Share News

పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యమేదీ?

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:57 AM

మన ఇరుగు పొరుగు దేశాలలో ఒకటైన చైనాతో మనకు 3,448 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉన్నది. అయినా చైనాను మన దేశంలో ఎందుకనో ఎవరూ ఒక పొరుగు దేశంగా భావించరు. ఆశ్చర్యకరమైన విషయమిది.

పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యమేదీ?

మన ఇరుగు పొరుగు దేశాలలో ఒకటైన చైనాతో మనకు 3,448 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉన్నది. అయినా చైనాను మన దేశంలో ఎందుకనో ఎవరూ ఒక పొరుగు దేశంగా భావించరు. ఆశ్చర్యకరమైన విషయమిది. మరో రెండు పొరుగు దేశాలు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో కూడా మన పొలిమేరలు చాలా దీర్ఘమైనవి. పశ్చిమాన పాక్‌తో ఉన్న సరిహద్దు (3,310 కిలోమీటర్లు), తూర్పున బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దు (4,096 కిలోమీటర్లు) పొడవునా పూర్తిగా కంచె నిర్మించుకున్నాం. భారత్‌, నేపాల్‌లు ‘తెరిచిన సరిహద్దు’ (ఓపెన్‌ బోర్డర్‌) విధానాన్ని అనుసరిస్తున్నాయి. అడపాతడపా ఏవో కొన్ని కీచులాటలు మినహా ఉభయ దేశాల మధ్య వస్తు సేవల రవాణా, ప్రజల నిర్నిబంధ రాకపోకలకు ఆ స్వేచ్ఛా సరిహద్దు విధానం ఇతోధికంగా తోడ్పడుతోంది. చిన్న దేశమైన భూటాన్‌తో మనకు 578 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. మనకు వ్యూహాత్మక ప్రాధాన్యమున్న భౌగోళిక నెలవులో ఉన్న పొరుగు దేశం భూటాన్‌. ఆ చిన్న దేశంతో స్నేహ సంబంధాలకు న్యూఢిల్లీ అమిత ప్రాధాన్యమిస్తోంది. శ్రీలంక ఒక సన్నని జలసంధితో భారత భూభాగం నుంచి వేరుపడి ఉంది చారిత్రక, సాంస్కృతిక కారణాల రీత్యా మనకు ఎంతో ప్రాధాన్యమున్న దేశమది. అయినప్పటికీ ఈ పొరుగు దేశం నుంచి కూడా మనకు తరచు సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. మాల్దీవులు కొంచెం దూరంగా ఉన్న పొరుగు దేశం. ఆ దేశ విధానాలపై చైనా ప్రభావం పెరుగుతున్నప్పటికీ మాల్దీవులతో మంచి సంబంధాలు నెరపడానికి మనం ప్రయత్నిస్తున్నాం. 1988లో మాల్దీవులలో అధికారాన్ని కబళించడానికి ఒక సైనిక ముఠా చేసిన ప్రయత్నాలను మనం విఫలం చేశాం. ఇప్పుడు ఆ ‘ఆపరేషన్‌ కాక్టస్‌’ను గుర్తు చేసుకునేవారు భారత్‌లో ఎవరైనా ఉన్నారా అనేది నాకు సందేహమే. ఇరుగు పొరుగు దేశాలలో మనకు చాలా చిన్న సరిహద్దు ఉన్న దేశం ఆఫ్ఘానిస్తాన్‌. కేవలం 106 కిలోమీటర్లు మాత్రమే ఉన్న సరిహద్దు అది. సరే ఆ దేశంతో మన సంబంధాలు వసంత కాలంలో వర్థిల్లితే హేమంత రుతువులో క్షీణించిపోవడం అనేక దశబ్దాలుగా ఒక పరిపాటిగా ఉన్నది. చైనా మినహా ఇతర పొరుగు దేశాలన్నీ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌)లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.

ఈ పొరుగు దేశాల పట్ల భారత్‌ ఎలా వ్యవహరిస్తోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాగానే తన అలవాటు ప్రకారం శబ్ద పటాటోపంతో తమ విదేశాంగ విధానం లక్ష్యం ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ (పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత)గా ప్రకటించారు. ఇరుగు పొరుగున ఉన్న దేశాల పట్ల ప్రధానమంత్రి వ్యక్తిగత శ్రద్ధ ఎంత ప్రగాఢమైనదో తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను. సార్క్‌ సభ్య దేశాలలో నరేంద్ర మోదీ చివరిసారి ఎప్పుడు పర్యటించారు? ‘పిఎమ్‌ ఇండియా’ వెబ్‌ సైట్‌లో ఆ వివరాలను కనుగొన్నాను: 2024 మార్చిలో భూటాన్‌, 2022 మేలో నేపాల్‌, 2021 మార్చిలో బంగ్లాదేశ్‌, 2019 జూన్‌లో మాల్దీవులు, 2019 జూన్‌లో శ్రీలంక, 2016 జూన్‌లో ఆఫ్ఘానిస్తాన్‌, 2015 డిసెంబర్‌లో పాకిస్థాన్‌ను నరేంద్ర మోదీ చివరిసారి అధికారికంగా సందర్శించారు. గత పది సంవత్సరాలలో మోదీ ఐదు సార్లు నేపాల్‌ను, మూడు సార్లు భూటాన్‌ను, మూడు సార్లు శ్రీలంకను, రెండు పర్యాయాలు బంగ్లాదేశ్‌ ను, రెండు సార్లు మాల్దీవులును, రెండు సార్లు ఆఫ్ఘాన్‌ను, ఒకసారి పాకిస్థాన్‌ను సందర్శించారని కూడా ఆ వెబ్‌ సైట్‌ ప్రకారం తెలుసుకున్నాను. నరేంద్ర మోదీ గత పదేళ్లలో మొత్తం 82 విదేశీపర్యటనలు చేశారు. ఆ పర్యటనల్లో భాగమే ఇరుగు పొరుగు దేశాలకు ఈ 18 సందర్శనలు. 2024లో భూటాన్‌లో ఒకరోజు పర్యటన మినహా మరే ఇతర పొరుగు దేశంలోనూ ఆయన రెండు సంవత్సరాలకు పైగా పర్యటించనే లేదు!


18వ సార్క్‌ శిఖరాగ్ర సదస్సు 2014లో నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో జరిగింది. 19వ సార్క్‌ శిఖరాగ్రం నవంబర్‌ 2016లో పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగవలసి ఉంది. అయితే భారత్‌ ఆ శిఖరాగ్ర సదస్సును బాయ్‌కాట్‌ చేసింది. భారత్‌ను అనుసరించి మరో నాలుగు దేశాలు కూడా ఆ శిఖరాగ్రానికి హాజరు కాలేదు. దరిమిలా సార్క్‌ శిఖరాగ్ర సదస్సు జరగనే లేదు. సార్క్‌ ‘ఒక సంపూర్ణ వైఫల్యం’ అని జస్వంత్‌ సింగ్‌ (వాజపేయి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి) అభివర్ణించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా సార్క్‌పై జస్వంత్‌ మాటే తుది మాటగా అంగీకరించింది.

ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోదీ 2015– జూన్‌, 2018 మధ్య చైనాలో ఐదుసార్లు పర్యటించారు. మియన్మార్‌ను రెండు సార్లు, మారిషస్‌ను ఒక పర్యాయం సందర్శించారు. చైనా తన చేతలతో మోదీకి కోపం తెప్పించింది. చైనాకు దీటుగా మోదీ ప్రతిస్పందించలేక పోయారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం మోదీ నిస్సహాయుడై పోయారు. సరిహద్దుల్లో ఎదురెదురుగా మొహరించిన సైనిక దళాల ఉపసంహరణ విషయమై చర్చలకు చైనానే ఎజెండాను నిర్దేశిస్తోంది. ఆ చర్చలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. అయినా సత్ఫలితాలు ఎండమావులుగా ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి తన సైనిక దళాల మొహరింపును చైనా ఇతోధికంగా పెంచింది. సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు వేస్తోంది, వంతెనలు నిర్మిస్తోంది, జనావాసాలను ఏర్పాటు చేస్తోంది, ఆయుధాల నిల్వకు భారీ వసతులను అభివృద్ధి పరుస్తోంది.


ఇరుగు పొరుగు దేశాల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినందుకు మనం భారీ మూల్యమే చెల్లించాము నేపాల్‌లో ప్రభుత్వం మారగలదని మనం ఊహించలేక పోయాం. కె.పి.శర్మ ఓలి మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. షేక్‌ హసీనా ఉన్న పాటున బంగ్లాదేశ్‌ నుంచి శరణార్థిగా భారత్‌కు రావలసి వస్తుందనే విపత్కర పరిస్థితిని ముందే పసిగట్టడంలో మనం పూర్తిగా విఫలమయ్యాం. రానిల్‌ విక్రమసింఘెకు ఎనలేని ప్రాధాన్యమిచ్చాం. అనూర దిస్సనాయకెను ఉపేక్షించాం. ఇప్పుడు దిస్సనాయకె 42.3 శాతం ఓట్లతో శ్రీలంక అధ్యక్ష పీఠం అధిష్ఠించారు. మాల్దీవుల అధ్యక్షుడుగా ఎన్నికైన మొహమ్మద్‌ మయిజ్జు తొలి చర్య తమ దేశంలోని భారతీయ సైనిక సలహాదారులను వెనక్కి వెళ్లిపొమ్మని ఆదేశించడమే. ఇక పాకిస్థాన్‌ విషయానికి వస్తే మోదీ ప్రభుత్వం విధానాలను దేశీయ రాజకీయ పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయనే అభిప్రాయం కలుగుతోంది.

చెప్పవచ్చిన దేమిటంటే దక్షిణాసియాలో భారత్‌ ప్రభావ ప్రాబల్యాలు అంతకంతకూ తగ్గి పోతున్నాయి. ఇది మనం స్వయంగా కొనితెచ్చుకున్న దుస్థితి. ప్రపంచ వ్యవహారాలలో భారత్‌కు శాంతి నిర్మాతగా ప్రతిష్ఠ సమకూర్చేందుకు మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం ఆరాటపడుతోంది. రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా, ఫ్రాన్స్‌ తదితర దేశాల నాయకులతో మోదీ తరచు సమావేశమవడం, మోదీ సర్కార్‌ శాంతి సాధన ప్రయత్నాలకు తార్కాణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడేందుకు మోదీ కృషి సఫలం కావాలని కోరుకుంటున్నాం. అయితే పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యం అనే విధానం వాస్తవంగా పొరుగు దేశాలకు చివరి ప్రాధాన్యం మాత్రమే ఇస్తుందని, భారత్‌ పట్ల ఆ దేశాల స్నేహశీలత, సుహృద్భావాన్ని అంతకంతకూ క్షీణింపజేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిష్కర్షగా చెప్పక తప్పడం లేదు.

ఈ ఏడాది మార్చిలో భూటాన్‌లో ఒకరోజు పర్యటన మినహా మరే ఇతర పొరుగు దేశంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సంవత్సరాలకు పైగా పర్యటించనే లేదు! దక్షిణాసియాలో భారత్‌ ప్రభావ ప్రాబల్యాలు అంతకంతకూ తగ్గి పోతున్నాయి. ఇది మనం స్వయంగా కొనితెచ్చుకున్న దుస్థితి. మోదీ సర్కార్‌ నైబర్‌ హుడ్‌ ఫస్ట్‌ విధానం వాస్తవంగా పొరుగు దేశాలకు చివరి ప్రాధాన్యాన్ని మాత్రమే ఇస్తూ భారత్‌ పట్ల ఆ దేశాల స్నేహశీలత, సుహృద్భావాన్ని క్షీణింపజేసింది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Sep 28 , 2024 | 04:57 AM