రెండో రాజధాని స్థాయికి చేరువైన వరంగల్
ABN , Publish Date - Nov 19 , 2024 | 05:46 AM
వరంగల్! – కాకతీయుల రాజధానిగా ప్రసిద్ధికెక్కిన ప్రాంతం. ధిక్కార సంస్కృతికి ప్రతీకగా నిలిచిన నేల. పోతన కాలం నుంచీ మొదలుకొని సమ్మక్క సారలమ్మ సాలులో, రాణి రుద్రమ ధీరత్వంతో, దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మల పోరాట పటిమతో, ప్రజాకవి కాళోజీ
వరంగల్! – కాకతీయుల రాజధానిగా ప్రసిద్ధికెక్కిన ప్రాంతం. ధిక్కార సంస్కృతికి ప్రతీకగా నిలిచిన నేల. పోతన కాలం నుంచీ మొదలుకొని సమ్మక్క సారలమ్మ సాలులో, రాణి రుద్రమ ధీరత్వంతో, దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మల పోరాట పటిమతో, ప్రజాకవి కాళోజీ అడుగుజాడల్లో ప్రశ్నించడమే పరమావధిగా వర్ధిల్లిన నేల. ఇప్పుడు వరంగల్ తన ప్రశస్తి మరింత ఇనుమడించే బాటలో అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ నగరం తెలంగాణ రెండో రాజధానిగా ఎదుగుతున్నది. గత దశాబ్ద కాలపు చీకటి రోజులను మరిచి అభివృద్ధి పథంలోకి అడుగేస్తున్నది.
చరిత్ర అవలోకనం, సంస్కృతి పరిరక్షణ చర్యలు, అభివృద్ధి చర్యలలో శాస్ర్త సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ముందుతరాలకు ఉపయోగపడే రీతిలో మౌలిక వనరులను మలచుకోవడం... ఈ చర్యలన్నింటినీ ఇప్పటి ప్రభుత్వం సమగ్రంగా చేపడుతున్నది. కాకతీయుల కాలం నాటి సేద్యపు నీటి వనరుల పరిరక్షణ యజ్ఞాన్ని తనదైన శైలిలో రేవంతన్న సర్కారు ముందుకు తీసుకుపోతున్నది. అభివృద్ధి రంగంలో వరంగల్‌ను ముందువరుసలో నిలిపే చర్యలు చేపడుతున్నది. ఒక ప్రాంతం సమగ్ర ప్రగతిని సాధించాలంటే– విద్య, వైద్యం, ఉపాధి రంగం, రహదారులు, రవాణా వ్యవస్థ ఇవన్నీ మెరుగుపడాలి. ఈ లక్ష్యాన్ని ఆచరణలో వాస్తవికం చేసి, తద్వారా వరంగల్‌ను ప్రగతి పథంలో ఆశించిన స్థాయికి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం కట్టింది. ఇందులో భాగంగానే ఇవ్వాళ వరంగల్‌లో ప్రజాకవి కాళోజీ కళాక్షేత్రం ఆరంభం అవుతున్నది. ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం ద్వారా పద్మవిభూషణ్ కాళోజీకి ఘనమైన రీతిలో నివాళులర్పిస్తున్నది ప్రభుత్వం. రాజకీయ రంగానికి వరంగల్ చేస్తున్న సేవలను ప్రస్ఫుటం చేసే ఈ ఆవిష్కరణతో ఈ నగరం తెలంగాణలో తనదైన స్థానాన్ని నిలుపుకోనున్నది.
అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ. పథకాలు, ఆ పథకాల ఆచరణకు వేసే ప్రణాళికలు, ఆ ప్రణాళికలకు క్రియాశీలమైన రీతిలో దారులూ వేసినప్పుడే ఒక ప్రాంత సమగ్రాభివృద్ధి సవ్యంగా జరుగుతుంది. కళలకు, సంస్కృతికి ప్రతీక అయిన వరంగల్ తెలంగాణలోని ప్రముఖ విద్యాకేంద్రంగా విలసిల్లుతూ వచ్చింది. వరంగల్ ప్రాధాన్యతను ఇక్కడి ప్రతిష్టాత్మక జాతీయ శాస్త్ర సాంకేతిక విషయాల సంస్థ (నిట్) జాతీయ స్థాయిలో నిలబెడుతున్నది. అలాగే ఇక్కడి కాకతీయ విశ్వవిద్యాలయం, వైద్య విద్యాసంస్థలు, ఉపాధి రంగంలో అవకాశాలను విస్తరింపజేసే పరిశ్రమలు, నైపుణ్య సంస్థలు వరంగల్‌ను తెలంగాణ పటంలో ప్రముఖంగా ఉంచుతున్నాయి. ఇలాంటి వరంగల్ నగరం ఒక దశాబ్ద కాలంగా గత ప్రభుత్వ అలసత్వం వలన వెనుకపట్టు పట్టి దీనస్థితికి నెట్టి వేయబడింది. అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెబుతూనే వాటికి సంబంధించిన పనులను క్రియాశీలమైన రీతిలో అమలుపర్చకపోవడం వల్ల ఈ నగరం ఒక దశాబ్దం వెనుకబడ్డది. ఈ నగర ప్రాముఖ్యతను తగ్గించే రీతిలో వరంగల్‌ను ఆరు జిల్లాలుగా విభజించిన అప్పటి పాలకులు ఇక్కడి అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదు.
పదేళ్లు గడిచిన తరువాత వరంగల్ నగరంలో నేడు ఒక కదలిక వచ్చింది. అభివృద్ధిని పరమావధిగా ఎంచుకున్న సర్కారు చేపడుతున్న చర్యలతో నగర పౌరుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటిదాకా అరకొర పనులతో అసంపూర్ణంగా ఉన్న కాళోజీ కళాక్షేత్రం నేడు సమగ్రతను సంతరించుకున్నది. కాళోజీ తరహా ప్రజల పక్షాన నిలిచే ఆవేదనలకు ఇప్పుడొక జవాబు దొరకబోతున్నది. సమాజం ముందుకు వెళ్లే దశలో ఎదురైన అవాంతరాలను తన మనాదిగా భావిస్తూ ‘నా గొడవ’లో అక్షరీకరించిన కాళోజీ భావనలకు సమాధానం దొరికే ప్రయత్నాలకు అంకురార్పణ జరుగుతున్నది.
ఆశించిన రవాణా సౌకర్యాలు లేక అంతర్జాతీయ వాణిజ్య రంగానికి ఉత్పత్తులను చేరవేయడంలో ఆపసోపాలు పడిన వరంగల్‌కు ఎయిర్ పోర్టు సదుపాయం కలుగుతున్నది. మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉత్పత్తయ్యే అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తరలించేందుకు అనువైన రీతిలో ఈ విమాన రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ఉత్తర్వులు నవంబర్ 17న జారీ అయ్యాయి. ఈ ఎయిర్ పోర్టు వాణిజ్య ప్రపంచంలో వరంగల్‌కు స్థానం కల్పించడంతో పాటు ఇక్కడ లభించిన విద్య ఊతంగా సాంకేతికంగా తమ ప్రతిభను చాటుకుంటున్న కొత్త తరాలకు ప్రపంచ దేశాల్లో విస్తరించగలిగే అవకాశాలను మెరుగుపరచనున్నది.
రోడ్లు ఒక ప్రాంత ప్రగతికి చిహ్నాలు. ఇక్కడే ప్రాతినిధ్యం వహించి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన పీవీ నరసింహారావు హయాంలో వరంగల్ ద్వారా అనేక జాతీయ రహదారుల రూపకల్పన జరిగింది. ప్రస్తుత ఆచరణశీల ప్రభుత్వ హయాంలో వాటి విస్తరణ కార్యరూపం దాలుస్తున్నది. విద్యా వైద్య రంగం కూడా వరంగల్ ప్రాముఖ్యతను విస్తరిస్తున్నది. వరంగల్ హెల్త్ హబ్‌గా మారుతున్నది. బొగ్గు గనులు, థర్మల్ యూనిట్‌తో ఉపాధి రంగ విస్తరణ జరుగుతున్నది. సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి వరంగల్‌ను సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్నది. అలాగే– దశాబ్దాలుగా కలగా మిగిలిన వ్యాగన్ పరిశ్రమ ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీగా రూపొందగలిగే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
వరంగల్ త్రినగరి నగరానికి న్యూక్లియస్. దీనికి అధునాతన సౌకర్యాలను కలిపించటమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ముఖ్యమంత్రి వరంగల్ నగర డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం నాలుగు వేల కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయటం వరంగల్ ప్రగతి పయనంలో మరో ముఖ్య భాగం. ఇది వరంగల్ తెలంగాణకు రెండో రాజధానిగా ఎదుగగలిగే అపురూప తరుణం. ఈ అభివృద్ధి ఫలాలను ఒడిసి పట్టుకుందాం. అభివృద్ధిని ఆకాంక్షించే అందరం ఈ సందర్భాన్ని ఆహ్వానిద్దాం.
పదేళ్లు గడిచిన తరువాత వరంగల్ నగరంలో నేడు ఒక కదలిక వచ్చింది. అభివృద్ధిని పరమావధిగా ఎంచుకున్న సర్కారు చేపడుతున్న చర్యలతో నగర పౌరుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇది వరంగల్ తెలంగాణకు రెండో రాజధానిగా ఎదుగగలిగే అపురూప తరుణం. ఈ అభివృద్ధి ఫలాలను ఒడిసి పట్టుకుందాం. అభివృద్ధిని ఆకాంక్షించే అందరం ఈ సందర్భాన్ని ఆహ్వానిద్దాం.
l డాక్టర్ కడియం కావ్య
ఎంపీ, వరంగల్
(నేడు సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా)