Share News

మూర్తీభవించిన ప్రజాస్వామ్య పరిణతి

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:08 AM

వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తయ్యిందని, వారు రాజకీయాల నుంచి కూడా విశ్రాంతి తీసుకోబోతున్నారు అన్న విషయం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అయితే ఆయన ‘ఐ హేవ్‌ రిటైర్డ్‌ ఫ్రం

మూర్తీభవించిన ప్రజాస్వామ్య పరిణతి

వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తయ్యిందని, వారు రాజకీయాల నుంచి కూడా విశ్రాంతి తీసుకోబోతున్నారు అన్న విషయం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అయితే ఆయన ‘ఐ హేవ్‌ రిటైర్డ్‌ ఫ్రం పోలిటిక్స్‌, బట్‌ నాట్‌ టైర్డ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ లైఫ్‌’ అని అనటం సంతోషదాయకం. రాజ్యసభకు నేతృత్వం వహించే బాధ్యత పూర్తి అయినప్పటికీ ఆయన గడించిన అనుభవాలు భవిష్యత్తులో ఎంతోకాలంపాటు దేశానికి లాభం చేకూరుస్తాయని, ప్రజాజీవితంలో పనిచేస్తున్న మావంటి కార్యకర్తలకు మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను.

వెంకయ్యనాయుడు ఎల్లప్పుడు దేశ యువతకు అత్యంత చేరువగా ఉంటూ, యువజనుల అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు. పార్లమెంట్‌లో కూడా యువ సభ్యులను ప్రోత్సహిస్తూ, వారికి మార్గదర్శకంగా నిలిచేవారు. విద్యార్థినీ విద్యార్థులను కలుసుకుని, వారితో సంభాషించేందుకు విశ్వవిద్యాలయాలకు, ఎన్నో సంస్థలకు తరచూ వెళుతూ ఉంటారు. కొత్త తరంతో సదా అనుబంధం కొనసాగిస్తూ ఉన్నారు. యువత కూడా ఆయన్ని కలుసుకోవటానికి ఉత్సుకత చూపుతూ ఉంటుంది. పార్లమెంట్‌ వెలుపల ఉపరాష్ట్రపతిగా ఆయన చేసిన ఉపన్యాసాల్లో 25 శాతం యువత మధ్య చేసినవే కావటం గొప్ప విశేషం. యువతలోనూ, ప్రజల్లోనూ ఆయనకు గల ఆదరాభిమానాలకి ఇది ప్రధాన కారణం.

పార్టీ కార్యకర్తగా ఆయన అంకితభావం కానీ, శాసనసభ్యునిగా పనితీరు కానీ, పార్లమెంట్‌ సభ్యునిగా చూపిన క్రియాశీలత కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ప్రదర్శించిన దక్షత–నాయకత్వం గానీ, కేబినెట్‌ మంత్రిగా చేసిన నిరంతర శ్రమ గానీ, ‘నవాచార్‌’ కోసం చేసిన కృషి – పొందిన సఫలత్వం కానీ... ఇవన్నీ దేశానికి మహోపకారం చేశాయి. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభాపతిగా ఆయన తన బాధ్యతలన్నింటినీ పట్టుదలతో నిర్వహించటం చూశాను. ఎప్పుడూ ఏ బాధ్యతనీ ఆయన భారంగా భావించలేదు. అప్పగించబడిన ప్రతి పనికి న్యాయం చేశారు. పార్లమెంట్‌ సభ్యులందరితోపాటు దేశ యువత కూడా సమాజం గురించి, దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి వెంకయ్యనాయుడు నుంచి ఎంతో నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. లిజనింగ్‌, లెర్నింగ్‌, కనెక్టింగ్‌, కమ్యునికేటింగ్‌, చాటింగ్‌ ఔర్‌ రిఫ్లెక్టింగ్‌, రీకలెక్టింగ్‌, రీకనెక్టింగ్‌ వంటి ఆయన మాటలు వెంకయ్య గురించి ఎంతో తెలియపరుస్తాయి. ఆయనకున్న అపారమైన అనుభవాలు మన దేశ యువతకు మార్గనిర్దేశం చేస్తాయి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యగలుగుతాయి.


వెంకయ్యనాయుడి పుస్తకాల శీర్షికలే ఆయనకున్న పదప్రయోగ ప్రతిభను ప్రస్ఫుటింపజేస్తాయి. అయన ‘వన్‌ లైనర్స్‌’ – ‘విట్‌ లైనర్స్‌’, ‘విన్‌ లైనర్స్‌’గా కూడా ఉంటాయి. అంతే, ఆ తరువాత ఇంకేమీ చెప్పవలసిన అవసరం ఉండదు. ‘హిజ్‌ ఈచ్‌ వర్డ్‌ ఈజ్‌ హర్డ్‌, ప్రిఫర్డ్‌, రివర్డ్‌ అండ్‌ నెవర్‌ కౌంటర్డ్‌’ తన సాటిలేని భాషా పటిమ, సహజ ప్రతిభ, సమయస్ఫూర్తి సాయంతో గడ్డు పరిస్థితుల దిశని మార్చగలిగే ఆయన సామర్ధ్యాన్ని నేను అభినందిస్తున్నాను. వెంకయ్యనాయుడు దక్షిణ భారతావనిలో విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఆయనకున్న భావజాలం, తదనుగుణమైన పార్టీకి దక్షిణాదిన అప్పటికి సమీప భవిష్యత్తులో ఏ సామర్థ్యమూ ఉండే అవకాశమే లేదు. అయినా సామాన్య విద్యార్థి కార్యకర్తగా యాత్ర ప్రారంభించి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుని వంటి అత్యున్నత పదవిని చేరుకోగలిగారు. ఇది ఆయనకున్న భావనిబద్ధత, కర్తవ్యపరాయణతలకు ప్రతీక. దేశభక్తి, భావాల్ని వ్యక్తీకరించే కళ ఉంటే, భాషా వైవిధ్యంపై విశ్వాసం ఉంటే, ‘భాష–ప్రాంతం’ అనేవేవీ ఎప్పుడూ మనకి అడ్డుగోడలు కావు అని వెంకయ్యనాయుడు నిరూపించారు.

వెంకయ్యనాయుడికి మాతృభాష అంటే ఎనలేని ప్రేమ. అదే విషయాన్ని ఆయన ‘‘మాతృభాష కంటిచూపు వంటిది, పరభాష కళ్ళజోడు వంటిది’’ అని చెపుతూ ఉండటం మనమంతా పలుసార్లు విన్నాం. అది ఆయన హృదయపు లోతులనుంచి వెలువడిన భావన. వెంకయ్య హయాంలో పార్లమెంట్‌ వ్యవహారాల్లో భారతీయ భాషలకి విశేష ప్రాధాన్యం ఇవ్వబడింది. వారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో సభలోని సభ్యులకు 22 షెడ్యూల్డ్‌ భాషల్లో, దేనిలోనైనా మాట్లాడటానికి అవకాశం కల్పించారు. ఆయన ప్రతిభ, కార్యనిష్ఠ ఇకపై కూడా పార్లమెంట్‌కు ఎల్లప్పుడూ ఒక దిక్సూచిలా నిలుస్తాయి. పార్లమెంటరీ మర్యాదను పాటిస్తూ సముచితమైన భాషలో ఏ సభ్యుడైనా తాను చెప్పదలచిన విషయాన్ని ప్రభావవంతంగా చెప్పవచ్చు అనేందుకు వెంకయ్య స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారు. వెంకయ్యనాయుడి నాయకత్వ ప్రతిభ, క్రమశిక్షణ రాజ్యసభ నిబద్ధతను, పనిసామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఆయన పదవీకాలంలో రాజ్యసభ పనిసామర్థ్యం 70 శాతం పెరగటమే కాక సభ్యుల హాజరు సహితం పెరిగింది. వెంకయ్య హయాంలో సుమారు 177 బిల్లులు పాసవ్వటం, లేదా వాటిపై చర్చ జరగటం ఒక రికార్డు. ఆయన మార్గదర్శకత్వంలో భారతీయ సంకల్పనలను సాకారం గావించే ఎన్నో చట్టాలు రూపొందాయి. అయన తీసుకున్న ఎన్నో నిర్ణయాల వల్ల ఎగువసభ ఎగువ దిశగా ప్రయాణం సాగించింది.


న సా సభా యత్ర న సంతి వృద్ధాః

వృద్ధా న తే యే న వదంతి ధర్మమ్‌

ఏ సభలో అయితే అనుభవజ్ఞులు ఉంటారో అదే నిజమైన సభ. కర్తవ్యబోధ చేసేవారే అనుభవజ్ఞులు అని శాస్త్రాలు చెపుతున్నాయి. వెంకయ్యనాయుడు మార్గదర్శకత్వంలో రాజ్యసభ ఆ స్థాయిని ఎంతో సమర్థంగా నిలిపింది. వారు సభలోని సభ్యులకు దిశానిర్దేశం చేయటమే కాదు, క్రమశిక్షణ దృష్ట్యా ప్రేమగా మందలించేవారు కూడా. ఆయన మాటని ఏ సభ్యుడూ ఎన్నడూ అన్యథా భావించలేదని నా విశ్వాసం. ఒక వ్యక్తి తాను చెప్పే విషయాల్ని తన వ్యక్తిగత జీవితంలో ఆచరించి చూపినప్పుడు మాత్రమే ఆయనపైన అంతటి గౌరవం ఏర్పడుతుంది.

పార్లమెంట్‌ కార్యకలాపాల్లో ఒక పరిమితిని మించి జాప్యం సభా తిరస్కారంతో సమానం అని వెంకయ్యనాయుడు భావిస్తారు. ఆయన ఆదర్శాల్లో ప్రజాస్వామ్యపు పరిపక్వతను నేను గమనిస్తున్నాను. మునుపు సభలో చర్చ జరిగేటప్పుడు గోల జరిగితే కార్యకలాపాలు నిలుపుచేయబడేవి. కానీ వెంకయ్య సభ్యులతో మాట్లాడి, సంప్రదింపులు జరిపి, సమన్వయంతో సభని కొనసాగించటంలో సఫలీకృతులయ్యారు. సభ జరిగే సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గొడవపడే పరిస్థితి ఏర్పడితే వెంకయ్య గారి నోటినుండి ‘‘లెట్‌ ద గవర్నమెంట్‌ ప్రొపోస్‌, లెట్‌ ద అపోజిషన్‌ అపోస్‌, లెట్‌ ద హౌస్‌ డిస్పోస్‌’’ అనే మాటలు గంభీరంగా వినవచ్చేవి. రాజ్యసభకు ఇతర సభ నుంచి వచ్చే బిల్లుల్ని ఆమోదించే లేక తిరస్కరించే హక్కు తప్పకుండా ఉంది. ఈ సభ వాటిని పాస్‌ చెయ్యొచ్చు, కొట్టివేయ్యొచ్చు, మార్పు చెయ్యొచ్చు, కానీ వాటిని అడ్డుకుని, నిలుపుచెయ్యాలన్న ఆలోచనకు మన ప్రజాస్వామ్యంలో తావు లేదు.

మనందరి సిద్ధాంతాలు, అభిప్రాయాలు భిన్నమైనవి అయినప్పటికీ వెంకయ్యనాయుడుకి వీడ్కోలు చెప్పటానికి సభ్యులందరం హాజరయ్యాం. ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న సౌందర్యం, గొప్పతనం. వెంకయ్య పట్ల సభకి ఉన్న గౌరవభావం. వారు ప్రత్యేకమైన పద్ధతిలో సభను నిర్వహించటంలో ఏర్పరిచిన ప్రమాణాలు ఇకపై ఈ పదవిని చేపట్టబోయేవారికి స్ఫూర్తినిస్తాయి. వారు ప్రవేశపెట్టి ఆచరించిన సంప్రదాయాల్ని రాజ్యసభ అనుసరిస్తూ దేశం పట్ల జవాబుదారీతనంతో పనిచేస్తుందని విశ్వసిస్తూ సభ్యులందరి పక్షాన, నా పక్షాన వెంకయ్యనాయుడుకి అనేకానేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


వెంకయ్య హయాంలో పార్లమెంట్‌ వ్యవహారాల్లో భారతీయ భాషలకి విశేష ప్రాధాన్యం ఇవ్వబడింది. వారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో సభలోని సభ్యులకు 22 షెడ్యూల్డ్‌ భాషల్లో, దేనిలోనైనా మాట్లాడటానికి అవకాశం కల్పించారు. ఆయన ప్రతిభ, కార్యనిష్ఠ ఇకపై కూడా పార్లమెంట్‌కు ఎల్లప్పుడూ ఒక దిక్సూచిలా నిలుస్తాయి. పార్లమెంటరీ మర్యాదను పాటిస్తూ సముచితమైన భాషలో ఏ సభ్యుడైనా తాను చెప్పదలచిన విషయాన్ని ప్రభావవంతంగా చెప్పవచ్చు అనేందుకు వెంకయ్య స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారు.

నరేంద్రమోదీ

(అనువాదం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌)

(భారత ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ అధ్యక్షుడిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు పదవీవిరమణ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో వెలువరించిన వీడ్కోలు ప్రసంగంలోని కొన్ని భాగాలు.నేడు హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవ వేడుక)

Updated Date - Jun 30 , 2024 | 06:08 AM