Share News

అసలైన విజేతలు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:31 AM

ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఏ క్రీడాకారుడైనా కష్టాలను అధిగమించాల్సిందే. కానీ, జీవితమే కష్టతరమై, అడుగడుగునా అవరోధాలు ఎదురైనా, ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకుంటారు పారా అథ్లెట్లు...

అసలైన విజేతలు

ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఏ క్రీడాకారుడైనా కష్టాలను అధిగమించాల్సిందే. కానీ, జీవితమే కష్టతరమై, అడుగడుగునా అవరోధాలు ఎదురైనా, ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకుంటారు పారా అథ్లెట్లు. తమకున్న వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో సత్తాచాటి వెలుగులోకి వస్తారు. అత్యుత్తమ క్రీడా వేదికపై పోటీపడి పతకాలతో మెరిసి దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. ఈసారి కూడా మన దివ్యాంగ క్రీడాకారులు పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించి అసలైన విజేతలుగా నిలిచారు.


గత పన్నెండు రోజులుగా క్రీడాభిమానులను మురిపించి అందరిలోనూ స్ఫూర్తి నింపిన పారిస్‌ పారాలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. గత టోక్యో క్రీడల తరహాలోనే ఈసారి కూడా చైనా అత్యధికంగా 220 పతకాలు సాధించి ఆటల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 94 బంగారు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 49 స్వర్ణాలు సహా 124 పతకాలతో గ్రేట్‌ బ్రిటన్‌ ద్వితీయస్థానాన్ని అందుకోగా, 105 పతకాలతో అగ్రరాజ్యం అమెరికా తృతీయస్థానంతో సరిపెట్టుకుంది. ఆత్మవిశ్వాసమే ఆస్తిగా, పట్టుదలే పెట్టుబడిగా, అనుక్షణం తమ పోరాట పటిమతో భారత పారాలింపియన్లు పారిస్‌లో అబ్బురపరిచారు. కనీసం పాతిక పతకాలు లక్ష్యంగా పోటీపడిన మన అథ్లెట్లు, అంతకంటే ఓ నాలుగు ఎక్కువగానే సాధించారు. 12 క్రీడాంశాల్లో 84 మంది పోటీపడి, మొత్తం 29 పతకాలు దక్కించుకున్నారు. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచి భళా అనిపించారు. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలున్నాయి. భారత ఆటగాళ్లు పారా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమంగా రాణించి అత్యధిక పతకాలను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన పారాలింపిక్‌ క్రీడల్లో కలిపి భారత్‌ మొత్తం అరవై పతకాలు సాధిస్తే.. ఇందులో ఒక్క పారిస్‌లోనే దాదాపు సగం పతకాలు లభించడం విశేషం.


పుట్టుకతోనే వచ్చిన వైకల్యంతో ఒకరు, ఊహించని ప్రమాదం బారినపడి కాలు, చేయి కోల్పోయి మరొకరు.. ఇలా పారిస్‌ పారాలింపిక్స్‌లో తలపడి పతకాలు సాధించిన యోధుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్ఫూర్తిగాథ. రెండు చేతులూ లేకున్నా, కాలితోనే విల్లును ఎక్కుపెడుతూ, లక్ష్యం దిశగా బాణాన్ని సంధించడంలో దిట్ట జమ్మూ కశ్మీర్‌కు చెందిన 17 ఏళ్ల శీతల్‌ దేవి. ఆర్చరీ క్రీడ వ్యక్తిగత విభాగంలో విఫలమైనా, రాకేశ్‌ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో కంచు పతకం సాధించి వహ్వా అనిపించింది. పిన్నవయసులో పారాలింపిక్స్‌లో పతకం దక్కించుకున్న తొలి భారత ఆర్చర్‌గా ఘనత వహించింది. పదిహేనేళ్ల వయసులో జరిగిన రైలు ప్రమాదంలో కాలును కోల్పోయిన నితేశ్‌ కుమార్‌ విషాదం నుంచి కోలుకొని చదువుపై దృష్టి సారించాడు. ఐఐటీలో ఇంజనీరింగ్‌ సీటు దక్కించుకొన్న అతడు, పారాలింపిక్స్‌లో దేశ షట్లర్ల విజయాలతో స్ఫూర్తిపొంది బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కృత్రిమ పాదం అమర్చుకొని పోటీలకు సిద్ధమైన అతడు నాలుగు పదుల వయసులో బంగారు పతకం గెలిచి తన కల నెరవేర్చుకున్నాడు. నీరజ్‌ చోప్రా స్ఫూర్తితో జావెలిన్‌ త్రో క్రీడను కెరీర్‌గా ఎంచుకున్న ఒంటికాలి వీరుడు సుమిత్‌ అంటిల్‌ వరుసగా రెండో పారాలింపిక్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చిన్నప్పుడు కారు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయినా జీవితంపై ఏమాత్రం ఆశలు కోల్పోని షూటర్‌ అవనీ లేఖారా వరుసగా రెండో పారాలింపిక్స్‌లో విజేతగా నిలిచి తన బుల్లెట్‌ పవరేంటో చూపించింది. తమకెదురైన అవమానాలనే సోపానాలుగా మలచుకుంటూ ముందుకుసాగిన పరుగుల రాణి ప్రీతి పాల్‌, పారిస్‌లో రెండు కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించగా.. కంటిచూపు తక్కువున్నా, పట్టుదలతో పోరాడిన సిమ్రన్‌ శర్మ పతకంతో అదరగొట్టింది. కరెంట్‌ షాక్‌తో చిరుప్రాయంలోనే చూపు కోల్పోయిన జూడో స్టార్‌ కపిల్‌ పర్మార్‌ కాంస్యం నెగ్గాడు.


షాట్‌పుట్‌లో కాంస్య పతకం అందుకున్న నాగాలాండ్‌కు చెందిన హొకాటో హొటొజి సెమా.. సైన్యంలో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్‌మైన్‌ పేలుడులో ఎడమ కాలిని పోగొట్టుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో పారా క్రీడల్లో ప్రవేశించి, విశ్వవేదికపై విజయఢంకా మోగించాడు. కొన్నాళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్లలో రాణిస్తున్న వరంగల్‌ జిల్లాకు చెందిన దీప్తి జీవాంజి పారిస్‌ క్రీడల్లోనూ వెలుగులు విరజిమ్మింది. 400 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించి, ఒకప్పుడు తన మానసిక వైకల్యాన్ని చూసి వెక్కిరించిన వాళ్లతోనే ఇప్పుడు గర్వంగా జేజేలు పలికించుకుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ, నిరాశలో కుంగిపోతూ, జీవితాన్ని వృథా చేసుకుంటున్న ఎందరికో ఈ పారా యోధుల విజయగాథలు స్ఫూర్తిదాయకం.

Updated Date - Sep 10 , 2024 | 12:31 AM