ఎన్నికల పోరు!
ABN , Publish Date - Aug 17 , 2024 | 05:13 AM
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 90స్థానాలకు మూడుదశల్లో పోలింగ్ జరిగి అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి. హర్యానాలోనూ 90స్థానాలే కానీ, అక్కడ ఒకదశలోనే, అంటే జమ్మూకశ్మీర్ ఆఖరుదశ పోలింగ్ అక్టోబర్ ఒకటి నాడు ఈ రాష్ట్రంలో అన్నిస్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఏడాది నవంబరులో మహారాష్ట్ర, హర్యానా, వచ్చే ఏడాది జనవరిలో జార్ఖండ్ అసెంబ్లీల గడువు ముగుస్తుంది. మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికలను ఒకేమారు కలిపి నిర్వహించే సంప్రదాయాన్ని ఈ మారు ఎందుకు కాదనుకున్నారన్న ప్రశ్నకు జమ్మూకశ్మీర్‌ను కారణంగా చూపించారు సీఈసీ రాజీవ్‌కుమార్. అక్కడ భారీస్థాయిలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉన్నందున మహారాష్ట్రను పక్కనబెట్టారట. దీనికితోడు మహారాష్ట్రలో వినాయకచవితి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలున్నాయని, వర్షాలు అడ్డుపడి ఓటర్ జాబితాను అప్‌డేట్ చేయడం పూర్తికాలేదని చెప్పుకొచ్చారు. మరి, జార్ఖండ్‌ను కూడా ఎందుకు వదిలేశారో తెలియదు. ఈ రెండింటినీ ఢిల్లీతో కలిపి జరుపుతారట.
జమ్మూకశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని ఎత్తివేసి, రాష్ట్రంగా ఉన్నదాన్ని కేంద్రపాలితంగా మార్చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టకుండా, ఎన్నికలు మాత్రం ఈ ఏడాది సెప్టెంబరు ముప్పైలోగా ఎన్నికలు జరగాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవలే సీఈసీ సారథ్యంలో ఎన్నికల కమిషనర్లు అక్కడ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. అన్ని పార్టీలూ ఎన్నికలు కోరుతున్నాయని, ఓటర్లు కూడా అదేమాట అంటున్నారని వారు చెప్పుకొచ్చారు. అక్కడి పార్టీలు, ప్రజలు ఎంతోకాలంగా ఎన్నికలు డిమాండ్ చేస్తున్న విషయం వీరికి తెలియనిదేమీ కాదు. 2014లో రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన చివరి ఎన్నికల్లో ముఫ్తీమహ్మద్ సయీద్ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (పీడీపీ) అతిపెద్దపార్టీగా అవతరించింది, బీజేపీ–పీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన మరణానంతరం 2016లో కుమార్తె మహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో ప్రభుత్వం కూలిపోయి, గవర్నర్ పాలన మొదలైంది. మరుసటి ఏడాది ఆగస్టులో కేంద్రప్రభుత్వం 370 ప్రయోగించింది, ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఎన్నికల సంఘం ప్రకటనకు ఒకరోజుముందే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ౨00మంది అధికారులను ఎడాపెడా మార్చేయడం విశేషం. దీనిపై ఒమర్ అబ్దుల్లా అభ్యంతరాన్ని ఎన్నికల సంఘం తేలికగా కొట్టివేసింది. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న ప్రతీచర్యకు ఈ ఎన్నికల్లో ప్రజలు సమాధానం చెబుతారు. ప్రత్యేకప్రతిపత్తి రద్దుకు పాలకులు చెప్పిన కారణాలను, పెట్టిన ఆశలను తూకం వేస్తారు. కశ్మీర్‌నుంచి జమ్మూకు ఉగ్రవాదం విస్తరించిన నేపథ్యంలో అక్కడ సైతం గతంలో ఉన్నంత ఉత్సాహం లేదన్న విశ్లేషణలు బీజేపీకి ఇబ్బందికరమైనవే.
90 స్థానాలున్న హర్యానాలో ఈ మారు కాంగ్రెస్‌ది పైచేయి అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019లో మెజారిటీ లేకున్నా దుష్యంత్ చౌతాలాతో పొత్తుపెట్టుకొని ముఖ్యమంత్రిగా ఖట్టర్ కొనసాగగలిగారు. కానీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ఆ కూటమి కూలింది, ఖట్టర్ స్థానంలోకి నయాబ్‌సింగ్ సైనీ వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సగం స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజాదరణ పెరిగిందని సర్వేలు కూడా అంటున్నాయి. నిరుద్యోగం, అగ్నివీర్, రైతు ఉద్యమాలు, మహిళా మల్లయోధుల అంశం ఓటర్లను ప్రభావితం చేస్తాయి. యూపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌ను కాపాడుకురావడంకోసం బీజేపీ పెద్దలు మహిళారెజ్లర్లతో అన్యాయంగా వ్యవహరించారన్న ఆగ్రహం ఖాప్ పంచాయితీల్లో ఉంది. ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన వినేశ్ ఫోగట్‌మీద ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడటమూ ఓటర్లమీద పనిచేయవచ్చు. దళిత్, ఓబీసీ ఓట్లతో పాటు జాట్ల ఓట్లు కూడా చీలి కాంగ్రెస్ బాగా లాభపడవచ్చునంటున్నారు. జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల్లో స్థానికాంశాలే ప్రధానంగా పనిచేసినప్పటికీ, ఫలితాల ప్రభావం దేశస్థాయిలో ఉంటుంది. ఈ మారు లోక్‌సభలో బలం తగ్గిన బీజేపీ మీద, బలపడిన ఇండియా కూటమి మీదా ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయి.