Share News

పంజాబీ పార్టీ ఎలా పతనమయింది?

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:21 AM

పంజాబ్‌లో సంభవిస్తున్న పరిణామాలు తీవ్ర కలవరపాటు కలిగిస్తున్నాయి. అకాలీదళ్‌ నాయకుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై హత్యాయత్నం గురించి మాత్రమే నేను ప్రస్తావించడం లేదు. నా వ్యాకులతకు ప్రధాన కారణం శిరోమణి అకాలీదళ్‌లో నెలకొన్న

పంజాబీ పార్టీ ఎలా పతనమయింది?

పంజాబ్‌లో సంభవిస్తున్న పరిణామాలు తీవ్ర కలవరపాటు కలిగిస్తున్నాయి. అకాలీదళ్‌ నాయకుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై హత్యాయత్నం గురించి మాత్రమే నేను ప్రస్తావించడం లేదు. నా వ్యాకులతకు ప్రధాన కారణం శిరోమణి అకాలీదళ్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అఖల్‌ తఖ్త్‌ జోక్యం చేసుకున్న తీరు. ఒక రాజకీయ పార్టీ వ్యవహారాలలో ఆ సిక్కు మత పీఠం ప్రమేయం పెట్టుకున్న వైనం లోతైన, విస్తృత రాజకీయ, న్యాయ సంబంధ, రాజ్యాంగపరమైన సమస్యలను లేవనెత్తుతోంది. వాటి గురించి మౌనం వహించడం తగదు. మన లౌకిక గణతంత్ర రాజ్యాన్ని (సెక్యులర్‌ రిపబ్లిక్‌) కూల్చివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఒక రాజకీయ పార్టీ (అది కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనదే అయినా) అంతర్గత విషయాలలో ఒక మత సంస్థ నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితులలోను ఉపేక్షించకూడదు.

అఖల్‌ తఖ్త్‌– అకాలీదళ్‌ సంబంధాల తాజా వాస్తవాలు సూటిగా ఉన్నాయి. వరుసగా సార్వత్రక, శాసనసభ ఎన్నికలలో పరాజయాలను చవిచూసిన శిరోమణి అకాలీదళ్‌ ప్రస్తుతం మనుగడ సంక్షోభంలో ఉన్నది. తండ్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ రాజకీయ వారసత్వాన్ని పొందిన నాటి నుంచి దుష్పరిపాలన, అవినీతి, రాజకీయ అవివేకం ఆరోపణలతో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పార్టీలో తీవ్ర సవాళ్ల నెదుర్కొంటున్నారు. సుఖ్‌బీర్‌ నాయకత్వ శైలిని మొదటి నుంచీ వ్యతిరేకించినవారు ఇటీవల మరింత మద్దతుతో, పూర్తిస్థాయిలో తిరుగుబాటు చేశారు. అకాలీదళ్‌ చీలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అకాలీదళ్‌కు ఏర్పడ్డ ఈ విపత్కర పరిస్థితిలో సిక్కుమత సర్వోన్నత ధార్మిక సంస్థ అఖల్‌ తఖ్త్‌ రంగప్రవేశం చేసింది.

మన రాజకీయ రంగంలో శిరోమణి అకాలీదళ్ లేకపోతే జరిగేదేమిటి? కేవలం పంజాబ్‌ మాత్రమే కాదు, యావద్భారతదేశమూ తీవ్రంగా నష్టపోతుంది. ఒక రాజకీయ శూన్యత నెలకొంటుంది. ఆ శూన్యత, తీవ్రవాద శక్తుల విజృంభణకు దారితీస్తుంది. పంజాబ్‌ లోపల, వెలుపల ఉన్న సిక్కు మతస్థులలో అనేక మంది ఇప్పటికీ 1984 నాటి తీవ్ర మనస్తాపం నుంచి తేరుకోనే లేదు. ఆ నాటి సిక్కుమత వ్యతిరేక మారణకాండ వారిని ఇప్పటికీ కోపోద్రిక్తులను చేస్తోంది. ఆ హత్యాకాండకు పాల్పడినవారు ఇప్పటికీ ఎటువంటి శిక్షలకు గురికాకుండా స్వేచ్ఛగా ఉండడం ఎంతో మంది సిక్కులను బాధిస్తోంది. అయితే పంజాబ్‌, జాతీయ రాజకీయాలలో అకాలీదళ్‌ నిర్వహిస్తున్న పాత్ర సిక్కు మతస్థులకు ఎంతో ఓదార్పునిస్తోంది. ‘1984’ మానసిక గాయాలకు ఒక విధంగా ఉపశమనం కలిగిస్తోంది. సరే, సుఖ్‌బీర్‌ బాదల్‌ తన తండ్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ రాజకీయ విజ్ఞత, పాలనా సామర్థ్యం, ప్రజాదరణకు వారసుడు కాలేక పోయారు. తత్కారణంగానే అకాలీదళ్‌ను సమస్యలు చుట్టు ముట్టాయి. ఫలితంగా ఆ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. అకాలీదళ్‌ నిర్నిరోధ పతనాన్ని అరికట్టేందుకు ఆ పార్టీ వ్యవహారాలలో ఎవరో ఒకరు జోక్యం చేసుకోవల్సి ఉన్నది.

నిజమే, పార్టీ శ్రేయోభిలాషులు జోక్యం చేసుకోవాలి. అయితే అకాలీదళ్‌ను చక్కదిద్దగల పెద్దరికం ఉన్నది ఎవరు? ఏ పెద్ద మనిషి ప్రమేయంతో సమస్యలు తీరిపోతాయి? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. అకాలీదళ్‌ వ్యవహారాలలో అఖల్‌ తఖ్త్‌ జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం నెరపడం సముచితమేనా? అంతకంటే ముఖ్యంగా అఖల్‌ తఖ్త్‌ సర్వోన్నత ఆదేశాలకు అకాలీదళ్‌ లోబడడం సరైన విషయమేనా? ఎందుకంటే ఇది ఒక పార్టీ లేదా ఒక మత సమూహం అంతర్గత వ్యవహారం కాదు; అలాగే ఒక పార్టీ, కొంతమంది మతనాయకుల మధ్య వ్యవహారం అంతకంటే కాదు. ప్రప్రథమంగా ప్రస్తావించాల్సిన అంశం: శిరోమణి అకాలీదళ్ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి ఒక మత సమూహం పార్టీగా తిరోగమించింది. సిక్కు మత సంస్కరణ ఉద్యమంలో మూలాలు ఉన్న ఒక పంథిక్‌ సంస్థగా శిరోమణి అకాలీదళ్‌ ఆవిర్భవించింది. అయితే పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదం సమసిపోయిన తరువాత విజయవంతంగా అధికారానికి తిరిగివచ్చిన అకాలీదళ్ రాజనీతిజ్ఞతలో ఒక పెద్ద మార్పు సంభవించింది. 1996లో ఆ పార్టీ మోగా సమావేశంలో ఒ‘పంథిక్‌’ పార్టీ నుంచి ఒక పంజాబీ పార్టీగా, ఒక మత సంబంధ– ప్రాంతీయ పార్టీ నుంచి స్వచ్ఛమైన ఒక ప్రాంతీయ పార్టీగా పరివర్తన చెందింది. సిక్కుల ప్రయోజనాలకే ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అకాలీదళ్‌ అనేక సంవత్సరాలుగా ఎంతో మంది హిందువులను పార్టీ సభ్యులుగా చేర్చుకుని పలువురికి నాయకత్వ స్థానాలను కూడా కల్పించింది. అయితే ఇటీవలి పరిణామాలు అకాలీదళ్‌ ఒక పంథిక్‌ పార్టీ అని, పంజాబ్‌లో అధిక సంఖ్యాకులు అయిన సిక్కు మతస్థుల పార్టీ అని, సిక్కు మత వ్యవస్థకు అది జవాబుదారీగా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ మార్పును మనం అంగీకరిస్తే, సువిశాల భారతదేశాన్ని అధిక సంఖ్యాకులు అయిన హిందూ మతస్థుల ఆకాంక్షలు, అభిమతాలకు అనుగుణంగా పాలించేందుకు ఆరాటపడుతున్న శక్తులను ఎలా ఆక్షేపించగలం?

రెండో అంశం రాజ్యాంగబద్ధమైన ఔచిత్యం. రాజ్యంగ బద్ధంగా నమోదై, గుర్తింపు పొందిన రాజకీయ పక్షం శిరోమణి అకాలీదళ్. రాజ్యాంగం ప్రవచించిన లౌకిక వాదానికి నిబద్ధమై ఉండేందుకు వాగ్దానం చేసిన రాజకీయ పార్టీ ఒక మత అత్యున్నత అధికార పీఠం ఆదేశాలను ఎలా ఔదలదాలుస్తుంది? అకాలీదళ్ పార్టీ సంవిధానంలో పార్టీ అంతర్గత వివాదాల పరిష్కారంలో అఖల్‌ తఖ్త్‌ను మధ్యవర్తిగా నిర్ణయించుకోవాలనే నిబంధన ఏమీ లేదు. పార్టీ వెలుపలి నుంచి సైద్ధాంతిక మార్గదర్శకత్వం, సలహాను తీసుకునే స్వేచ్ఛ ఇప్పుడు ఏ రాజకీయపక్షానికి అయినా ఉన్నది. ఒక పార్టీ నాయకత్వం మామూలుగా మతనాయకుల నుంచి సలహాలు తీసుకోవచ్చు. నిజానికి ఇప్పుడు కుల లేదా మతపరమైన సంస్థలతో సంబంధాలు ఉండి వాటి మార్గదర్శకత్వాన్ని తీసుకుంటున్న పార్టీలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు అకాలీదళ్ విషయమై ప్రజల సమక్షంలో విచారణ నిర్వహించి, అనివార్యంగా నిబద్ధమవ్వాల్సిన తీర్పును వెలువరించడం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగ బద్ధమైన అధికార పదవులకు పోటీపడే రాజకీయపక్షం ఒక మత సంస్థ విచారణకు అంగీకరించడం ఎలా సబబు? అఖల్‌ తఖ్త్‌ బహిరంగ విచారణ సమంజసమే అయితే భారతీయ జనతాపార్టీ వ్యవహారాలను, ఆ పార్టీ ప్రభుత్వాలను నిర్వహించడంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పాత్రను ఎలా ప్రశ్నించగలం?

ఇక చివరి అంశం రాజకీయ వ్యవహారాలలో అఖల్‌ తఖ్త్‌ జోక్యం చేసుకోవడంలో ఔచిత్యం ఉన్నదా? అఖల్‌ తఖ్త్‌ ఒక మత వర్గం ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, చట్టాలు, రాజ్యం నుంచి స్వతంత్రంగా వ్యవహరించి అనుయాయులపై నైతిక అధికారాన్ని నెరపే సంస్థ. అఖల్‌ తఖ్త్‌ జతేదార్‌లను నియమించేది, తొలగించేది శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) దేశీయ చట్టం ద్వారా నెలకొల్పబడిన సంస్థ ఇది. ఎస్‌జీపీసీ గానీ, అది నియమించినవారు గానీ రాజకీయాలలో జోక్యం చేసుకునేందుకు ఆ సంస్థకు సిక్కు గురుద్వారాల చట్టం–1925 ఎలాంటి అధికారాలనివ్వలేదు. మత సంబంధిత వ్యవహారాలలో మార్గదర్శకత్వం ఇవ్వడానికి మాత్రమే అఖల్‌ తఖ్త్‌ ఉన్నది. ఏవైనా సామాజిక వివాదాలలో, వివాదపడిన పక్షాలు రెండూ అంగీకరించిన పక్షంలో మధ్యవర్తిత్వం చేసి న్యాయం నిర్ణయించే అధికారం మాత్రమే ఎస్‌జీపీసీకి ఉన్నది. మతస్థులను మతం నుంచి వెలివేసేందుకు ఎస్‌జీపీసీకి గల అధికారాలపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి.


ప్రస్తుత వివాదం గుణాత్మకంగా భిన్నమైనది. అన్ని అంగీకారయోగ్యమైన పరిధులను అది అతిక్రమించింది. సుఖ్‌బీర్‌ బాదల్‌పై బహిరంగ విచారణ ఒక రాజకీయ వ్యవహారం అఖల్‌ తఖ్త్‌ ఆయనకు సంధించిన అనేక ప్రశ్నలలో ఒక్కటి మాత్రమే మతపరమైన విషయానికి సంబంధించినది: అది ‘బి–అదాబి’ (సిక్కు మత పవిత్రగ్రంథమైన గురు గ్రంథ సాహిబ్‌ను అపవిత్రీకరణ వ్యవహారంపై ఆయన అసమర్థంగా వ్యవహరించారన్న ఆక్షేపణ అది). మిగతావన్నీ ప్రభుత్వంలోను, అకాలీదళ్‌ నాయకుడుగాను ఆయన నిర్వర్తించిన పాత్రకు సంబంధించినవి. అవి కూడా ‘పంథ్‌’ను ప్రభావితం చేసే అంశాలే కావడం గమనార్హం. సరే, అకాలీ నేతలకు వీటిపై ఎటువంటి అభ్యంతరాలు లేవు అటువంటి జోక్యాన్ని వారు కోరారు. అయితే పూర్తిగా మత సంస్థ అయిన అఖల్‌ తఖ్త్‌ ఒక రాజకీయ పార్టీని పునర్ వ్యవస్థీకరించే అధికారాలను ఎలా సంతరించుకున్నదనేదే అసలు ప్రశ్న. ఇది ఆమోదయోగ్యమైతే బీజేపీకి ఓటు వేయమని తన అనుయాయులను డేరా సచా సౌదా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అదేశించడంలో తప్పు ఏముంది?

అంతకంటే ఆక్షేపణీయమైనది ఈ వ్యవహారంలో చోటు చేసుకున్నది. అకాలీదళ్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ఆదేశించడం ద్వారా అఖల్‌ తఖ్త్‌ ఒక రాజకీయ సంస్థ స్థాయికి పరిమితమైపోలేదా? ఇప్పుడు ప్రతి రాజకీయ సంస్థ మాదిరిగానే అఖల్‌ తఖ్త్‌ కూడా ప్రజల నిశిత పరిశీలన, నిందాత్మక ప్రచారాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఈ పరిస్థితిలో సిక్కు సమాజంలో మత, రాజకీయ అధికారాల మధ్య విభజన లేదన్న వాదనను అఖల్‌ తఖ్త్‌ చేస్తుందా? సిక్కుల విషయంలో అది సమంజసమే అయితే, పౌర సమాజ వ్యవహారాలలో ప్రభావశీల జోక్యం చేసుకుంటున్న బాబాలు, యోగులు, స్వాములను సమర్థించేందుకు బీజేపీ సైతం అదే వాదనను ఉపయోగించుకోదూ?

సిక్కు మత సంస్కరణ ఉద్యమంలో మూలాలు ఉన్న ఒక పంథిక్‌ సంస్థగా అకాలీదళ్‌ ఆవిర్భవించింది. ఖలిస్తానీ ఉగ్రవాదం సమసిపోయిన తరువాత అకాలీదళ్ రాజనీతిజ్ఞతలో ఒక పెద్ద మార్పు సంభవించింది. ఒక ‘పంథిక్‌’ పార్టీ నుంచి ఒక పంజాబీ పార్టీగా, ఒక మత సంబంధ– ప్రాంతీయ పార్టీ నుంచి స్వచ్ఛమైన ఒక ప్రాంతీయ పార్టీగా పరివర్తన చెందింది. అయితే, అకాలీదళ్‌ సిక్కు మతస్థుల పార్టీ అని, సిక్కు మత వ్యవస్థకు అది జవాబుదారీగా ఉంటుందనే విషయాన్ని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేశాయి.

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - Dec 12 , 2024 | 05:21 AM