్టంగా, వేగంగా జరుగుతున్న విషయం అర్థమవుతుంది. సరిగ్గా మూడేళ్ళక్రితం ఇదే జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడిచేసి పెద్దసంఖ్యలో వారిని చంపివేసిన విషయం తెలిసిందే. ప్రతీ ఎన్‌కౌంటర్‌తోనూ ఒక ప్రతీకారదాడిముడిపడి ఉండటం, ఈ పరస్పర హింసలో ఇరుపక్షాలకు చెందినవారు పెద్దసంఖ్యలో మరణించడం జరుగుతున్నదే. నక్సలైట్లు తుడిచిపెట్టుకుపోయారని, ఆ ఉద్యమం ముగిసిపోయిందని ఎప్పటికప్పుడు అంటున్నప్పటికీ, ఈ యాభైయేళ్ళకాలంలో అది కొన్ని కొత్తప్రాంతాలకు విస్తరించింది, స్థావరాలు మార్చుకుంటోంది.

మావోయిస్టుల ఉనికికి, ఆదివాసుల్లో వారికి గల ఆదరణకు కారణమైన అంశాలను గుర్తించకుండా, పరిపాలనావైఫల్యాలను సరిదిద్దుకోకుండా భద్రతాబలగాల సాయంతో ఆ ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం ఆశించిన ఫలితాన్నివ్వదు. ఆదివాసుల హక్కులు హరించుకుపోతూ, వారి వనరులు అపరకుబేరుల, కార్పొరేట్‌ సంస్థల వశమైపోతున్నప్పుడు మావోయిస్టు ఉద్యమానికి స్థానిక ప్రజల సహకారం అందుతూనే ఉంటుంది. వేలాది ఎకరాల అటవీభూమిని అస్మదీయ పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తూపోతున్నప్పుడు, ఈ సైనికదాడులూ ఎన్‌కౌంటర్లన్నీ ఆ వనరుల నిరంతర దోపిడీకేనని ఆదివాసులు నమ్మకుండా ఉండరు. ఈ హింసావలయాన్ని ఛేదించడానికి ఇప్పటికైనా చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు సిద్ధపడటం మంచిది. అడపాదడపా రెండు పక్షాలనుంచి చర్చలకు సానుకూలమైన ప్రకటనలు వస్తున్నప్పటికీ, ఎందుకోగానీ నిర్దిష్టంగా అడుగుముందుకు పడటంలేదు. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇటీవల కూడా చర్చలకు సిద్ధమేనని ప్రకటించి, ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. లక్షలాదిమంది ఆదివాసీల జీవితాలతో ముడిపడిన అంశం కనుక, పౌరసమాజం పెద్దలు కాస్తంత చొరవతీసుకుంటే సమస్యకు శాంతియుత పరిష్కారమార్గాలు అన్వేషించవచ్చు.

Updated Date - Apr 04 , 2024 | 01:03 AM