Share News

‘సుప్రీం’ చెప్పిన హక్కు

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:47 AM

పర్యావరణ పరిరక్షణకోసం కృషిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మంచి ఉత్తేజాన్ని, ఊతాన్నీ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఉపకరిస్తుంది. వాతావరణమార్పుల వల్ల...

‘సుప్రీం’ చెప్పిన హక్కు

పర్యావరణ పరిరక్షణకోసం కృషిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మంచి ఉత్తేజాన్ని, ఊతాన్నీ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఉపకరిస్తుంది. వాతావరణమార్పుల వల్ల సంభవించే దుష్ప్రభావాలకు లోనుగాకుండా జీవించేహక్కు ఈ దేశపౌరుడికి ఉన్నదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేయడం ఈ తీర్పులో విశేషమైన అంశం. వాతావరణమార్పులు మన నిత్యజీవితంమీద విశేషమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, వాటినుంచి రక్షణపొందే హక్కు పౌరులకు ఉన్నదని సుప్రీంకోర్టు నిర్ధారించడం, దానిని ప్రత్యేకప్రాథమిక హక్కుగా గుర్తించడం ప్రశంసనీయమైన విషయం. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు, జీవించే హక్కుల పరిధిలోకే ఇది కూడా వస్తుందని చెప్పడం వల్ల పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇక ప్రభుత్వాలు గతమంత నిర్లక్ష్యంగా ఉండలేవని చాలామంది నమ్ముతున్నారు.

మూడేళ్ళనాటి కేసులో, మార్చి 21న ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, మొత్తం తీర్పు పాఠాన్ని మొన్న శనివారం సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో దానిమీద విశ్లేషణలు, చర్చలు క్రమంగా జోరందుకుంటున్నాయి. అభివృద్ధిపేరిట మానవుడు సాగిస్తున్న విధ్వంసవల్లనూ, క్లైమేట్‌ ఛేంజ్‌ కారణంగానూ అంతరించిపోతున్న అరుదైన పక్షిజాతుల్లోకి చేరిపోయిన బట్టమేకపక్షి, గడ్డి నెమలి పరిరక్షణకు ఉద్దేశించిన కేసు ఇది. గుజరాత్‌, రాజస్థాన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో జీవించే ఈ అరుదైన పక్షిజాతుల రక్షణనిమిత్తం మూడేళ్ళక్రితం అక్కడ ఎత్తయిన విద్యుత్‌ టవర్ల నిర్మాణంమీద సుప్రీంకోర్టు నిషేధం విధించింది. సౌర, పవన విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఎంతగానో వీలైన, కీలకమైన ప్రాంతాలు ఇవి. సోలార్‌ ఎనర్జీ కంపెనీలు నిర్మించిన ఎత్తయిన టవర్లకు, విద్యుత్‌ సరఫరా లైన్లకు ఢీకొనడం వల్లనూ, వాటిపరోక్షప్రభావంతోనూ ఈ పక్షులు మరణిస్తుండటంతో పర్యావరణప్రేమికులు కేసులు వేశారు. దీనితో, ఇకపై విద్యుత్‌లైన్లను భూగర్భంలోనే నిర్మించాలని, ఇప్పటికే ఉన్నవాటిని భూగర్భంలోకి మార్చాలని కోర్టు మూడేళ్ళక్రితం ఆదేశించింది. ఇది సాంకేతికంగా సాధ్యం కాదని, విపరీతమైన ఖర్చుదారీ వ్యవహారమని సదరు కంపెనీలు ఆ తరువాత కోర్టుకు నివేదించుకున్నాయి. దాని ఆదేశాలవల్ల పునర్వినియోగ ఇంధన రంగం ఎంతగా దెబ్బతినిపోతుందో చెప్పుకొని బావురుమన్నాయి. దీనికితోడు, మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు వాటిపక్షాన కోర్టులో ఆ తీర్పుమీద తమ అభ్యంతరాలను, అభ్యర్థనలను దాఖలుచేశాయి. దీనితో ఇప్పుడు న్యాయస్థానం విద్యుత్‌ తరలింపునకు భూగర్భంలో వేసిన కేబుల్స్‌ మాత్రమే వాడాలన్న తన గత ఆదేశాలు స్వచ్ఛ ఇంధన లక్ష్యాల సాధనలో భారత్‌ వెనుకబాటుకు కారణమవుతాయని గుర్తించింది. తన గతకాలపు ఆదేశాలను పూర్తిగా ఉపసంహరించుకొని ఈ ప్రాంతాల్లో అరుదైన పక్షిజాతుల రక్షణ, టవర్లు, కేబుల్స్‌ నిర్మాణంతో ముడిపడిన స్వచ్ఛ ఇంధనవృద్ధి విషయంలో ఏం చేయాలో చెప్పమంటూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

సౌరవిద్యుత్‌ మీద నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెడుతూండటం, అదానీ, అంబానీ సహా బడా కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు సౌరవిద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెడుతూండటం, దేశవ్యాప్తంగా విస్తరిస్తూండటం తెలిసిందే. స్వచ్ఛ ఇంధనం పేరుతో సాగుతున్న ఈ వ్యవహారం పర్యావరణానికి ఏ మేరకు మేలుచేస్తుందన్నది అటుంచితే, సర్వోన్నతన్యాయస్థానం గతంలో తాను ఇచ్చిన తీర్పును ఇప్పుడు సవరించుకుంటూనే పర్యావరణానికీ, మనిషి మనుగడ హక్కుకూ మధ్య సంబంధం విషయంలో నాలుగు మంచిమాటలు చెప్పింది. పునర్వినియోగ ఇంధనం దేశానికి ఎంతో అవసరమని చాలాలెక్కలు, లక్ష్యాలు, అంతర్జాతీయ ఒప్పందాలు ఏకరువుపెడుతూనే స్వచ్ఛమైన పర్యావరణం లేకపోతే సమానత్వ హక్కు, జీవించే హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని వివరించింది. పర్యావరణమార్పులకు సంబంధించి భారతదేశంలో ఓ చట్టం లేదన్న విషయాన్ని గుర్తుచేస్తూ, చట్టంలేనంతమాత్రాన దుష్ప్రభావాలనుంచి భద్రంగా ఉండే హక్కు భారతీయులకు లేకపోలేదని హెచ్చరించింది. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాపాడాలన్నది సందేశం. పర్యావరణ పరిరక్షణ ఎవరో కొంతమంది ఉద్యమకారులకు పరిమితమైన వ్యవహారం కాదని, అది ప్రభుత్వాల విధి అంటున్న ఈ తీర్పు పాలకులను కదిలిస్తుందని ఆశిద్దాం.

Updated Date - Apr 11 , 2024 | 03:47 AM