Share News

Wayanad Tragedy : మరో ‘వయనాడ్‌’.. ఎలా ఆపాలి?

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:29 AM

వయనాడ్‌ ఒక ప్రదేశం మాత్రమే కాదు. పర్యావరణ దుర్ఘటనలకు అదొక ప్రతీక. అటువంటి విపత్తులు మరెన్నో సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకూ వయనాడ్‌ ఒక తాజా ప్రతీక. సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్‌లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన

Wayanad Tragedy : మరో ‘వయనాడ్‌’.. ఎలా ఆపాలి?
Wayanad, Kerala

వయనాడ్‌ ఒక ప్రదేశం మాత్రమే కాదు. పర్యావరణ దుర్ఘటనలకు అదొక ప్రతీక. అటువంటి విపత్తులు మరెన్నో సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకూ వయనాడ్‌ ఒక తాజా ప్రతీక. సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్‌లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన దుస్సంఘటనకు బాధ్యులు ఎవరు? ఎవరి అలక్ష్యం ఆ ఉపద్రవానికి దారితీసింది? ప్రాణనష్టం, ఆస్తినష్టం హృదయ విదారకంగా వాటిల్లేందుకు కారణమైన ప్రమాదం అనివార్యమైనది కాదు. నేను నా గత కాలమ్‌లో ఈ అంశాలను చర్చించాను (ఆగస్టు 15, ‘వయనాడ్‌ విపత్తుకు కారకులు ఎవరు?’).

మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు. ఆ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజలను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. విషాదసీమ వయనాడ్‌ ఘోషిస్తున్న సత్యమది.

వయనాడ్‌ విలయం వాటిల్లి నాలుగు వారాలు గడిచిపోయాయి. మన దృష్టి వేరే ప్రదేశాలలో వాటిల్లిన ప్రాకృతిక విధ్వంసాల పైకి మళ్లింది. అక్కడా ఇక్కడా, ఈ ధరిత్రిపై మరెక్కడైనా కొట్టివేయలేని ఒక సుస్థిర సత్యంగా ఉన్న వాతావరణ మార్పు, వయనాడ్‌ వినాశనంలో నిర్వహించిన పాత్రనూ నా గత కాలమ్‌లో వివరించాను. పశ్చిమ కనుమలలోని వయనాడ్‌ ప్రాంతం ఇప్పటికే దుర్బల పర్యావరణ సీమగా మారిపోయింది. విచక్షణారహిత మానవ కార్యకలాపాల మూలంగా వాతావరణ వైపరీత్యం పెచ్చరిల్లడంతో వయనాడ్‌ ఒక విషాద సీమగా పరిణమించింది. అందుకే పర్యావరణ విపత్తులు సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకు వయనాడ్‌ ఒక ప్రతీక అన్నాను. మరి మరో ‘వయనాడ్‌’ సంభవించకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?

తొలుత వయనాడ్‌లో అభివృద్ధి కార్యకలాపాలు అమలవుతున్న తీరుతెన్నులను అవగతం చేసుకుందాం. నా సహచరులు రోహిణి కృష్ణమూర్తి, పులాహ రాయ్‌ ఆ ‘అభివృద్ధి’ని నిశితంగా పరిశీలించారు. జూలై 29 అర్ధరాత్రి వయనాడ్‌ జిల్లాలో సంభవించిన దుర్ఘటన నివారింప సాధ్యం కానిదని వారి దర్యాప్తులో వెల్లడయింది. భీతి గొల్పుతున్న వాస్తవమది. మరింతగా వివరిస్తాను. వెల్లెరిమల గ్రామ పరిధిలో కొండచరియలు విరిగిపడ్డాయి. సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా కె. కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక (2013) పేర్కొన్న గ్రామాలలో వెల్లెరిమల కూడా ఒకటి. ‘పశ్చిమ కనుమల సమగ్ర సుస్థిరాభివృద్ధికి అనుసరించవలసిన పద్ధతులను’ సిఫారసు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆ కమిటీలో నేనూ ఉన్నాను. గ్రామ వైశాల్యంలో ఇరవై శాతానికి పైగా సున్నిత పర్యావరణ ప్రదేశాలు ఉన్న గ్రామాలు అన్నిటిలోనూ ప్రకృతి వనరులను మరింతగా ధ్వంసం చేసే అభివృద్ధి కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యంగా మైనింగ్‌, క్వారీయింగ్‌ లాంటి విధ్వంస కార్యకలాపాలను అసలు అనుమతించవద్దని కూడా కస్తూరి రంగన్‌ కమిటీ స్పష్టంగా సూచించింది.

నవంబర్‌ 2013లో కస్తూరి రంగన్‌ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఐదవ సెక్షన్‌ కింద వయనాడ్‌ జిల్లాలో 60,000 చదరపు కిలోమీటర్ల సువిశాల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదని ప్రకటించింది. మైనింగ్, క్వారీయింగ్‌తో సహా ఆ ప్రాంతంలో నిర్దిష్ట అభివృద్ధి కార్యలాపాలు జరగకూడదని ఆంక్షలు విధించింది. అయితే కేరళ ప్రభుత్వం ఆ సిఫారసులకు ఒక సవరణను కోరింది సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా పేర్కొన్న గ్రామాలలో నిలిపివేయడానికి వీలులేని ఇతర అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతున్నందున అటువంటి గ్రామాలను పూర్తిగా సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రత్యేకించకూడదని తమ సొంత కమిటీ ఒకటి నిర్ధారించిందని, కనుక ఆ గ్రామాలను మాత్రమే పాక్షికంగా సున్నిత పర్యావరణ గ్రామాలుగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వం అభ్యర్థించింది. కస్తూరి రంగన్‌ కమిటీ సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా పేర్కొన్న 13 గ్రామాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పులహరాయ్‌ పరిశీలించారు. ఆ 13 గ్రామాలలోను 15 క్వారీయింగ్‌ ప్రదేశాలు ఉన్నట్లు వెల్లడయింది. ఒక్క నూల్‌పూఝ్హ గ్రామంలోనే 6 క్వారీయింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంగా ప్రత్యేకించిన భూములలోనే అవన్నీ ఉన్నాయి. ఈ నియమోల్లంఘన కథ ఇంకా ఉంది. 2017లో మైనింగ్‌ నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించిందని రోహిణి పరిశోధనలో వెల్లడయింది. ఒక నివాస గృహానికి 50 మీటర్ల ఆవల అటవీ భూములు, కొండ వాలు ప్రాంతాల్లో గానీ ఎక్కడైనా సరే పేలుడు సామగ్రిని ఉపయోగించేందుకు ఆ సవరణలు అనుమతిచ్చాయి. అంటే మీ ఇంటి వెనుక ఉన్న కొండలను అస్థిరపరిచే పరిస్థితులను సృష్టించడం చట్టబద్ధమే అవుతుంద!.

ఈ పరిస్థితులను నివారించేందుకు మనమేమి చేయాలి అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. పశ్చిమ కనుమల పర్యావరణ రక్షణకు తొలుత మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ సిఫారసులను, ఆ తరువాత కస్తూరి రంగన్‌ కమిటీ సూచనల అమలును సున్నిత పర్యావరణ ప్రాంతాల ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాంతాలలో పర్యటించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చర్యల పట్ల ప్రజల విముఖతను నేను స్వయంగా గమనించాను. పరిరక్షణ పద్ధతులు, చర్యలను ప్రజలు వీథులలోకి వచ్చి నిరసిస్తున్నారు. వారు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారా? వాస్తవమేమిటంటే సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా తమ తోటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, తాము అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులపై ఆంక్షలు విధించవచ్చని వారు భయపడుతున్నారు. వారి భయాందోళనలకు కారణమేమిటి? పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం, అదీ హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తుండడమే సుమా!


పర్యావరణ పరిరక్షణ విధానాల రూపకల్పనలో మనం ఈ వాస్తవాలను తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ వ్యవస్థల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను మనం శీఘ్రగతిన మార్చుకోవల్సివుంది. వాతావరణ మార్పు పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది తప్పనిసరి. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటున్నందున ప్రకృతి వనరులకు హాని కలిగిస్తున్న సదరు కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలనే భావన ప్రాతిదికన పర్యావరణ పరిరక్షణ విధానాలను రూపొందిస్తున్నారు. ఇది సరైన విషయమే కావచ్చు గానీ మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు.. ఇది వాస్తవం. ఆ ప్రాంతాలు జనవాసాలు మాత్రమే కాదు, వ్యవసాయ భూములకు నెలవులు కూడా. మరి అటువంటి సున్నిత పర్యావరణ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజలను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. ఇందుకు ఆ ప్రాంతాలలోని సామాజిక సముదాయాలకు ప్రయోజనకరమైన ప్రోత్సాహకాలు సమకూర్చాలి.

కాఫీ, తేయాకు తోటల పెంపకం, పర్యావరణ–పర్యాటకం మొదలైన హరిత జీవనాధారాల ప్రాతిపదికన అభివృద్ధి పథకాలు రూపొందించుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రజల భూములను వారి భాగస్వామ్యంతో సంరక్షించడాన్ని మనం నేర్చుకోవాలి. వయనాడ్‌ విపత్తు చెప్పుతున్న సత్యమది. వాతావరణ మార్పు చిక్కులు జటిలమవుతోన్న ఈ కాలంలో విషాదసీమ వయనాడ్‌ పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. మనం వాటిని నేర్చుకోవాలి. నేర్చుకోవడమంటే పర్యావరణకు అనుసరించే పద్ధతులను మార్చుకోవడమే. పర్యావరణ పరిరక్షణలో గుణప్రదమైన మార్పును సత్వరమే సాధించలేనిపక్షంలో మన మనుగడ శాశ్వతంగా అపాయంలో పడుతుంది.

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Aug 30 , 2024 | 05:29 AM