Share News

మళ్లీ సఖ్యత!

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:12 AM

వైవిధ్యంలోనూ, ప్రజాస్వామ్యంలోనూ భారతదేశం చాలాదేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మాల్దీవులు సైతం ఎంతో స్ఫూర్తిపొందుతున్నదని ఆ దేశ విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్య, ఇరుదేశాల...

మళ్లీ సఖ్యత!

వైవిధ్యంలోనూ, ప్రజాస్వామ్యంలోనూ భారతదేశం చాలాదేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మాల్దీవులు సైతం ఎంతో స్ఫూర్తిపొందుతున్నదని ఆ దేశ విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్య, ఇరుదేశాల సంబంధాల్లో వస్తున్న మార్పుకు నిదర్శనం. భారతదేశంతో సాన్నిహిత్యాన్ని, సత్సంబంధాలను తమ అధ్యక్షుడు బలంగా కోరుకుంటున్నారని ఆయన స్పష్టంచేశాడు. ఇదంతా ఇటీవల మన విదేశాంగమంత్రి ఆ దేశంలో పర్యటించివచ్చిన ప్రభావం. బంగ్లాదేశ్‌లో మనకు జరిగిన నష్టం మాల్దీవుల్లో భర్తీ అయిందని కొందరి విశ్లేషణ.


షేక్‌ హసీనా కంటే, ఆమె పార్టీకంటే తామే భారతదేశంతో అధికంగా సత్సంబంధాలు కోరుకుంటున్నామని బీఎన్పీ నాయకుడు ఒకరు ఈ మధ్యన వ్యాఖ్యానించారు. అక్కడ ఎన్నికలు జరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వ్యాఖ్యల్లో నిజాయితీ ఎంతో తెలుస్తుంది. కానీ, ముజబూర్‌ రహ్మాన్‌ కుమార్తె అధికారంలో ఉన్నంత కాలం భారతదేశం సరిహద్దుల వరకూ ప్రశాంతంగా ఉన్నమాట నిజం. దానికి ముందు బీఎన్పీ–జమాత్‌ కూటమి అధికారంలో ఉండగా ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు, అక్రమరవాణాలు, ఈశాన్యంలో తిరుగుబాటుదారులకు సహకారం ఇత్యాది బాధలు అనేకం భారత్‌ అనుభవించింది. ఇప్పుడు హసీనా నిష్క్రమణతో, చుట్టుపక్కల దేశాలన్నీ వరుసపెట్టి మనకు దూరమవుతున్నాయన్న ఆందోళన అధికమవుతున్న తరుణంలో మాల్దీవుల నుంచి ఈ సానుకూల వైఖరి మనలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది.

మాల్దీవుల అధ్యక్షపదవికి మహ్మద్‌ మొయిజ్జు పోటీపడిందే భారతవ్యతిరేక ప్రచారంతో. ఇతరత్రా కారణాలతో కూడా అక్కడి ప్రజలు ఆయనకు ఓటువేసివుండవచ్చును కానీ, ఎన్నికల ప్రచారంలో చెప్పినదానికి అనుగుణంగా భారతదేశ సైనికులను తనదేశంనుంచి పంపించివేయడానికి ఆయన గట్టిగా పట్టుబట్టాడు. మొదట్లో కాస్తంత బెట్టుచేసినా, భారతదేశం కూడా అందుకు అంగీకరించింది. మాల్దీవులకు బహూకరించిన హెలికాప్టర్లు, రక్షణ సామగ్రి నిర్వహణ, శిక్షణ నిమిత్తం భారత సైనికులు అక్కడ ఉన్నారన్నది మన వాదన. ప్రకృతి విపత్తుల్లో కూడా మన సైనికులు ఆ దేశానికి సహకరిస్తున్నారు. కానీ, తనదేశంలో మన సైనికుల ఉనికిని మొయిజ్జు అంగీకరించలేదు. చివరకు ఆ తొంభైమంది ‘సైనికుల’ స్థానంలోకి మన ‘సాంకేతికనిపుణులు’ వెళ్ళడంతో సమస్య పరిష్కారమైపోయింది. ఈ సైనికుల ఉపసంహరణతో పాటు, లక్షద్వీప్‌ వ్యవహారం కూడా రెండు దేశాల మధ్యా అగాధాన్ని పెంచింది.


ప్రధాని మోదీ లక్షద్వీప్‌ వెళ్ళి, పర్యాటక స్థలంగా అది అద్భుతమైనదంటూ కొన్ని చిత్రాలను ప్రచారంలోకి పెట్టడం, బీజేపీ అభిమానులు, నాయకులు కొందరు దానిని అందిపుచ్చుకొని మాల్దీవులను పర్యాటకంలో దెబ్బతీయాలంటూ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇందుకు ప్రతిగా ఆ దేశంనుంచి హద్దులు దాటి మాట్లాడిన కొందరు మంత్రులను మొయిజ్జు వెంటనే తొలగించారు. ఆయనను అభిశంసించడానికి అక్కడి విపక్షాలు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు.

ఇంతటి తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బంధాలు తిరిగి అతుక్కోవడం కచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. జయశంకర్‌ తన పర్యటనలో మాల్దీవుల్లో భారతదేశం ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రాజెక్టుల స్థితిగతులను సమీక్షించారు, ౨8దీవులకు మంచినీరు సరఫరా చేసే మరో వెయ్యికోట్ల రూపాయల ప్రాజెక్టులను ఆరంభించారు. ఇందుకు మొయిజ్జు కృతజ్ఞతలు తెలియచేశారు, రెండుదేశాల మధ్యా సహకారం హెచ్చుతోందన్నారు. ఇటీవల తనదేశ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంలోనూ ఆయన భారతదేశం మాల్దీవులను రుణాల చెల్లింపుల భారంనుంచి కాపాడిందనీ, మాల్దీవుల ఆర్థికస్వావలంబనను పరిరక్షించిందనీ ప్రశంసలు కురిపించారు.


భారత్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదర్చుకుంటానని కూడా ప్రకటించారు. మాల్దీవులకు ప్రకటించిన రుణాలు, ప్రాజెక్టులు ఇత్యాది అంశాల్లో భారతదేశం ఏ మాత్రం తన వైఖరిని మార్చుకోకుండా నిజానికి మరిన్ని అధిక కేటాయింపులతో గత కొద్దినెలలుగా వ్యవహరిస్తూ వచ్చింది. మొయిజ్జు వైఖరితో నిమిత్తం లేకుండా అక్కడి ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. భారతదేశాన్ని దూరం చేసుకుంటే తమ పర్యాటకరంగం తీవ్రంగా నష్టపోతుందని ఆ దేశానికి తెలిసివచ్చింది. తీవ్ర ఆర్థికసంక్షోభంలో ఉన్న మాల్దీవులకు ప్రకృతి విపత్తులతో పాటు అన్ని ఆపదల్లోనూ భారత్‌మీదే ఆధారపడాలని తెలియనిదేమీ కాదు.

Updated Date - Aug 20 , 2024 | 01:12 AM