జయాపజయాలు
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:38 AM
మహారాష్ట్రలో మహాయుతి విజయాన్నే జాతీయ మీడియా కీర్తిస్తున్నదని, జార్ఖండ్‌లో హేమంత్ సొరేన్ ఘనవిజయం దానికి పట్టడం లేదని కాంగ్రెస్ నాయకులకు కోపం. ఎవరే రాష్ట్రాన్ని...
మహారాష్ట్రలో మహాయుతి విజయాన్నే జాతీయ మీడియా కీర్తిస్తున్నదని, జార్ఖండ్‌లో హేమంత్ సొరేన్ ఘనవిజయం దానికి పట్టడం లేదని కాంగ్రెస్ నాయకులకు కోపం. ఎవరే రాష్ట్రాన్ని ఏలుతున్నారో, వారే అక్కడ గెలిచారు తప్ప మహారాష్ట్ర విజయంలో వేరు ఘనత ఏమిటని వారి ప్రశ్న. ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాల రీత్యా కూడా పెద్దది కనుక దానికి మీడియాలో అధిక గుర్తింపు దక్కినమాట నిజం. దేశ ఆర్థిక రాజధాని ఉన్నందునా, దేశ రాజకీయాలకు వనరులు సమకూర్చగలిగే సమర్థత ఉండటంతోనూ, అనేక వరుస రాజకీయ విన్యాసాలకు, పరిణామాలకు కేంద్రం కావడంతోనూ మహారాష్ట్ర మీద ఎక్కువ దృష్టి ఉండటం సహజం. మీడియా ఇంతగా దృష్టిపెట్టినప్పటికీ మహాయుతి ఘనవిజయాన్ని ఎందుకోగానీ అది ముందుగా పసిగట్టలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఇంకా ఆర్నెల్లు కూడా కాలేదు, అప్పట్లో 48 స్థానాల్లో ముప్పై మూటగట్టి మహావికాస్ అగాఢీకి ఇచ్చిన జనం, ఇప్పుడు ఆ కూటమిని ఇంతలా ముంచేస్తారని ఊహించలేకపోయింది. పోటీచేసిన 17 ఎంపీ స్థానాల్లో పదమూడింటిని అప్పట్లో గెలుచుకోగలిగిన కాంగ్రెస్ సహా అగాఢీ పార్టీలన్నీ ఈ పరాభవాన్ని లోతుగా సమీక్షించుకోక తప్పదు.
అగాఢీకి ఆయుష్షు తీరినట్టేనని, సమీప భవిష్యత్తులో అది కోలుకోదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏక్‌నాథ్ శిందేలను సృష్టిస్తాం, మిమ్మల్ని కూల్చేస్తాం అని వెన్నుపోట్లకూ, చీలికలకూ ఒక నిలువెత్తు నిదర్శనంగా, ఆయుధంగా విపక్షపాలిత రాష్ట్రాల్లో బీజేపీ నాయకులకు ఉపకరించే ఓ వ్యక్తి ఇంత అద్భుతం చేస్తాడని ఎవరూ అనుకోలేదు. దశాబ్దాలుగా మహారాష్ట్రను ఏలిన రెండు రాజకీయ కుటుంబాలనుంచి చీలివచ్చినవారిని ముందుబెట్టి బీజేపీ నెరపిన ఈ రాజకీయాన్ని ప్రజలు ఒప్పుకుంటారనుకోలేదు. అధికారపక్షంలోనూ, విపక్షంలోనూ ఒక ఎన్సీపీ, ఒక శివసేన ఉన్నప్పుడు ఆయా పార్టీల వ్యవస్థాపకులో, వారి వారసులో ఉన్నవైపు ప్రజలుంటారని అనుకుంటాం తప్ప, వారిని దెబ్బకొట్టివచ్చినవారికి బ్రహ్మరథం పడతారని ఎలా అనుకుంటాం? విశ్లేషకులకు అర్థంకాని చిక్కుప్రశ్నలివి. నేరుగా సేన వర్సెస్ సేన యుద్ధం జరిగిన స్థానాల్లో, ఏక్‌నాథ్ శిందే డెబ్బయ్‌శాతం నెగ్గుకొస్తే, బాల్‌థాకరే పుత్రరత్నం రన్‌రేట్ ఇరవైఐదు కూడా లేదు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్‌పవార్ పక్షాన ఉన్నవారిని భయపెట్టి, బెదిరించి బీజేపీ తమవైపు తిప్పుకున్నదనీ, ఈ కూటమికి కండబలం, అర్థబలం తప్ప ప్రజాబలం లేదన్న వాదనలను ఈ ఫలితాలు వమ్ముచేశాయి. వ్యూహం ఫలించింది, నిరీక్షణ ముగిసింది కనుక ఇప్పుడు స్టీరింగ్ వీల్ ముందు ఫడ్నవీస్‌ను కూచోబెట్టి బీజేపీ నేరుగా రాజ్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇంతకాలం బీజేపీని హద్దుల్లో ఉంచగలుగుతున్న శిందే ఏంచేస్తారో చూడాలి.
పెద్దరాష్ట్రం మహారాష్ట్రలో జరిగిన అవమానం నుంచి కాంగ్రెస్‌ను ఆదివాసుల రాజ్యం కాపాడుకొచ్చింది. ఈ విజయంలో జార్ఖండ్ ముక్తిమోర్చాదే అధికవాటా అయినప్పటికీ, కాంగ్రెస్, ఆర్జెడీ ఇత్యాది ఇండియాబ్లాక్ పార్టీల సమష్టి కృషి కారణంగా బీజేపీని సుదూరంలో నిలువరించడం సాధ్యమైంది. ఎస్టీ స్థానాలే కాదు, ఎస్సీ, జనరల్ స్థానాలను సైతం ఈ కూటమి చక్కగా నెగ్గింది. హేమంత్ సొరేన్ మీద అవినీతి కేసులు, అరెస్టు, జైలు, బెయిలు ఇత్యాదివి ప్రజలమీద వ్యతిరేకంగా పనిచేసినట్టు కనిపిస్తోంది. ఈశాన్య జార్ఖండ్‌లోని సంథాల్ పరగణాస్ పూర్తిగా బంగ్లాదేశీ చొరబాటుదారులతో నిండిపోయిందనీ, అసలు ఆదివాసీలకు ఏదో అన్యాయం జరిగిపోతోందనీ బీజేపీ చేసిన ప్రచారం కూడా ఫలించలేదు. ఆదివాసులకు, ముస్లింలకు మధ్య విభజనరేఖ గీయాలన్న ప్రయత్నాన్ని ఓటర్లు తిప్పికొట్టారు. సంథాల్ పరగణాలలో ఐదేళ్ళక్రితం నాలుగుస్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఒక్కదానికే పరిమితం కావడం, మొత్తం 28 ఎస్టీ స్థానాల్లో ఒకటి మినహా మిగతావన్నీ జెఎంఎం– కాంగ్రెస్ కూటమికి దక్కడం విశేషం. జార్ఖండ్‌లో బీజేపీని నెగ్గించే బాధ్యత భుజానవేసుకున్న హిమంత బిశ్వశర్మ ఇక్కడ కూడా అసోం నమూనా ప్రయోగించాలని చూశారు. జెఎంఎం–కాంగ్రెస్ కూటమిని ముస్లిం అనుకూల, ఆదివాసీ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించిన విడియోలు అనేకం ప్రచారంలోకి వచ్చినప్పటికీ, ఆదివాసులు ఆ మాయలో పడకపోవడం, చంపయ్ సొరేన్ వంటివారి మాటలను నమ్మకపోవడం విశేషం. సంక్షేమ పథకాలతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్న హేమంత్ సొరేన్ ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటు, ఉపాధి అవకాశాలమీద కూడా దృష్టిపెట్టాలి.