Share News

తా‌‌ష్కెంట్‌ నుంచి తెలంగాణ దాకా...!

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:52 AM

భారత కమ్యూనిస్టు పార్టీ ఈ డిసెంబర్‌ 26న నూరవ ఏట ప్రవేశిస్తోంది. ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలో లేని ఒక విచిత్ర వివాదం భారతీయ కమ్యూనిస్టుల్లో ఉంది. అది తమ మాతృసంస్థ (భారత కమ్యూనిస్టు పార్టీ) ఎప్పుడు ఆవిర్భవించింది? అన్న మీమాంస. 1920

తా‌‌ష్కెంట్‌ నుంచి తెలంగాణ దాకా...!

భారత కమ్యూనిస్టు పార్టీ ఈ డిసెంబర్‌ 26న నూరవ ఏట ప్రవేశిస్తోంది. ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలో లేని ఒక విచిత్ర వివాదం భారతీయ కమ్యూనిస్టుల్లో ఉంది. అది తమ మాతృసంస్థ (భారత కమ్యూనిస్టు పార్టీ) ఎప్పుడు ఆవిర్భవించింది? అన్న మీమాంస. 1920 జూలైలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ సమావేశంలో వలస దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలను స్థాపించాలని నిర్ణయించగా, దాన్ని అమలు చేయటంలో భాగంగా ఎం.ఎన్‌.రాయ్‌ ఇండియా, స్పెయిన్‌ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల స్థాపనకు కృషి చేశారు. 1920 అక్టోబర్‌లో సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంటులో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. తాష్కెంటులో అప్పటికే ఉన్న భారతీయ ప్రవాసుల్లో కొంతమందిని కమ్యూనిస్టులుగా మార్చి, వారిలో కొందరికి శిక్షణ ఇచ్చి భారతదేశానికి పంపటానికి రాయ్‌ కృషి చేశారు. అయితే వారు బ్రిటిష్‌ వలస పాలకులకు దొరికిపోవటంతో వారిపై పెషావర్‌ కుట్రకేసు బనాయించి శిక్ష పడేట్లు చేశారు. వీరిలో మీర్‌ అబ్దుల్‌ మజీద్‌, మన్సూర్‌, రహ్మన్‌ఖాన్‌, అక్బర్‌ఖాన్‌ తదితరులు తర్వాత కాలంలో ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి కృషి చేశారు.

అక్టోబర్‌ 17, 1920న తాష్కెంటు పార్టీ స్థాపన సమావేశంలో యం.యన్‌. రాయ్‌తో పాటు ఆయన భార్య ఎవలిన్‌ ట్రెండ్‌రాయ్‌, ఎ.ఎన్‌. ముఖర్జి, రాసా ఫిటింగోవ్‌, మహమ్మద్‌ అలీ (అహ్మద్‌ హసన్‌), మహమ్మద్‌ షఫీర్‌ సిద్ధిఖ్‌, ప్రతివాద భయంకరాచారి తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్‌ అలీని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కారణాలేమైనా తాష్కెంటు పార్టీ స్థాపన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేయటంలో పెద్దగా ఉపకరించలేదు. కాని కలకత్తా, బొంబాయి మద్రాసు, లాహోర్‌ లాంటి చోట్ల ఎవరికి వారుగా వారివారి తరహాలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేశారు.

ఈ స్థితిలో ‘‘ఇండియన్‌ కమ్యూనిస్టు పార్టీ’’ పేరుతో పనిచేస్తున్న ‘సత్యబ్రత’ పై గ్రూపులన్నింటినీ ఆహ్వానించి 1925 డిసెంబర్‌ 26 నుంచి 28 వరకు కాన్పూర్‌లో 300 మందికి పైగా ప్రతినిధులతో ఒక సభ జరిపారు. ఇందులో ఎస్‌.వి. ఘాటే, కృష్ణస్వామి అయ్యర్‌, జోద్కర్‌, జానకీ ప్రసాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, ఆర్‌.ఎస్‌ నింబకర్‌, అబ్దుల్‌ మజీద్‌, సయ్యద్‌ హసన్‌ తదితరులు పాల్గొనగా సభకు సింగారువేలు చెట్టియార్‌ అధ్యక్షత వహించారు. డాంగే తదితరులు జైల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు. ఈ సభకు ముందే కాన్పూరు కుట్ర కేసు బనాయించారు. కొంతమందికి శిక్షలు పడినా సింగారవేలు తదితరులపై కేసు కొట్టివేశారు. ఈ కేసులో ముద్దాయిగా పేర్కొన్న గులాం హుస్సేన్‌ జైలు నుంచి తప్పించుకున్నాడు. కాన్పూరు సభకు ఆహ్వానసంఘం అధ్యక్షునిగా హాజరత్‌ మెహా వ్యవహరించారు.

పార్టీ పేరు ఇండియన్‌ కమ్యూనిస్టుగా ఉండాలని, జాతీయ కమ్యూనిస్టు పార్టీగా ఉంటే బహిరంగంగా పనిచేసే అవకాశం ఉంటుందని సత్యబ్రత చేసిన వాదనని సభ తిరస్కరించింది. పార్టీకి ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా’గా పేరు స్థిరపరచింది. ఈ కారణంగా సత్యబ్రత వెళ్లిపోయి ఇండియన్‌ కమ్యూనిస్టు పార్టీని స్థాపించుకొని ఆ తర్వాత కనుమరుగయ్యారు. కాన్పూరు సభలో పార్టీ కార్యదర్శులుగా ఎస్వీ ఘాటే, జానకీ ప్రసాద్‌, బాగేర్‌ హిట్టాల్‌ను ఎన్నుకున్నారు. కాని తర్వాత జానకీ ప్రసాద్‌ని పోలీసు ఏజెంటుగా అనుమానించి బయటకు పంపారు. ప్రారంభంలోనే బాలారిష్టాలు ఎదురైనా నాలుగైదు ఏళ్లలోనే పార్టీ స్థిరపడింది. కాన్పూరు కుట్ర కేసు పార్టీ ప్రచారానికి బాగా దోహదపడింది. సాంకేతికంగా పార్టీ ఆవిర్భావం 1920లో జరిగినా, 1925లో జరిగిన స్థాపననే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ కూడా గుర్తించింది. 1920 తాష్కెంటు సమావేశాన్ని పార్టీ స్థాపకదినంగా సీపీఎం, మరికొన్ని నక్సల్‌ గ్రూపులు భావిస్తుండగా, 1925 కాన్పూరు సమావేశాన్ని సీపీఐ, మరికొన్ని గ్రూపులు స్థాపకదినంగా భావిస్తున్నాయి.


1946 జూలై 4న రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహిద్దీన్‌ల పిలుపుతో ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 2297 రోజులు సాగి, నాలుగువేల మంది వీరుల బలిదానం తర్వాత 1951 అక్టోబర్‌ 21న సుందరయ్య, రాజేశ్వరరావు, బసవపున్నయ్య, మద్దుకూరి చంద్రంల ప్రకటనతో విరమింపబడింది. నెహ్రూ ప్రభుత్వ పోలీసు చర్య తర్వాతనే ఎక్కువమంది చంపబడ్డారు. పోలీసు చర్య తర్వాత పోరాటం కొనసాగించటం విషయంపై పార్టీలో తీవ్రస్థాయిలో విబేధాలు పొడచూపినా పోరాట ఫలాలను పరిరక్షించుకోవాలనే పేరుతో పోరాటం కొనసాగించాలని మెజారిటీగా వున్న అతివాదులు భావించారు. ఈనాటికీ వారు అదే వైఖరితో ఉన్నారు. అపరిమితమైన సంఖ్యలో అధునాతనమైన ఆయుధ సంపత్తితో ఉన్న ఆ సైన్యాన్ని కర్రలు, ఈటెలు, వడిసెలు, అరకొరగా ఉన్న పాతకాలపు తుపాకులతో ఎదుర్కోవటం ఔచిత్యం కాదని రావి నారాయణరెడ్డి లాంటి పెద్ద నాయకులు భావించినా, నిలబడి శ్రేణుల్ని ఒప్పించకుండా పోరాట ప్రాంతం నుంచి తప్పుకొని పోయినవారూ జరిగిన తప్పులకు పరోక్ష కారకులయ్యారు. మెరికల్లాంటి కార్యకర్తలు, నాయకుల ఈ కాలంలోనే తెలంగాణని తమ రక్తంతో పునీతం చేశారు.

నిజానికి డజన్ల సంఖ్యలో జరిగిన చీలికల్లో కూడా సిద్ధాంత భేదాలతో కూడిన నిబద్ధత కన్నా వ్యక్తిగత రాగద్వేషాలు, అవినీతి ఆర్థిక అరాచకాలు, లైంగిక బలహీనతలూ, పదవీలాలస ఇలా సమస్త దరిద్రాలు ఉద్యమంలో దాపురించాయి. పార్టీ ఏర్పడిన నాటి నుంచి రకరకాల సిద్ధాంత విభేదాలున్నా, ఎన్ని అవమానాలు జరిగినా 4 దశాబ్దాల పాటు పార్టీని చీల్చే సాహసం లబ్ధప్రతిష్టులైన అగ్రనాయకులు సైతం చేయలేకపోయారు. చివరకు గత్యంతరం లేని స్థితిలో 1964 జూలైలో తెనాలిలో సమావేశమై సీపీఎంగా ఏర్పడ్డారు. మళ్లీ అందులో నక్సల్‌బరి ఘటన మరో చీలికకు దారితీసింది. ఆ తర్వాత నక్సల్స్‌ డజన్ల సంఖ్యలో చీలిపోయినా అవన్నీ ఆయా నాయకులు తెచ్చి పెట్టుకున్న విభేదాలే కాని, వాటిలో నిజాయితీ పాళ్లు తక్కువ. దేశం సంగతేమో గాని, తెలుగు రాష్ట్రాల విషయం చెప్పాలంటే అందులో మావోయిస్టు పార్టీ, లిబరేషన్‌ పార్టీ తప్ప... మిగిలిన డజను గ్రూపులూ ఒకనాటి నాగిరెడ్డి – పుల్లారెడ్డి నాయకత్వంలోని విప్లవకారుల సమన్వయ కమిటీ తాను నుంచి వచ్చిన పీలికలే. భిన్నాభిప్రాయానికి చీలికే పరిష్కారం అని పుల్లారెడ్డి చూపిన బాటనే తర్వాత తర్వాత అందరూ అనుసరించారు. అనుసరిస్తున్నారు. మూడు ఐక్యతలు, ఆరు చీలికలుగా వర్ధిల్లుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్రలో ఎన్నో కుటుంబాలు ధ్వంసమయ్యాయి, చితికిపోయాయి. అమరవీరుల త్యాగాలు నిష్ఫలమయ్యాయి. దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తలుగా ఉండి సేవలందించి సజీవులుగా ఉన్నవారు వారు చేసిన కృషి నిష్ప్రయోజనం అయిందనే వేదనకు గురవుతున్న సందర్భమిది. నాయకత్వం పట్ల కార్యకర్తలకు అపనమ్మకం ఉన్న స్థితి, ఎన్నో దశాబ్దాల కాలం పనిచేసిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఉన్నా మంచో, చెడో కాలక్షేపం చేద్దామనే నిరాశ ఈనాడు ఎర్రపార్టీల్లో కన్పిస్తున్న కఠోర వాస్తవం. సామరస్యం సాధ్యంకాని అనేక సమూహాల మధ్య సాధ్యమే అన్నట్లు చెబుతున్న కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కువగా దుర్వినియోగం కాబడే పదాలు ఐక్యత, విలీనం. తెలిసి తెలిసి పదేపదే ఈ పదాన్ని వల్లిస్తూ అటు తమ శ్రేణుల్ని, ఇటు అసంఖ్యాక ప్రజానీకాన్ని వంచించే కపటత్వాన్ని నాయకత్వం గత శతాబ్దకాలంగా సాగిస్తూనే ఉంది.

ఏమైనా భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని పార్లమెంటరీ మార్గంలో సాగించటంలోనూ, విప్లవోద్యమంగా మలచటంలోనూ నాయకత్వం విఫలమైంది. ఇది నాయకత్వ వైఫల్యమే గాని మార్క్సిజం వైఫల్యం కాదు.

భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని పార్లమెంటరీ మార్గంలో సాగించటంలోనూ, విప్లవోద్యమంగా మలచటంలోనూ నాయకత్వం విఫలమైంది. ఇది నాయకత్వ వైఫల్యమేగాని మార్క్సిజం వైఫల్యం కాదు.

l చెరుకూరి సత్యనారాయణ

Updated Date - Dec 22 , 2024 | 05:52 AM