PDSU : విద్యార్థిలోకపు పోరుపతాక
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:51 AM
విద్యార్థి ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది పీడీఎస్‌యు చరిత్ర. ఎన్నో పోరాటాలనూ, సమరశీలతనూ, త్యాగాలనూ, రాజకీయ పనిరీతిని తనలో ఇముడ్చుకుని తెలుగు నేలను
విద్యార్థి ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది పీడీఎస్‌యు చరిత్ర. ఎన్నో పోరాటాలనూ, సమరశీలతనూ, త్యాగాలనూ, రాజకీయ పనిరీతిని తనలో ఇముడ్చుకుని తెలుగు నేలను ముఖ్యంగా విద్యార్థి సమాజాన్ని చలింప చేసినది. జ్వలింప చేసినది పీడీఎస్‌యు. 1974 అక్టోబర్ 12, 13 తేదీలలో మొదటి మహాసభలో పీడీఎస్‌యుగా నిర్మాణాన్ని సంతరింపచేసుకున్న ఆ సంస్థకు 2024 అక్టోబర్‌కు 50 ఏండ్లు నిండాయి. ఒక విద్యార్థి సంఘం, అందునా పోరాటాల చరిత్ర, విప్లవోద్యమ దృక్పథం గల సంస్థ ఇంతకాలం కాలానికి ఎదురీదుతూ నిలబడటం అరుదైన సందర్భమే. ఈ సందర్భంగా ఈ సంస్థలో కృషి చేసినవారు, అమరులైన వారు వారి జీవిత మధురిమలను ఉద్యమంలోనే చవిచూశారు. త్యాగాలతో పునీతమైన ఆ చరిత్రను మననం చేసుకోవడానికి 2024 సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీలోని టాగూర్ ఆడిటోరియంలో పీడీఎస్‌యు స్వర్ణోత్సవం జరుపుకుంటున్నది. ఆ 50 వసంతాల పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మననం చేసుకోవడం ఎంతో సముచితం. అవసరం కూడా.
1960వ దశకం ప్రపంచంలో, ముఖ్యంగా భారత దేశంలో అల్లకల్లోలంగా నడిచింది. అధిక ధరలు, నిరుద్యోగం, పనిభారం, రుణభారం, ఆశ్రిత పక్షపాతం, నిరంకుశత్వం ఇవన్నీ సమాజాన్ని పట్టి పీడించాయి. అస్వతంత్రత పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ నేపథ్యంలోనే 1968లో ఫ్రాన్స్‌లో డీగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ప్రజ్వరిల్లింది. అది భద్రత కోసం, ప్రజాస్వామ్యం కోసం నినదించింది. ఈ పోరాటం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావాన్ని ప్రసరింప చేసింది. భారతదేశ విద్యార్థి లోకంపై కూడా ఆ ప్రభావం పడింది. ఆ క్రమంలోనే అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు, విద్యార్థులు చేసిన దేశభక్తియుత గెరిల్లా పోరాటం, పుస్తకాలు వదిలేసి విద్యార్థులు సైతం నేల మాళిగల్లోకి దూరి చేసిన గెరిల్లా పోరాటం ఉత్తేజాన్ని కలిగించింది. మరోవైపు చేగువేరా సాహసాలు, క్యూబా విముక్తి తరువాత లాటిన్ అమెరికాలో విప్లవం కోసం ఆయన చేసిన త్యాగాలు చెరగని ముద్రను వేశాయి. ఈ సందర్భంలోనే నక్సల్బరీ, శ్రీకాకుళ గోదావరిలోయ ప్రజల పోరాటాలు, సాయుధ సంఘర్షణలు తెలుగు సీమను పులకింపచేశాయి.
ఈ సందర్భంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుతూ, గోల్డ్‌మెడల్ సాధించిన జార్జిరెడ్డిని సమాజ చింతకుడిగా రూపుదిద్దుకోవడానికి ప్రేరణ అయ్యాయి. యూనివర్సిటీలోని ర్యాగింగ్, ఆశ్రిత పక్షపాతం, హాస్టల్స్‌లో సౌకర్యాల లేమి, మెస్‌లో దందాలు, అధికారుల ఆగడాలు, గ్రామీణ విద్యార్థుల పట్ల జరిగే అవహేళన ఇవన్నీ కదిలించాయి. ఈ సమస్యలన్నీ జార్జిని పోరాట వీరునిగా మలిచాయి. ఆ క్రమంలోనే నీలం రామచంద్రయ్య (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) సహచర్యంతో రాజకీయ నిర్మాణ పరిణతి పొంది జార్జిరెడ్డి రాజకీయ, నిర్మాణ దక్షకుడయ్యాడు. విద్యార్థులకు సమరశీల పోరాట వేదిక వుండాలని భావించి, సహచరులను సమన్వయ పరిచి పీడీఎస్ అనే సంస్థను స్థాపించాడు. అది యూనివర్సిటీలో విద్యార్థుల పోరాట పతాకగా మారింది. మతోన్మాదులకూ, ఛాందసవాదులకూ సింహస్వప్నంగా మారింది. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నెన్నో విజయాలు సాధించింది. ఈ ఫలితాలను మింగలేని మతోన్మాద మూకలు 1972 ఏప్రిల్ 14న జార్జిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ పోరాటాల క్రమంలో 1975 జూన్ నుంచి 1977 మార్చి వరకు ఎమర్జెన్సీ నియంతృత్వాన్ని ఎదుర్కొన్నది. రహస్యంలోకి నాయకత్వం పోవాల్సి వచ్చింది. సంస్థ కార్యకలాపాలకు, ఉద్యమాలకు బ్రేకు పడింది.
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత తిరిగి పునర్నిర్మాణం జరిగింది. మిగిలిన వారు, ఉద్యమబాట పట్ల ఆసక్తి వున్న వారితో కార్యక్రమాలు, నిర్మాణ రూపం ఆరంభించారు. అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్‌యు బలమైన సంస్థగా ఎదిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో సౌకర్యాల కోసం, వారిని గౌరవంగా చూడాలనే అంశంపై ఎన్నో పోరాటాలు చేసి, విజయాలు సాధించింది. మహిళలకు, విద్యార్థినులకు సమాన హక్కుల కోసం నినదించింది. ర్యాగింగ్‌పై కన్నెర్ర చేసింది. వివిధ కళాశాలల్లో గూండాగిరి, రౌడీ గ్యాంగ్‌లపై పోరాడి, వారి కీళ్ళు విరిచింది. కళాశాల సీట్లు పెంచాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని, అధ్యాపకుల నియామకం కోసం ఎన్నో పోరాటాలు చేసింది. నిరుద్యోగం, అధిక ధరలను నిరసించింది. నిర్బంధాల శిబిరాల నుంచి, ఆంక్షల చట్రాల నుంచి, ఛాంధసభావాల నుంచి, అభివృద్ధి నిరోధకత్వం నుంచి దాడులను, ఉక్క చట్రాలను ఎదుర్కొని 5 దశాబ్దాలుగా పీడీఎస్‌యు పురోగమిస్తున్నది. ఈ క్రమంలోనే 1972–73 లో డీఎస్‌గా, 1974లో ఆర్‌ఎస్‌యుగా, 1984 నుంచి 2013 దాకా మరో రెండు మూడు విభజనలను ఎదుర్కొని సైతం తన సిద్ధాంత, రాజకీయ, నిర్మాణ, పోరాట కృషిని కొనసాగిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకపు పోరు పతాకగా నిశ్చలంగా నిలబడింది.
పోటు రంగారావు
పీడీఎస్‌యు పూర్వ ప్రధాన కార్యదర్శి
(సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్‌యు స్వర్ణోత్సవ వేడుకలు)