Share News

ఆరని అగ్ని!

ABN , Publish Date - May 04 , 2024 | 04:41 AM

మణిపూర్‌లో హింస చెలరేగి మే 3వ తేదీకి ఏడాది అయింది. సుదీర్ఘ కాలం సాగిన ఆ హింస కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 227మంది మరణించారు, డెబ్బయ్‌వేలకుపైగా...

ఆరని అగ్ని!

మణిపూర్‌లో హింస చెలరేగి మే 3వ తేదీకి ఏడాది అయింది. సుదీర్ఘ కాలం సాగిన ఆ హింస కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 227మంది మరణించారు, డెబ్బయ్‌వేలకుపైగా నిరాశ్రయులైనారు. మీతీలకూ, కుకీ–జో తెగలకు మధ్య రేగిన ఆ చిచ్చు ఇప్పటికీ రాష్ట్రాన్ని వదలకుండా ఉన్నది. ఎడతెరిపిలేని ఘర్షణలతో ఆయా తెగలవారు ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితులు పూర్తిగా మాయమైనాయి. వారంక్రితం కూడా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఏడాది కాలంలో ప్రధానంగా వచ్చినమార్పు ఒకటే. మీతీల ఆధిపత్యం ఉన్న ఇంఫాల్‌ లోయలో కుకీ–జో తెగకు చెందిన ఒక్కరు కూడా ఉండటం లేదు. అలాగే, కుకీ–జో ఆధిపత్యం ఉన్న కొండప్రాంతాల్లో ఒక్క మీతీకూడా మిగల్లేదు. ప్రజల మధ్య అపనమ్మకాలు, అనుమానాలు తప్ప పలకరింపులు కూడా మాయమైపోయాయి. విభజనరేఖలు గీయడంలో రాష్ట్ర పాలకులు విజయం సాధించారు.


ఒక భయానక ఘటన జరిగింది కనుక మే 3, 2023చరిత్రపుటల్లోకి ఎక్కింది కానీ, మణిపూర్‌ హింసకు పునాదులు అంతకుముందే పడ్డాయి. అప్పటికే బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం మీద కుకీ–జో తెగల్లో అవిశ్వాసం తీవ్రస్థాయిలో ఉంది. ఆ తెగలవారు మాదకద్రవ్యాల అక్రమరవాణాకు కారణమని, నల్లమందు, గసగసాలు ఇత్యాది పంటలు పండిస్తున్నారని, అత్యధికులు అక్రమంగా వలసవచ్చినవారే తప్ప స్థానికులు కారని ఏవేవో వాదనలతో బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది, వేట ఆరంభించింది. వారు తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకొని, గ్రామాలను ఖాళీచేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఈ తెగల ఆ‍ధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భూములు కోల్పోతామన్న భయంలో ఈ తెగలున్న తరుణంలోనే, మీతీలను ఎస్టీలుగా గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ఆదేశించింది. ఏకపక్షం, చట్టవ్యతిరేకం, పరిధుల అతిక్రమణ, అనవసరపు చొరవ ఇత్యాది తీవ్రపదజాలంతో సుప్రీంకోర్టు అనంతరకాలంలో ఈ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టి, పక్కనబెట్టిన మాట అటుంచితే, మీతీలకు ఎస్టీ హోదా అన్న హైకోర్టు మాటలు పాతగాయాలను రేపి, ఆరనిమంటలు సృష్టించాయి. కొండప్రాంతాలకు చెందిన నాగా, కుకీ–జోల కంటే ఇంఫాల్‌లోయలో ఉండే మీతీలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది రాజకీయంగానూ ఆధిపత్య స్థానంలో ఉన్నారు. ఎక్కువమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరకు బీరేన్‌సింగ్‌ కూడా మీతీయే. కోర్టు ఆదేశాల వెనుక బీరేన్‌ కుట్ర ఉన్నదని, మీతీలకు ఆదివాసీ హోదా దక్కితే తమ భూములు వారి వశమైపోతాయని ఆదివాసులు భయపడ్డారు. కొండప్రాంతాల్లోని భూములకు రాజ్యాంగపరమైన ప్రత్యేక రక్షణలు ఉన్నందున, వాటిని వశం చేసుకోవడానికే ఆదివాసీయేతరులైన మీతీలు ఆదివాసీలుగా మారుతున్నారని ఈ తెగలు విశ్వసించాయి. మే 3న గిరిజన తెగలన్నీ కలసికట్టుగా అతిపెద్ద నిరసన సభ నిర్వహించడం, అది ముగియగానే మీతీలకూ, ఆదివాసీ తెగలకు మధ్య ఘర్షణలు రేగి, హింసాత్మక ఘటనలకు దారితీయడం తెలిసినవే.


హింసను అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని మొదట్లో అనుకున్నప్పటికీ, బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం హింసను ప్రోత్సహించిందని ఆ తరువాత చాలా నివేదికలు ఆరోపించాయి. మీతీ యువకులకు పోలీసులే అండదండలు అందించారని, ఆయుధాగారాలు దోచుకొనేందుకు అనుమతించారని విమర్శలువచ్చాయి. రెండునెలలపాటు రాష్ట్రం తగలబడుతున్నా, తప్పుడు సమాచారంతో, వాదనలతో పాలకులు కాలాన్ని నెట్టుకుంటూ వచ్చారు, ప్రధానమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోగా నోరువిప్పకూడదని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, మీతీయువకులు కొందరు ఇద్దరు కుకీమహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం అత్యాచారం చేసిన ఘటనలకు సంబంధించిన విడియో ఒకటి జులైలో బయటకు వచ్చి దేశాన్ని కుదిపేయడంతో, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని సంఘటనలతో కలిపి ప్రధాని ఈ దారుణాన్ని మాటమాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. ఇంతజరిగినా బీజేపీ పెద్దలు ముఖ్యమంత్రిని మార్చకపోవడం విశేషం. సరైన సమయంలో, సరైన చర్యలతో తమ ప్రభుత్వం హింసను చక్కగా అదుపుచేసిందని ఇటీవలి ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోదీ ప్రకటించారు. గత పక్షంరోజుల్లోనే కనీసం నాలుగు హింసాత్మక ఘటనలు జరిగిన విషయాన్ని అటుంచితే, మానసికంగా ఎప్పుడో విడిపోయిన మణిపూర్‌ ఇప్పుడు స్వయం పాలిత ప్రాంతాల డిమాండ్‌తో చీలిపోవడానికి సిద్ధంగా ఉంది.

Updated Date - May 04 , 2024 | 04:41 AM