ట్రంప్ హెచ్చరికలు
ABN , Publish Date - Jul 20 , 2024 | 04:47 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలబరినుంచి జోబైడెన్ తప్పుకోబోతున్నారని, సదరు నిష్క్రమణ ఉన్నతంగా, గౌరవంగా ఉండేందుకు ఏమిచేయాలన్న వ్యూహరచన ప్రస్తుతం సాగుతోందని వార్తలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలబరినుంచి జోబైడెన్ తప్పుకోబోతున్నారని, సదరు నిష్క్రమణ ఉన్నతంగా, గౌరవంగా ఉండేందుకు ఏమిచేయాలన్న వ్యూహరచన ప్రస్తుతం సాగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తరువాత బైడెన్‌కు ఎదురుగాలి మరీ ఎక్కువైంది. ఒకపక్క సర్వేలు బైడెన్ వెనుకబడినట్టుగా చెబుతూంటే, మరోపక్క ఆయన ఇలా మాటల్లోనూ, చేతల్లోనూ తడబడుతూంటే ఈమారు విజయం అసాధ్యమని డెమోక్రాట్లకు అనిపించింది. ఇంతలో, ట్రంప్‌మీద హత్యాయత్నం జరగడంతో ఉన్న ఆశలు కూడా నీరుగారిపోయాయి. ట్రంప్ రెండడుగులు ముందున్నారని సర్వేలు తేల్చేశాయి. దీనికితోడు, ఇప్పుడు బైడెన్‌ను కరోనా చుట్టుముట్టి కదల్లేకుండా చేసింది. ఇన్ని కష్టాల మధ్య, ఇంతవయసులో పదవికోసం పాకులాడటం దేనికని బైడెన్‌కు జ్ఞానోదయం కలిగివుండవచ్చు. ఆయన తప్పుకొని ఆ స్థానంలో ఎవరు వచ్చినా ఈ ఆఖరుదశలో ఏమి అద్భుతాలు చేయగలరన్న ప్రశ్న ఉండనే ఉంది. ఎవరిని అధికారపీఠంమీద కూచోబెట్టాలన్నది అంతిమంగా అమెరికన్ల ఇష్టాయిష్టాలమీద ఆధారపడి ఉంటుంది కానీ, అది డోనాల్డ్ ట్రంప్ అయినపక్షంలో అమెరికా విదేశాంగవిధానంమీద ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట నిజం.
ఇటీవల రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ సందర్భంగా తైవాన్‌కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలవోకగా అన్నవి కావు. చైనానుంచి దానిని రక్షించాలంటే అమెరికాకు తైవాన్ మరింత ఎక్కువ కప్పం కట్టాలన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. తైవాన్‌ను కాపాడటానికి చాలా ఖర్చవుతోందనీ, అమెరికా చిప్‌మార్కెట్‌ను తన్నుకుపోయి, ఇక్కడి ఉపాధి అవకాశాలను చావుదెబ్బతీసిన తైవాన్ భద్రతకు పూచీపడాలంటే ఆ రేటు ఎక్కువగా ఉంటుందని ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. తైవాన్ అతిజాగ్రత్తగా ప్రతిస్పందించింది కానీ, ట్రంప్‌మాటలు అమెరికా విశ్లేషకులకు, మీడియాకు ఆగ్రహాన్ని కలిగించాయి. నేను అధికారంలోకి రాగానే నువ్వు తైవాన్‌తో యుద్ధం చేయి, దానిని వశం చేసుకో, నేను నోరువిప్పను, జోక్యం చేసుకోను అని ట్రంప్ ముందే చైనాకు సందేశం ఇచ్చేశారని, దానిముందు సాగిలబడ్డారని సుప్రసిద్ధ అమెరికన్ దినపత్రిక తీవ్రంగా విరుచుకుపడ్డది. తైవాన్‌ను ఆదినుంచీ అమెరికా కాపాడుకొస్తున్నది. ఈ మధ్యన చైనా సైనికకవాతులతో, యుద్ధవిమానాలతో తైవాన్‌ను బెదిరించినప్పుడు అమెరికా మరింత తీవ్రంగా రంగంలోకి దిగింది. తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవాలన్న చైనా లక్ష్యం, దాని ప్రాతిపదికలు, విధానాలు అందరికీ తెలిసినవే. ఈ నేపథ్యంలో, తైవాన్‌ను ట్రంప్ తూలనాడటం, అది తన భద్రతను తానే చూసుకోవాలని అనడం, 68మైళ్ళ దూరంలో ఉన్న చైనా దానిని దురాక్రమించిన పక్షంలో 9, 500మైళ్ల దూరంలో ఉన్న అమెరికా వచ్చి రక్షించడం అసాధ్యమన్న భావన వెలిబుచ్చడం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏటా కొన్ని వందలకోట్ల ఆయుధసామగ్రిని అమెరికానుంచి అది కొంటున్నది. పెడుతున్న ఖర్చుకంటే అమెరికా పొందుతున్నదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. గత నలభైయేళ్ళ కాలంలో కనీసం వందసార్లు అమెరికా అమ్మిన ఆయుధాలన్నీ బేరం లేకుండా కొని తైవాన్ తన రక్షణఫీజు చెల్లించుకుంటూనే ఉంది. అయినా కూడా ట్రంప్, అనంతరం ఆయన విధాన సలహాదారు ఈ వ్యాఖ్యలు చేశారంటే, తైవాన్‌నుంచి మరింత పిండుకోవాలన్నది ఉద్దేశం కావచ్చు, లేదా చైనాకు శాంతి, సయోధ్యల సందేశమూ కావచ్చు. చైనాతో బేరసారాలకు తైవాన్‌ను ఎరవేసేప్రయత్నమూ కావచ్చు. ఈ సందర్భంగా ఆయన అమెరికాను ఓ బీమాకంపెనీతో పోల్చడం విశేషం. మరి, ప్రాణంమీదకు వస్తే, తైవాన్‌ను వచ్చి రక్షిస్తుందా? ట్రంప్ వ్యాఖ్యల్లో లేదన్న సమాధానం స్పష్టంగా ఉంది. ఆయన గతంలో జింగ్‌పింగ్‌తో మాట్లాడుతూ ఒకే చైనా విధానానికి సానుకూలత వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. తాను అధికారంలో ఉండివుంటే యుద్ధమే జరిగేది కాదన్న ట్రంప్ ఆ తరువాత ఉక్రెయిన్‌కి అందించే ఆయుధ, ఆర్థిక సహాయాల విషయంలో ఇప్పటివిధానానికి పూర్తిభిన్నంగా వ్యాఖ్యలు చేస్తూ జెలెన్‌స్కీని ఇరుకునపెట్టారు. తాను గెలిస్తే సైనికసాయం ఆపేస్తానని ప్రకటించి, పుతిన్‌తో బేరాలాడుకున్న విమర్శలు ఎదుర్కొన్నాడు. తైవాన్, ఉక్రెయిన్, గాజా ఇత్యాది విషయాల్లో రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే గనుక ట్రంప్ ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాలి.