Share News

రెగ్యులరైజేషన్‌పై తీర్పు పాక్షిక ఉపశమనమే!

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:11 AM

గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగుల నిరీక్షణను, వేదనలను కాదని అక్రమంగా, అన్యాయంగా అనర్హులైన జూనియర్, డిగ్రీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరుద్యోగులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.

రెగ్యులరైజేషన్‌పై తీర్పు పాక్షిక ఉపశమనమే!

గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగుల నిరీక్షణను, వేదనలను కాదని అక్రమంగా, అన్యాయంగా అనర్హులైన జూనియర్, డిగ్రీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరుద్యోగులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. రెగ్యులరైజేషన్‌లను నిలిపివేయాలని, మున్ముందు ఉద్యోగాల భర్తీని చట్ట ప్రకారం నిర్వహించాలని హైకోర్ట్‌ ఆదేశించింది.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని 1994 పబ్లిక్ సర్వీస్ రూల్స్ చెప్తున్నాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం 2016లో ఈ చట్టానికి సవరణ చేస్తూ ‘సెక్షన్ 10ఎ’ను చేరుస్తూ జీవో 16ను తీసుకువచ్చింది. దీన్ని పాటిస్తూ కాంటాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్, డిగ్రీ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసింది. ఎలక్షన్లో లబ్ధి కోసం, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నియమాలను అతిక్రమించి 5544 మందిని క్రమబద్ధీకరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, దీక్షలు చేశారు. వినతి పత్రాల ద్వారా నిరసన తెలియజేశారు. అయినప్పటికీ, ఇప్పుడు నిరుద్యోగుల తరఫున గొంతు చించుకుంటున్న కేటీఆర్, హరీష్‌రావులతో సహా ఏ ఒక్క మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ నిరుద్యోగుల బాధ వినేందుకు సంసిద్ధత చూపలేదు. చివరగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నిజానికి ఇప్పుడు హైకోర్టు తీర్పు ద్వారా కూడా నిరుద్యోగులకు పాక్షికంగానే ఉపశమనం లభించింది.

హైకోర్టు ఒకపక్క జీవో 16ను రద్దు చేస్తూ, ఇలాంటి రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమనీ, చట్టవిరుద్ధమనీ అంటూనే, ఇప్పటికే రెగ్యులరైజ్‌ అయిన వారిని కొనసాగించుకోవచ్చుననీ, వారి మేము తొలగించలేమనీ చెప్పడం నిరుద్యోగులను నిరాశకు గురిచేసింది. తప్పు అని చెప్పినప్పుడు ఆ విధానంలో రెగ్యులరైజ్‌ అయిన వారిని తొలగించాలి, ఆ తప్పు చేసిన వారిని శిక్షించాలి. అంతేతప్ప ఆ తప్పును కొనసాగిస్తూ పోవడం ఎందుకు? ఈ 5544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల బహుళ ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పిన కోర్టు– మరి లక్షలాదిమంది నిరుద్యోగుల బహుళ ప్రజా ప్రయోజనాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? పాక్షిక న్యాయాన్ని మాత్రమే ఇస్తున్న ఈ తీర్పును సవాల్ చేస్తూ నిరుద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

అక్రమ దారిలో రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులందర్నీ తప్పనిసరిగా తొలగించాలి. నోటిఫికేషన్ ద్వారా ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఈ విషయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వాలు ఉపాధిని చూపించలేక దేశంలో రోజు రోజుకూ నిరుద్యోగ సంక్షోభం పెరుగుతున్న ఈ కాలంలో ఎట్టిపరిస్థితిలోనూ ఏ చిన్న ఉద్యోగాన్నీ కూడా రెగ్యులరైజ్ చేయకూడదు. ఉన్న ఉద్యోగాలు మొత్తం ఇలా అక్రమ పద్ధతిలో భర్తీ అయిన తర్వాత ఇక ‘ఈసారికి వారిని క్షమిస్తున్నాం’ అని వదిలేస్తే నష్టపోయేది రాజకీయ నాయకులు కాదు, నిరుద్యోగులు. గ్రూప్ వన్ పరీక్షలో తప్పు జరిగిందనే కదా రెండుసార్లు రద్దు చేసి మూడోసారి విజయవంతంగా నిర్వహించింది. అప్పుడు మరి ఆ ఒక్క తప్పే కదా అని వదిలేయలేదేం? ఎన్నికల్లో ఎమ్మెల్యే అక్రమమైన పద్ధతిలో గెలిస్తే అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నారు కదా? ఆ న్యాయం ఇక్కడ ఎందుకు వర్తించదు?

ప్రస్తుతం ఒక్కో నోటిఫికేషన్ రావడానికే దాదాపు పదిహేనేళ్ళ సమయం పడుతున్నది. అప్పటిదాకా నిరుద్యోగులు లక్షల రూపాయలు అప్పు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోపక్క ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం మానేసి ఇలా నిరుద్యోగుల మధ్యనే అంతరాలను సృష్టించే స్వార్థ రాజకీయ విన్యాసాలకు పాల్పడుతున్నారు.

– మండ్ల రవి

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - Dec 12 , 2024 | 05:11 AM