Share News

ఐరోపా వంచన: నాడు యూదులు, నేడు ముస్లింలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 05:27 AM

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం యూరోపియన్‌ సమాజాలలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నెల మొదటి వారంలో నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో

ఐరోపా వంచన: నాడు యూదులు, నేడు ముస్లింలు

ఐరోపా ఆర్థిక వ్యవస్థలు సజావుగా ఉన్నంతవరకు అరబ్‌, ఉత్తరాఫ్రికా, ఆసియా దేశాల నుంచి వలసవచ్చిన వారిని బహు సంస్కృతీపరత్వం పేరుతో అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది. 2008 తర్వాత ఆర్థిక ప్రగతి తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్‌ దేశాలలోని తీవ్ర జాతీయవాద పార్టీలు వలస ప్రజల పట్ల వ్యతిరేకతని పెంచాయి. ఈ సందర్భంలోనే యూరోపియన్‌ దేశాలకు ముస్లింలు ఒక సమస్యగా పరిణమించారు. ఒక శతాబ్దం క్రితం ఆ స్థానంలో యూదులు ఉండేవాళ్ళు.

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం యూరోపియన్‌ సమాజాలలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నెల మొదటి వారంలో నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్‌– నెదర్లాండ్స్‌ మధ్య యూరోపా లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు, తరువాత అల్లర్లు, హింసాకాండ చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ అభిమానులు ‘పాలస్తీనా వాసులు చావాలి’ అని అరుచుకుంటూ రోడ్లమీద కన్పించిన వాళ్ళపైన ఖాళీ సీసాలు విసిరి, బీభత్స వాతావరణాన్ని సృష్టించారు. మరునాడు డచ్ పౌరులు ముందటి రోజు అరాచకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేశారు. శరణార్ధులని, వలస వచ్చిన వాళ్ళని వ్యతిరేకించే తీవ్ర జాతీయవాద డచ్ పార్టీ నాయకుడు గేర్ట్స్ విల్డర్స్ ఆమ్‌స్టర్‌డామ్‌ సంఘటనల్లో తన రాజకీయ లబ్ధికి ఇంకొక అవకాశం వెతుక్కున్నాడు. జరిగినదంతా ఏడు దశాబ్దాల క్రితం హిట్లర్ సైన్యాలు యూదులను వేధించిన పద్ధతిని గుర్తుతెస్తుందని విల్డర్స్‌ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్ రాజు కూడా పెద్ద డ్రామా చెయ్యటంతో, శాంతియుతంగా నిరసనలు చేసిన అనేకమందిని డచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉండే 15,000 మంది యూదు పౌరులకి, అక్కడ ఉండే అరబ్బు, ముస్లిం పౌరులకు ఇప్పటి వరకూ ఏ గొడవా లేదు. విచిత్రంగా ఐరోపా, అమెరికాలలో అనేక వార్తా పత్రికలు ఈ ఇజ్రాయెల్‌ ఫుట్‌బాల్ గూండాలని బాధితులుగాను, తమతమ ఇళ్లపై వారు దాడి చేసినందుకు నిరసన వ్యక్తం చేసిన డచ్ పౌరులని యూదు వ్యతిరేకులుగాను వర్ణిస్తూ వార్తలు రాశాయి. హింసకి పాల్పడిన ఇజ్రాయెల్ పౌరులు క్షేమంగా వెళ్లిపోయారు గానీ, డచ్ ప్రభుత్వం శాంతియుత నిరసనలని నిషేధించి, అరబ్, ఇతర డచ్ ముస్లిం పౌరులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

వంద సంవత్సరాల క్రితం యూదులను తోటి తెల్లజాతి వారుగా ఐరోపా దేశాలు పరిగణించేవి కావు. నాజీ హిట్లర్ సైన్యాలు యూరోపియన్‌ యూదులలో మూడు వంతుల మందిని సంహరించాయి. ఆ తరువాత యూరోపియన్‌ దేశాలు మిగిలిన యూదులను ఇజ్రాయెల్‌కి పంపి, తమ అపరాధ భావాన్ని పశ్చిమాసియాకి తరలించాయి. ఎప్పుడయితే ఇజ్రాయెల్ అపార చమురు నిక్షేపాల పశ్చిమాసియాలో తమ ఆర్ధిక ఆసక్తులకి కాపలా దారుగా పని చేస్తుందని అర్థమయిందో, యూదులను తెల్లజాతి వారిలో కలుపుకుని తమది ఉమ్మడి జూడో– క్రిస్టియన్ నాగరికత అని యూరోపియన్‌ దేశాలు చెప్పుకోసాగాయి. తమ అపరాధ భావాన్ని తగ్గించుకోవటంలో భాగంగా యూదులకి పరిహారాలు చెల్లించటమే కాకుండా ఇజ్రాయెల్ సమర్ధనని తమ జాతీయతా భావనలో భాగం చేసుకున్నాయి. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక కూటమి (International Holocaust Remembrance Alliance) ప్రారంభిస్తూ చేసిన స్టాక్‌హోం ప్రకటనలో హోలోకాస్ట్‌ని ‘మానవ నాగరికతకు మచ్చగా’ పరిగణించాలని, దాని జ్ఞాపకాలని అందరూ గౌరవించాలని, యూదు వ్యతిరేకతని సంఘటితంగా ఎదుర్కోవాలని ప్రకటించాయి. అలా, తమ పాపాన్ని మొత్తం ప్రపంచ దేశాల పాపంగా మార్చివేశాయి. తాము మినహా ఎవరూ పెద్దగా పాటించని తీవ్ర యూదు వ్యతిరేకతని ‘ప్రపంచ’ ప్రజలందరికీ అంటగట్టాయి.


ఈ అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక కూటమి, అనేక ఇతర శక్తిమంతమైన యూదు సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా యూదు వ్యతిరేకత అనే భావనని ఇజ్రాయెల్ ఉనికిని సమర్థించేందుకు, పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్న వారి గొంతు నొక్కటానికి వాడుకుంటూ వస్తోంది. పాలస్తీనా అక్రమణని ఎవరు ప్రశ్నించినా, అక్కడి జాతి వివక్ష విధానాలని ఎత్తి చూపినా సహించవు. వాళ్ళు ఏ జాతి, రాజకీయాలు, మతం వాళ్ళయినా సరే. యూదు వ్యతిరేకులుగా ముద్ర వేసి వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ మధ్యనే అమెరికన్ ఇజ్రాయెలీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనే అతి పెద్ద ఇజ్రాయెలీ లాబీ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఇద్దరు నల్ల జాతి డెమొక్రాట్లని కోట్లాది డాలర్లు ఖర్చు పెట్టి ఓడించింది. ప్రస్తుతం ఇటువంటి ఇజ్రాయెల్ సమర్థక సంస్థలన్నీ కలిసి అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్ని జాతుల, మతాల విద్యార్థులపై సంస్థాపరమైన దాడులు చేయిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాలలో అమెరికా, యూరోపు దేశాలు, ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్, సిరియా, లిబియా, పాలస్తీనా వంటి అనేక అరబ్బు, ముస్లిం దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక యుద్ధాలు చేసి, చేయించిన తర్వాత ఆయా దేశాల నుండి ఐరోపాకు శరణార్థులు పెరిగారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తమ శ్రామిక అవసరాల కోసం కూడా జర్మనీ లాంటి దేశాలు ఇటువంటి వలసలని ప్రోత్సహించాయి. దక్షిణాసియా లాగే వలస పాలనలో కునారిల్లిన అరబ్బు, ఉత్తర ఆఫ్రికా దేశాల వారు కూడా సహజంగానే ఐరోపాకు వలస వచ్చారు. ఆయా దేశాల్లో ఆయా భాషలు నేర్చుకుని అన్ని రకాలుగా ఇమిడిపోయారు. ఐరోపా ఆర్ధిక ప్రగతి బాగున్నంత వరకూ వీళ్లందరినీ బహు సంస్కృతీపరత్వం (మల్టీ కల్చరలిజం) పేరుతో అర్ధం చేసుకునే ప్రయత్నం జరిగింది. 2008 తర్వాత ఐరోపా ఆర్ధిక ప్రగతి కొంత తగ్గుముఖం పట్టడంతో తీవ్ర జాతీయవాద పార్టీలు శరణార్థులు, వలస ప్రజల పట్ల వ్యతిరేకతని ప్రోత్సహించి పెంచాయి. ఈ సందర్భంలోనే యూరోపియన్‌ దేశాలకు ముస్లింలు ఒక సమస్యగా పరిణమించారు. ఒక శతాబ్దం క్రితం ఆ స్థానంలో యూదులు ఉండేవాళ్ళు.

యూదులను తమలో కలుపుకుని, ఇజ్రాయెల్‌ని పశ్చిమ ఆసియాలో నమ్మిన బంటుగా మార్చుకున్న ఐరోపా దేశాలు 2000 సంవత్సరం తర్వాత పాలస్తీనా ఆక్రమణని ప్రపంచ దేశాల దృష్టిలోకి రాకుండా చేశాయి. అమెరికాలో ట్విన్ టవర్లపై దాడుల తర్వాత ముస్లిం వ్యతిరేకతని ఒక పద్ధతి ప్రకారం పోషించి, పాలస్తీనాని కూడా ఒక టెర్రరిస్టుల సమూహంగా అందరూ భావించేటట్లు చేశాయి. దురదృష్టవశాత్తూ అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ పాలస్తీనాపై జరుపుతోన్న అంతులేని అమానుష దాడులు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిలోకి వచ్చి ఈ యథాతథ స్థితిని మార్చాయి. ఇజ్రాయెల్ ఆక్రమణలో వుండిన పాలస్తీనా ప్రజల పట్ల జాతి వివక్ష, వారి జాతి ప్రక్షాళన, దీని జియోనిస్టు మూల కథా కమామిషూ ప్రపంచవ్యాప్త నిరసనలతో బట్టబయలయ్యాయి. ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల కమిషన్ ఇజ్రాయెల్ చేస్తున్న హత్యలని అంతర్జాతీయ చట్టం క్రింద జెనోసైడ్ లేదా మానవ హననం అని వర్ణిస్తూ ఒక నివేదిక తీసుకొచ్చింది. పాలస్తీనా ప్రజల పక్షాన, ఐరోపాలో ప్రజల తీవ్ర నిరసనలతో ఆయా ప్రభుత్వాల ఇజ్రాయెల్ సమర్ధన ప్రశ్నార్థకమయింది. ఈ సందర్భంలోనే ఐరోపా దేశాల అతివాద పార్టీలు యూదు సంరక్షక అవతారం ఎత్తి తమ దేశాల్లో వుండే అరబ్బులు, ముస్లింలని నియంత్రించటానికి వారి పాలస్తీనా సమర్ధనని యూదు వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్నాయి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. హోలోకాస్ట్ అపరాధ భావనని ఎక్కువ మోసే జర్మనీ దీన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లి మొన్ననే కొత్త చట్టాన్ని బుండేస్టాగ్‌లో ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్ దేశాన్ని, విధానాలను విమర్శించినా, దాని బహిష్కరణని ఏ విధంగా కోరినా అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక కూటమి నిర్వచనం ప్రకారం ఆయా వ్యక్తులను యూదు వ్యతిరేకిగా పరిగణించి, వారి హక్కులను తగ్గించి, నిరసనకారుల పౌరసత్వాన్ని కూడా తీసివేసే అధికారాలను ఈ చట్టం ఇస్తోంది. యూదు వ్యతిరేకత భావనని చట్టపరంగా, విధానపరంగా సాధ్యమయినంత విస్తృతపరిచి నిరసన, విమర్శకి అవకాశం లేకుండా చేసే చర్య అని ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు.

భారత్‌ సహా, అన్ని దేశాల్లో పాలస్తీనా మద్దతుదారులను నియంత్రించటానికి, పాలస్తీనియన్లపై తాను జరుపుతోన్న మారణహోమాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఉండటానికి యూదు వ్యతిరేకత సెంటిమెంటుని ఇజ్రాయెల్‌ వాడుకుంటోంది. దీనికి అమెరికా, యూరోపులలోని అన్ని దేశాల అతివాద రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. తన అస్తిత్వం కోసం ప్రపంచంలో అన్ని దేశాల ప్రజాస్వామ్య విలువల పతనానికి తోడ్పడుతున్న ఇజ్రాయెల్, పశ్చిమాసియాలో తమ బంటుని కాపాడుకోవటానికి కష్టపడుతోన్న తెల్లజాతి క్రిస్టియన్ దేశాలు కలిసి ఇప్పుడు ముస్లింలకి వ్యతిరేకంగా ఆ సెంటిమెంటుని ప్రయోగిస్తున్నాయి.

l ఎ. సునీత

Updated Date - Nov 21 , 2024 | 05:27 AM