భయపెడుతున్న ఆర్థిక భవితవ్యం
ABN , Publish Date - Nov 02 , 2024 | 06:24 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సరికొత్తగా ద్రవ్య విధాన ప్రకటన చేసింది. అది మీడియా పతాక శీర్షికల్లో అందరినీ ఆలోచనామగ్నులను చేసింది. రెపో రేటు విధానమే అందుకు కారణమని మరి చెప్పనవసరం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సరికొత్తగా ద్రవ్య విధాన ప్రకటన చేసింది. అది మీడియా పతాక శీర్షికల్లో అందరినీ ఆలోచనామగ్నులను చేసింది. రెపో రేటు విధానమే అందుకు కారణమని మరి చెప్పనవసరం లేదు. బ్యాంకులు తమ వద్దనున్న అదనపు నిల్వలను రిజర్వ్ బ్యాంకు వద్ద ఉంచి నిధులు తీసుకోవడాన్ని రెపో అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీల హామీతో ఆర్బీఐ తీసుకొనే ఒక స్వల్పకాలిక వడ్డీతో కూడిన అప్పు ఇది. ఈ అప్పుమీద తీసుకునే వార్షిక వడ్డీరేటునే రెపో రేటు అంటారు. రెపో రేటు వడ్డీరేట్లకు ప్రధాన సంకేతంగా మారింది. రెపో రేటు తగ్గడం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేవారికి ఆనందదాయక విషయం. ఎందుకంటే అవి, రిజర్వ్ బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీరేటుపై అప్పులు తీసుకుంటాయి. ఈ సొమ్మును తక్కువ వడ్డీపై తిరిగి ప్రజలకు అప్పుగా ఇస్తాయి. రెపో రేటు పెరగడం ద్రవ్యోల్బణం తగ్గాలని ఆశిస్తున్న వారికి సంతోషకరమైన విషయం. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపోరేటు ఒక సాధనం. రెపోరేటు యథాతథంగా ఉండిపోవడం జరిగితే అప్పులు తీసుకునేవారు, ద్రవ్యోల్బణం ఎప్పుడు తగ్గుతుందా అని నిరీక్షిస్తున్నవారు తమ ఆర్థిక భవితవ్యం విషయమై వివిధ అంచనాలకు రావడాన్ని అనివార్యం చేస్తుంది.
మార్చి 27, 2020న రెపోరేటును 5.0 శాతం నుంచి 4.0 శాతానికి తగ్గించారు. ఇది చాలా పెద్ద కోత. కోవిడ్ ప్రభావిత ఆర్థిక వ్యవస్థ మాంద్యం ముప్పు నెదుర్కొంటున్న కారణంగా రెపో రేటును తగ్గించారు. ఆ తగ్గిన రేటు 26 నెలల పాటు అమలులో ఉన్నది. కోవిడ్ విలయం ముగిసి, ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటున్న సూచనలు కన్పించగానే రెపోరేటును స్వల్పంగా పెంచారు. ద్రవ్యోల్బణ అంచనాలను నియంత్రించేందుకై రెపోరేటును 4 నుంచి 4.40 శాతానికి పెంచారు. ఫిబ్రవరి 2023 నాటికి అది 6.50 శాతానికి పెరిగింది. గత 20 నెలలుగా అది అలానే ఉండిపోయింది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మే 2022 నుంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే రెపో రేటు మార్చని కారణంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ఆర్బీఐ ఇంతవరకు సఫలం కాలేదు.
ఆర్బీఐ గవర్నరే కాదు, ఏ కేంద్ర బ్యాంకు గవర్నర్ కూడా అందరినీ తన నిర్ణయాలతో సంతృప్తిపరచలేడు. యూపీఏ ప్రభుత్వం ఒక ద్రవ్య విధాన కమిటీని నియమించింది. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల బరువు పంచుకోవడమే ఆ కమిటీ ఏర్పాటు లక్ష్యం. అయితే రెపోరేటుగానీ మరేదైనా విషయమై గానీ తుది నిర్ణయం మాత్రం ఆర్బీఐ గవర్నర్‌దే.
ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచాలన్నది లక్ష్యం. అయితే ద్రవ్యోల్బణం ఆ లక్ష్య దిశగా లేదు. ఆహార, ఇంధన ధరలు పరిస్థితులను క్లిష్టం చేస్తున్నాయి. వడ్డీరేటు మార్పుకు అవి ప్రతిస్పందించడం లేదు. సెప్టెంబర్ 2024లో గత ఏడాది ధరల కంటే టొమాటో ధర 42.4 శాతం, ఉల్లిపాయల ధర 66.2 శాతం, పొటాటో ధర 65.3 శాతం పెరిగాయి. రెపో రేటును యథాతథంగా ఉంచడాన్ని ఆర్బీఐ గవర్నర్ సమర్థించారు. రెపో రేటు అధిక స్థాయిలో ఉంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుదల కుంటుపడుతుందనేది ఒక ప్రతి వాదన.
అర్థిక వ్యవస్థ పెరుగుదల, ద్రవ్యోల్బణం అదుపు అనేవి అటు ప్రభుత్వ, ఇటు ఆర్బీఐ ప్రాథమిక బాధ్యతలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండగలదని శక్తికాంత దాస్ అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండగలదని ఆయన భావిస్తున్నారు ద్రవ్యోల్బణం ఇంకా ఆ స్థాయికి రాలేదు. ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్ 2024లో 5.49 శాతంగా ఉన్నది. అఖిల భారత వినియోగదారు ఆహార ధర సూచీ 9.24 శాతం వద్ద ఉన్నది. ఈ నెలలో విడుదలైన ఆర్బీఐ ద్రవ్య విధాన నివేదిక ఆ రెండు అంశాలపై ఏమి చెప్పిందో వివరంగా చూద్దాం.
ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వ గణాంకాలను ఏకరవు పెట్టిన తరువాత ఆ నివేదిక ఇలా వ్యాఖ్యానించింది: ‘అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, పెచ్చరిల్లుతున్న భౌమ రాజకీయ ఘర్షణలు, పెరుగుతున్న సరఫరా గొలుసు ఒత్తిళ్లు మొదలైనవాటి కారణంగా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌లో తగ్గుదల, వాతావరణ మార్పు కారణంగా తరచు ప్రాకృతిక విపత్తులు వాటిల్లడం మొదలైనవి కూడా ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సానుకూలంగా లేవు’.
ఇక ద్రవ్యోల్బణం అదుపు విషయమై ఎదురవుతున్న చిక్కుల గురించి ఆ నివేదిక ఇలా పేర్కొంది : పెరుగుతున్న ప్రపంచ సరఫరా ఒత్తిళ్లు, ప్రతికూల వాతావరణ సంఘటనలు, వర్షపాతం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేకపోవడం, ఎడతెగకుండా కొనసాగుతున్న భౌమ రాజకీయ ఘర్షణలు, తత్ఫలితంగా సరఫరాలకు అంతరాయం, ఆహార, లోహ, ధరల పెరుగుదల, క్రూడాయిల్ ధరల చంచల స్వభావం మొదలైనవి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు దోహదపడడంలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘మంత్లీ ఎకనామిక్ రివ్యూ’ అంచనా నిక్కచ్చిగా ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ‘సంతృప్తికరం’గా ఉందని పేర్కొంటూ డిమాండ్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించవలసి ఉన్నదని హెచ్చరించింది. భౌమ రాజకీయ ఘర్షణలు అంతకంతకూ పెచ్చరిల్లిపోవడం, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలోని ద్రవ్యవిపణులలో మూల్య నిర్థారణలు అధిక స్థాయిలో ఉండడం మొదలైనవి కూడా మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సానుకూలంగా లేవని ‘మంత్లీ ఎకనామిక్ రివ్యూ’ పేర్కొంది. ఎన్‌సిఎఇఆర్‌కు మంత్లీ ఎకనామిక్ రివ్యూ అంచనా సమతౌల్యంగా ఉన్నది. పెరుగుదలకు దోహదం చేస్తున్న అంశాలను ప్రస్తావించిన తరువాత పలు ప్రతికూల అంశాలను పేర్కొంది. బ్యాంకు రుణాల మంజూరులో తగ్గుదల, వ్యక్తిగత రుణాలలో తగ్గుదల, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ పెట్టుబడుల రాక తగ్గిపోవడం మొదలైనవాటిని ప్రస్తావించింది.
నా అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థపై విహంగ దృష్టి కంటే అందుకు వ్యతిరిక్తంగా కింది నుంచి పరిశీలించవలసిన అవసరమున్నది. స్థూల ఆర్థిక రంగాన్ని పరిశీలించడంలో విహంగ దృష్టి ముఖ్యమైనది. అయితే కింది నుంచి చేసే పరిశీలనలో సామాన్య ప్రజలకు సమకూరు తున్న ప్రయోజనాలు, వారు ఎదుర్కొంటున్న యాతనలు విశదమవుతాయి. ప్రజలను అమితంగా ఆందోళన పరుస్తున్న విషయాలు: పెచ్చరిల్లుతున్న నిరుద్యోగిత, అధిక ద్రవ్యోల్బణం, ఎదుగుబొదుగు లేని వేతనాలు, పేదలు, సంపన్నుల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, మితిమీరిన క్రమబద్ధీకరణ, జీఎస్టీ పాలనా వ్యవహారాలు కఠోరంగా, భరించలేనివిగా ఉండడం, నాణ్యత కొరవడిన విద్య, అందుబాటులో లేని వైద్య సేవలు, ప్రభుత్వోద్యోగుల నిర్లక్ష్య వైఖరులు, పేదల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన సొమ్మును సంపన్నులకు అనుకూలంగా వ్యయపరచడం మొదలైనవి. వీటితో పాటు మరెన్నో విషయాలు ప్రజల శ్రేయస్సుకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి యుద్ధాలు. పశ్చిమాసియాలో అమానుష యుద్ధం, దాని ప్రభావం మరిన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. అలాగే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలు సైతం పాల్గొనడం అనివార్యమయ్యే పరిస్థితులు క్రమంగా నెలకొనడం. సరే, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో పరిస్థితులు ఏ క్షణాన అయినా బద్దలయ్యే అగ్ని పర్వతంలా కొనసాగుతుండడం ఎంతైనా ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికలలో ప్రజల తీర్పు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. చైనా–తైవాన్, అలాగే ఉభయ కొరియాల మధ్య పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవచ్చు. మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆశాజనకంగా లేదన్నది ఒక కొట్టివేయలేని వాస్తవం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు జాగ్రత్తపడడం అవశ్యం.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)