Share News

విగ్రహాల ఏర్పాటులో ఔచిత్యం ఉండొద్దూ?

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:45 AM

ఈ మధ్య చాలామంది గొప్ప తెలుగువారు చనిపోయారు. వారంతా ప్రజల హృదయాలలో జీవిస్తున్నవారే. రచయితలు, భాషావేత్తలు, నృత్య గురువులు, చిత్రకారులు, రాజకీయ నాయకులు... ఇలా వీరంతా సమాజాన్ని ప్రేమించినవారు,

విగ్రహాల ఏర్పాటులో ఔచిత్యం ఉండొద్దూ?

ఈ మధ్య చాలామంది గొప్ప తెలుగువారు చనిపోయారు. వారంతా ప్రజల హృదయాలలో జీవిస్తున్నవారే. రచయితలు, భాషావేత్తలు, నృత్య గురువులు, చిత్రకారులు, రాజకీయ నాయకులు... ఇలా వీరంతా సమాజాన్ని ప్రేమించినవారు, సమాజంలో సాంస్కృతిక చైతన్యం, అభ్యుదయ పరంపర అన్ని దిశలకూ వ్యాపించాలని తమజీవితకాలంలో ఘనమైన కృషిచేసినవారనడంలో సందేహంలేదు.

వారంతా వారి వారి రంగాలలో ఎంతో పేరొందినవారు, సంఘానికి ఎన్నో సేవలందించినవారు. ఎన్నో విషయాలలో ఎంతోమందికి మార్గదర్శకులు. గురజాడ వారన్నట్టు స్వంత లాభం కొంత మానుకొని పరుల మేలుకు పాటుపడినవారు.

పుట్టినాక చనిపోవడం ఎలాగూ తప్పదు. చనిపోయిన వాళ్లలో మంచివారూ ఉంటారు, చెడ్డవారూ ఉంటారు, అయినవారూ ఉంటారు, కానివారూ ఉంటారు. చనిపోయిన వారి విగ్రహాలు నెలకొల్పునపుడు ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, సంఘానికి వారు చేసిందేమిటో బేరీజు వేసుకొని విగ్రహాలు నెలకొల్పాలి కాని ఎవరికిష్టమైనట్లు వారు, ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీ వారివి, అధికారాన్ని ఆసరాగా తీసుకొని నెలకొల్పడం ఎంతమాత్రం సమంజసం కాదు.

ఒక విగ్రహాన్ని నెలకొల్పడానికి అతడేమి చేశాడన్నది కారణం కావాలి కాని అతడేమయినాడన్నది కారణం కాకూడదు. ఒకడు పదేపదే శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరేమైనా కావచ్చు. అదే విధంగా అలాంటివారు రాజకీయరంగంలోనే కాక మరోరంగంలో కూడా ఉండవచ్చు. విగ్రహావిష్కరణకు కారణం సంఘసేవ కావాలి కాని, స్వసేవ మాత్రమే కాకూడదు కదా?

విగ్రహాలు నెలకొల్పుటకు ఆయా రంగాలకు చెందిన సుప్రసిద్ధులతో కొన్ని కమిటీలు వేయాలి. ఎవరి విగ్రహాలైతే పెట్టాలని అనుకుంటారో వారి బయోడేటా ఆ కమిటీ సభ్యులకు అందజేయాలి. ఆ కమిటీవారు సచ్ఛీలురను, సమర్థులను ఎంపిక చేసి సమర్పించాలి. వారినుండి ప్రభుత్వం ఎంపిక చేయాలి. ఆ ఎంపిక చేసినవారిని రాష్ట్ర శాసనసభ లేక కేంద్ర పార్లమెంటు ఆమోదించాలి. అలా ఆమోదించినవారి విగ్రహాలు మాత్రమే నెలకొల్పాలి. అప్పుడది రాజ్యాంగబద్ధమౌతుంది. అందువలన వాటిని ఇష్టానుసారం మార్చడానికి కాని, పాడుచేయడానికి కానీ వీలుండదు.

అలా నెలకొల్పని వాటికి శాసనపరమైన, పరిపాలనాపరమైన రక్షణ కాని, స్థిరత్వం కానీ ఉండదు. అందువలన అలా నెలకొల్పినవి పరిహాసాలపాలయ్యే అవకాశముంటుంది. అలా పరిహాసాలపాలయిన ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తాయి.

ఎవరిష్టానుసారం వారు విగ్రహాలు నెలకొల్పితే, మార్చితే ఎలా? సంఘం సరే అనాలి కదా! విగ్రహాలు నెలకొల్పుటకు కూడా అర్హతలుండాలి. ఆయా రంగాలకు చెందిన అర్హులు ఆయా రంగాల కొరకే ఎంపిక చేయబడాలి కాని మరో రంగాలకు కాదు. ఇప్పుడు రాష్ట్రస్థాయి, దేశస్థాయి పద్మ అవార్డులకు, తదితర అవార్డులకు ఒక పద్ధతిగ ఎంపిక చేస్తున్నారు కదా! అలాగే స్థాయిలను బట్టి విగ్రహాలను ఎంపిక చేయాలి. విగ్రహాలను మార్చుటకు వీలుకాకుండా, పాడుచేయకుండా నియమాలు రూపొందించాలి.

ఈ సందర్భంగా ఒక్క ఉదాహరణ తీసుకుందాం. ప్రత్యేక తెలంగాణ కొరకు ఎన్నో ఏళ్లు, ఎంతోమంది కృషి చేశారు. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు, చనిపోయారు. చనిపోయినవారి విగ్రహాలు పెట్టడం సమంజసమే. అలాగే ఉద్యమాన్ని తగు స్థాయిలో నడిపినవారి విగ్రహాలు పెట్టడం కూడా.

ఇప్పుడు ‘తెలంగాణ తల్లి’ విగ్రహం ఒకటి పెట్టాలనుకుంటున్నారు. ఈ తల్లి ఎవరు? నన్నడిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎవరయితే ఫైరింగ్‌లో ప్రాణాలు కోల్పోయారో వారు కావాలి దానికి అర్హులు. తొలినాటి ఉద్యమంలో ఒక సిటీ కాలేజ్‌ విద్యార్థిని బుల్లెటుకు గురయి చనిపోయింది. వాస్తవానికి ఆమె విగ్రహమే పెట్టాలి. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి చనిపోయాడు. ఆయన విగ్రహం పెట్టాలి. ఇంకా ఎంతోమంది చనిపోయారు కాని వారందరి విగ్రహాలు పెట్టలేం కదా!


ఒకప్పటి ఫ్రాన్స్‌ దేశపు చాలా గొప్ప ఉద్యమాలలో ఎంతోమంది పనిచేశారు, చనిపోయారు. కాని ఒక్క ‘జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’ విగ్రహాన్ని మాత్రమే నెలకొల్పారు, ఆమె త్యాగం అత్యున్నత త్యాగం కనుక. అలా మనం కూడా చేయాలి. లేకపోతే లెక్కలేనన్ని విగ్రహాలు నెలకొల్పడం కుదరదు, సమంజసంగా ఉండదు.

ఒక మ్యూజియం లాంటిది ఏర్పరచి దానిలో చాలామంది త్యాగాలు చేసినవారి, మరణించిన వారి విగ్రహాలు పెట్టవచ్చును. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. వీథుల్లో విగ్రహాలు నెలకొల్పితే వాటి రక్షణ సంరక్షణలు కష్టం. అది ఇప్పుడు కనబడుతూనే ఉంది. నన్నడిగితే వీధులలో విగ్రహాలు నెలకొల్పడం మానుకొని మ్యూజియంలో పెట్టడమే ఉత్తమం. అలాగే విద్యారంగాలలో త్యాగాలు చేసిన వారి విగ్రహాలు విద్యాలయాలలో, వినోదరంగాలలో విజయాలు సాధించిన వారి విగ్రహాలు వినోదాలయాలలో, తక్కిన రంగాలవారివి ఆయా రంగాలకు చెందిన వాటిలో పెట్టవచ్చును. అలాగే పెట్టాలి కూడా.

ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ ముందర కూడా పెట్టదలచుకుంటే అదనంగా పెట్టవచ్చు.

– డా. వెలిచాల కొండలరావు

పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమి

Updated Date - Aug 31 , 2024 | 05:45 AM