వాతావరణ అధర్మం
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:11 AM
వాతావరణమార్పుమీద ప్రపంచదేశాలన్నీ ఏకతాటిమీదకు వచ్చి సంఘటితంగా యుద్ధం చేయగలవన్న ఆశ అంతకంతకూ నశించిపోతున్నది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే సభ్యదేశాల మహాసదస్సు...
వాతావరణమార్పుమీద ప్రపంచదేశాలన్నీ ఏకతాటిమీదకు వచ్చి సంఘటితంగా యుద్ధం చేయగలవన్న ఆశ అంతకంతకూ నశించిపోతున్నది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్)లో అప్పుడప్పుడు కొన్ని మెరుపులు తప్ప, ప్రభావవంతమైన చర్యలు కనిపించడం లేదు. అజర్‌బైజాన్ రాజధాని బాకులో మొన్న ముగిసిన సదస్సు కూడా ఎప్పటిలాగానే, కాస్తంత ఎక్కువసాగి, మరోరెండు రాత్రులు చర్చోపచర్చలు జరిగినా, ఫలితం మాత్రం ఘనంగా లేకపోయింది. ఈ 29వ సదస్సును ప్రత్యేకంగా ‘ఫైనాన్స్ కాప్’ అని అనుకోవడంలో ప్రధానోద్దేశం, వాతావరణంలో ప్రతికూల మార్పులమీద పోరాడేందుకు వీలుగా వర్ధమానదేశాలకు ధనికదేశాలు అందించే ఆర్థికసాయాన్ని అధికం చేయడం. వాతావరణమార్పులపై పోరాటాన్ని సుసాధ్యంచేయాలంటే, ఎదుగుతున్నదేశాలకు పెద్దదేశాలు అందించాల్సిన సాయం 1.3 ట్రిలియన్ డాలర్లు ఉండాలన్న నిర్దిష్టమైన అంచనాలకు పూర్తి భిన్నంగా, పదేళ్ళపాటు ఏటా మూడువందల బిలియన్ డాలర్లు ఇవ్వడానికి మాత్రమే ధనికదేశాలు సిద్ధపడటం, సదస్సులో తదనుగుణంగా తీర్మానం జరగడం విచిత్రం.
వాతావరణ నిధిని ఈ మేరకు సరిపెట్టేయడం భారత్ సహా మిగతా అభివృద్ధి చెందుతున్నదేశాలకు ఏ మాత్రం నచ్చలేదు. వాతావరణంలో ప్రతికూలమార్పుల వల్ల ప్రధానంగా నష్టపోతున్నది బడుగుదేశాలే కనుక, అధిక కాలుష్యంతో వాతావరణాన్ని నాశనం చేస్తున్నది అగ్రదేశాలే కనుక వాటినుంచి ఇవి ఎక్కువ సాయాన్ని ఆశించడంలో తప్పులేదు. వాతావరణ బీభత్సాలతో, విపత్తులతో అభివృద్ధిచెందుతున్న దేశాలకు ఒనగూరే నష్టంతో పోల్చితే అగ్రరాజ్యాలు ఏటా ఇచ్చే మూడువందల బిలియన్ డాలర్లు ఏ మూలకూ రాదు. మొదట 250 బిలియన్ డాలర్లకు ఒప్పుకొని, ఆ తరువాత వర్ధమాన దేశాల ఒత్తిళ్ళతో, సదస్సు విఫలమయ్యే ప్రమాదాలు కనిపించడంతో 300 బిలియన్ డాలర్లకు ఈ నిధిని పెంచడానికి అవి అంగీకరించాయి. అనేకగంటలపాటు చర్చలు నిలిచిపోయి, నిరసనలు, వాకౌట్లతో సదస్సులో గందరగోళం ఏర్పడిన తరుణంలో మరో యాభై బిలియన్ డాలర్లు అదనంగా చేర్చేందుకు అవి ఒప్పుకున్నాయి. ఇంతహడావుడివల్ల కాబోలు, ఈ చిన్న మొత్తమే అమెరికాకు మహాద్భుతంగా కనిపించింది.
ప్రపంచ ఉష్ణోగ్రతలను ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్‌కు కుదించాలన్న లక్ష్యం పెట్టుకొని దాదాపు పదిహేనేళ్ళవుతోంది. పారిస్‌లో అనుకున్నదానిమీద పెద్దగా అడుగు ముందుకు పడకుండానే, మరోపక్క ఉద్గారాలు పెరిగిపోతున్నాయి, భూ ఉష్ణోగ్రత హెచ్చుతోంది. కొత్తగా చేసుకుంటున్న ఈ చేటును పరిమితం చేసుకుంటేనే, గతంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యపడుతుంది. ఉద్గారాలు తగ్గించుకోవాలంటే, ఆర్థికసాయంతో పాటు ఆధునిక సాంకేతికతలసాయం కూడా ఎదుగుతున్నదేశాలకు అందాలి. ఇవేమీ జరగకుండా, తమ ఉత్పత్తిని ఆవగింజంత తగ్గించకుండా, కాలుష్యాన్ని కుదించకుండా ధనికదేశాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నాయి.
గతంలో హామీ పడిన ఏటా 100 బిలియన్ డాలర్ల సాయం ఇప్పుడు మూడింతలు పెరిగినందుకు సంతృప్తిపడి సరిపెట్టుకోవడం వినా చేయగలిగిందేమీ లేదు. పదేళ్ళుగా ఆ పాత సాయం కూడా సరిగా సమకూరనిస్థితిలో, ఇప్పుడు కొత్తగా హామీపడినదానికి ఆ దేశాలు ఏమేరకు కట్టుబడివుంటాయో చూడాలి. మానవాళి అంతటికీ చెందిన ప్రకృతిని నాశనం చేసి, సిరిసంపదలతో, సకల సౌఖ్యాలతో తులతూగుతున్న ధనికదేశాలు కర్బన ఉద్గారాల పాపాన్ని మాత్రం దేశాలన్నింటికీ పంచాలనుకుంటాయి. ఉద్గారాల్లో డెబ్బయ్‌ఐదుశాతం వాటాతో ప్రకృతిని నాశనంచేస్తున్న సంపన్న దేశాలు పర్యవసానాలను మాత్రం పేదదేశాలమీద రుద్దుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో అవి కనీస బాధ్యత వహిస్తే కాప్ సదస్సులు ఇలా మొక్కుబడిగా తయారయ్యేవి కావు. అధిక పారిశ్రామికీకరణతో, హద్దులు లేని ఉత్పత్తితో లాభపడుతున్న సంపన్నదేశాల దగ్గరనుంచి ఇప్పుడు హామీపడిన ఆర్థికసాయాన్ని పొందడంతో పాటు, పర్యావరణ అనుకూల విధానాలకు మారేందుకు ఉపకరించే ఇతరత్రా పరిజ్ఞానాలను కూడా ఉచితంగానో, కారుచవుకగానో వర్ధమానదేశాలు పొందవలసి ఉంది. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరగబోయే కాప్ 30 సదస్సులో ప్రపంచదేశాలన్నీ ఏకతాటిమీదకు వచ్చి వాతావరణ మార్పుపై మానవ పోరాటాన్ని విజయవంతం చేసే దిశగా నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవాలి.