Share News

నేరస్థుడు నెతన్యాహూ!

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:45 AM

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ మీద ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు–ఐసీసీ అరెస్టువారెంట్‌ జారీ చేసింది. ఆయనతోపాటు మాజీ రక్షణమంత్రి యోవ్‌ గల్లాంట్‌ మీద కూడా గాజాలో...

నేరస్థుడు నెతన్యాహూ!

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ మీద ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు–ఐసీసీ అరెస్టువారెంట్‌ జారీ చేసింది. ఆయనతోపాటు మాజీ రక్షణమంత్రి యోవ్‌ గల్లాంట్‌ మీద కూడా గాజాలో యుద్ధనేరాలకు, మానవహననానికీ పాల్పడినందుకు, మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఐసీసీ అరెస్టువారెంట్లు జారీ చేసింది. ఐసీసీ అరెస్టువారెంట్ల ప్రభావమెట్టిది, వీరిద్దరూ అరెస్టవుతారా, చేయగలవారెవ్వరు ఇత్యాది ప్రశ్నలను అటుంచితే, ఈ తీర్పు నెతన్యాహూకు నైతికంగా ఎదురుదెబ్బ. ఆయనకు నష్టం ఉన్నా లేకున్నా ఈ తీర్పు తరువాత ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌ తరఫున ఏకపక్షంగా, నిస్సిగ్గుగా నిలవకుండా కాస్తంతైనా వెనుకంజవేస్తాయని ఆశ.

గాజాలో హత్యలు, హింస ఇత్యాది అమానుష చర్యలతో పాటు, ఆకలిచావులకు వీరిద్దరు కారకులని ఐసీసీ ఆరోపించింది. అన్నం, నీళ్ళు, మందులు అందనివ్వకుండా చేసి, మానవ మనుగడనే ప్రశ్నార్థం చేసి, సంక్షోభం తీవ్రస్థాయికి చేర్చారని వ్యాఖ్యానించింది. పౌరులను, ప్రధానంగా చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నారని నిర్థారించడానికి నిర్దిష్టమైన ఆధారాలున్నందున అరెస్టు వారెంట్లు జారీ చేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఇవన్నీ తప్పుడు మాటలనీ, తిరస్కరిస్తున్నామని, ఆత్మరక్షణ కూడా పాపమైపోతే ఎలా అనీ ఇజ్రాయెల్‌ చాలా విమర్శలు చేసింది. దేశరక్షణలో ఏమాత్రం రాజీపడననీ, ఏ శక్తీతనను అడ్డుకోలేదనీ, ఇటువంటి కుట్రలు ఎన్నిచేసినా యుద్ధం ఆపేదిలేదని నెతన్యాహూ గొప్పలకు పోయారు. మానవాళి రక్షణకు కృషిచేయాల్సిన న్యాయస్థానం శత్రువుగా మారిందన్నారు.


నెతన్యాహూ, గల్లాంట్‌లతో పాటు ముగ్గురు కీలకమైన హమాస్‌నేతలపై కూడా అరెస్టువారెంట్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఐసీసీ తీర్పు నెతన్యాహూ కంటే జోబైడెన్‌కు ఎక్కువ ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. ఒక నిరపరాధితో పోలీసులు బలవంతంగా నేరాన్ని ఒప్పించి నేరగాడుగా చిత్రీకరించినంత బాధ అమెరికాకు కలిగింది. నిజానికి, రోమ్‌ ఒప్పందంమీద సంతకాలు చేసిన 124 దేశాల్లో ఎక్కడ అడుగుపెట్టినా ఈ తీర్పుకు లోబడి సదరు దేశం నెతన్యాహూను అరెస్టుచేయాల్సి ఉంది. అమెరికా ఈ ఒప్పందంలో లేదన్నది వేరే విషయం. మరి, బ్రిటన్‌ అందుకు సిద్ధమేనా? అన్న ప్రశ్నకు ఆ దేశ హోంమంత్రి సమాధానం ఇవ్వనన్నారు. బ్రిటన్‌లో ప్రభుత్వం మారిన తరువాత, కొన్ని రకాల ఆయుధాల సరఫరాలు, వినియోగంమీద ఏవో పరిమితులు విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా మాదిరిగా అప్పుడప్పుడు ఆగ్రహిస్తున్నట్టు, అలుగుతున్నట్టు కనబడటం వినా, ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అమ్ముకుంటున్న పశ్చిమ దేశాలేవీ ఎన్ని ఉద్యమాలు జరిగినా, ప్రపంచవ్యాప్తంగా ఎంతటి వ్యతిరేకత చవిచూస్తున్నా ఆయుధ సరఫరాలను ఆపిందే లేదు. ఈ ఏడాది మే నెలలో ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీంఖాన్‌ ఇజ్రాయెల్‌మీద ఈ ఆరోపణలను సూచించడం, అదేనెలలో ఐసీజే తీవ్రంగా ఇజ్రాయెల్‌ రఫా ప్రవేశాన్ని వ్యతిరేకించడం, గాజాలోని వివిధ ఆస్పత్రులను ఇజ్రాయెల్‌ బలగాలు కుప్పకూల్చి, సజీవంగా ఉన్న రోగులను నిలువునా పాతిపెట్టినటువంటి అనేక నేరాలూ ఘోరాలు సైతం ఈ దేశాల మనసు మార్చలేకపోయాయి.


హమాస్‌ మీద యుద్ధం చేస్తున్నానని నెతన్యాహూ చెప్పుకోవచ్చును కానీ, గాజాలో ఆయన చేస్తున్నది సామాన్యులను ఊచకోతకోయడమని ఈ తీర్పు మరోమారు స్పష్టంచేస్తోంది. అన్నం నీళ్ళు మందులు లేకుండా చేయడం వంటి వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌ నాయకుల నోటినుంచి ఈ ప్రపంచం విన్నది. ఆ రీతిన పాలస్తీనియన్లను చంపేయాలన్న కసి వారి మాటల్లోనూ, చేతల్లోనూ విస్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక విద్యాలయాలు, వైద్యాలయాలు సహా ప్రతీ చోటా హమాస్‌ ఉగ్రవాదులు ఉన్నారన్న వాదనతో వాటిని నేలమట్టం చేయడం, మారణాయుధాలు ప్రయోగించి వందలాదిమంది అమాయకులను హత్యచేయడం నిర్లజ్జగా సాగుతూనే వచ్చింది. నెతన్యాహూ పాల్పడుతున్న ఈ యుద్ధనేరాల్లో ఆయనకు ఆయుధాలు అమ్మిన దేశాలు కూడా భాగస్వాములే. ఆ పాపంలో వాటి వాటాయే అధికం. మారణాయుధాల సరఫరా సాగుతున్నంతకాలం ఏ యుద్ధమూ ఆగదు. నెతన్యాహూను ఎవరు అరెస్టు చేస్తారు, చేయగలరు అన్న ప్రశ్నలకంటే, ఐసీసీ ఆదేశాల్లో ఉన్న సారాంశానికి అనుగుణంగా ఆయాదేశాలు ఆయుధాల సరఫరాన్ని నిలుపుదల చేయడం ముఖ్యం. మానవాళిమీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరస్థులకు ఆయుధాలు అందించి, ఆ పాపంలో పాలుపంచుకోవడం ఆగిపోవాలి.

Updated Date - Nov 23 , 2024 | 12:45 AM